Menu Close
SahitiSirikona_Title

సాహితీ సిరికోన లో ప్రచురించిన కొన్ని కవితలు, పద్యాలు గంగిసెట్టి గారి అనుమతితో సిరిమల్లె పాఠకుల కొరకు ఇక్కడ అందిస్తున్నాము.

వెన్నెముకని స్తూపంగా నిలిపినవాడు ..! -- డా.పెరుగు రామకృష్ణ

(మండేలాకు నివాళి గా అప్పుడు రాసిన కవిత)

అతడు అతడిగా జన్మ సమ్మర్ధనతో
నల్ల సూరీడుగా పుట్టాడు
ఈ భూమి మీద అతడితో పాటు నిన్నటి వరకు
అదే ఆకాశం కింద శ్వాసించి నందుకు
మనమూ ధన్యులం ...
గెలుపు ఓటముల్ని ఉచ్చ్వాస, నిశ్స్వాసలుగా పీల్చి
వర్ణ  వివక్షను మండే సూర్యుడయి భస్మించిన మహాత్ముడు
ఏళ్ల తరబడి వ్యక్తిని నిర్భందించ గలరు తప్ప
ఉద్యమ స్పూర్తిని తాకనైనా లేరని నిరూపించాడు
కూలిపోతున్న నల్లజాతి చరిత్రని భుజాని కెత్తుకున్నాడు
విజయం కోసమే పిడికిలి బిగించి
పోరాటం కోసం వెన్నెముకని స్తూపంగా నిలిపి
తన జాతి విముక్తి కోసం తపించిన
విప్లవ సింహం అతడు ...
ఈ జీవిత గమనాన్ని ముగించి
ఎవరైనా, ఎప్పుడైనా వెళ్ళాల్సిందే..
కానీ ...
మహాత్ములకు నెలవు తప్ప సెలవు లేదు
నల్లజాతి గుండెల్లో రక్తం ప్రవహించి నంతకాలం
ఈ విప్లవ సింహం బతికే వుంటుంది...
ఈ విప్లవ జ్యోతి వెలిగే వుంటుంది ...

నో కరోనా -- నేమాని సోమయాజులు

చైనాదేశమునందునన్ గలిగి విశ్వంబెల్ల వ్యాపించుచున్
ప్రాణాపాయకరమ్ముగా నిలచి యల్లాడించె భూగోళమున్
దీనావస్థను దెచ్చె పెక్కులకు బాధించెన్ వయోవృద్దులన్
నానాదుఃఖనిమిత్తమయ్యెను కరోనా దైత్యులన్ బోలుచున్

గృహసభ్యులను సన్నిహితులు గావించిన
    నో కరోనా నమోవాకశతము
పరిశుభ్రతకుగల ప్రాముఖ్యతను దెల్పు
    నో కరోనా నమోవాకశతము
మాంసభక్షణపు ప్రమాదముల్ తెలిపిన
    నో కరోనా నమోవాకశతము
వ్యర్థమైనట్టి ప్రయాణమ్ము లాపిన
    నో కరోనా నమోవాకశతము
మేలు కరచాలనముకంటె కేలుమోడ్పు
క్షాళనమ్ములు పలుమారు సలుపుడనుచు
హిందువుల భావజాలముల్ హెచ్చు చేయు
నో కరోనా యిదే నమోవాకశతము

అలల అంతరంగం -- లక్ష్మీ పద్మజ

సంద్రాన ఎగిసిపడే
అలల అంతరంగం,,
మనిషి మనసుకు
నిలువెత్తు అద్దం,,

ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటం
మనిషి లోని ఎదగాలనే
ఆరాటానికి చిహ్నం!

వాలిపోయే కెరటం
మనిషి ఒద్దికకు
ప్రతిరూపం!

అంతులేని అలలు
మానవ ప్రయత్నానికి
ప్రతీకలు!

ఆకాశం అంచులు
తాకాలనే ఆరాటం
అలల అంతరంగం,,
విజయ శిఖరం చేరాలనే
మనిషి మనసులోని
పోరాటం!

మనసుకు మరో రూపం
అలల అంతరంగం,

ఏ  వస్తువునైనా తీరానికి
విసిరేసే  కెరటానికి అర్థం,
తనది కానిదేది ఆశించకు
అని నేర్పే పాఠం !

మనిషి మదిలో ఎన్ని
వేదనలున్నా,
కడలి తరంగాల వలే
ఉల్లాసంగా వుత్సాహంగా
జీవినయానం  సాగించాలనే
జీవితపాఠం ఆ అలల అంతరంగం!

అలల అంతరంగమే
మనిషి జీవితానికో ఆదర్శం !!

మరింత ఉత్సాహంగా -- అరుణ నారదభట్ల

అమ్మా...మా బ్రతుకుల మూలానివి!

ఎంత అమాయకత్వం ఇది
నిన్ను మరిచామంటూ ఈ భ్రమేంటో!?!
ఈ అణువణువునా
నీవై వున్నావన్న మతిని గ్రహించలేనితనం

వృద్ధాశ్రమాల్లో వదిలిపెట్టడం అలవాటైన
అనాధమనసు
వెలితినవ్వులు, మనోచీకట్లు
విలువలు తెలియని నడత
కళ్ళు మూతలుపడి
సరిహద్దులు గీసుకున్న నిశాచరత్వం
సత్యాసత్యాల ఆనవాళ్ళు అవగతమవని అంధకారం!

నవ్విపోనీ అలాగే నవ్విపోనీ!
అమ్మా!
నువ్వు నిరంతరం ఆవహించి ప్రవహించే జీవనదివి
దాహార్తిని సోకనీయని స్వేచ్ఛాయుత ప్రాకారానివి!

నువ్వంటే స్వేచ్ఛని మరిచిన యెదేచ్చ

విలీనమై విశాలమై
లోలోనే కొలువై నిరాడంబరంగా నిశ్చలంగా వెలుగుతున్న దీపానివి
గ్రహణశక్తి కోల్పోయిన ఒకానొక నిస్తేజానికి కూడా తేజానివి

నిన్నొక పండుగగా భరించలేని
నీకు మరింత గట్టిగా జోహార్లు పలుకలేని హృదయాలు
స్వేచ్ఛాతొడుగులై
ఒక్కరోజని
తమకు తాము తక్కువైపోతున్న విధి
జాలికురిపిద్దాం

ఇదో విచిత్ర కాలం కదా...
కనీసం ఇలాగైనా స్పందించనిద్దాం!

స్వేచ్చాజీవి -- బి. రాజేంద్రసింగ్

నేను కవిని
సృష్టి కర్తను
సంయగ్దర్శిని
రవి కాంచనివి కూడా చూసి
నచ్చేటట్లు రాసి
మార్గదర్శనం చేయగలను
ధర్మ మార్గాన నడిపించగలను
సత్య శోధన చేయించగలను.

కాని నేడు కళ్లు మూసుకున్నాను
కమ్మటి కలలు కంటున్నాను
భావుకతలో మునక లేస్తున్నాను
మబ్బుల్లో తేలుతున్నాను
వెన్నెల, కోయిల పాటలు, సెలయేళ్ళు, వసంతం,
లేత చిగుళ్లు, కూనిరాగాలు
కనిపిస్తాయి మూసిన కళ్ళకు
మంచిదే.

కళ్లు తెరిస్తే గుడిముందు బిక్షగత్తె
గుడి లోపల చాలామంది బిక్షగాళ్లు
గుడిని పేల్ఛే ప్రయత్నంలో కుర్రాళ్లు
వాళ్ల వెనుక కుహనా మేధావులు
మరీ వెనకగా విదేశీ ఏజంట్లు
వారు కల్లలతో కలిగిస్తున్న విధ్వంసం
అన్నీ చూడాల్సివస్తుంది
నా కెందుకీ  గొడవ
స్వతంత్ర దినం, రాజ్యాంగ దినం
జండాకో సెల్యూట్  కొట్టేసి
మేరా భారత్ మహాన్
అని అరిచేసి
జనగనమణ పాడెస్తే
అయిపోతుందిగా
చాలదంటే
ఓ దేశభక్తి గీతం రాసేద్దాం
పద్మశ్రీ ఇచ్ఛేస్తారేమో.

Posted in May 2020, సాహిత్యం

1 Comment

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!