Menu Close
ఘాలి లలిత ప్రవల్లిక
మర్మదేశం (ధారావాహిక)
ఘాలి లలిత ప్రవల్లిక

"చరణ్ ... నేను మాటంటే మాటే. కాసేపు ఎవరూ ఏమీ మాట్లాడొద్దు. నేను కచ్చితంగా దినేష్ ను రక్షిస్తాను. నన్ను నమ్మండి. ఎవరూ ఏడవద్దు." అన్నాడు మేథా.

కాసేపటికి వీరెక్కిన ఫ్లయింగ్ సాసర్ కరెక్ట్ గా దినేష్ తిరుగుతున్న చైర్ పైకి వచ్చింది. వెంటనే ఫ్లయింగ్ సాసర్ కింద ఉన్న అన్ని లైట్లు వెలిగాయి. అవి ఎంతో కాంతివంతంగా ఉన్నయి.

ఒక ఫ్లాష్ లైట్ ను దినేష్ మీదకు ఫోకస్ చేశాడు మేథా.

ఏం జరిగిందో, ఏమో ఎవరికీ అర్థం కాలేదు. ఓ మెరుపు లాంటి కాంతి వారి పక్కన చేరింది. మేథా ఏం చేస్తున్నాడో ఎవరికీ అర్థం కాలేదు.

కాసేపటికి ఆ మెరుపు స్థానంలో దినేష్ ఉన్నాడు. కళ్ళు మూసుకునే ఉన్నాడు. పిల్లలంతా దినేష్ చుట్టూ మూగారు.

"పక్కకు తప్పుకోండి." అంటూ క్రేన్ వాళ్ళను పక్కకు నెట్టాడు.

"భయపడకండి అతను భయంతో కళ్ళు తిరిగి పడిపోయాడు అంతే. మీరు మీ స్థానాల్లో కూర్చోండి.” అన్నాడు మేథా.

“లేదు మేథా! మా ఫ్రెండ్ మాతో మాట్లాడేవరకు మేము ఇక్కడే ఉంటాం." బాధగా అంది శార్వాణి.

"అసలు దినేష్ ని ఎలా తెచ్చావు ఇక్కడికి?" అని కుతూహలంగా అడిగాడు చరణ్.

"ఇలాంటి ఇబ్బందులు వస్తాయనే మిమ్మల్ని కాంతిగా మార్చి తీసుకొని వెళదాం అనుకున్నాము. కానీ మీరు అందుకు అంగీకరించలేదు. అందుకే ఇలా జరిగింది. పోనీలే దినేష్ మనకు దక్కాడు." అన్నాడు డింగూ.

మళ్లీ ఫ్లయింగ్ సాసర్ పైకి ఎగిరింది. "మీ భూగోళమే ఇది." పిల్లలు మూడ్ మార్చటానికి ప్రయత్నిస్తూ చెప్పాడు డింగూ.

"ప్లీజ్ అంకుల్ మాకు మూడ్ లేదు. మా దినేష్ మామూలు స్థితికి వచ్చే వరకు ...మేము వేటి మీద కాన్సన్ట్రేట్ చేయలేము." గద్గద స్వరంతో చెప్పాడు చరణ్.

"దినేష్ కి ఏమీ కాలేదు. పిరికివాడు కదా భయపడ్డాడు అంతే." అంటూ మేథా దినేష్ భుజం తట్టి లేపాడు.

"దినేష్ కళ్ళు విప్పి చూశాడు. వాళ్ళందర్నీ చూడగానే నేను బతికే ఉన్నానా...?" అంటూ తన చేతిని గిల్లుకున్నాడు. నొప్పి పుట్టి అమ్మా అంటూ అరిచాడు.

"అంత గట్టిగా గిల్లుకుంటారా ఎవరైనా?" అన్నాడు కౌశిక్. అందరి మొహాలు నవ్వుతో విచ్చుకున్నాయి.

"ఓకేనా? అందరికీ సంతోషమేనా? ఇప్పుడు చూడండి మీ భూగ్రహాన్ని". అన్నాడు డింగూ.

"ప్రత్యేక లక్షణాలు గల ఏకైక గ్రహం మీ భూమి. ఇదో అందమైన నీలిరంగు గ్రహం.” అన్నాడు క్రేన్..

"మా భూమేనా. ఇంక ఎక్కడికి మేం రాం మమ్మల్ని మా ఇంటికి చేర్చేయండి ప్లీజ్." దీనంగా అడిగాడు దినేష్.

"భయపడకురా దినేష్. నీకేం కాలేదుగా. మంచి అవకాశం ఇది మనకు. జనరల్ నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నాము. మంచి థ్రిల్లింగ్ గా కూడా ఉంది‌. ప్లీజ్ రా అన్ని చూసిపోదాం." రిక్వెస్టింగ్ గా అడిగాడు కౌషిక్.

"అంటే నాకు ఏమన్నా ఐతే నన్ను వదిలేసి మీ పాటికి మీరు అన్నీ చూసుకుంటూ వెళ్లేవారుగా" కోపంగా అడిగాడు దినేష్.

"అలా ఎందుకు అనుకుంటున్నావు దినేష్? వాళ్లు అక్కడే ఉండిపోతామన్నారు. నువ్వు లేకుండా వెళ్ళమన్నారు. బలవంతంగా నేను వారిని ఫ్లయింగ్ సాసర్ లోకి తెచ్చా. నిన్ను అక్కడ వదిలేసానని నాతో కూడా గొడవ పడ్డారు తెలుసా? అంతటి మంచి మిత్రులు దొరకడం నీ అదృష్టం." చెప్పాడు మేథా.

"మేథా మన పక్కన ఉండంగా భయపడాల్సిన పనిలేదు. దినేష్ నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోదాము లే."అంది శార్వాణి.

"లేదు లేదు వచ్చిన అవకాశాన్ని జారవిడుచు కోవడం ఎందుకు? మీ అందరి కోరిక నేను ఎందుకు కాదనాలి. అలాగే అన్నీ చూద్దాం" అన్నాడు దినేష్.

"మన భూమి ఎందుకు నీలంగా కనపడుతోంది?" అని అడిగింది శార్వాణి.

"అయ్యో నీకు అది కూడా తెలియదా? నీటి ప్రవాహాలు, సముద్రాలు అందుకు కారణం. చూడు నీరు ఆవిరిగా, మంచు ముక్కలుగా నీటిగా ద్రవ రూపంలో మనకు ఎలా కనిపిస్తోందో ". అంటూ చూపించాడు చరణ్.

"మనం అతినీలలోహిత కిరణాలు తాకుతామా? ఓజోన్ పొరను దాటేసామా?" భయంగా అడిగాడు దినేష్.

"భయమేమి లేదు మనం దానికన్నా ఎన్నో వేల కోట్ల దూరం నుంచి పోతున్నాం అయినా అలాంటి పొరలు, కలుషిత వాయువులు మనల్ని ఏమీ చేయలేవు. మీరు ఫ్లయింగ్ సాసర్ లో ఉన్నంత వరకు ఎటువంటి ప్రభావాలు మీ మీద పడవు. ఈ విషయం ఎప్పుడూ మర్చిపోవద్దు." అన్నాడు క్రేన్.

"అతినీలలోహిత కిరణాలు అంటే ఎక్కువ నీలంగా ఉండే కిరణాలా?" అమాయకంగా ప్రశ్నించాడు కౌషిక్.

అందరూ గొల్లున నవ్వారు.

"అవి చాలా శక్తివంతమైన కిరణాలు. అవి భూమిమీద ప్రసరిస్తే.. మనిషి శరీరాన్ని తాకిన ప్రాంతాల్లో ఎర్రని మచ్చలు ఏర్పడి శారీరక రుగ్మతలు ఏర్పడతాయి. స్కిన్ క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. పంటలు సరిగా పండవు. అటువంటి అతినీలలోహిత కిరణాలను అడ్డుకునే శక్తి మీ భూ వాతావరణ పొరల లో ఉంటుంది. ఈ ఓజోన్ పొర స్ర్టాటో ఆవరణం లో ఉంటుంది. ధ్రువ ప్రాంతాల్లో ఈ ఓజోన్ పొర గాఢత చాలా వరకు తగ్గింది." అని వివరించాడు క్రేన్.

“ఓజోన్ పొర చిల్లులు పడ్డాయి అంటున్నారు కదా? ఎక్కడో భూమి పై పొరల్లో ఉండే ఈ ఓజోన్ పొర ను  పనిగట్టుకుని ఎవరన్నా చింపేశారా?" అడిగాడు దినేష్.

"ఒరేయ్ 'మట్టి బుర్రా' వాతావరణ కాలుష్యం వల్లరా చిల్లులు పడేది." వెక్కిరింతగా నవ్వుతూ చెప్పాడు కౌషిక్.

"నిజమా అంకుల్" క్రేన్ ని ఉద్దేశించి అడిగాడు దినేష్.

"ఆ..‌అవును నిజం. మనం వాడుకునే ఏసీలు, రిఫ్రిజిరేటర్లు వెలువరించే (సి.ఎఫ్.సి.ఎస్) క్లోరో ఫ్లోరో కార్బన్లు, అధిక సంఖ్యలో వాహనాల వాడకంలో వెలువడే వాయువుల వలన అంటార్కిటికా ప్రాంతంలో ఈ ఓజోనుకు రంధ్రం ఏర్పడిందని 1980 లో గుర్తించారు. సెప్టెంబర్ 16 అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణదినోత్సవం  జరుపుకుంటున్నారు." చెప్పాడు క్రేన్.

"అయితే మనము ఏసీలు, రిఫ్రిజిరేటర్లు వాడకాన్ని తగ్గించేసి పెట్రోల్ వాడకాన్ని కూడా తగ్గించేసి మొక్కలు, అడవులు నరక్కుండా ఎంచక్కా మొక్కలు నాటేస్తే సరిపోతుంది కదా అంకుల్?" అంది శార్వాణి.

"అవునమ్మా నువ్వు చెప్పింది కరెక్ట్" అన్నాడు క్రేన్.

"మన భూమి సూర్యుడి నుండి 149,600,000 కిలోమీటర్ల దూరంలో ఉండి తన అంశంపై 23.45 డిగ్రీలు వంగి తిరుగుతోందని తెలుసా? నీకు?" అడిగాడు చరణ్.

"అబ్బో......నీకు చాలా విషయాలు తెలుసే!" ఆశ్చర్యంగా అడిగింది శార్వాణి.

"ఇంత చిన్న విషయం కూడా నీకు తెలియదా! మనకు సోషల్ లో వచ్చింది కదా! భూమి తన చుట్టూ తాను తిరగడానికి 23 గంటల 56 నిమిషాల పడుతుందని, దాన్ని ఆత్మభ్రమణం అంటారని, సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజులు అంటే సంవత్సర కాలం పడుతుందని దీన్ని పరిభ్రమణం అంటారని, భూమి ఒంగి తిరగడం వలన ఋతువులు ఆత్మభ్రమణం వలన రాత్రింబవళ్లు ఏర్పడతాయని మన సోషల్ సార్ చెప్పారు కదా గుర్తు తెచ్చుకో." అంటూ చెప్పాడు చరణ్ .

"మనం మీ భూమి కి 384,400 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం.... అంటే మీ మామ గారి ఇంటికి వచ్చాం వెళ్దామా?" అడిగాడు డింగూ.

"మామయ్య ఇల్లా? ఇక్కడ మా మామయ్య ఇల్లు కూడా ఉందా?"ఆశ్చర్యంగా అడిగాడు దినేష్.

"ఒరేయ్ మట్టి బుర్రా....... మామ అంటే చందమామరా ..... చందమామ.. ఆమామే గాడింగూ మామ." నవ్వుతూ అన్నాడు కౌషిక్.

"అబ్బా భలే చెప్పావు అల్లుడు కరెక్ట్ గా." మామ అన్న పిలుపులో మాధుర్యం అనుభవిస్తూ ఆనందంగా అన్నాడు డింగూ.

"మామ ఈ చంద్రుడు భూమికి ఉపగ్రహం కదా! ఈ ఉపగ్రహాన్ని మన సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం శ్రీహరికోట వారు పంపించారా? అడిగాడు కౌషిక్.

"అయ్యో అది తెలీదా..వ్వె ..వ్వె..వ్వె.." వెక్కిరింతగా అంది శార్వాణి.

"తప్పు అలా ఒకళ్ళనొకళ్ళు వెక్కిరించుకోకూడదు. తెలియని విషయాలు అడిగి తెలుసుకోవాలి." అంటూ మందలించాడు మేథా.

"చంద్రుడు భూమికి సహజంగా ఏర్పడిన ఉపగ్రహం. దాని వయసు సుమారు 4.6 బిలియన్ సంవత్సరాలు ఉంటుంది." చెప్పాడు డింగూ.

"అంకుల్ శుక్లపక్షం, కృష్ణపక్షం అని అంటుంది మాఅమ్మమ్మ అంటే ఏంటి?" ప్రశ్నించాడు దినేష్.

"చీకటి రాత్రులను కృష్ణ పక్షమని, వెన్నెల రాత్రులను శుక్ల పక్షం అని అంటారు. ఈ రెండూ కలిస్తేనే నెల. అందుకనే చంద్రుని నెలవంక అని కూడా పిలుస్తారు." అని చెప్పాడు డింగూ.

"దాహం .....దాహం ఊపిరి ఆడటంలేదు. ఏదో గాలి లో తేలిపోతున్నట్టుగా ఉంది." ఆందోళనగా అంటున్న శర్వాణి గాలిలో తేలిపోతోంది.

"అయ్యో అయ్యో శర్వాణి ని దెయ్యం ఎత్తుకుపోతోంది తేలిపోతోంది" భయంగా అన్నాడు దినేష్.

"ఇక్కడికి దెయ్యాలు ఎలా వస్తాయి ఊరికే నువ్వు భయపడి మమ్మల్ని కంగారు పెట్టక" అన్నాడు చరణ్.

"పౌర్ణమికి, అమావాస్యకు దెయ్యాలు తిరుగుతాయని మా నాయనమ్మ అంటుండేది అంటే చంద్రుడి మీద దెయ్యాలు ఉన్నట్లేగా ఓరిదేవుడో.... ఎవరు మాకు దిక్కు... శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం..." అంటూ గజగజ వణికి పోతున్నాడు దినేష్.

"ఓయ్..ముయ్..నీ పిరికి గోల ఊరికే భయపడిపోతావ్. ముందు దాన్ని రక్షించే ఏర్పాట్లు చూడు." అన్నాడు విసుగ్గా చరణ్.

"మనమేమన్నా హీరోలమా, సూపర్ మాన్ లమా ఎగిరెళ్ళి దాన్ని పట్టుకొని రావడానికి చరణ్. మేధా ప్లీజ్ శర్వాణిని రక్షించవా!" బ్రతిమాలాడు కౌశిక్.

"శార్వాణి వేసుకున్న క్యాప్సిల్ పవర్ తగ్గినట్టుంది. అందుకే ఆకలిదప్పులు వచ్చి ఉంటాయి. కంట్రోలింగ్ కనెక్షన్ కట్ అయి ఉంటుంది అందుకే అలా గాలిలో తేలిపోతోంది." అన్నాడు మేథా.

"భూమి పైన ఇలా తేలం కదా! భూమి ఉపగ్రహమేగా చంద్రుడు ఇక్కడ ఎందుకు తేలతారు." కుతూహలంగా అడిగాడు కౌషిక్.

"ఇది ఓ నిర్జీవ గోళం. ఇక్కడ నీరు, గాలి ఉండవు. ఇక్కడ కొండలు, బిలాలు ఉంటాయి. ఇక్కడ ఆకర్షణ శక్తి తక్కువ. భూమి మీద 60 కేజీలు ఉన్న వ్యక్తి యొక్క బరువు ఇక్కడ 10 కేజీలు ఉంటుంది." చెప్పాడు మేథా.

అపోలో11 వ్యోమనౌక ద్వారా1969 జులై 20న నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ మొట్టమొదట చంద్రునిపై కాలుమోపిన వ్యక్తి కదా! అంటే చంద్రునిపై నిలబడ్డాడుగా మరి. మన శార్వాణీ ఎందుకు ఎగిరిపోతోంది?" అడిగాడు చరణ్.

"మంచి ప్రశ్న వేశావు. స్పేస్ సూట్ వేసుకుంటారు వారు. మీకు మేము ఇచ్చిన క్యాప్సిల్స్ చాలా పవర్ఫుల్. అది శరీరాన్ని తేలికగా చేస్తుంది. అంటే తమ బరువును కోల్పోయేట్టు గా చేస్తుంది.

అంతేకాదు మీరు కూర్చున్న ఈ స్పేస్ ఆబ్జెక్ట్ లో కూడా ఏ ప్లానెట్ లో మనం ఉన్నా మనకు అనుకూలమైన వాతావరణం మనకు కల్పిస్తుంది." చెప్పాడు మేథా.

"మరైతే శర్వాణి ఎందుకు ఎగిరిపోయింది? దెయ్యాలు ఎత్తుకుపోయాయా?" ఏడుస్తూ అడిగాడు దినేష్.

"ఏడవకు దినేష్. ఏదో రకంగా మనం శర్వాణిని రక్షించుకుందాం." ఓదారుస్తూ అన్నాడు క్రేన్.

"మేథా ఏం జరిగింది? ఎందుకు నువ్వు స్పందించటం లేదు?" అడిగాడు డింగూ.

"నా వేవ్ లైన్స్ శర్వాణిని చేరుకోవటం లేదు. పోనీ మనమే అటు వెళ్దామన్నా కుదరడం లేదు. ఏదో జరుగుతోంది. మన టెక్నాలజీకి అందనంత." భయంగా చెప్పాడు మేథా. పిల్లలంతా గొల్లున ఏడవటం మొదలుపెట్టారు.

"ఏడవకండి. మన మేథా ఏదో ఒక ఉపాయం ఆలోచిస్తాడు." నచ్చచెప్పాడు క్రేన్.

"మేథా నిన్ను నమ్మి వచ్చాము. శార్వాణి ని ఎలాగైనా రక్షించు. తను లేకుండా మేం వెళ్ళం. మేము ఇక్కడే దూకేస్తాం." ఉద్రేకంగా అన్నాడు చరణ్.

"భయపడకండి ఎలాగైనా నేను మీకు శర్వాణి ని అప్పచెప్తాను." అని పిల్లలకు ధైర్యం చెప్పాడు కానీ మేథా మనసులో భయం.

ఏదో శక్తి శార్వాణి ని వీరినుంచి దూరం చేస్తోంది. ఎవరిదా శక్తి? మేథా మేధస్సుకు అంతుచిక్కడం లేదు. అన్ని గ్రహాల మీద అధిపత్యం సంపాదించామన్న వారి ఆలోచనలు తలకిందులయ్యాయి. అనవసరంగా పిల్లలని తీసుకొచ్చామా? ఏం చేయాలి? ఎలా శర్వాణి ని రక్షించాలి? మేథా పరిపరివిధాలుగా ఆలోచిస్తున్నాడు.

***సశేషం***

Posted in December 2021, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!