Menu Close
Page Title

“మీరు కంటినిండా నిద్ర పోవాలంటే నా ప్రయత్నం గూర్చి మీరు వినాలి. ఆ ప్లాను మీకు నచ్చినప్పుడే మీకు పూర్తి ఆనందం కలుగుతుంది. అందుకని ఇంకొక అరగంట గడిపి నా మాటలు వినండి” అంటూ సుకుమార్ కూర్చొన్నాడు. ఆయన మాటలకు సరోజ రమేష్ దంపతులు కూడా కూర్చొన్నారు.

“అనాథలంటే తల్లీ తండ్రి లేనివారు మాత్రమే గాదు. తల్లిదండ్రులున్నా ఆర్థికస్తోమత లేక తమ కోర్కెలను ప్రోత్సహించే వారు లేక తమ తమ చదువులను అర్థాంతరంగా ముగించి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొంటూ బ్రతికేవారు కూడా అనాథలే. చదువు మీద కోర్కె తీరక బాధపడేవారు ఎందఱో ఉన్నారు.  ఇలాంటి వారిని నేను ప్రత్యక్షంగా చూశాను. అందుకని నేను ఒక కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టాలనుకొంటున్నాను.

ఇలాంటి వారందరినీ వారి వారి విద్యార్హతల ఆధారంగా జల్లెడపట్టి వారి తల్లిదండ్రులను ఒప్పించి వారిని ఉత్తమ విద్యార్థులుగా, మంచి వ్యక్తులుగా, దేశానికి పనికివచ్చే పౌరులుగా తీర్చిదిద్దడమే మన ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నా కోరిక. దీనికి మీరు అంగీకరిస్తే నా కోరిక, మీ కోరిక నెరవేరుతుంది. లేక మీకేమైనా మరో ఆలోచన, విధానము ఉంటె చెప్పండి. అందరం కలిసి ఆలోచించి, ప్రారంభిద్దాం” సుకుమార్ అన్నాడు.

“ఇంకో పది జన్మలెత్తినా మాకు ఇంతకంటే మంచి ఆలోచన రాదు గానీ నీ బ్రహ్మాండమైన ఆలోచనకు ముహూర్తం పెట్టించు బాబు! మాకు మరింత హాయిగా నిద్రపోయే వరాన్ని ప్రసాదించావు. గుడ్ నైట్” రమేష్ హుషారుగా అన్న మాటలకు సుకుమార్ తృప్తిగా నవ్వుకుంటూ బయటకు నడిచాడు.

%%%%

ఊరికి కొంచెం దూరంలో విశాల ప్రదేశంలో కావలిసిన హంగులతో తయారై వెలసింది “జ్ఞానసరసు”. ప్రధాన భవనానికి ఆనుకొని నీటితో నిండిన సరసు దాని చుట్టూ పచ్చని వృక్షాలు ప్రకృతి మాతకు ప్రతిరూపాలా అన్నట్లున్నాయి. వీణాపాణి, హంసవాహిని – జ్ఞాన సరస్వతి పాలరాతి విగ్రహం ప్రారంభోత్సవానికి సిద్ధమై కన్నులకు కమ్మని విందుగా అలరారుతున్నది. కొంచెం ముందుకు పొతే పిల్లలకు పార్కు, దాని ప్రక్కనే ‘పక్షుల నిలయం’ రెండూ జంటగా ఉన్నాయి. విశాలమయిన ఆట స్థలం, ద్యానమందిరం – ‘మేమిద్దరం ఒక జంట సుమా’ అన్నట్లు ప్రక్క ప్రక్కనే ఉన్నాయి.

ఆ ప్రదేశమంతా వెదికినా ఒక్క దేవాలయం కూడా కనపడదు. ‘దైవం అందరివాడే. కాని అందరికీ కనపడేవాడు కాదు సులభంగా. అందుకే ఆయన దయకోసం, దర్శనం కోసం నిరంతర, నిత్య పరిశోధన సాగించండి’ అన్న సందేశంతో వెలసిందక్కడ ‘ధ్యానవాహిని’ బహాయ్ టెంపుల్ లాగా.

సరోజ ఆధ్వర్యంలో వెంకటగిరి జరీ, కంచి పట్టు చీరలను ఉపయోగించి చెట్లు, మొక్కలు మొదలైన ఆకృతులు తయారుచేయబడ్డాయి. అవి నిజమైనవా అన్నట్లు అతి సహజ సుందరంగా ఉన్నాయి. ఎక్కడ పెట్టాల్సిన వస్తువును అక్కడ పెడితేనే ఆ వస్తువుకు అందం వస్తుందన్న రహస్యం తెలిసిన సరోజ ఆ వస్తువులన్నింటినీ దగ్గరుండి అలంకరింపజేయడం వల్ల ఆ వస్తువుల అందం రెండింతలయింది.

%%%%

అది అరుణోదయం. నిరాశతో కాలం గడుపుతున్న సరోజ, రమేష్ దంపతుల ముకుళించిన హృదయ సరోజాలను వికసింపజేసినా ఉషోదయం.

అణగారిన కోర్కెలతో, అసలుడిగి జీవితాలను భారంగా గడుపుతున్న కొంతమంది విద్యార్థులకు అది అరుణోదయం. అంతేగాక శుభోదయం.

మానవతావాదం, క్రాంతి సందేశాన్ని, శాంతి కపోతాలతో ఎగురవేసిన అరుణోదయమది. ఆనంద భానోదయం. ఆ రోజు సాయంకాలమే ‘జ్ఞాన సరసు’ ప్రారంభోత్సవం. అందుకే ఆ ప్రదేశమంతా పనివారితో, అక్కడ ఉండడానికి వచ్చిన పిల్లలతో, వారి తల్లిదండ్రులతో, రమేష్ సరోజ దంపతుల బంధువులతో సందడిగా ఉంది. మొత్తం మీద ఆ ప్ర్రాంగణమంతా నయన మనోహరంగా, హృదయాహ్లాదకరంగా ఉంది.

సరోజ, సుకుమార్, రమేష్ ఉయ్యాల పలకమీద కూర్చొని ఉన్నారు. ‘జ్ఞాన సరసు’ అన్న బోర్డు ముఖద్వారం పైన కిరీటంలా మెరుస్తున్నాది. ఒకటవ భవనం ‘చదువుల తల్లి’ చదువుకు సంబంధించిన దంతా ఇక్కడ నిర్వహిస్తారు. రెండవ భవనం ‘సేద తీర్చుకో’ బయట నుండి వచ్చేవారు విశ్రాంతి తీసుకోవడంకోసమిది. మూడవ భవనం ‘పెద్దతలలు’ – ఇది సరోజ కోర్కెపై ప్రత్యేకంగా నిర్మించింది. “శారీరక బలం, ఆర్ధిక బలం, మానసిక బలం ఏవీ లేకుండా ఏకాకుల్లా బ్రతికే వృద్ధుల కోసం మనవంతు సహాయం మనం చేద్దాం.” అంటూ సరోజ తీసుకొన్న మరో మంచి నిర్ణయమిది,

“నేను విద్యార్థుల కోసమే ఆలోచిస్తే నీవు మరో మెట్టు ఎక్కిచ్చావు చెల్లెమ్మా!” అన్న సుకుమార్ మాటలతో, “మా పుట్టింటి ఆస్తి బోలెడుంది. అంతేగాక అమెరికాలోనూ సంపాదన. వీళ్ళందరి నిర్వహణ కోసం మేమిద్దరం అవసరమైతే మా డాక్టర్ బోర్డులను గోడకు తగిలిస్తాం. పిల్లలకోసం ఆ మాత్రం కష్టపడి సంపాదించలేమూ? ఎలాగూ ఇక్కడున్న వారి కోసం మేం ప్రాక్టీసు పెట్టాల్సిందే!” అంది సరోజ ఎంతో సంతోషంగా.

“చెల్లమ్మా! పేర్లు పెట్టడంలో నువ్వు సిద్ధహస్తురాలివి. మన ముగ్గురి పేర్లు కలిసి వచ్చేటట్లు ‘సరసు’ అని దానికి ‘జ్ఞాన’ అన్న పదం ద్వారా పరిపూర్ణత్వాన్ని సంతరిమ్పజేశావు. సరసులో ‘స’ అంటే సరోజ, ‘ర’ అంటే రమేష్, ‘సు’ అంటే సుకుమార్ చాలా చక్కగా ఉంది. అంతేగాక ‘సరసు’ కు ‘జ్ఞాన’ శబ్దం చేరి మన ధ్యేయానికి తగ్గ మంచి పేరు సూచింపబడింది. ఒరే బడుద్ధాయి కొట్టరా క్లాప్ మీ ఆవిడ ప్రతిభకు” సుకుమార్ మాటలకు,

“పిల్లలూ! ఇలా రండి. చప్పట్లట కొట్టండి ఓ అమ్మ ప్రతిభకు. నాకు ఓపిక లేదు.” అన్నాడు రమేష్ అక్కడే నిలుచుని ఉన్న పిల్లలతో.

“అలాగే నాన్న! మా అమ్మ ఏ పనిచేసినా అద్భుతమే” అన్న అనంత్ అనే కుర్రాడి మాటలకు పిల్లలంతా చప్పట్లతో ఆ ప్రదేశమంతా చప్పట్లతో మారుమ్రోగించారు. ఇదంతా చూస్తున్న రమేష్ బంధువు,

“సంబరం. వీళ్ళొక పిల్లలు వాళ్ళొక అమ్మా నాన్నలు. లోకం భ్రష్టుపట్టి పోయింది.” అని గొణుక్కొంటూ వెళ్ళడం సుకుమార్ విని నవ్వుకొన్నాడు.

%%%%

అతిధులంతా రావడంతో సభాప్రాంగణం సందడిగా ఉంది. సరస్వతీ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత సరోజ స్టేజీ ఎక్కి మైక్ ముందు నిలబడింది. ఆమెను చూడగానే పిల్లలంతా ఒక్కసారి ‘నమస్కారమమ్మా!” అన్నారు ఏకకంఠంతో. ఆ పిలుపుతో సరోజ తనువు పులకాంకితమైంది. మనసు తన్మయత్వంతో బృందావనిలా విరబూచింది.

“ఏదీ, మరోసారి పిలవండి” అంది సరోజ.

“అమ్మా! మాకు దేవుడిచ్చిన అమ్మవు. నమస్కారమమ్మా!” అంటూ గట్టిగా చప్పట్లు కొట్టారు. ‘అమ్మా! అమ్మా!’ అంటూ ఆనందంతో కేరింతలు కొట్టారు.

**** సశేషం ****

Posted in May 2020, సమీక్షలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!