Menu Close
manusmrithi page title
రెండవ అధ్యాయము (అ)

భృగు మహర్షి మునులతో ఇలా చెప్పాడు -

వేదవేత్తలు, ధార్మికులు, రాగద్వేషములు లేనట్టివారు అయిన విప్రులచేత ఎల్లప్పుడు అనుష్ఠింపబడే శ్రేయస్సాధనమైన ధర్మం ఏదైతే ఉందో దానినిప్పుడు మీకు వివరిస్తాను. వినండి.

ఈ ప్రపంచంలో ప్రజలు ఫలాపేక్షతో (ప్రతిఫలం ఆశించి) పనులు చేయడం మంచిది కాదు. అయినా ఇహలోకంలో ఫలాపేక్ష లేకుండా పనులు చేయడం అనేది అసాధ్యం. వేదవేదాంగాలు అధ్యయనం చేసినా, వేదోక్తములైన సకల కర్మలను ఆచరించినా - అదంతా కూడా ఫలాపేక్షతో చేసేదే. అందుకే అదంతా కామ్యమే.

ఈ సందర్భంగా ప్రజాకవి వేమన ‘ముముక్షువు కూడా మోక్షం కోరే కదా తపస్సు చేసేది? కోరికలేని వారెవరు?‘ అని ప్రశ్నిస్తూ చెప్పిన ఈ కింది పద్యం ప్రస్తావనార్హం.

జడలుగట్టనేల? సన్యాసిగానేల?
ఒడలు విరుచుకొనెడి యోగమేల?
ముక్తికాంతబట్టి ముద్దాడనే గదా?
విశ్వదాభిరామ వినురవేమా.

కామానికి (కోరికకు) సంకల్పమే మూలం. ఈ యీ వస్తువులు నాకు కావాలని కోరుకోవడమే సంకల్పం. దానివలననే కామం పుడుతున్నది. యజ్ఞములు, వ్రతములు చేయాలనే కోరిక సంకల్పం కారణంగానే పుడుతున్నది. ఈ నియమాలన్నీ కూడా సంకల్పం వల్లనే పుడుతున్నాయి.

లోకంలో కోరిక లేకుండా ఏ క్రియా జరగదు. భోజనం చేయాలనే కోరిక కలిగినప్పుడు మానవుడు భోజనం చేస్తాడు. నడవాలనే ఇచ్ఛ కలిగినప్పుడు నడుస్తాడు. మానవుడు చేసే ప్రతి ఒక్క క్రియ కామము యొక్క వ్యాపారమే కాని వేరొకటి కాదు. అయితే ఈ తరహా సంకల్పాలలో ప్రతిఫలాపేక్ష లేకుండా మంచి తలంపుతో నియమానుసారం కార్యాలు చేసే మానవుడు మృత్యురహితమైన బ్రహ్మభావాన్ని పొందుతాడు. అంతేకాదు; ఇహలోకంలో కోరుకున్నవన్నీ కూడా పొందుతాడు.

ఇప్పుడు ధర్మానికి ప్రమాణాలు ఏమిటో తెలుసుకుందాం. అఖిల ధర్మములకూ వేదములే మూలం. వేదములు తెలిసినవారు రచించిన స్మృతులు, వేదవిదులు పాటించిన ఆచారాలు, వారి ఆత్మ సంతుష్టి - ఇవన్నీ ధర్మానికి ప్రమాణాలు. ఎవరికి ఏది ధర్మమని మనువు చెప్పాడో అవన్నీ వేదాలలో చెప్పబడినవే. మనువు సర్వ జ్ఞాన స్వరూపుడైనందున ఆయన చెప్పిందంతా వేదబద్ధమైన ధర్మమే.

విజ్ఞుడైనవాడు ఈ ధర్మశాస్త్రాన్ని తన జ్ఞాననేత్రంతో పరిశీలించి, శ్రుతులే (వేదములే) ఈ ధర్మశాస్త్రానికి ప్రమాణాలని గ్రహించి, స్వధర్మాన్ని నిష్ఠతో అనుష్ఠిస్తాడు. మానవుడు శ్రుతులు, స్మృతులలో చెప్పబడిన ఈ ధర్మసూత్రాలను పాటిస్తే ఇహలోకంలో కీర్తిని, పరలోకంలో ఉత్తమమైన సుఖాన్నీ (మోక్షాన్నీ) పొందుతాడు.

వేదాలను శ్రుతి అంటారు. ధర్మశాస్త్రాలను స్మృతి అంటారు. ఈ రెంటిలో చెప్పిన ఏ విషయాన్నీ మనం ప్రతికూల తర్కంతో ప్రశ్నించకూడదు. ఎందుకంటే ఆ రెంటి నుంచే ధర్మసూత్రాలు వెలువడి ప్రకాశితమయ్యాయి.

ఇక్కడ ఒక విషయం గమనార్హం. సంప్రదాయవాదులు ఇలాంటి వాదనే మరో విషయంలోనూ చేస్తారు. భగవంతుడి వాక్కు కనుక వేదాలు ప్రమాణాలుగా విశ్వసనీయమైనవంటారు. వేదాలు ఘోషిస్తున్నాయి కనుక భగవంతుడున్నాడనేందుకు ఇంకా అంతకు మించిన ఋజువేం కావాలంటారు. చూడండి. ఈ వాదన ఎంతటి సారవిహీనమైనదో? వేదాలు భగవంతుడు సృష్టించినవేనని ముందు రుజువైతేనే కదా, వాటిని సృష్టించిన భగవంతుడి ఉనికికి అవి సాక్ష్యాలుగా నిలిచేది? ఊహని వాస్తవంగా భావించడం, ఆ భావన మీద ఆధారపడి మరొక ప్రతిపాదన చేయడం ఈ వాదనలోని దోషం. వివిధ దేశ కాలాలలో పలువురు ఋషులు సంకలనం చేసిన (పౌరుషేయములైన) వేదములను ముందుగా అవి అపౌరుషేయాలనీ, అవి భగవంతుడి నుంచి నిత్యం వెలువడే అనంత శబ్దరాశి అనీ, అందుకే వాటిని వినబడినవి (శ్రుతులు) అన్నారనీ ప్రచారం చేసి, ఆ తరువాత వేదాలు భగవంతుడు ఉన్నట్లు ప్రకటిస్తున్నాయి కనుక భగవంతుడున్నాడనీ, భగవంతుడే లేకుంటే ఈ వేదాలెలా అస్తిత్వంలోకి వచ్చాయనీ వాదిస్తారు.

సరిగ్గా ఇదే తరహాలో శ్రుతులు (వేదములు), స్మృతులు (ధర్మశాస్త్రములు) - ఈ రెండింటిలో ఉన్న ఏ విషయాన్నీ మనం ప్రశ్నించకూడదట! అంటే వాటిని పూర్తిగా సత్యాలని ముందుగానే నమ్మితీరాలన్నమాట! ఈ రెండింటి నుంచే ధర్మసూత్రాలు వెలువడ్డాయి కనుక, శృతి, స్మృతులను ప్రశ్నించకుండా వాటిని పూర్తిగా సత్యాలుగా స్వీకరించేవారు ఇక ధర్మసూత్రాలను మాత్రం ఎందుకు, ఎలా ప్రశ్నిస్తారు? ప్రశ్నించ వీలులేనట్టివిగా వాటిని జనం భావించిన కారణంగానే ఈ ధర్మ సూత్రాలు స్మృతికారుడు కొందరిపై కొన్ని అమానవీయ నియమాలు బలవంతంగా రుద్దడానికి ఉపయోగపడ్డాయి. బాధితులు కూడా ప్రశ్నించకుండా వాటిని ఔదలదాల్చడానికి అవి ఉపకరించాయి.

ఏ ద్విజుడు ప్రమాణములైన శృతి స్మృతులను హేతుతర్కంతో చర్చిస్తూ, వాటిని దూషిస్తాడో ఆ నాస్తికుడిని, వేద దూషకుడిని సాధువులు బహిష్కరించాలి.

ఇక్కడ కూడా మనం ఒక విషయం గమనించాలి. వేదదూషణ చేసిన ద్విజుడిని మాత్రమే కాదు - ఈ (2- 11) శ్లోకంలో హేతుశాస్త్రాన్ని ఆశ్రయించిన ద్విజుడిని (హేతుశాస్త్రాశ్రయాద్ద్విజః) కూడా సమాజాన్నుంచి వెలివేయాలన్నాడు మనువు. అంతకు ముందరి శ్లోకంలోనేమో శృతి స్మృతులను ప్రశ్నించకుండా అనుసరించాలన్నాడు. ప్రశ్నించకుండా అనుసరించడంలో హేతుదృష్టి ఎక్కడుంటుంది? హేతుశాస్త్రాన్ని ఆశ్రయించిన ద్విజుడిని సమాజంనుంచి వెలివేయమని సాధు జనులకు సూచించిన స్మృతికారుడైన మనువులో హేతుదృష్టి ఎక్కడుంది? కొందరు సంప్రదాయవాదులు సనాతన ధర్మం హేతువాద దృక్పథానికి వ్యతిరేకమనే అపప్రథను విమర్శకులు కావాలని సృష్టించారనీ, అది సత్యదూరమనీ వాదిస్తారు. సనాతన ధర్మం పూర్తిగా హేతుబద్ధమైనదేనని వారి వాదన. ప్రశ్నించకుండా అనుసరించడం, హేతుశాస్త్రాన్ని ఆశ్రయించి విమర్శచేసే వ్యక్తులను బహిష్కరించాలనడం హేతుబద్ధ వైఖరి ఎలా అవుతుంది? తమ ప్రతిపాదనలు హేతుపరీక్షకు నిలబడలేనప్పుడే ఇలా ప్రత్యర్థులను వెలివేయడం, వారికి పాషండులని ముద్రవేయడం జరుగుతుంది.

వేదము, స్మృతి, సదాచారము, తమ మనస్సుకు ఇష్టమైనది - ఇవి నాలుగూ ధర్మానికి ప్రత్యక్ష లక్షణాలని పెద్దలు చెపుతారు. అర్థ కామాలపై ఆశ వదలిన వ్యక్తే ధర్మసూత్రాలు తెలుసుకొనేందుకు అర్హుడు. తన కోరికలు తీర్చుకొనడం కోసం, సంపదలు పోగుచేసుకొనడం కోసం ఆరాటపడే వ్యక్తికి ఈ ధర్మసూత్రాలపై ఎలాంటి ఆసక్తి ఉండదు. ధర్మసూత్రాల గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉన్నవారికి వేదమే ముఖ్య ప్రమాణము.

శ్రుతిలో ఏదైనా ఒకే  విషయం మీద పరస్పర విరుద్ధమైన రెండు విధములుగా ధర్మం  చెప్పబడినప్పుడు, విజ్ఞులు ఆ రెండు ధర్మములనూ అనుసరించ వచ్చును. ఉదాహరణకు ‘ఉదితే జుహోతి’ అనీ ‘అనుదితే జుహోతి’ అనీ రెండు వేదవాక్యాలున్నాయి. సూర్యోదయం అయిన తరువాత యజ్ఞం చేయాలని మొదటి వాక్యం అర్థం. ఆకాశంలో నక్షత్రాలు ఉండి, ఇంకా సూర్యుడు ఉదయించక పూర్వం ఆకాశమంతా ఎర్రబారిన అరుణోదయ సమయంలో యజ్ఞం చేయాలని రెండవ వాక్యం అర్థం. ఈ రెండు శృతి వాక్యాలలో దేనిని అనుసరించి యజ్ఞం చేయాలని సంశయం ఏర్పడితే ‘ఈ రెండు విధాలుగా యజ్ఞం చేయవచ్చును’ అని వివరణ ఇవ్వబడింది.

నేను గతంలో పేర్కొన్నట్టే వేదాలు పౌరుషేయాలు. అంటే అవి వివిధ దేశ కాలాలలో పలువురు ఋషులు సంకలనం చేసినవే. ఒకే విషయం మీద ఇలాంటివే వేదాలలో పరస్పర విరుద్ధంగా చెప్పబడిన పలు అంశాలున్నాయి. అవి ఎప్పుడూ ఎలాంటి మార్పుకూ లోనుకానివాడని భావించే భగవంతుడి వాక్కులే కనుక అయితే ఒక విషయం మీద చెప్పబడిన వాక్కులు ఎలాంటి మార్పు లేకుండా ఒకేవిధంగా ఉండాల్సి ఉంది కదా? వేదమంత్రాల రచనా శైలి, ఛందస్సు, వర్ణనలు, వాటిలో ప్రస్తావించబడిన వివిధ దేశకాల స్థితిగతులను సూచించే పలు అంశాలు మొదలైనవాటిని నిశితంగా పరిశీలించిన వైదిక పండితులు ఆ యా అంశాలు ఒక క్రమ పరిణామాన్ని సూచిస్తున్నాయనీ, కనుక వేదాలు వివిధ దేశ కాలాలలో పలువురు ఋషులచే రూపొందించబడి, మౌఖికంగా ఒకరినుంచి మరొకరికి తరాల తరబడి అందజేయబడుతూ వచ్చాయనే నిర్ధారణకు వచ్చారు.

ప్రఖ్యాత చరిత్రకారుడు రమేశచంద్ర మజుందార్ వేదాల గురించి చెపుతూ ఇలా అన్నారు - “It is a mass of literature which had grown up in course of many centuries and was orally handed down from generation to generation.” (Page 33, ‘Ancient India’, R.C. Majumdar, Motilal Banarsidass Publication, 8th Edition, 1977). పలువురు ఇతర ప్రముఖ చరిత్రకారులు కూడా వేదసాహిత్యంపై ఇదే అభిప్రాయం వెలిబుచ్చారు. కనుక వేదసాహిత్యం క్రమంగా పెరుగుతూ వచ్చిన, శతాబ్దాల తరబడి ఒక తరాన్నుంచి మరొక తరానికి మౌఖికంగా అందజేయబడుతూ వచ్చిన సాహిత్యమనేది నిర్వివాదాంశం. వేదసాహిత్యంలో పెరుగుదల అది మానవ సృష్టి అని చెప్పకనే చెపుతున్నది.

నిషేకాది శ్మశానాంతో మంత్రైర్యస్యోదితో విధి : |
తస్య శాస్త్రేధికారోస్మిన్ జ్ఞేయో నాన్యస్య కస్య చిత్ || (2- 16)

నిషేకము అంటే గర్భాధానము (గర్భ + ఆధానము) మొదలు అంత్యేష్టి (అంత్యక్రియలు) వరకు గల షోడశ (16) సంస్కారాలు ఏ బ్రాహ్మణునికి విధించబడినాయో, వానికి మాత్రమే ఈ మనుధర్మశాస్త్రం చదవడానికి, ఇతరులకు బోధించడానికి అధికారం ఉంటుంది. శాస్త్రంలో విధించిన నియమాలను తెలుసుకుని అనుష్ఠించడమనే విధి క్షత్రియ, వైశ్యులకు ఉన్నప్పటికీ, వారికి అధ్యాపనం చేసే అధికారం లేదు. శూద్రునికైతే అసలు ఈ ధర్మశాస్త్రం చదివే, వినే అధికారమే లేదు.

ఇక్కడ నాకొక అనుమానం వస్తున్నది. ఈ ధర్మశాస్త్రంలో శూద్రులు పాటించవలసిన పలు విధులను కూడా పేర్కొన్నారు. వారు పై మూడు వర్ణాల వారిని తమ సేవల ద్వారా ఎలా మెప్పించాలో కూడా ఈ శాస్త్రంలో వివరించడం జరిగింది. మరి శూద్రులు ఈ ధర్మశాస్త్రం అధ్యయనం చేయకూడదు, వినకూడదు అనే నియమం ఉంటే ఈ ధర్మశాస్త్రంలో శూద్రులకు విధించిన ధర్మాలు, వారు అనుసరించవలసిన సూత్రాలను ఆ కాలంలో వారికి ఎవరు, ఎలా తెలియజేసేవారనేది నా సందేహం.

సరస్వతి, దృషద్వతి అనే రెండు దేవ నదుల మధ్య ప్రదేశం దేవతలు నిర్మించినదని విశ్వాసం. దానిని బ్రహ్మావర్తము అంటారు. ఈ బ్రహ్మావర్తములో బ్రాహ్మణులు, ఇతర వర్ణములవారు, వర్ణ సాంకర్యము కారణంగా జన్మించినవారు వంశపారంపర్యంగా ఏ యే ఆచారాలు పాటిస్తారో, వాటిని సదాచారాలు అంటారు.

కురుక్షేత్రము, మత్స్య దేశము, పంచాలము (పాంచాల దేశము), శూరసేనకాః ( శూరసేన) దేశము - ఈ నాలుగు ప్రాంతాలనూ కలిపి బ్రహ్మర్షి దేశం అంటారు. ఇది బ్రహ్మావర్తాన్ని ఆనుకునివున్న ప్రదేశము. ఈ దేశంలో జన్మించిన బ్రాహ్మణుని నుండి మాత్రమే సమస్త భూమండలంలోని మానవులందరూ తమ తమ ఆచారములను తెలుసుకొనవలసి ఉంది.

హిమవద్వింధ్యయోర్మధ్యం యత్ప్రాగ్విశసనాదపి |
ప్రత్యగేవ ప్రయాగాచ్చ మధ్యదేశః ప్రకీర్తితః || (2 - 21)

ఉత్తరదిశలో హిమవత్పర్వతములు, దక్షిణ దిశలో వింధ్య పర్వతములు ఎల్లలుగా ఉన్న ప్రదేశము; విశసనము అంటే వినాశనము జరిగిన ప్రదేశము (అంటే సరస్వతీ నది ఒకప్పుడు నేలలో ఇంకిపోయి అదృశ్యమైపోయిన ఎడారి ప్రదేశము) నకు యత్ ప్రాక్ - ఏది తూర్పుగా ఉందో ఆ ప్రదేశము; ప్రత్యగేవ (ప్రత్యక్ + ఏవ) ప్రయాగాచ్చ - ప్రయాగకు ఏది పడమరగా ఉందో ఆ ప్రదేశము మధ్యదేశము అనబడుతుంది.

ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన వింధ్య పర్వతాలు, పడమరన వినాశన దేశం (థార్ ఎడారి), తూర్పున ప్రయాగ (నేటి అలహాబాద్) ఎల్లలుగా ఉన్న దేశమే నాడు మనువు పేర్కొన్న మధ్యదేశం. బ్యూలర్ (Buhler) వంటి కొందరు వ్యాఖ్యాతలు దీనికే వినాశన ప్రదేశానికి పడమరగా, ప్రయాగ కు తూర్పుగా ఉన్న ప్రదేశం మధ్యదేశం అంటూ అర్థం చెప్పారు. అది ఈ శ్లోకార్థాన్ని తప్పుగా అన్వయించడం.

తూర్పు, పశ్చిమ దిశలలో ఉన్న సముద్రములు ఎల్లలుగా కల పర్వతమయ ప్రదేశమును బుధజనులు (విజ్ఞులు) ఆర్యావర్తము అంటారు.

కృష్ణసార మృగం (నల్ల ఇర్రి- The Black Antelope) ఏ ప్రదేశంలో సహజసిద్ధంగా సంచరిస్తుందో - ఆ ప్రదేశం యజ్ఞాలు చేసేందుకు అనువైనదిగా గ్రహించాలి. ఇది కాక మిగిలిన ప్రదేశం మ్లేచ్ఛ దేశం (The Land of Barbarians). బ్రాహ్మణులు ప్రయత్న పూర్వకముగా పైన  చెప్పిన ఏ అనువైన ప్రదేశములోనైనా నివసించాలి. శూద్రులది సేవా వృత్తి కనుక జీవనోపాధి కొరకు వారు ఏ ప్రదేశములోనైనా జీవించవచ్చు.

ఈ విధంగా ధర్మశాస్త్రం యొక్క ఆవిర్భావం గురించి, ఈ విశ్వావిర్భాన్ని గురించి మీకు సంక్షిప్తంగా వివరించాను. ఇక ఇప్పుడు వర్ణ ధర్మాలను వివరిస్తాను - అన్నాడు భృగు మహర్షి మునులతో.

***సశేషం***

Posted in May 2020, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!