Menu Close
వాగ్రూపం - భావం, స్థితులు
-- పిల్లలమఱ్ఱి కృష్ణ కుమారు

परा प्रत्यक्चितीरूपा पश्यन्ती परदेवता ।
मध्यमा वैखरीरूपा भक्तमानसहंसिका ॥ ८१॥

పరా ప్రత్యక్చితీరూపా పశ్యన్తీ పరదేవతా
మధ్యమా వైఖరీరూపా భక్తమానస హంసికా || (లలితా సహస్రనామావళి - 81వ శ్లోకం)

కొందరు మిత్రులతో చర్చిస్తుండగా వాక్కు, దాని స్వభావము, మాట ఎలా పుడుతుంది, ఎలాంటి శక్తివల్ల ఇది సాధ్యం, జంతువులలో, చెట్లలో వాక్కు ఎందుకు లేదు? వంటి ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఇదేదో చాలా బాగుందే అని దాని గురించి కొంత చదివి, కొంత పండితులైన వారివద్ద విని, మరికొంత పండితులైన వారితో చర్చించి ఈ వ్యాసం రాయడం జరిగింది. మిత్రులందరూ దీనిని బాగా అవగాహన చేసుకుని, పరస్పరం చర్చించవలసిందిగా కోరుతున్నాను.

ఈ వ్యాసం రాయడానికి ఇంకొక కారణం కూడా ఉన్నది. పాశ్చాత్త్య దేశాలలో "mindfulness" పరిశోధనలు ముమ్మరంగా సాగుతున్నాయి. భారత దేశంలో అనుకరణ పరిశోధనలే తప్ప సహజంగా జరగవలసిన పరిశోధన తక్కువగా ఉన్నది. పైగా ఇండియా నించి అమెరికాకి వచ్చిన ఒక వైజ్ఞానికుడితో మాట్లాడితే 'మీ అమెరికా వాళ్ళు చాలా ముందున్నారు; ఇండియాలో మేము దీన్ని అందుకోవాలంటే ఇప్పటిప్పట్లో సాధ్యం కాదు" అని అన్నారు. నేను ఆశ్చర్య పోయాను. పైన ఉదహరించిన లలితా సహస్ర నామాలు చెప్పి ఇవి పరిశోధనకి సంబంధించినవి కావా అని అడిగాను. ఆయన తేలిగ్గా, 'ఎక్కడో శాస్త్రాల్లో ఉన్నవి మీరు సైన్సుకి జోడిస్తారేమిటి?' అన్నారు. అప్పుడు నిశ్చయం చేసుకున్నాను - దీని గురించి కొంత పరిశోధన చేసి ఒక వ్యాసం రాయాలని.

వాక్కు ఒక దేవతారూపం అని వేదం చెప్పింది. హైందవ మతంకి (సనాతన ధర్మం కి) ప్రమాణం వేదమే. (వేదాన్ని ఎందువల్ల ప్రమాణంగా తీసుకోవాలో నా ' వేదాలు అపౌరుషేయాలని ఎలా నిర్ణయిస్తాం? ' అనే వ్యాసంలో చదవండి). వేదంలో లేని దేవత ఉండదు కాబట్టి ఈ వాగ్రూపానికి వేదమూలం తెలుసుకోవడానికి ప్రయత్నించాను.

తైత్తిరీయ బ్రాహ్మణం (2. 8. 8) మంత్రంలో -  

चत्वारि वाक्परिमिता पदानि तानि विदुर्ब्राह्मणा ये मनीषिणः ।
गुहा त्रीणि निहिता नेङ्गयन्ति तुरीयं वाचो मनुष्या वदन्ति ॥

చత్వారి వాక్పరిమితా పదాని తాని విదుర్బ్రాహ్మణా యే మనీషిణః 
గుహా త్రీణి నిహితా నేంగయన్తి తురీయం వాచో మనుష్యా వదంతి || 

"నాలుగు వాగ్రూపములలో ఉన్న శబ్దాన్ని(పదాలని)  బ్రహ్మరూపంగా విజ్ఞులు  తెలుసుకుంటున్నారు. మూడు రూపములు రహస్యముగా లోపల దాగి ఉన్నాయి. మానవులుమాత్రమే నాలుగవదైన వాక్కును పలుకగలుగుతున్నారు. "ఇది చూడగానే ఇదేదో తప్పక తెలుసుకోవాలని అనిపించదూ?

భర్తృహరి వాక్యపదీయంలో :

వైఖరియా మధ్యమాయాశ్చ పశ్యన్తాశ్చైతదద్భుతం
అనేక తీర్థ భేదాయాస్త్రయ్యచాచ పరం పరం || భర్త్రుహరి వాక్యపదీయం 1. 59||

భర్తృహరి తన వాక్యపదీయంలో ఈ వాక్కు మూడు రూపాలుగా ఉంటుందని అన్నాడని పైన శ్లోకం వర్ణిస్తుంది. ఆయన నాలుగవ రూపం అనకుండా, మానవులు మాత్రమే తురీయమైన వాక్కుని పలకగలుగుతారన్నాడు. త్రిక్ శైవం లో సోమానందుడనేవాడు నాలుగవదైన వైఖరీ రూపాన్ని ప్రవేశ పెట్టాడనీ, అంతకుముందు మూడు రూపాలనీ చదివాను కానీ, అది సత్యంగా కనపడదు. ఎందుకంటే యజుర్వేదంలోనే వైఖరీ ప్రస్తావన ఉన్నదని యోగకుండలీయుపనిషత్తు చెపుతున్నది. అంటే భర్తృహరి ముందరేనన్నమాట.

ఇక యజుర్వేదంలో యోగకుండల్యుపనిషత్  లో ఇలా ఉన్నది:

परायामङ्कुरीभूय पश्यन्त्यां द्विदलीकृता ॥
मध्यमायां मुकुलिता वैखर्यां विकसीकृता ।
पूर्वं यथोदिता या वाग् विलोमेनास्तगा भवेत् । (3: 18,19)

పరాయమన్కురీభూయ పశ్యన్త్యాం ద్విదళీకృతా |
మధ్యమాయాం ముకుళితా వైఖర్యామ్ వికసీకృతా |
పూర్వం యథోదితా యా వాగ్విలోమేనాస్తగా భవేత్ | (యజుర్వేదం 3: 18,19)

అయితే, వికీపీడియాలో చూస్తే ఈ యోగకుండల్యోపనిషత్తు యోగశాస్త్రాలకన్నా తరువాతిదనీ, దాదాపు 10వ శతాబ్దంనాటిదనీ ఉన్నది. కానీ నాకు వికీపీడియాని నమ్మబుద్ధి కాలేదు. కారణాలనేకం.

ఇక ఈ శ్లోక వివరణ చూద్దాం: (స్పందన శక్తి ఉత్పన్నమవంగానే) 'పరా' గా పుట్టిన (శబ్దబ్రహ్మ శక్తి ఒక మొక్కగా) రెండు ఆకులు ధరించి పశ్యంతి గా ఆవిర్భవించింది. మళ్ళీ మధ్యమగా ముకుళించుకుపోయి, వైఖరిగా వికసితమవుతున్నది. (అంటే మధ్యమగా ముడుచుకున్న ఆకులు మళ్ళీ వైఖరిగా విస్తరించాయి). పూర్వం పుట్టిన ఈ వాగ్దేవత కిందకి వెళుతూ పైకి తిరిగి ఊర్ధ్వముఖంగా పయనిస్తున్నది. ఇక్కడ విలోమ అనే శబ్దానికి ' Turned Opposite way ' అన్న అర్థం తీసుకోవచ్చు. ఈ process సరిగ్గా అర్థం చేసుకోవడానికి ఇంకా వేరే పాఠం చూడవలసి వచ్చింది.

దీనికి శాస్త్రంలో ఇంకొక చోట ఇలా కనిపిస్తున్నది:

మూలాధారాత్ సముత్పన్న: పరాఖ్యో నాద సంభవః | 
సయేవ ఊర్ధ్వతయా నీతః స్వాధిష్టానే విజృంభితః | 
పశ్యంతాఖ్యామవాప్నోతి తయైరోర్ధ్వం  శనై: శనై:  | 
అనాహతే బుద్ధి తత్వ సమేతో మధ్యమావిదః | 
తథా తయోర్ధ్వన్నున్నస్సన్ విశుద్దౌ  కంఠ దేశతః వైఖర్యాఖ్యా: |  

శ్రీ విద్యారణ్యులవారి సూత సంహిత టీక లో:

ज्ञातमर्थं विवक्षोः पुरुषस्येच्छया जातेन प्रयत्नेन मूलाधारस्थः पवनः संस्कृतस्तेन पवनेन सर्वत्र स्थितं शब्द्ब्रह्म तत्राभिव्यज्यते । तदभिव्यक्तं शब्दब्रह्म कारणबिन्द्वात्मकं स्वप्रतिष्ठतया निःस्पन्दं सत् परावागित्युच्यते । तदेव नाभिपर्यन्तमागच्छता तेन वायुना अभिव्यक्तं विमर्शरूपेण मनसा युक्तं सामान्यस्पन्दप्रकाशरूपिणी कार्यबिन्दुतत्त्वात्मिकाऽधिदैवमीश्वररूपा पश्यन्तीवागित्युच्यते । तदेव शब्दब्रह्म तेनैव वायुना हृदयपर्यन्तमभिव्यज्यमानं निश्चयात्मिकय बुद्ध्या युक्तं विशेषस्पन्दरूपनादबिन्दुमय्यधिदैवतं हिरण्यगर्भरूपा मध्यमावागित्युच्यते । तदेवऽऽस्यपर्यन्तं तेनैव वायुना कण्ठादिस्थानेषुवभिव्यज्यमानम् अकारादि-क्षकारान्तवर्णमालारूपं परश्रोत्रग्रहणयोग्यं बीजात्मकमधिदैवं विराड्रूपं वैखरीवागित्युच्यते ।

జ్ఞాతమర్థం వివక్షో: పురుషస్యేచ్ఛయా జాతేన ప్రయత్నేన మూలాధారస్థ: పవన: సంస్కృతస్తేన పవనేనా సర్వత్రా స్థితం శబ్దబ్రహ్మ తత్రాభివ్యజ్యతే | తదభివ్యక్తం శబ్దబ్రహ్మ కారణ బింద్వాత్మకం స్వప్రతిష్ఠతయా ని:స్పందం సత్ పరావాగిత్యుచ్యతే | తదేవ నాభిపర్యన్తమాగచ్ఛతా తేన వాయునా అభివ్యక్తం విమర్శరూపేణ మనసా యుక్తం సామాన్యస్పందప్రకాశరూపిణీ కార్యబిందుతత్వాత్మికాధిదైవమీశ్వరరూపా పశ్యన్తీవాగిత్యుచ్చతే | తదైవ శబ్దబ్రహ్మ తేనైవ వాయునా హృదయాపర్యంతమభివ్యజ్యమానం నిశ్చయాత్మికయ బుధ్యా యుక్తం విశేషస్పందరూపనాదబిందుమయ్యధిదైవతం హిరణ్యగర్భరూపా మధ్యమావాగిత్యుచ్యతే | తదైవస్యపర్యన్తం తేనైవ వాయునా కంఠాధిస్థానేషువభివ్యజ్యమానం అకారాది - క్షకారాంతవర్ణమాలారూపం పరశ్రోత్రగ్రహణయోగ్యం బీజాత్మకమధిదైవం విరాడ్రూపం వైఖరీవాగిత్యుచ్యతే |

ఇవి చాలా మహిమాన్వితమైన వివరణలు. కొన్ని వేల ఏళ్ల క్రితమే మన మహర్షులు ఎంతో చక్కగా వాక్కు ఎలా పుడుతుందో, ఎలా దీన్ని అర్థం చేసుకోవాలో, యే యే స్టేజ్ లో ఎలా మార్పు చెందుతుందో అర్థం చేసుకోవడం మనకి నేర్పారు. అలాంటి ఋషులకి, వారి పరంపరకు నమస్కారం చెప్పుకుంటూ, ధన్యవాదాలు చెప్పుకుంటూ, హైందవ మతంలో (సనాతన ధర్మంలో) సైన్సు, రిలీజియన్ అనేవి రెండు కాదని, అంతా ఒక సమగ్రసారం (integral entity) అని తెలుసుకుంటూ అర్థం పరిశీలిద్దాం.

మొట్టమొదట మనలో 'మాట్లాడాలి' అనే స్పందన పుడుతుంది. ఇది వివక్ష. ఇచ్ఛా శక్తి.. అప్పటిదాకా వ్యక్తం కాని దాన్ని వ్యక్తం చెయ్యాలనే భావన స్పందన శక్తిగా పుడుతుంది. ఇది సహస్రార కమలంలో ఉన్న చంద్రమండలంలో ఉన్న శక్తి. .  సహస్రార కమలం శిరస్సుకి పైభాగంలో ఉంటుంది. (ఇక్కడ మన శరీరంలో వరుసగా మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా, సహస్రార కమలాలున్నాయనీ, అవి దేహంలో ఎక్కడ ఉన్నాయో, మీరు తెలుసుకోవాలి. దీని  గురించి సూచనగా మాత్రమే ఈ వ్యాసంలో చెప్పడం జరిగింది. వివరాలకై వేరే వాఙ్మయం చదవాలని మనవి). ఈ ఇచ్చా శక్తికి  జ్ఞాన శక్తి, క్రియా శక్తి తోడవ్వాలి కదా? అప్పుడే 'మాట్లాడాలి' అన్న ఇచ్ఛ మాటగా బయటకి వచ్చే యోగం సిద్ధమవుతోంది. యోగ పరంగా ఈ స్పందనా శక్తిని ప్రాణశక్తిగా వర్ణిస్తారు. స్త్రీలింగంలో లలితాదేవి శక్తిగానూ, పుంలింగంలో శబ్ద బ్రహ్మగానూ వ్యవహరిస్తారు. మెదడులో పైన సహస్రారంలో పుట్టిన ఈ శక్తి చాలా వేగంగా - (బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు దీన్ని ''విద్యుద్వేగంగా" వర్ణించారు) మూలాధార చక్రాన్ని చేరుతుంది. ఈ మూలాధార చక్రం అన్నిటి కన్నా కింద ఉన్న చక్రం. ఇది వెన్నెముక అథోభాగంలో ఉంటుంది. ఈ స్పందన శక్తి (కారణ మాత్రం, శబ్ద బ్రహ్మ స్వరూపం) మూలాధారం నించి మళ్ళీ పైకి వాయు రూపం సంతరించుకుని బయలుదేరుతుంది. ఇది వాక్కుకు మూలం అవుతుంది. బింద్వాత్మకంగా మూలాధారంలో ఉన్న ఆ శబ్దబ్రహ్మ వాగ్రూపంగా  వాయువుగా పైకి బయలుదేరుతుంది. ఈ స్థితిలో ఉన్న శక్తి పేరు "పరా". ఊర్ధ్వ ముఖంగా బయలుదేరిన ఈ శక్తి నాభి వద్దనున్న స్వాధిష్టాన చక్రం దగ్గిరకి వచ్చేటప్పటికి ప్రభంజనమై, "పశ్యంతీ" రూపం పొందుతుంది. ఇప్పటిదాకా సామాన్య స్పంద శక్తిగా బింద్వాత్మకంగా ఉన్న ఆ శక్తి పరా రూపం నించి పశ్యంతీ రూపం ధరించేటప్పుడు అక్కడ మనస్సు కేంద్రీకృతమై  (అంటే మనసుతో కలిసి) చూస్తూ ఉంటుంది. ఈ స్టేజ్ లో సామాన్య ప్రకాశ రూపిణి అయిన శబ్ద బ్రహ్మ (ప్రాణశక్తి) నాభిపర్యన్తం వచ్చేటప్పటికి 'కార్య ' బిందురూపం దాల్చి మనస్సుతో కలిసి  చూస్తూ ఉంటుంది. అందుకే ఆ శక్తికి 'పశ్యంతీ' అని పేరొచ్చింది. అంటే ఈ స్థితిలో ఈ శబ్ద శక్తి మనస్సు అధీనంలో ఉంటుంది. మనస్సు యొక్క స్వభావం ఏంటంటే అది ఎప్పుడూ మనకి వివిధ వికల్పాలని చూపిస్తూ ఉంటుంది. అంటే ఆంగ్లంలో చెపితే Options ఇస్తూ ఉంటుంది. ఈ ప్రభంజనం వంటి వాయువు అదే వేగంతో పైకి విశుద్ధ చక్రం వైపు వెళుతూ ఉంటుంది.

అనాహత చక్రం హృదయ స్థానంలో, విశుద్ధ చక్రం కంఠ స్థానంలో ఉంటాయి. ఈ అనాహత చక్రంలో ప్రస్తుతం మనస్సు అధీనంలో ఉన్న శబ్ద శక్తిని  విశుద్ధ చక్రం చేరే మధ్యలో బుద్ధి అడ్డుకుంటుంది. ఈ స్థాయిని "మధ్యమా" అంటారు. ఇక్కడ రెండు క్రియలు జరుగుతాయి. ఒకటి: చెప్పబోయే మాటకి బుద్ధి వివక్షాశక్తి ఒక జల్లెడ పట్టే పని చేస్తుంది. అంటే మనస్సు చెప్పే రకరకాలైన మాటలకి బుద్ధి ఒక స్వరూపం కలిపించి ఆ మాటలు మనం అనవచ్చో లేదో సూచిస్తుంది. సరియైన ఒక మాట ఎంచుకుంటుంది. ఈ సమయంలో మంచి చెడ్డలు, ఏ భాషలో అనాలి, ఏ స్థాయిలో అనాలి, ఏ మాట తరువాత ఏ మాట అనాలి వంటి నిర్ణయాలు జరుగుతాయి. రెండు: మనకి ధారణలో ఉన్న విషయాలు ఎంతవరకూ ఇక్కడ పనిచేస్తాయో, వాటికి, భాషా స్వరూపం కూడా ఇక్కడే తయారవుతుంది. అంటే ఈ మధ్యమారూపంలో స్పందన శక్తి ఒక పూర్తి వాక్య స్వరూపం దాలుస్తుంది. అయితే, ఇప్పటిదాకా అది ని:స్పందనగానే ఉంటుంది. అంటే బయటకి వినపడే శబ్దరూపం ఇంకా రాలేదన్న మాట. ఇక్కడే అకారాది - క్షకారాంతవర్ణరూపం తయారవుతుంది. ఇక్కడే మనకి జ్ఞాపకరూపంలో ఉన్న శబ్దం, కొత్తగా తయారయ్యే శబ్దం యొక్క అనుసంధానం జరుగుతుంది. ఈ రూపం ఒక విశేష బిందుమయ, హిరణ్య గర్భ రూప అధిదైవతా రూపం ధరిస్తుంది. ఇప్పుడు ఈ పూర్తి ఆయిన రూపం విశుద్ధ చక్రం వైపు ప్రయాణిస్తుంది.

విశుద్ధ చక్రంలోనే ఈ శబ్దబ్రహ్మమైన శక్తి నిజమైన,ఇతరులకి వినపడే శబ్ద పద, వాక్య రూపాలు దాలుస్తుంది. దీన్ని "వైఖర " అంటారు. ఈ వైఖరి స్వరూపం ఒకొక్క మాటని ఒకదాని తరువాత ఒకటి ఎలా ఉచ్చరించాలో అలా కంఠంలో ఉన్న కండరాలని కదిలించడం ద్వారా శబ్దోత్పన్నం చేసి వినేవాళ్ళకి అర్ధమయ్యే రూపంలో బయటకి పంపుతుంది. కంఠంలో ఒకొక్క నిర్దిష్టమైన ప్రదేశాల్లో వివిధ శబ్దాలు ఉత్పన్నమవుతాయి. ఇదివరలో పూర్తి అర్ధవంతంగా తయారయిన శబ్దబ్రహ్మం ఇక్కడ ఒక వరుసక్రమంలో బయటకి వస్తూ ఒకొక్క కండరాన్ని కదిలిస్తూ 'శబ్ద ' రూపంగా బయటకి వస్తుంది. ఏ వైఖరితో బయటకి రావాలో నిర్ణయిస్తుంది కనక దీని రూపం 'వైఖరీ '.

మనం సాయనుడి భాష్యం పరిశీలిస్తే ఇదే నాలుగు స్థాయిలు, ఇదే నాలుగు పేర్లతో కనిపిస్తాయి - పరా, పశ్యంతీ, మధ్యమా, వైఖరీ - అని. కానీ సాయన భాష్యంలో 'అకారాది క్షకారాంతం ' అన్న మాట లేదు.

ఇక్కడ శ్రీ సామవేదంవారు ఒక అద్భుతమైన విషయం వెల్లడించారు: సృష్టి నిర్మాణం కూడా ఇలా పరా, పశ్యంతీ, మధ్యమా, వైఖరీ అన్న నాలుగు భాగాల్లోనే అయిందని. పరమాత్మ ఒక్కడుగా ఉన్నప్పుడు సృష్టి చెయ్యాలనుకున్నాడు; ఆయన అనుకోగానే తన శక్తితో కలిసాడు. ఆయన తన శక్తితో కలవంగానే ఆ దశని  'పరా ' అంటారు. ఆ తరువాత ఆయన ఏం సృష్టి చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఆ సంకల్ప దశ (భావ దశ) ఆయనకి పశ్యంతీ దశ. ఏ విధంగా వివరంగా నిర్మాణం చెయ్యాలని అనుకున్నాడో అది ఆయన మధ్యమా దశ. ఆఖరికి ఆయన సృష్టిని వ్యక్తం చేసిన దశ -  అది వైఖరీ దశ.

దేవతానామాలు: మన ఋషులకి ఈ నాలుగు స్థాయిలూ (Stages ) నాలుగు దేవతా రూపాలుగా దర్శనమిచ్చాయి. ఈ పరా రూపం 'ప్రత్యక్చితీ ' దేవతగా దర్శనమైంది. లలితా సహస్ర నామాలలో ఉన్న, పైన ఉదహరించిన ఈ రూపం 'వెనుదిరిగి చూసిన/చూడవలసిన) రూపం. అంటే అంతర్ముఖంగా మనకి దర్శనమయ్యే రూపం. ఇలా అంతర్ముఖులమై శబ్దబ్రహ్మాన్ని దేవతారూపంగా ఆరాధించగలగడం ఒక గొప్ప సాధన. శ్రీచక్రంలో బిందు స్థానమే 'పరా'. ఈవిడని ప్రత్యక్ గానే సాధన చేస్తే ' చితి ' గా అర్ధం అవుతుంది. అంటే చైతన్య రూపంగా తెలుస్తుంది. పశ్యంతి రూపాన్ని పరదేవతగా అభివర్ణించారు.  శ్రీచక్రంలో త్రికోణ రూపమే పశ్యంతీ. ఆ పైన ఉండే అష్ట త్రికోణ చక్రమే ‘ మధ్యమా '. ఆపైన అన్ని ఆవరణలూ కలుపుకుని ' వైఖరీ '' అని తెలుసుకుంటున్నాము. ఈ నాలుగు రూపాలూ కలిసి ' భక్తుడి మనసు అనే హంస ' - అని లలితా సహస్ర నామంలో వశిన్యాది వాగ్దేవతలు వర్ణించారు. మళ్ళీ ' హంస ' అన్న మాట పరమాత్మ స్వరూపాన్నే సూచిస్తుంది. అంటే - పరా  దేవతని ప్రత్యక్చితీ రూపంలోనూ, భావ రూపంలో పశ్యంతీ గానూ, జప రూపంలో (అంటే మాటలని లేక మంత్రాలని మనస్సులో అనుకోవడం) మధ్యమాగా తెలుసుకుని, , ఆ ప్రాణశక్తి అయిన అమ్మవారిని, వాక్కు బ్రహ్మగా భావించడం భారతీయుడి గొప్పదనం. ఆ వాక్కుని పరుషంగా అధర్మంగా వాడకూడదనే మాట దీనివల్ల నిర్ధారితమవుతుంది.

దీని గురించి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు మాట్లాడుతూ - 'ఈ వాక్కు (ప్రాణ శక్తి) అనేది ఒక్క మనుషులకే ఉన్నదని అనుకోవడం పొరపాటు. సృష్టిలో అందరికీ / అన్నిటికీ వాక్కు ఉంటుంది. రాళ్ళలో ఇది ' పరా ' రూపంలోనూ, చెట్లలో ఇది ' పశ్యంతీ ' రూపంగానూ, జంతువులలో ఇది ' మధ్యమా ' రూపంగానూ ఉంటుంది ', మానవులలోనే వైఖరీ రూపంలో ఉంటుంది - అని చెప్పారు. ఇది చాలా సరిగ్గా మనకి తెలిసిన సైన్సుకి సరిపోయింది కూడా. ఈరోజే యూరపు దేశాలనించి ఒక వార్త వెలువడింది (12/17/2019): వాక్కు అనేది ఇదివరలో అనుకున్న దానికన్నా 200,000 ఏళ్ల క్రితమే ఉన్నదనీ, అప్పుడు ఉండే ' monkeys ' చాలా బాగా మాట్లాడేవనీ, differentiated vowels కూడా పలికేవనీ ఈ వార్త తెలియజేసింది. మనకి వెంటనే రామాయణం గుర్తుకు రాదూ? హనుమంతుడు గొప్ప వాక్శీలత కలవాడని రామాయణంలో రాస్తే దాన్ని పరిహసించిన వాళ్ళు ఎంతమంది లేరు? పాశ్చాత్త్యులు పరిహసించి వాఖ్యానం చేస్తే ఒక పెట్టు - కానీ భారతీయులు కూడా అలాగే చేస్తే ఎంత అన్యాయం? అశ్రద్ధ? మీరు శ్రద్ధగా చెట్లు పెంచేవారిని అడగండి - వాళ్ళు చెపుతారు - చెట్లతో మాట్లాడినా, వాటికి సంగీతం వినిపించినా అవి సంతోషించి బాగా కిలకిలలాడతాయని. కాబట్టి వేద పరిజ్ఞానం బాగా తెలుసుకుని మనం ఎందుకు చెట్లని పరమాత్మ స్వరూపంగా ఆరాధిస్తామో  అర్థం చేసుకోవాలి. అలాగే మన సంస్కృతిలో ప్రతి దేవతకీ ఒక జంతువు వాహనం. ఆ జంతువులు మాట్లాడటమూ, చాలా విశిష్టమైన (కాంప్లెక్స్ ) భావాలని అభివ్యక్తీకరించటమూ చెయ్యడం చూస్తాము. పక్షులు కూడా అంతే. ఉదా: గరుత్మంతుడు. ఈ జంతువులూ, పక్షులూ మధ్యమారూపంలో వాటిమధ్య అవి, మనుష్యులతోను మాట్లాడతాయి. వైఖరి లేనందువల్ల వాటి మధ్యమా వాగ్రూపం మనకి అర్థం కాదు కానీ, చాలామంది వాళ్ళ కుక్కలు, పిల్లులు ఏం చెప్పాలని అనుకుంటున్నాయో  గ్రహించేస్తారు. ఇదే దీని వెనుక రహస్యం. మనుష్యులకు మాత్రమే వైఖరీరూపం వ్యక్తం చేసే అవకాశం ఉన్నది. జంతువులలో కూడా ఏనుగు, కోతి, కాకి వంటివి ఒక "హయ్యర్ కాన్షస్ ప్లేన్ " లో వ్యవహరిస్తాయి. అంటే సృష్టిలో ఉన్న ప్రతీదీ - రాళ్లనించి, జంతువులనించి, సర్వం - ఈ నాలుగు స్థాయిలలో మాటలు చెపుతూనే ఉంటాయి. పైగా, ఒకప్పుడు మనుష్యులకి పరా, పశ్యంతీ, మధ్యమా రూపాలు అర్థం అయ్యేవి బాగా అనేది మన పురాణాలు, వేద వాఙ్మయం చూస్తే అర్థం అవుతుంది. ఇప్పుడు ఆ శక్తి తగ్గిపోయింది. యోగసాధన ద్వారా ఆ శక్తులు మళ్ళీ సాధించుకోవచ్చు అని అంటారు.

## చివరి భాగం తరువాయి సంచికలో ##

Posted in May 2020, సాహిత్యం

2 Comments

  1. G.S.S.Kalyani

    కృష్ణ కుమారు గారూ..! నమస్కారం. మీరు రాసిన ఈ వ్యాసం అత్యద్భుతంగా ఉంది! లలితా సహస్రంలోని నామాలకు, వాక్కుకీ మధ్యనున్న సంబంధాన్ని చక్కగా వివరించారు. మావంటి సామాన్యులకు తెలియని ఎన్నో విషయాలు విపులంగా తెలియజేసారు. వివిధ వేదశాస్త్రాలలో వాక్కు గురించి ఏముందో ఆ వివరాలు కూడా తెలుసుకునే అవకాశం ఈ వ్యాసం మాకు కల్పించింది. మన నోటి వెంట సునాయాసంగా వచ్చే వాక్కు మన శరీరంలో ఒక చక్రం నుండీ ఇంకో చక్రానికి వెళ్లే విధానం ఆసక్తికరంగా ఉండటమేకాక, ఒక మాట వెనుక ఇంత జరుగుతుందా అని ఆశ్చర్యాన్ని కూడా కలిగించింది.ఎంతో కృషితో మీరు సంపాదించిన జ్ఞానాన్ని ఈ విధంగా అందరితో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి వ్యాసాలు మీ నుండీ మరిన్ని రావాలని కోరుకుంటున్నాము. ఇంత అద్భుతమైన వ్యాసం ప్రచురించినందుకు ‘సిరిమల్లె’ పత్రిక వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.

  2. Ms. P. Neeraja

    A great in-depth analysis of some of our shlokas to understand the origin of our speech.
    జంతువుల మధ్య జరిగే సంభాషణలు కూడా వైఖరినేమో?? కొన్ని tribal బాషలు మనకు అర్ధంకానట్లుగా .
    ఎందుకంటే శబ్దం చేస్తాఇ కదా

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!