Menu Close
Ghali-Lalitha-Pravallika
కథ మొదలు మాది - ముగింపు మీది
ఘాలి లలిత ప్రవల్లిక

గత సంచిక తరువాయి... ముగింపు కథ కొనసాగింపు .... »

Mulugu Lakshmi Maithili22. ములుగు లక్ష్మీ మైథిలి

అంశం :: కథ మొదలు మాది_ ముగింపు మీది; కథా శీర్షిక: అమ్మ

ఆరుపదుల వసంతాలు చూసిన శ్యామలమ్మకు, ఒంటరితనం కొత్తేమీకాదు. కానీ ఈ మధ్య కాలంలో... 'తాను ఒంటరి' అనే ఫీలింగ్ పవర్ ఆఫ్ పట్టా పుచ్చుకొని గుండె సింహాసనం మీద, తిష్ట వేసుకుని కూర్చుంది. 'ఇన్నాళ్లు లేని ఫీలింగ్ ఇప్పుడు ఎందుకు వచ్చింది?' అని పదే పదే తన మనసును ప్రశ్నించుకుంది.

అది...

'అప్పుడు బాధ్యతలు తోడుగా ఉండేవి. ఇప్పుడు అవి తీరిపోయా యి. వీటితో పాటుగా అనారోగ్యం...

శరీరంలోకి ఎంట్రీ ఇచ్చేసింది. మరి ఇప్పుడేగా! ఇంట్లో నాకు ఉన్న విలువ నాకు తెలిసేది. మరి ఇంత సింపుల్ లాజిక్ ఎలా మిస్ అయ్యాను!?!' అని తనకు తాను జవాబు చెప్పుకొంది.

కంటికొలకు ల్లో దాగిన రెండు కన్నీటిబొట్లు ఆమె బుగ్గల పైకి ప్రాకాయి. గతం ఆమె కళ్ళ ముందు మెదిలింది.

***

పెళ్లయిన నాలుగేళ్లకే ఇద్దరు పిల్లల్ని ఒళ్ళోపెట్టి పరారు అయిపోయాడు శ్యామలమ్మ మొగుడు పరాంకుశం.

"నా కొడుకును వీధులపాలు చేసిన నీవు మా ఇంటికి ఏ మొహం పెట్టుకొని వస్తావు? నువ్వూ, నీ పిల్లలూ కట్ట కట్టుకొని ఏచావన్నా చావండి. మాకు మీకు ఎటువంటి సంబంధం లేదు," అని తెగేసి చెప్పేసి, ఆమెను... ఆమె పిల్లల్ని ఇంట్లోకి రానీయకుండా తలుపు మొహం మీదే వేసేసారు ఆమె అత్తింటి వారు. పుట్టింటికి వెళ్ళటం ఇష్టం లేని శ్యామలమ్మ. ఒక కాన్వెంటు లో టీచర్గా జాయిన్ అయ్యి, తిని తినక ఎన్నో కష్టాలు పడి పిల్లల్ని ప్రయోజకుల్ని చేసుకుంది. ఇప్పుడు పిల్లలు ఇద్దరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. ఎవరి సంసారాలు వాళ్ళవి.

***

కళ్ళ నీళ్లు తుడుచుకుంది. మనసులో ఒక గట్టి నిర్ణయం తీసుకుంది. ఆ ప్రయత్నంలో సఫలీకృతురాలు అయ్యింది. తన నిర్ణయం కొడుకూ, కోడలికి చెప్పింది. నీ ఇష్టం అన్నాడు కొడుకు. మీ ఆనందమే మా ఆనందం అని చెప్పి తప్పుకుంది కోడలు.

కూతురుతో ఈ మాటే చెబితే... జవాబు చెప్పకుండా, ఫోన్ కట్ చేసేసింది. చుట్టుపక్కల వాళ్ళు,

"ఈ వయసులో ఈవిడకు ఇదేం పోయేకాలం?" అని అన్నారు.

******

ఈ కథకు నేను వ్రాసిన ముగింపు...

కూతురు ఫోన్ కట్ చేయటంతో ఏం చేయాలో తోచలేదు శ్యామలమ్మకు. 'పిల్లలు ఎవరి దారి వారి చూసుకున్నారు. తోడు లేని ఈ వయసులో జీవితం ఎలా సాగించాలి'. అనుకుంటూ దిగులుగా ఆలోచిస్తూనే... ప్రతిరోజూ తన ఇంటికి దగ్గరగా ఉన్న పార్క్ కి వెళ్లి కాసేపు కూర్చొని ఇంటికి రావటం అలవాటు చేసుకుంది ఆమె. ఆరోజు కూడా అలాగే పార్క్ కు వెళ్లి కూర్చున్న శ్యామలమ్మ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు.‌

"అమ్మా! నమస్తే నేను ప్రతిరోజూ వాకింగ్ కి ఇక్కడికి వస్తాను.‌ మీరు కూడా రోజూ ఇక్కడికి రావడం, ఎప్పుడూ దిగులుగా కూర్చోవడం చూస్తున్న. మీరు ఏమీ అనుకోకపోతే  మీ గురించి చెప్పండి." అంటూ అడిగాడతను.

అతను మరీ మరీ అడగటంతో శ్యామలమ్మ తన జీవితంలో జరిగిన సంఘటనలు మొత్తం వివరంగా అతనితో చెప్పింది.

"అమ్మా! నేను తల్లీ, తండ్రీ అనాథను. సాప్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం చేస్తున్నా. అనాథనని నాకు ఎవరూ పిల్లనివ్వలేదు. అందుకే నేను అనాథైన అమ్మాయినే పెళ్లి చేసుకున్న. ప్రస్తుతం నా భార్య ప్రెగ్నెన్సీ. తనను చూసుకుంటూ మాకు పెద్ద దిక్కుగా, మాకు తోడుగా ఉందురు గాని. మా ఇద్దరికీ తల్లి లేని లోటు తీరుతుంది. ఇకనుంచి నేనే నీ కొడుకును. ఆ దేవుడు నాకు ఇచ్చిన తల్లిలా నిన్ను చూసుకుంటాను. మా ఇంటికి రా అమ్మా!" అంటూ అతను ప్రేమగా పిలవటంతో 'అమ్మ' అనే తీయని పిలుపు ఇక వినబడదేమోనని దిగులు పడ్డ ఆమెకు మళ్ళీ ఆ మధురమైన పిలుపు వినపడేసరికి "సరే" అంటూ తన కోసం వచ్చిన మరో కొడుకు వెంట నడిచింది శ్యామలమ్మ.

******

Venkata Lakshmi Gayathri23. వేంకట లక్ష్మీ గాయత్రి రేగులగెడ్డ

అంశం :: కథ మొదలు మాది_ ముగింపు మీది; శీర్షిక: పునర్జన్మ

ఆరుపదుల వసంతాలు చూసిన శ్యామలమ్మకు, ఒంటరితనం కొత్తేమీకాదు. కానీ ఈ మధ్య కాలంలో...  'తాను ఒంటరి' అనే ఫీలింగ్ పవర్ ఆఫ్ పట్టా పుచ్చుకొని గుండె సింహాసనం మీద, తిష్ట వేసుకుని కూర్చుంది. 'ఇన్నాళ్లు లేని ఫీలింగ్ ఇప్పుడు ఎందుకు వచ్చింది?' అని పదే పదే తన మనసును ప్రశ్నించుకుంది.

అది...

'అప్పుడు బాధ్యతలు తోడుగా ఉండేవి. ఇప్పుడు అవి తీరిపోయా యి. వీటితో పాటుగా అనారోగ్యం...

శరీరంలోకి ఎంట్రీ ఇచ్చేసింది. మరి ఇప్పుడేగా! ఇంట్లో నాకు ఉన్న విలువ నాకు తెలిసేది. మరి ఇంత సింపుల్ లాజిక్ ఎలా మిస్ అయ్యాను!?!' అని తనకు తాను జవాబు చెప్పుకొంది.

కంటికొలకు ల్లో దాగిన రెండు కన్నీటిబొట్లు ఆమె బుగ్గల పైకి ప్రాకాయి. గతం ఆమె కళ్ళ ముందు మెదిలింది.

***

పెళ్లయిన నాలుగేళ్లకే ఇద్దరు పిల్లల్ని ఒళ్ళోపెట్టి పరారు అయిపోయాడు శ్యామలమ్మ మొగుడు పరాంకుశం.

"నా కొడుకును వీధులపాలు చేసిన నీవు మాఇంటికి ఏమొహం పెట్టుకొని వస్తావు? నువ్వూ, నీ పిల్లలూ కట్ట కట్టుకొని ఏచావన్నా చావండి. మాకు మీకు ఎటువంటి సంబంధం లేదు," అని తెగేసి చెప్పేసి, ఆమెను... ఆమె పిల్లల్ని ఇంట్లోకి రానీయకుండా తలుపు మొహం మీదే వేసేసారు ఆమె అత్తింటి వారు. పుట్టింటికి వెళ్ళటం ఇష్టం లేని శ్యామలమ్మ. ఒక కాన్వెంటు లో టీచర్గా జాయిన్ అయ్యి, తిని తినక ఎన్నో కష్టాలు పడి పిల్లల్ని ప్రయోజకుల్ని చేసుకుంది. ఇప్పుడు పిల్లలు ఇద్దరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. ఎవరి సంసారాలు వాళ్ళవి.

***

కళ్ళ నీళ్లు తుడుచుకుంది. మనసులో ఒక గట్టి నిర్ణయం తీసుకుంది. ఆ ప్రయత్నంలో సఫలీకృతురాలు అయ్యింది. తన నిర్ణయం కొడుకూ, కోడలికి చెప్పింది. నీ ఇష్టం అన్నాడు కొడుకు. మీ ఆనందమే మా ఆనందం అని చెప్పి తప్పుకుంది కోడలు.

కూతురుతో ఈ మాటే చెబితే... జవాబు చెప్పకుండా, ఫోన్ కట్ చేసేసింది.  చుట్టుపక్కల వాళ్ళు,

"ఈ వయసులో ఈవిడకు ఇదేం పోయేకాలం?" అని అన్నారు.

******

నా ముగింపు:

లోకులు కాకులు. మనం బాధ పడే కొద్దీ పొడిచి పొడిచి చంపుతారు. ఇవేమీ పట్టించుకోకూడదు అనుకుంది శ్యామలమ్మ. మరోసారి తన ముందుకు వచ్చిన ప్రస్తావన గురించి ఆలోచించడం మొదలు పెట్టింది.

శ్యామలమ్మ పనిచేసే స్కూలుకు దగ్గరగా ఒక గుడి ఉంది. అవకాశం ఉన్న రోజుల్లో స్కూలు అయిపోయాక ఆ గుడికి వెళ్ళి కాసేపు కూర్చుని వచ్చేది శ్యామలమ్మ.

రిటైర్ అయ్యాక ఒక రోజు మధ్యాహ్నం స్కూలుకు ఏదో పని మీద వచ్చి...అది అయిపోయాక దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళింది శ్యామలమ్మ. దేముడి దర్శనం చేసుకుని కాసేపు అరుగుమీద కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉన్న శ్యామలమ్మ "నమస్తే టీచర్" అన్న మాటలకి తల ఎత్తి చూసింది.

ఎదురుగా తన దగ్గర చదివిన శ్రవణ్ కుమార్  కనిపించాడు.

"నమస్తే శ్రవణ్! బాగున్నావా?" అడిగింది శ్యామలమ్మ.

"బాగున్నాను మేడం. మీరు ఎలా ఉన్నారు?" ..అడిగాడు శ్రవణ్.

"బాగానే ఉన్నాను బాబూ! మీ నాన్నగారు ఎలా ఉన్నారు?" అడిగింది శ్యామలమ్మ.

"బాగానే ఉన్నారమ్మా. మీకు గుర్తు ఉన్నారా ఇంకా!" ...అన్నాడు శ్రవణ్.

"ఎందుకు ఉండరు బాబూ. నీ కోసం ఎంత తాపత్రయ పడే వారో...మీ అమ్మగారు పోయాక వివాహం కూడా చేసుకోకుండా నీ కోసం అలాగే ఉండిపోయారు...ఎవరి సానుభూతి ఆశించకుండా నీ బాగోగులు చూసారు. మగవాళ్ళలో మీ నాన్నగారి లాంటి వారు అరుదు..." అంది శ్యామలమ్మ.

అమ్మా! మీ ఫోన్ నెంబరు ...ఇంటి అడ్రస్ మీకు అభ్యంతరం లేకపోతే నాకు ఇస్తారా? మీ ఇంటికి రావాలని ఉంది...అన్నాడు శ్రవణ్.

"తప్పకుండా ఇస్తాను...ఇంతకీ నువ్వు ఏమి చేస్తున్నావు?" అంది శ్యామలమ్మ.

"ఒక మల్టీ నేషనల్ కంపెనీలో ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నాను అమ్మా" అన్నాడు...శ్రవణ్.

"ఓ గుడ్! నీకు పెళ్లి అయ్యిందా" అంది శ్యామల.

"లేదమ్మా! చేసుకోలేదు అన్నాడు" శ్రవణ్.

"ఏమి ఎందుకు చేసుకోలేదు..." అడిగింది శ్యామలమ్మ.

"నా కోసం నా తండ్రి ఎంత కష్టపడ్డారో మీకు తెలుసు కదమ్మా...వచ్చే ఆమె నన్ను ఎలా చూస్తుందో అని మరొక వివాహం కూడా చేసుకోలేదు ఆయన. ఇప్పుడు నాకు వస్తున్న సంబంధాల వాళ్ళు నాన్నగారిని చూసి వెనక్కి తగ్గుతున్నారమ్మా. కొందరైతే మగవాడు కదా ఆయన... అత్తగారు ఉంటే ఫరవాలేదు.ఆయన ఏమి సాయం చేయగలడు...అత్తగారు ఉండి మామగారు లేని సంబంధాలైనా చేసుకోవచ్చు అన్నట్లు మాట్లాడారు అమ్మా. అందుకే నేను వివాహం చేసుకోలేదు" అన్నాడు శ్రవణ్.

"అయ్యో! మీ నాన్నగారు చాలా మంచివారు. తల్లి లేని నువ్వు నాకు ఎందుకో చేరువయ్యావు. నా పిల్లలతో పాటు ఆడుకుంటావని ఒకోసారి నిన్ను మా ఇంట్లో ఉంచేస్తే...ఆయన చాలా మొహమాట పడేవారు. మీ నాన్నగారికి  ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతుంటే నువ్వు నన్ను వదలలేక ఎంత ఏడ్చావో!" గుర్తు చేసుకుని బాధ పడింది శ్యామలమ్మ.

కొంతసేపు మౌనం రాజ్యమేలింది అక్కడ.

కాసేపాగి "అవునూ... నువ్వు ఈ ఊర్లో ఎలా?" అడిగింది శ్యామలమ్మ

"నాన్నగారి ఫ్రెండ్ కి ఆరోగ్యం బాగులేదంటే చూడడానికి వచ్చాము మేడం" అన్నాడు శ్రవణ్.

ఇక నేను ఇంటికి వెళతాను లేచింది శ్యామలమ్మ. మాట్లాడకుండా ఆమె వెనకాలే వెళ్ళి ఆమెని ఇంటి వరకూ దిగబెట్టాడు శ్రవణ్.

"లోపలకి రా" అని పిలిచింది శ్యామలమ్మ.

రేపు వస్తాను మేడం అని వెళ్ళిపోయాడు శ్రవణ్.

మరునాడు మధ్యాహ్నం 3గంటలకు శ్యామలమ్మ ఇంటికి వచ్చాడు శ్రవణ్.

కాసేపు ఆ మాట ఈ మాట మాట్లాడుకున్నాక సడన్ గా కుర్చీలోంచి కిందకి దిగి శ్యామలమ్మ కాళ్ళ దగ్గర కూర్చున్నాడు శ్రవణ్. "ఏమైంది సడన్ గా" అంది శ్యామలమ్మ గాభరాగా లేవబోతూ.

"మీరు నాకు అమ్మ కాగలరా! అని అడిగాడు శ్రవణ్.".. శ్యామలమ్మ ఖంగారుగా ఏదో చెప్పబోతుంటే "నన్ను పూర్తిగా మాట్లాడనివ్వండి" అన్నాడు శ్రవణ్.

"నాన్నగారి సంగతి మీకు తెలుసు...అమ్మా పోయాక ఇంకొక స్త్రీని తన జీవితంలోకి రానివ్వలేదు.ఎలాంటి అలవాట్లూ లేవు. ఇప్పుడు ఆయన్ని నా వివాహం కోసం వదిలి పెట్టడం నాకు ఇష్టం లేదు. వదిలిపెట్టను. కానీ కొందరి మాటలు విన్నాక ఆయనకి ఒక తోడు తీసుకొని వస్తే బాగుంటుంది అనిపించింది. ఆ తోడు మీరైతే ఇంకా బాగుంటుంది అనిపించింది. పిల్లల కోసమే మీరిద్దరూ బ్రతికారు. ఇప్పుడు మీరిద్దరూ ఒకటైతే ఒకరినొకరు అర్థం చేసుకుని జీవితంలో మిగిలిన భాగం హాయిగా గడపగలరు. నాకు కూడా అమ్మ ప్రేమ అందుతుంది. మీతో కలసి ఉండేందుకు ఒప్పుకునే అమ్మాయి దొరికితేనే నేను వివాహం చేసుకుంటాను. లేకపోతే శ్రావణ కుమారుడిలా మిమ్మల్ని చూసుకుంటాను .ఇది మీ పాదాలంటి చెపుతున్నాను" అన్నాడు శ్రవణ్.

"నువ్వు ఇక్కడకి మీ నాన్నగారికి చెప్పే వచ్చావా?" అడిగింది శ్యామలమ్మ.

"చెప్పే వచ్చానమ్మా...అందుకే ఇవాళ వస్తాను అని చెప్పాను మీకు... కష్టపడి నాన్నగారిని ఒప్పించాను. మీ సమ్మతి అడిగి రమ్మన్నారు" అన్నాడు శ్రవణ్.

"నేను కొంచెం ఆలోచించుకోవాలి. మీ నాన్నగారితో మాట్లాడాలి" అంది శ్యామలమ్మ.

"అలాగేనమ్మా ఆ ఏర్పాటు నేను చేస్తాను..."అని వెళ్ళాడు శ్రవణ్.

'శేఖర్ గురించి తనకి తెలుసు...శ్రవణ్ చిన్నప్పుడు శ్రవణ్ కోసం ఒక టీచరుగా అతనితో చాలా సార్లు మాట్లాడింది. తమ ఇంటికి శ్రవణ్ ని తీసుకుని వెళ్లడానికి వచ్చినప్పుడు కూడా మాట్లాడేది. అందుకే మళ్ళీ అతనితో మాట్లాడుదాము అనుకుంది. తనకి కూడా శ్రవణ్ ప్రస్తావన ఎందుకో నచ్చింది..' అనుకుంది శ్యామలమ్మ.

శేఖర్ తో మాట్లాడాక అతనితో కలసి ప్రయాణం చేద్దామని నిశ్చయించుకుంది. కొడుకు, కోడలి సమ్మతి లభించింది. వాళ్ళకి తన భారం దిగిపోతే చాలు. ఊహించిన విధం గానే ఒప్పుకున్నారు. కూతురే ఏడ్చింది...తిట్టింది. నీ దగ్గర ఉంచుకుంటావా నన్ను అని అడిగితే సమాధానం ఇవ్వలేదు.

అందుకే ఇప్పుడు తన నిర్ణయం ఇంకా బలపడింది. ఆలోచనల్లోంచి బయటకు వచ్చింది శ్యామలమ్మ.

ఇద్దరు ముగ్గురు మిత్రుల సమక్షంలో గుడిలో నిరాడంబరంగా శ్యామలమ్మ, శేఖర్ ల వివాహం జరిగిపోయింది. తనను ఈ వయసులో అపురూపంగా చూస్తున్న శేఖర్ని చూస్తే శ్యామలమ్మకి గర్వంగా అనిపించసాగింది. దేముడు తనకి పునర్జన్మ ఇచ్చినట్టు అనిపించింది. ఇద్దరూ కలసి వాకింగ్ కి వెళ్లి రావడం, శేఖర్ తనకి పనులలో సాయం చేయడం, శ్రవణ్ ఆఫీసు నుంచి రాగానే కాఫీ తాగి కాసేపు రిలాక్స్ అవడానికి ముగ్గురూ ఏ కార్డ్స్ ఆడుకోవడమో చేసేవారు. అమ్మా,నాన్న ల ఆనందం చూసి శ్రవణ్ ఎంతో ఆనందపడసాగాడు. పిల్లలు తనని చూడడానికి రాలేదు సర్ కదా తనతో మాట్లాడలేదు. ముందు కొంచెం బాధ పడినా శ్యామలమ్మ శేఖర్,శ్రవణ్ చూపిస్తున్న ప్రేమతో తన పిల్లల గురించి ఆలోచించడం మానేసింది. అరవై కి చేరిపోయాను అనుకున్న శ్యామలమ్మకి శ్యామూ అన్న భర్త పిలుపుతో వయసు సగానికి సగం తగ్గిపోయింది. ఇక శ్రవణ్ ఆఫీసుకి కొత్తగా వచ్చిన అమ్మాయి శ్రావ్య తనకి తల్లిదండ్రులు లేరని పెదనాన్న దగ్గర పెరిగానని...శ్రవణ్ తల్లిదండ్రులను తన తల్లిదండ్రులు గా చూసుకుంటానని తను నచ్చితే తన పెదనాన్నగారితో మాట్లాడమని అడిగింది. శ్యామల, శేఖర్ వెళ్ళి సంబంధం కుదుర్చుకుని వచ్చారు. శ్రవణ్ పెళ్ళి శ్రావ్యతో అయిపోయింది. ఆ కుటుంబం బంగారు కుటుంబం అయిపోయింది.

******

****సశేషం****

Posted in January 2026, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *