నా ఇంటి కిటికి రెక్కలు తెరవగానే
ఆకాశాన భగభగ మండే సూర్యుడు
అడుగు దూరంలోకి వచ్చి వాలిపోతాడు
దుమ్ము ధూళిలను తనలో నింపుకున్న గాలి
మా ఇల్లంతా ఆవరిస్తుంది
పక్షుల కిలకిల రాగాల మాటేమోగాని
వాహనాల శబ్దాలతో
మా కర్ణభేరికీ కష్టాలు ఖాయం
చల్లని జాబిల్లితో కబుర్లు చెప్పడానికైనా
ఆహ్లాదకరమైన హరివిల్లును ఆస్వాదించడానికైనా
కారుమబ్బుల కాపలాని తిలకించడానికైనా
నిర్మలాకాశంలో నక్షత్రాలను లెక్కించడానికైనా
మా ఇంటి కిటికినే
మాకు వారధి
కురిసేది చిరుజల్లైనా
కుండపోత వానైనా
కప్పుకుంటున్న పొగమంచునైనా
విహరిస్తున్న పక్షుల గుంపులనైనా
వీక్షించడానికి మా కిటికినే
మాకు ప్రసారమాధ్యమం
ఇసుమంతైనా ఖాళీలేని
బహుళంతస్తుల భవంతులు
కనుచూపుమేరలో మచ్చుకైనా
కనిపించని పచ్చనిచెట్లు
ప్రార్ధనా సమయంలో
నిల్చున్న బడిపిల్లల వలె పార్కింగ్లో వాహనాలు
ఎదురింటి వసారాలో
దీనంగా వేలాడుతున్న
ఆరబెట్టిన బట్టలు
విద్యుత్ కాంతులతో వెలిగిపోతూ
మనుషులు లేక బోసిపోతున్న ఎన్నో ఇళ్లులు
వీటన్నింటి సమాహారం
మా కిటికిలో ప్రసారం...
సూపర్….
గ్రామాలు దేశానికి వెన్నెముక.