శ్రాద్ధములలో కర్త, భోక్తలు పాటించవలసిన నియమాలు
శ్రాద్ధ కర్మకు నియుక్తుడైన బ్రాహ్మణుడు, శ్రాద్ధ కర్త - వీరు శ్రాద్ధ దినము రోజు జితేంద్రియులై (ఇంద్రియములను జయించినవారై) ఉండాలి. వారు ఆరోజు నిత్యజపములైన గాయత్రి వంటివి తప్ప ఇతర వేద భాగములను అధ్యయనం చేయరాదు.
నిమంత్రితులైన ఆ విప్రులను పితృదేవతలు సమీపిస్తారు. వారు వాయువువలె ఆ విప్రులను వెంబడిస్తారు. వారు కూర్చుంటే పితృదేవతలు కూడా ఆ సమీపంలోనే కూర్చుంటారు. కాబట్టి భోక్తలైన ఆ విప్రులు శుచిగా, పరిశుద్ధులుగా ఉండాలి. హవ్యకవ్యముల కోసం భోక్తగా నియమితుడైన బ్రాహ్మణుడు ఏ కొద్ది కారణం చేత శ్రాద్ధమునకు హాజరుకాకపోయినా అతడు మరుజన్మలో సూకరముగా (ఊర పందిగా) పుడతాడట.
భోక్తగా నియమితుడైన విప్రుడు ఎవరైనా శూద్ర స్త్రీతో సంగమిస్తే శ్రాద్ధ కర్తకు ఉన్న ఏదైనా కొద్ది పాపం కూడా ఆ విప్రునికి తగులుకుంటుంది.
పితృదేవతలు కామక్రోధములు లేనివారు, ఆచారవంతులు, ఎప్పుడూ వేదాధ్యయనం చేసేవారు, బ్రహ్మచారులు, ఇంద్రియాలను జయించినవారు, శస్త్రములను వదిలిపెట్టినవారు, సాత్త్వికులకు ఉండవలసిన దయ మొదలైన ఎనిమిది సద్గుణములు కలవారు, అనాది దేవతారూపులు. కనుక శ్రాద్ధ క్రియలు చేసే కర్త, భోక్తలు కూడా క్రోధరహితులుగా సద్గుణ సంపన్నులుగా ఉండాలి.
సాత్త్వికులకు దయ(కృప), జ్ఞానము, తపస్సు, ఓర్పు, సత్యము, గొప్పతనము, మౌనము, ఇంద్రియ నిగ్రహము అనే సద్గుణములు ఉండాలని సనాతనులు చెపుతారు.
పితృదేవతల ఉత్పత్తి, వారి పేర్లు
మనోర్హిరణ్యగర్భస్య యే మరీచ్యాదయః సుతాః |
తేషామృషీణాం సర్వేషాం పుత్రాః పితృగణాః స్మృతాః || ( 3- 194 )
హిరణ్యగర్భుని కుమారుడు మనువు. మరీచి మొదలైన ఋషులు మనువు పుత్రులు. ఆ మహర్షుల పుత్రులందరూ పితృ దేవతా గణములు అనబడతారు.
విరాట్ పుత్రులైన సోమసదులు సాధ్యుల పితరులు. అగ్నిష్వాత్తులనే వారు మరీచి పుత్రులు కనుక మారీచులుగా లోక ప్రసిద్ధులు. వారు దేవతల పితరులు.
అత్రి మహర్షి పుత్రులైన దైత్యులు, దానవులు, యక్షులు, గంధర్వులు, ఉరగములు (పాములు), రాక్షసులు, సుపర్ణులు (గరుడాది పక్షి గణములు), కిన్నరులు మొదలైనవారంతా బర్హిషదులుగా ప్రసిద్ధులైన పితృదేవతలు.
సోమపా (సోమరసం తాగేవారు) అనబడేవారు (సోమపులు) బ్రాహ్మణుల పితరులు. హవిర్భుజులనేవారు (హవిస్సులను భుజించేవారు) క్షత్రియుల పితృదేవతలు. ఆజ్యపా (నేతిని తాగేవారు) అనబడేవారు (ఆజ్యపులు) వైశ్యుల పితరులు. శూద్రులకు సుకాలినులు పితరులు.
సోమపులు శుక్రునికి పుట్టారు. హవిర్భుజులు లేక హవిష్మంతులు అంగిరసుని పుత్రులు. ఆజ్యపులు పులస్త్యుని పుత్రులు. సుకాలినులు వసిష్ఠుని పుత్రులు.
అగ్నిదగ్ధులు, అనగ్నిదగ్ధులు, కావ్యులు, బర్హిషదులు, అగ్నిష్వాత్తులు, సౌమ్యులు -- వీరంతా ప్రత్యేకించి బ్రాహ్మణుల పితరులు.
ఋషులవలన పితరులు జన్మించారు. పితరుల వలన దేవదానవులు జన్మించారు. దేవతల వలన స్థావర, జంగమ రూపమైన ప్రపంచమంతా ఉత్పత్తయింది.
ఈ పితృదేవతలకు ప్రపంచంలో ఉండే ప్రజలంతా పుత్రులు, పౌత్రులు అన్నమాట.
పార్వణ శ్రాద్ధ నియమములు
పౌర్ణమి, అమావాస్య మొదలైన పర్వదినాలలో పితృదేవతలందరినీ ఆవాహనచేసి, వారికి కవ్యములు సమర్పించే శ్రాద్ధమును పార్వణ శ్రాద్ధము అంటారు.
భోక్తలుగా నియమితులైన బ్రాహ్మణులకు వెండి పళ్లెములలోగానీ, వెండి కలిపిన ఇతర లోహ పాత్రలలోగానీ విస్తర్లు వేసి, భోజనం పెట్టాలి. ఒకవేళ మృష్టాన్న భోజనం పెట్టలేకున్నా కనీసం శ్రద్ధతో వెండి పాత్రలో ఇచ్చిన నీరైనా పితరులకు అనంతమైన తృప్తిని ఇస్తుంది. ఇక భోక్తకు సుమృష్ట భోజనం పెట్టడం వలన పితృదేవతలు ఎంతగా తృప్తిచెందుతారో చెప్పే పనేముంది?
బ్రాహ్మణులకు దైవకార్యం కంటే పితృకార్యమే ముఖ్యమైనది. దైవకార్యం పితృకార్యం కంటే ముందుగా చెయ్యాలి. దేవకార్యము కూడా పితృకార్యంలోని ఒక అంగమే కనుక దేవకార్యాన్ని ముందుగానే చేస్తారు.
కాపుదల లేని శ్రాద్ధ కార్యాన్ని రాక్షసులు పాడుచేస్తారు కనుక ముందుగా దైవకార్యం చేసి, విశ్వేదేవరూప బ్రాహ్మణుని, పితృకార్య రక్షణ నిమిత్తం ముందుగా నిలపాలి. పితృ శ్రాద్ధమునకు ముందు, వెనుక దేవతలు కాపు కాస్తారు. పితృ కార్య నిర్వహణకు ముందు విశ్వదేవతా రూపమైన ఒక బ్రాహ్మణుని రక్షణగా నియమించాలి.
పితృకార్యం తరువాత విష్ణువును శ్రాద్ధ రక్షణ కోసం ఏర్పాటు చేసుకోవాలి. అలా కాక నేరుగా తన పితృదేవతనే ఆవాహన చేసి, శ్రాద్ధం చేసే గృహస్థు తన వంశంతో సహా శీఘ్రంగా నశిస్తాడట.
శ్రాద్ధ కర్మకోసం ఒక పరిశుద్ధమైన, నిర్జన ప్రదేశాన్ని ఎంచుకుని ఆ ప్రదేశాన్ని అంతటినీ గోమయం (ఆవు పేడ) తో శుభ్రంగా అలకాలి. ఆ స్థలం దక్షిణా ప్రవణంగా ఉండేట్లు (దక్షిణ దిశ వైపు వాటం ఉండేట్లు) చూసుకోవాలి. స్వభావరీత్యానే పరిశుద్ధంగా ఉండే అరణ్యాలు మొదలైన ప్రదేశాలలో, ఏకాంతంగా ఉండే నిర్జన ప్రదేశాలలో, పుణ్యనదీ తీరాలలో తమకు పెట్టే శ్రాద్ధములతో పితృదేవతలు పూర్తిగా సంతృప్తి చెందుతారు.
వేరువేరుగా ఇలా రెండు పవిత్ర స్థలాలను తయారుచేసుకుని దేవతా స్థానంలో ఉత్తరపు కొనలు కలిగిన రెండు దర్భలను, పితృస్థానంలో దక్షిణపు కొనలు కలిగిన మూడు దర్భలను కింద పరచి నియమితులైన బ్రాహ్మణులను వారు స్నానము, ఆచమనము చేసి వచ్చిన వెంటనే వారిని అక్కడ కూర్చోబెట్టాలి.
స్నానం చేసిన తరువాత భోజనానికి కూర్చోబోయే ముందు ఉపస్పర్శనము లేక ఆచమనము చేయడం ప్రాచీనులు తమ విధిగా భావించేవారు. ఉపస్పర్శనము లేక ఉపస్పర్శము అంటే ముందుగా నోటిలోనికి కొంత నీటిని తీసుకుని పుక్కిలించి ఉమియడం, తరువాత కొంత నీటిని తాగటం. భోజనానికి ముందు ఆ తరువాత నియమం ప్రకారం చేసే ఈ శౌచ విధిని వార్చుట అని కూడా అంటారు. మన ప్రాచీనులు దర్భలకున్న క్రిమి నిరోధక గుణాలను గుర్తించిన కారణంగా హవ్యకవ్యములకు వినియోగించే వండిన ఆహారపదార్థాల పాత్రలను దర్భలపైనే ఉంచేవారు. తాము కూడా దర్భలపైననే కూర్చుని భుజించేవారు. క్రమంగా దర్భలకు కొంత పవిత్రత కూడా ఆపాదించబడింది.
భోక్తలుగా నిమంత్రితులైన బ్రాహ్మణులకు పవిత్రమైన దర్భలతో కూడిన అర్ఘ్యోదకాన్ని ఇచ్చి, వారిని ప్రార్థించి, వారి అనుమతితో దేవతల ప్రీతికోసం హోమాగ్నిలో వేల్వాలి. అర్ఘ్యము అంటే పూజకు తగినది లేక పూజకు ఉద్దేశించినది అని అర్థం. దేవునికి లేక ఒక గౌరవనీయమైన వ్యక్తికి లేక అతిథికి పూజ చేసేటప్పుడు ముందుగా ఇచ్చేది అర్ఘ్యమే. మనం గతంలో చెప్పుకున్న మధుపర్కములోనూ అర్ఘ్యం ఇవ్వడమే మొదటి విధి. పెరుగు, తేనె, నెయ్యి, అక్షతలు, గరిక, నువ్వులు, దర్భ, పుష్పము -- ఈ ఎనిమిదింటినీ అష్టార్ఘ్యములు అంటారు. అతిథి పూజ అర్ఘ్య పాద్యాదులు (అర్ఘ్యము, పాద్యము మొదలైనవి) ఇవ్వడం (తాగేందుకు, పాద ప్రక్షాళనకు నీరు ఇవ్వడం) తో మొదలౌతుంది. నెయ్యి మొదలైన పదార్థాలను హోమాగ్నికి సమర్పించడాన్ని వేల్చుట అంటారు.
అగ్నికి, సోమునికి, యమునికి ముందుగా తనివి తీరేటట్లు హవిస్సులు సమర్పించి, ఆ తరువాత పితృదేవతలకు హోమం చేయాలి. బ్రహ్మచారికి, స్నాతకుడికి, భార్య లేనివానికి అగ్నిహోత్రము లేదు. అటువంటి అగ్న్యభావులైన (అగ్నిహోత్రం లేని) విప్రులు నిమంత్రితుడైన బ్రాహ్మణుని కుడి అరచేతిలోనే హవిస్సులను సమర్పించాలి. ద్విజుడు అగ్నిహోత్రుడేనని మంత్రజ్ఞులైన విప్రులు చెపుతారు.
శ్రాద్ధములో నిమంత్రితులైన విప్రులు క్రోధములేనివారు, దయగలవారు, ప్రాచీనులు అయిన కారణంగా వారు లోక కల్యాణం కోరుకునే వారే అయివుంటారు కనుక వారి చేతులలో హవిస్సులు వేసినా అగ్నిలో వేల్చిన పుణ్యం దక్కుతుంది. పిండ ప్రదాన స్థలములో, దర్భలు పరచిన స్థలములో కర్త కుడిచేతితో నువ్వులు, నీళ్లు కలిసిన నిర్వపేదుదకం (దానోదకం) విడవాలి. దీనినే తిలోదకం విడవడం అని కూడా అంటారు.
తరువాత కర్త హోమంలో వేల్చిన అన్నం పోను మిగిలిన అన్నముతో మూడు పిండాలు చేసి, శ్రద్ధగా దక్షిణానికి తిరిగి కూర్చుని ఆ తిలోదకాలు విడిచిన ప్రదేశంలో ఆ మూడు పిండాలనూ ఉంచి, వాటిపై తిలోదకాలు విడవాలి.
ఆ తరువాత ఉత్తర దిశగా తిరిగి ఆచమనం చేసి, మెల్లగా మూడుసార్లు ప్రాణాయామాన్ని ఆచరించి, ఆరు ఋతువులకూ నమస్కరించి, ఆ తరువాత మంత్ర సహితంగా పితృదేవతలకు నమస్కరించాలి.
పిండదానంలో వినియోగించిన తిలోదకంలో మిగిలిన భాగాన్ని ఒక దొన్నెలో తీసుకుని, ఆ మూడు పిండాల చుట్టూ అపసవ్య దిశలో తిప్పాలి. ఆ పిండాల నుంచి ఒక్కొక్క మెతుకు చొప్పున తీసి వాసన చూడాలి. తరువాత ఆ మెతుకులు కింద పడెయ్యాలి. ఎడమనుంచి కుడికి ( Clockwise) కాక, కుడి నుంచి ఎడమకు (Anti Clockwise) ఆ పిండాల చుట్టూ చేతిని తిప్పడాన్ని అపసవ్య దిశలో తిప్పడం అంటారు.
తరువాత ఆ పిండముల నుంచి కొంచెం కొంచెంగా తీసుకుని, ఆ బ్రాహ్మణులు కూర్చున్న ప్రదేశంలో వారు దానిని తినేటట్లుగా ఉంచాలి. పితృస్థానంలో కూర్చున్న బ్రాహ్మణునికి పితరుని ఉద్దేశించి పిండ శేషాన్ని ఉంచాలి. ఇదేవిధంగా పితామహుడికి (తాతకు), ప్రపితామహుడికి (ముత్తాతకూ) కూడాచేయాలి.
ఒకవేళ తండ్రి జీవించివుండి తల్లికి శ్రాద్ధ కర్మ చేస్తుంటే పితామహ ప్రపితామహులు ఇద్దరికి మాత్రమే పిండప్రదానం చేయాలి. తాత ఉండగా తండ్రి చనిపోతే, తండ్రికి, ప్రపితామహుడిని (ముత్తాతని), పితృప్రపితామహుడిని (జేజి తాతను) ఆ బ్రాహ్మణులలో ఆవాహన చేసి వారికి పిండప్రదానం చేయాలి. ఆ సందర్భంలో జీవించివున్న పితామహుడి అనుమతితో అతడి స్థానంలో అతడినే ఉంచి, పితృ ప్రపితామహులను బ్రాహ్మణులలోకి ఆవాహనము చేసి ఈ శ్రాద్ధమును నిర్వహించవచ్చు.
శ్రాద్ధ భోజనం
శ్రాద్ధాన్నాన్ని వండిన పాత్రను స్వయంగా శ్రాద్ధ కర్తే మూతమూసి రెండుచేతులతో పట్టుకుని, పితృదేవతలను ధ్యానిస్తూ ఆ పాత్రను మెల్లగా ఆ నిమంత్రిత బ్రాహ్మణుల ముందు ఉంచాలి. అలా మూత మూసి తేకున్నా, రెండు చేతులతో పట్టుకుని తేకున్నా ఆ పాత్రలలోని ఆహారాన్ని రాక్షసులు అపహరిస్తారని సనాతనుల విశ్వాసం.
అక్కడ అన్నం ఉంచడానికి ముందే వ్యంజనములను, సూపము (పప్పు), శాకములు (ఆకు కూరలు, కాయగూరలు మొదలైనవాటితో వండిన కూరలు), పయస్సు (పాలు), దధి (పెరుగు), ఘృతం (నెయ్యి), మధు (తేనె) మొదలైన వాటిని వేరు వేరు పాత్రలలో తెచ్చి అక్కడ ఉంచాలి.
భక్ష్యం భోజ్యం చ వివిధం మూలాని చ ఫలాని చ |
హృద్యాని చైవ మాంసాని పానాని సురభీణి చ || ( 3- 227)
భక్ష్యాలు, భోజ్యాలు, వివిధములైన వేళ్ళు (కంద మూలాలు), ఫలాలు, ఇంపైన మాంసం, సువాసన కలిగిన పండ్ల రసాలు అక్కడ ఉంచాలి.
ఇక్కడ భక్ష్యాలు, భోజ్యాలు అంటే ఏమిటో కొంత వివరించాలి. ‘పంచభక్ష్య పరమాన్నాలు’ అనే వాడుక మనం విన్నదే. పంచ భక్ష్యాలు అని మనం అంటున్నామే కానీ, వాస్తవానికి ‘భక్ష్యము మొదలైన పంచ (ఐదు) ఆహారాలు’ అనాలి. భక్ష్యము, భోజ్యము, లేహ్యము, చోష్యము, పానీయము - అనేవి ఈ ఐదు రకాల ఆహారాలు. లడ్డూలు, గారెలు, అరిసెలు, జిలేబీలు వంటి పిండివంటలన్నీ భక్ష్యాలు. ఇవన్నీ మనం చేతితో పట్టుకుని భక్షిస్తాం (కొరుక్కుని తింటాం). ఇక చేతితో కలుపుకుని ముద్దలుగా చేసి, నోట్లో వేసుకుని నమిలి భుజించేవి భోజ్యాలు. భోజనంలో వడ్డించే అన్నము, అన్నంతో కలిపి భుజించే కూరలు, వ్యంజనములు, పులిహోర, కలిహోర, దధ్యోదనము (దధి + ఓదనము) వంటి చిత్రాన్నాలు భోజ్యాలు. లేహ్యములు అంటే నాకుతూ తినే తేనె, చ్యవనప్రాశ వంటివి. చోష్యములు అంటే ఊదుకుంటూ, మెల్లగా పీలుస్తూ తాగేవి. వేడి గంజి, అంబలి, కాఫీ, టీ, సూప్ వంటివన్నీ చోష్యాలు. చివరిగా పానీయములు అంటే గటగటా తాగేసేవి. ఎడనీరు అని కూడా పిలిచే కొబ్బరి నీరు, పానకం, పండ్ల రసాలు వంటివన్నీ పానీయాలు.
పరిశుద్ధుడై కర్త ఇలా పైన తెలిపిన పలు ఆహార పదార్థాలనన్నింటినీ చుట్టూ ఉంచుకుని, భోక్తలకు ఆ యా పదార్థాల గుణములు తెలుపుతూ జాగరూకతతో వడ్డించాలి. అలా వడ్డించే సమయంలో మృతులను తలచుకుని కన్నీరు విడువరాదు. కోపం ప్రదర్శించకూడదు. అనృతం (అసత్యం) పలుకకూడదు. చెదరిన అన్నాన్ని కాలితో తొక్కకూడదు. విస్తరిలో ఉన్న అన్నం చెదిరే విధంగా (పులుసు, మజ్జిగ వంటివి) వడ్డించకూడదు. చాలా శ్రద్ధగా జాగరూకతతో వడ్డన చేయాలి. అస్రం (కన్నీరు) కారిస్తే శ్రాద్ధాన్నాన్ని ప్రేతములు తింటాయట. కోపం ప్రదర్శిస్తే ఆ ఆహారం అరికి (శత్రువుకు) చేరుతుందట. అబద్ధం చెపితే ఆ ఆహారం శునః (కుక్కలకు) చెందుతుందట. పాదానికి తగిలిన ఆహారం రాక్షసులకు చెందుతుందట. అవధూననమైన (విస్తట్లో చెదిరిన) అన్నం దుష్కృతులకు (పాపాత్ములకు) చెందుతుందట. కనుక శ్రాద్ధ కర్మలో భోక్తలు భుజించిన ఆహారం కేవలం పితరులకు మాత్రమే చెందాలంటే చాలా జాగ్రత్తగా వడ్డన చేయాలి. ఆ బ్రాహ్మణులకు ఏది ఇష్టమో దానిని వారికి అడిగినకొలది వడ్డిస్తూ, వారికి తృప్తి కలిగించాలి. బ్రహ్మతత్త్వ ప్రతిపాదకములైన కథలను వారికి చెప్పాలి. పితరులకు అలాంటి కథాకాలక్షేపమే అత్యంత ఇష్టమైనది.
పితృదేవతలకు భోజనకాలంలో వేదములను, ధర్మశాస్త్రములను, ఆఖ్యానములు (ప్రాచీనగాథలు), ఇతిహాసములు (రామాయణ భారతముల వంటివి), పురాణములు (అష్టాదశ పురాణాలు, ఉపపురాణాలు), ఖిలములు(ప్రాచీన గ్రంథాలకు అనంతర కాలంలో జోడింపబడిన మంత్రాలు లేక గాథలు) మొదలైనవి పితృదేవతలకు చదివి వినిపించాలి.
కర్త తాను చాలా సంతోషభరితుడై, భోక్తలైన ఆ బ్రాహ్మణులు సంతుష్టిగా భోజనం చేసే విధంగా, ఎలాంటి తొందరపాటు లేకుండా శనైశ్శనై: (మెల్లమెల్లగా) వడ్డిస్తూ, ఆ ఆహార పదార్థాల గుణగణాలను వారికి వివరిస్తూ, వారిని మరింతగా తినడానికి ప్రోత్సహించాలి.
శ్రాద్ధము అనేది కాల పాత్ర నియమాలతో చేసే శాస్త్ర చోదితమైన ఒక పితృకర్మ. శ్రాద్ధము అంటే అర్థం శ్రద్ధతో చేసేది అని. పితృదేవతల పట్ల శ్రద్ధతో చేసే పితృకర్మ కనుక దీనికి ఆ పేరు. ఆగ్నేయము అనే దశాహ (పది రోజులు చేసే) శ్రాద్ధము, సాక్ష్యము అనే ఏకాదశాహ (పదకొండు రోజులు చేసే) శ్రాద్ధము, సంప్రేషణము అనే ద్వాదశాహ (పన్నెండు రోజులు చేసే) శ్రాద్ధము, మాసికము అనే (నెలనెలా చేసే) శ్రాద్ధము వంటి పలు రకాల శ్రాద్ధాలు ఉన్నాయి. మాసికము అనేది ఆబ్దికము లేక ఏడుడి జరిగేవరకు నెలనెలా చేసే శ్రాద్ధము. ప్రతి మాసంలో అమావాస్య రోజు చేసే శ్రాద్ధమును కూడా మాసికము అనే అంటారు. శ్రాద్ధములో భోజన పదార్థాల రుచికి, శుచికీ ఎంతో ప్రాముఖ్యం ఉంటుంది. భోక్తలు తృప్తిగా భుజిస్తేనే తమ పితరులు సంతృప్తి చెందుతారనే విశ్వాసం శ్రాద్ధ కర్తలలో ఉన్న కారణంగా వారు అనాదిగా శ్రాద్ధ భోజనాలలో రుచి, శుచి కలిగిన ఆహార పదార్థాలు వండి వడ్డించడంలో ఒకరితో ఒకరు పోటీపడేవారు. శ్రాద్ధ భోజనాలలో భోక్తలుగా నిమంత్రించబడడానికి బ్రాహ్మణులలోనూ పోటీ తీవ్రంగా ఉండేదనేది సుస్పష్టం. అందుకే మనువు ఈ అధ్యాయంలో భోక్తలుగా ఎంపిక కాబడడానికి బ్రాహ్మణులలోనూ ఎవరు అర్హులో, ఎవరు అనర్హులో చాలా విస్తారంగా పేర్కొనడం జరిగింది.