Menu Close
Page Title

7. కాకతీయ వైభవం

తెలుగు గడ్డ నేలిన రాజులలో శ్రీ కృష్ణదేవరాయల తరువాత కాకతీయ రాజులు ప్రముఖులు. వీరు 11 వ శతాబ్దంలో చాళుక్యుల శత్రు రాజ్యస్థాపకులుగా ఓరుగల్లులో చాల చిన్న రాజ్యంగా ప్రోలుని ఆధిపత్యంలో ప్రారంభించి, 12, 13 శతాబ్దాలలో రాజ్యవిస్తీర్ణంతోబాటు ప్రజాదరణని కూడా పెంచుకున్నారు. వీరిలో రుద్రదేవుడు 1158- 1165 మధ్యకాలంలో అన్ని దిశలా రాజ్యాన్నిపెంచి వరంగల్లు కోట, వేయిస్థంభాలగుడి, రామప్ప దేవాలయం నిర్మించి ప్రసిద్ధుడైనాడు. తరువాత వచ్చిన మహాదేవుడు, ఆ తరువాత గణపతి దేవుడు (1199-1261) గోదావరి తీరాలని దాటి, తూర్పు తీరాలనాక్రమించి, లలితకళలని, వర్తక వ్యాపారాల అభివృద్ధిని సాధించి కాకతీయ రాజులలో ఆధిక్యతని సంపాదించుకున్నాడు. గణపతి దేవునికి సామంత రాజైన మనుమసిద్ధి ఆస్థానంలో ఉంటూ మహాభారతం రచించిన కవిత్రయంలో మధ్యముడైన తిక్కన సోమయాజి వ్యాస మహాభారతం లో పదునాల్గు (4 నుంచి 18) పర్వాలు ఆంధ్రీకరించి ప్రసిద్ధి గాంచాడు. తిక్కన సోమయాజి పుట్టినది నెల్లూరులోనే అయినా కాకతీయ రాజుల ప్రాపకంలో కవి రాజుగా ఎదిగిపోయాడు. ఆదికవి నన్నయ, సంస్కృత పదాలంకరణతో తన ఆంధ్ర మహాభారత ప్రబంధాన్ని అలంకరిస్తే, తిక్కన అచ్చ తెలుగు పదాలతో తన ప్రబంధ కావ్యాన్ని జన రంజకం చేశాడు. తిక్కన తెలుగు పద్యాలు ఇప్పటికి నానుడులుగా తెలుగువారి నోళ్ళల్లో నానుతూనే ఉన్నాయి. ఉదాహరణకి కొన్ని మచ్చుతునకలు: 'మడుగు చీరయందు మాసి తాకినట్లు', 'పాలలో పడిన బల్లి తెఱంగున', 'నెయ్యివోసిన అగ్ని భంగి', 'మంటలలో మిడుతలు చొచ్చినట్లైన', 'కంటికి రెప్పవోలె', 'నూతిలోని కప్ప విధంబున'.

Kakathiya Vaibhavamపరమాత్ముడు ఒక్కడే అని నమ్మిన తిక్కన తన ఆంధ్ర మహాభారతకావ్యాన్ని హరిహరనాధునికి అంకితమిచ్చి హరిహరాద్వైత భావాన్ని నిరూపించాడు. నెల్లూరు రాజ్యానికి కాకతీయ సామంతులలో ఒకడైన మనుమసిద్ధి వద్ద తిక్కనామాత్యుడు ప్రధానమంత్రి గా ఉండేవాడు. ఒకప్పుడు మనుమసిద్ధి దాయాదుల కుతంత్రం తో సింహాసనాన్ని కోల్పోయినప్పుడు, తిక్కనామాత్యుడు ప్రధాన మంత్రిగా గణపతి దేవుని వద్దకి వెళ్లి అయన సహాయంతో మనుమసిద్ధి శతృవులని తరిమికొట్టి ఆతడు తిరిగి రాజ్యాధికారం పొందేటట్లు చేశాడట. అందుకు కృతజ్ఞతగా తిక్కనాచార్యుడు "నిర్వచనోత్తర రామాయణం" కృతిని గణపతి దేవునికి సమర్పించాడు. గణపతి దేవుడు చిన్న రాజ్యాలనేలే రాజులందరిని ఏకం చేసి తెలుగు రాజ్యాన్ని స్థాపించిన కీర్తిని సంపాదించాడు. 1220-1280 కాలంలో చోళ రాకుమారుడైన బద్దెన భూపాలుడు కాకతీయులకు సామంత రాజుగా ఉండి 'సుమతి' అనే మొదటి నీతి శతక గ్రంధాన్ని కందపద్యాలలో సులభమై అందరికీ అర్ధమయ్యే రీతిలో తెలుగులో వ్రాసి చాలా ప్రసిద్దుడైనాడు. అది ఈనాటికి అందరి నోళ్ళల్లో నానుతూ అలవోకగా పండిత పామరులతో ఉదాహరించ బడుతూ వాసికెక్కినది. బద్దెన భూపాలుడు తిక్కనాచార్యుల శిష్యుడు కూడా.

సుమతి శతకంలోని కొన్ని చాలా మంది చేత పలికించే ఉదాహరణలు:

Kakathiya Vaibhavam'బలవంతుడ నాకేమని, పలువురితో విగ్రహించి పలుకుట మేలా?'; 'వినదగు నెవ్వరుచెప్పిన, వినినంతనె వేగపడక వివరింపఁదగున్, గని కల్లనిజము లెరిగిన మనుజుడెపో నీతిపరుడు'; 'ఎప్పటికెయ్యది ప్రస్తుత మప్పటికా మాటలాడి అన్యులమనముల్ నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగు వాడె ధన్యుడు'; 'కనకపుసింహాసనమున శునకముగూర్చుండఁబెట్టి శుభలగ్నమునం దొనరఁగ బట్టముఁ గట్టిన వెనుకటి గుణమేల మాను?'; 'తలనుండు విషము ఫణికిని వెలయంగా దోకనుండు వృశ్చికమునకున్ ఖలునకు నిలువెల్ల విషము గదరా'; 'సిరిదా వచ్చిన వచ్చును సరసంబగు నారికేళ సలిలముభంగిన్, సిరిదా బోయిన పోవును కరిమ్రింగిన వెలగపండు కరణిని'.

అదే కాలంలో పాల్కురికి సోమనాధుడు (1160-1240) 'బసవ పురాణం', 'పండితారాధ్య చరిత్ర', 'మల్లమ్మదేవి పురాణం' ద్విపద కావ్యాలుగా తెలుగులోనూ, 'సోమనాథభాష్య' 'రుద్రభాష్య' 'వృషభ శతక', 'బసవ పంచక', 'బసవాష్టక', 'పంచ ప్రకారం గద్య', 'అష్టోత్తర శతనామ గద్య', 'అక్షరాంక గద్య' సంస్కృతంలోనూ, అనేక గ్రంధాలను కన్నడ భాషలోనూ వ్రాసి వన్నెకెక్కాడు. యాభై ఏళ్ళే జీవించినా, ఆయన సాహిత్య సేవ అమోఘం. గణపతి దేవుని అనంతరం అతనికి కొడుకులు లేకపోవడం వల్ల, ఆయన కుమార్తె, రాణి రుద్రమదేవి చాల చతురురాలై తేలితేటలతో తన రాజ్యంలోని అంతర్శతృవులని, బహిర్శతృవులని కూడా అణచివేసి రాజ్యపాలన చేసి సుప్రసిద్ధురాలైనది. తరువాత ఆమె మనుమడు ప్రతాపరుద్రుడు II, 1265-1323 ల మధ్య రాయచూరు వరకు రాజ్యాన్ని విస్తరించి రాజ్యపాలనకి మెరుగులు దిద్ది, లలిత కళలని అభివృద్ధిచేసి కాకతీయ చరిత్రలోనే 'స్వర్ణయుగం' అనిపించుకున్నాడు. కాకతీయ యుగంలో శిల్పకళ కూడా విరబూసింది. ఒక్క రామప్ప దేవాలయం లో తప్ప తక్కిన ఆలయాలలో శిల్పశ్రేష్ఠుల పేర్లుగాని వారి చరిత్రలు తెలియజేసే ఆధారాలు ఎక్కడా దొరక్కపోయినా, వారి కళాసృష్టి కోటలలోని రాతి స్థంభాలపైన, దేవాలయాల్లోనూ, స్థిరంగా నిలిచి నేటికీ చూపరులని ముగ్ధుల్ని చేస్తోంది. ఆ శిల్ప సౌందర్యం ఇక్కడ ప్రదర్శించిన ఫోటోలలోచూడవచ్చు.

ఓరుగల్లు కోట: పదమూడవ శతాబ్దంలో కాకతీయ ప్రభువు గణపతి దేవునిచే చాల భాగం నిర్మింపబడి ఆయనకూతురు రుద్రమదేవి చే పూర్తి చేయబడిన మూడు అంతరాల రక్షణ స్థావరమై, శతృ దుర్భేద్యమైన ఈ కోట, అనేక ముస్లిం రాజుల దాడుల్ని ఎదుర్కొని నిలవగలిగింది. శతృ దాడుల వల్ల విచ్ఛేదనము కాగా మిగిలిన శిల్పకళా సౌదర్యం ఈనాడు కూడా మనల్ని ముగ్ధుల్ని చేస్తోంది అనడంలో సందేహం లేదు.

Kakathiya Vaibhavam

రామప్ప దేవాలయం: పాలంపేట లోని చాళుక్య శైలి లో నిర్మింపబడ్డ రామలింగేశ్వరాలయం క్రీ.శ. 1213 లో రామప్ప అనే శిల్పిచే నిర్మిపబడినట్లు శిలాశాసనాలు ఉన్నాయి. నక్షత్రాకారంలో ఉన్న ఆరడుగుల మెట్టుపైన ఎర్ర ఇసుకరాయితో నిర్మితమైన ఈ రామేశ్వరాలయం ప్రపంచ చరిత్రకారుడు మార్కోపోలో దృష్టిని ఆకర్షించి అప్పటి ప్రపంచ ఆలయాల చరిత్రలోనే గొప్పదై వెలుగుతున్న ఒక ధృవ తారగా గుర్తింపు పొందింది. ఆతని మెప్పు పొందిన మరొక గొప్ప నిర్మాణతీరు ఏమనగా నీటిపై తేలే ఇటుకలతో నిర్మింప బడినదట. అలాగే  పునాదులు ఇసుక పెట్టెలపై నిర్మించడం జరిగిందని కనుకనే అనేక భూకంపాలని, వాతావరణపు ఆటుపోట్లని తట్టుకుని ఈ నాటికి నిలబడి ఉందని చెప్పవచ్చు. అదే ప్రాంతంలో నిర్మితమైన అనేక కట్టడాలు శిధిలమైనా, ఈ ఆలయం మాత్రం చెక్కుచెదరక నిలిచి యునెస్కో చేత ప్రపంచ సాంస్కృతిక స్థలంగా పేర్కొనబడింది.

Kakathiya Vaibhavam

రామప్ప చెరువు: రామప్ప ఆలయం పక్కనే ఉన్న ఈ చెరువు 13వ శతాబ్దంలో కాకతీయ రాజులచే నిర్మింపబడిన 35 చదరపు మైళ్ళ విశాలం గల పెద్ద తటాకం. దీని జలాలు ఓరుగల్లు జిల్లా పంటపొలాలకు ఆధారమే కాకుండా కొన్ని శతాబ్దాలుగా అక్కడి జనాల మంచి నీటికొరత తీరుస్తూ వచ్చింది. ఈనాటికీ ఇది పక్షులకి, జలచరాలకి అలవాలమై పర్యాటకులకు వినోద యాత్రాస్థలమై ఒక ఆకర్షణ గా నిలిచింది.

Kakathiya Vaibhavamవేయి స్థంభాల గుడి: నక్షత్రాకారంలో వేయి స్తంభాలతో కాకతీయ రాజు రుద్రదేవుని చే నిర్మింపబడి అప్పటి శిల్ప సంస్కృతికి మచ్చుతునకై నిలిచిన రుద్రేశ్వర స్వామి దేవాలయం (శివాలయం) 1163 లో పూర్తి చెయ్య బడ్డట్టు చెప్పబడుతొంది. ఈ ఆలయంలో స్తంభాలు ఎంత సుందరంగా మల్చబడ్డాయంటే, ఎక్కడనుంచి చూసినా దైవ దర్శనానికి అవి అడ్డుగా నిలవవు. ఈ త్రికూటాలయంలో శివుడు, విష్ణువు, సూర్యుడు ఆరాధ్య దైవాలు. నల్లరాతిపై సున్నితంగా మలిచి అతిసుందరంగా తీర్చిదిద్దిన ఆ శిల్ప సౌందర్య నాశనానికి మహమ్మద్ బీన్ తుగ్లక్ వంశీయులు పంతంతో పనిచేశారట. ఎక్కడైనా యుద్ధంలో గెలిచి రాజ్యాన్ని ఆక్రమించే రాజులు గెలిచిన రాజ్య సంపద కొల్లగొట్టుకోవడమేకాకుండా అక్కడి సంస్కృతిని నాశనం చెయ్యడమే ధ్యేయంగా పెట్టుకునే పద్ధతి వారి కుసంస్కారానికి అద్దంపడుతుంది. భారత దేశంలో సంస్కృతికి ప్రతిబింబాలైన ఎన్నో దేవాలయాలు ముస్లిం దోపిడీదారుల దారుణాలకు గురై చిన్నాభిన్నమైపోయాయి. అందుకు గుజరాత్ లోని సోమనాధ దేవాలయం, కాశీ విశ్వేశ్వరాలయం తార్కాణాలు.

Kakathiya Vaibhavam

-o0o-

Posted in May 2020, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!