ఈ భావాలు ఏ కలం కల్లోలమో?
ఈ గాయాలు ఏ గుండె కర్కశమో?
ఈ అంకాలు ఏ కలల అల్లికలో?
ఈ నాటకం ఏ ఊహ వ్రాతో?
ఎందులో, ఏ పాత్రది ఎంత నిడివో
పక్కనే ఎన్ని పాత్రల దోబూచులో?
ఎక్కడా ముఖానికి రంగుండదు
ఎవరికీ డైలాగులు ఎవ్వరూ ఇవ్వరు.
సాటి పాత్రలేవో ఎవరూ చెప్పరు.
లోటుపాట్లు ఎక్కడా కనిపించవు
కనుక్కోవాలంటే కుదరదు.
గొంతు చించుకున్నా వినిపించదు.
ఏ ప్రశ్నకు చావుండదు
ఏ జవాబు ప్రశ్నను చంపలేదు.
నడిచేది నచ్చదు.
గడిచేది నొప్పదు.
విదిలించుకుని వదిలేద్దామని
అనిపించక తప్పదు.
వదిలేసి ఒంటరిగుందామన్నా
వెనుకాడక తప్పదు.
గట్టి పదాలతో
పెదవికి గాయం తప్పదు.
మెత్తని అగ్నికి
నాలుక కాలకా తప్పదు.
నచ్చని రంగులతో
ముఖాన్ని కడిగి
మెచ్చని మనిషికి
మనసును వ్రాయాలి
ఐనా, నిరంతరం
కాలు ముల్లునే ప్రేమిస్తుంది
చేతులు ముప్పునే వరిస్తాయి.
కళ్ళు కలలతో కుదించుకుపోయాయి.
బొట్లు బొట్లుగా కురిసే బాధలో
జోరుగా కన్నీటి హోరుగాలికి
పగలు చీకటిగా నడపాలి
రాత్రి పగటిగా గడపాలి.
నవ్వుల్ని అమ్ముకుని
ఏడుపును కొనుక్కునే
వింత రీతులతో
విచిత్ర రుచులతో
బతుకు పరీక్షలు వ్రాయాలని
కాలం బోధిస్తునే ఉంటుంది
కడదాకా..
ఇది తెలియకుండా
మనసులు మండే అనుభవంలో
ఫలితాల్ని అనుభవించే రహస్యం
" జీవితం".