Menu Close
వీక్షణం సాహితీ గవాక్షం - 92
- వరూధిని
vikshanam-92

వీక్షణం-92 వ సమావేశం తొలి ఆన్ లైన్ సమావేశంగా ఏప్రిల్ 12, 2020 న  నాలుగు సెషన్లుగా మధ్యాహ్నం 3 గం. నుండి సాయంత్రం 5.30 వరకు జరిగింది. మొత్తం 22 మంది పాల్గొన్న ఈ సమావేశంలో మొదటి సెషన్ పరిచయ కార్యక్రమం. గత రెండు నెలలుగా కరోనా వైరస్ వ్యాప్తి వలన ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న క్లిష్ట పరిస్థితుల వల్ల సమావేశాలు జరుపుకోలేకపోవడం, సామాజిక దూరం పాటించడం, గృహ నిర్భంధాలలో ఉండాల్సి రావడం వల్ల ఈ తొలి ఆన్ లైన్ సమావేశం అందరికీ అత్యంత ఆనందాన్ని కలగజేసింది.

రెండవ సెషన్ ప్రధాన ప్రసంగం. ఇందులో శ్రీ చింతకుంట్ల సంపత్ రెడ్డి "ఉత్తరాలు- ఉపన్యాసాలు" అనే అంశం పై దాదాపు 30 ని.ల పాటు చక్కని ఉపన్యాసం చేశారు. సంపత్ రెడ్డి గారు "ఉత్తరాలు- ఉపన్యాసాలు" శీర్షికతో "నెచ్చెలి" అంతర్జాల మాసపత్రికలో ప్రపంచవ్యాప్త ఉత్తమ ఉత్తరాలు, ఉపన్యాసాలను తెలుగులోకి అనువాదం చేస్తుంటారు. తమ ప్రసంగంలో ముందుగా ఇటువంటి విభిన్నమైన కార్యక్రమానికి తనను ప్రేరేపించిన అంశాలను గురించి వివరించారు. ఇందులో భాగంగా తన విద్యాభ్యాసం, వృత్తి తోడ్పడ్డాయన్నారు . ఇక ఉత్తరాలలో భాగంగా మచ్చుకి చెహోవ్ కథ "పందెం" లోని ఉత్తరాన్ని చదివి వినిపించారు.

అంటోన్ పావ్లోవిచ్ చెహోవ్ రష్యన్ రచయిత. ప్రపంచ సాహిత్య చరిత్ర మొత్తంలో చిన్న కథల్ని అల్లడంలో ఆయనకు సాటి ఎవరూ లేరు అని ప్రసిద్ధి!

ఇంగ్లీష్ లోకి “బెట్” గా అనువదించబడిన రష్యన్ కథలో వున్న ఈ కథా నేపథ్యం ఇది:-

కోటీశ్వరుడైన ఓ బ్యాంకర్ ఇచ్చే విందులో “మరణశిక్ష-యావజ్జీవ కారాగార శిక్ష” ఈ రెండింటిలో ఏది ఎక్కువ అంగీకారమైనది అనే విషయం చర్చనీయాంశం అవుతుంది. ఆ బ్యాంకర్ ఉద్దేశ్యం ప్రకారం మరణశిక్ష అయితే ప్రాణం ఒకేసారి పోతుంది. కాని అదే యావజ్జీవ కారాగారవాసం ప్రాణాన్ని నెమ్మది నెమ్మదిగా హరిస్తుంది. కాబట్టి మరణశిక్ష అనాయాస మరణాన్ని ప్రాసాదిస్తుంది. జీవుడికి ఇబ్బంది వుండదు.

చాలాసేపటి వాదోపవాదాల తర్వాత ఓ యువ లాయర్ ఆ రెండు అనైతికమైనవే ….. కానీ “నాకు అవకాశం వొస్తే యావజ్జీవ కారాగార శిక్షను ఎంచుకొంటాను, ఎందుకంటే చావడం కన్నా ఏదోరకంగా బ్రతకడం మంచిది.” అంటాడు. తర్వాత జరిగిన అతిధులు, బ్యాంకర్, లాయర్ మధ్య జరిగిన వాదోపవాదాల పరిణామం 2 మిలియన్ల ‘పందెం’. బ్యాంకర్ కాసిన ‘పందెం’ షరతులు ఒప్పుకుని లాయర్ 15 సంవత్సరాల పాటు ఒంటరిగా ఒక గదిలో గడపడానికి తన నిర్ణయం తెలియజేస్తాడు. దానికి కావాల్సిన ఏర్పాట్లు జరిగిపోతాయి. ఆ 15 సంవత్సరాలు లాయర్ అడిగినవన్నీ బ్యాంకర్ సమకూర్చాడు. లాయర్ మాత్రం ఒంటరిగా తన గదిలోనే గడిపాడు. కానీ, ఆ గడువు పూర్తి ఆయే సమయానికి బ్యాంకర్ దివాలా తీసివుంటాడు. అతనికి తాను ఓడిపోవడం ఇష్టం వుండదు. అందువల్ల ఆ లాయర్ ను చంపివేయాలని అతని గదికి వెళతాడు. అతనికి అక్కడ రాసివున్న ఈ ఉత్తరం కనిపిస్తుంది.

ఆ ఉత్తరం ఇది:-

"రేపు అర్ధరాత్రి పన్నెండు గంటలకు నాకు స్వేచ్చ, అందరితో కలిసివుండే అర్హత లభిస్తుంది. కానీ, నేను ఈ గది వదలివెళ్ళబోయేముందు, మీకు కొన్ని విషయాలు చెప్పవలసిన అవసరమున్నదని నేను భావిస్తున్నాను. నా అంతరాత్మ చెప్పినట్టు, నన్ను చూస్తున్న భగవంతుడి ముందు ….. స్వేచ్చ, జీవితం, ఆరోగ్యం, మీ పుస్తకాలు ప్రపంచపు ఆశీర్వాదాలు అని పిలుస్తున్న అన్ని విషయాలు తుచ్ఛమైనవి అని నేను ప్రకటిస్తున్నాను.

పదైదు సంవత్సరాలపాటు లౌకిక విషయాలను అధ్యయనం చేశాను. నేను భూమిని గానీ, మనుష్యులను గానీ చూడలేదు. కానీ, మీ పుస్తకాలలో సువాసన నిండిన మధువును గ్రోలాను; పాటలు పాడాను; అరణ్యాల్లో జింకలను, పందులను వేటాడాను; స్త్రీలను ….. వారి మేధస్సుతో మీ కవులు సృష్టించిన, తేలిపోయే మబ్బుల్లాంటి అప్సరసలను ప్రేమించాను. వారు రాత్రిళ్ళు నా దరిచేరి గుసగుసగా చెప్పిన అద్భుతమైన కథలు నా మస్తిష్కాన్ని మత్తెక్కించాయి.

మీ పుస్తకాల్లో నేను ఎల్బ్రజ్, మాంట్ బ్లాంక్ పర్వతశిఖరాలను అధిరోహించాను. అక్కడినుండి నేను సూర్యుడు ఎట్లా ఉదయిస్తాడో, సాయంసమయంలో ఎట్లా పడమటి తీరాల్లో విస్తరిస్తాడో; సముద్రాలను, పర్వతసానువులను తన బంగారు కిరణాలతో ఎట్లా మెరిసేట్టు చేస్తాడో గమనించాను. అక్కడినుండి, నా పైన మబ్బుల్ని చీలుస్తూ కాంతిపుంజాలను వెదజల్లిన మెరపులు చూశాను; పచ్చటి అరణ్యాలు, పొలాలు, నదులు, నగరాలు చూశాను; సైరెన్లు గానిస్తుంటే విన్నాను; పాన్ పైపర్ గారడి సొన్నాయి విన్నాను; భగవంతుడి గురించి చెప్పడానికి నా వద్దకు ఎగురుతూ వచ్చిన అందమైన రాక్షసుల రెక్కలను తడిమాను. మీ పుస్తకాల్లో నాకు నేను అంతుతెలియని అఘాతాల్లోకి తోసివేయబడ్డాను, అద్భుతాలను ఆవిష్కరించాను; నగరాలను దహించి భూమట్టం చేశాను; కొత్త మతాలను భోదించాను; దేశాలన్నింటినీ జయించాను.

మీ పుస్తకాలు నాకు జ్ఞానాన్ని ప్రసాదించాయి. శతాబ్దాలుగా అలసటనెరుగక సృజించిన మానవ భావచింతన నా మెదడులో ఓ మూలన చిన్న ముద్దలాగా పడివున్నది. మీ అందరికన్నా నేను తెలివైనవాడినని నాకు తెలుసు.

నేను మీ పుస్తకాలను అసహ్యించుకొంటున్నాను. ప్రపంచపు ఆశీర్వాదాలు, విజ్ఞానాన్ని నేను హేయమైనవిగా భావిస్తున్నాను. ప్రతిది ఒక ఎండమావిలాగా శూన్యం, దుర్భలం, మిథ్య. మేము అందమైనవారిమని మీరు గర్వపడవచ్చు. అయినప్పటికీ, భూగర్భంలోని ఎలుకలవలె మరణం మిమ్మల్ని భూమిపై తుడిచివేస్తుంది; మీ రానున్న తరాలు, మీ చరిత్ర, మీ మేధావుల అమరత్వం ఒక వ్యర్థమైన మంచుముద్దలాగా మారుతుంది. అవి అన్నీ భూగోళంతో పాటు మండిపోతాయి.

మీరు పిచ్చివాళ్ళు. మీరు పెడదోవ బట్టారు. మీరు నిజాన్ని అబద్డంలాగా, వికారమైనదానిని అందమైనదానిగా పరిగణిస్తారు. అకస్మాత్తుగా ఒకవేళ ఆపిల్, నారింజ చెట్లకు ఫలాలకు బదులుగా కప్పలు, బల్లులు కాస్తే, ఒకవేళ గులాబిపూలు గుర్రపు చెమటవాసన వేస్తే మీరు ఆశ్చర్యపోతారు. అందువల్ల స్వర్గానికి బదులుగా భూమిని బదలాయింపు చేసుకున్నందుకు నేను మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతున్నాను. నాకు మిమ్మల్ని అర్థం చేసుకోవాలని లేదు.

వేటిపట్ల ప్రేమతో మీరు జీవిస్తున్నారో, వాటినన్నిటినీ నేను మనసా, వాచా, కర్మణా తృణప్రాయంగా తిరస్కరిస్తున్నాను. ఒకప్పుడు రెండు మిలియన్లు స్వర్గతుల్యం అని కలలుగన్నాను. కానీ ఇప్పుడు వాటిని అసహ్యించుకుంటున్నాను. వాటిని పొందానికి నా హక్కును కోల్పోవడం కోసం, ఇక్కడినుండి నిర్ణీతగడువుకు అయిదు నిముషాల ముందుగా నేనే బయటకు వస్తాను. ఆ విధంగా మన ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నాను."

"ఎప్పుడో 1889 లో వ్రాయబడిన ఈ కథ “మరణశిక్ష-యావజ్జీవ కారాగార శిక్ష” లపై ఈనాటికీ వాదోపవాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆలోచన రేకెత్తించే రచన" అని ముగించారు సంపత్ రెడ్డి గారు.

ఆ తర్వాత సెషన్ లో జరిగిన కవిసమ్మేళనంలో డా| | కె.గీత "కరోనా కాలం" కవితను, షంషాద్ "కరోనా" కవితను, రావు తల్లాప్రగడ "భరియించు వాడవే హరి నారాయణా" పద్య గీతాన్ని, సంపత్ రెడ్డి "ఏదో చెప్పాలని ఉంది" కవితను, శారద "మహావధాని ఎవరు?" కవితను, సురేంద్ర "పప్పు పప్పు ... " హాస్య కవితను, శ్రీధర్ "ప్రపంచమైన ఇల్లు" కవితను, అపర్ణ గునుపూడి "వాయినం" కవితను చదివి వినిపించగా వ్యాసరాజు "కరోనా" పేరడీ పాటను వినిపించారు.

చివరి సెషన్లో శారద, కిరణ్ ప్రభ గార్ల ఆధ్వర్యంలో జరిగిన సాహితీ క్విజ్ అందరినీ విశేషంగా అలరించింది. చివరిగా సుభద్ర గారు పాడిన లలిత గీతం, డా| | కె.గీత గారు రచించి, పాడిన జానపద గీతంతో అత్యంత ఆనందోత్సాహాలతో వీక్షణం సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో టెక్సాస్, లాస్ ఏంజిలస్ వంటి దూరప్రాంతాల నుంచి కూడా సాహిత్యాకారులు పాల్గొనడం విశేషం.

Posted in May 2020, వీక్షణం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *