Menu Close
GSS-Kalyani
జ్ఞానానందమయం
శ్రీ శేష కళ్యాణి గుండమరాజు

వేసవి కాలం అంటే ప్రసూనాంబకు గుర్తుకొచ్చేవి కరెంటు కోతలూ, మండే ఎండలూ, నీళ్ల కరువూనూ. కానీ కృష్ణానందకి మాత్రం హాయిగా గడిపే వేసవి సెలవలూ, చల్లటి పుచ్చకాయలూ, తాటి ముంజలూ అన్నిటికీ మించి తియ్య మామిడిపళ్ళూ గుర్తుకొస్తాయి! ఓసారి వేసవిలో కృష్ణానందని తీసుకుని మామిడిపళ్ళు కొనడానికి బజారుకెళ్లింది ప్రసూనాంబ.

"మామిడిపళ్ళు ఎవరి దగ్గర కొంటావు బామ్మా?", దారిలో ప్రసూనాంబను అడిగాడు కృష్ణానంద.

"మన ఊళ్ళో ఈ ఏడు రామయ్య, సోమయ్యలు ప్రత్యేకంగా దుకాణాలు పెట్టి మరీ మామిడిపళ్ళు అమ్ముతున్నారట! వాళ్ళిద్దరిలో ఒకరిదగ్గరకు వెళ్లి పళ్ళు కొందాం", చెప్పింది ప్రసూనాంబ.

"వాళ్ళిద్దరిలో పళ్ళు ఎవరి దగ్గర కొంటే బాగుంటుందీ?", అడిగాడు కృష్ణానంద.

"వారిద్దరి దుకాణాలనూ చూశాక నిర్ణయిద్దాం!", చెప్పింది ప్రసూనాంబ.

కొద్దిదూరం నడిచాక రామయ్య, సోమయ్యల దుకాణాలున్న ప్రదేశానికి చేరుకున్నారు ప్రసూనాంబ, కృష్ణానందలు. వారికి ముందుగా సోమయ్య దుకాణం కనపడింది. సోమయ్య దుకాణం బయట నిలబడి ఉన్నాడు.

ప్రసూనాంబను చూస్తూనే సోమయ్య, "అమ్మా! ఇటు రండమ్మా! ఇవి తియ్య మామిడిపళ్ళమ్మా! ప్రత్యేకంగా ఏరి పట్టుకొచ్చా. ధర కాస్త ఎక్కువని అనిపించినా, రుచిలో అమోఘంగా ఉంటాయి. పట్టుకెళ్ళండమ్మా. ఇంత మంచి మామిడిపళ్ళు మీకు మరెక్కడా దొరకవు! ఈ సోమయ్య గొప్పతనమేమిటో తెలియాలంటే మీరు నా దుకాణంలో పళ్ళు కొనాల్సిందే!", అని అన్నాడు.

ప్రసూనాంబ సోమయ్య దుకాణంలోని పళ్ళను చేతిలోకి తీసుకుని పరిశీలించి, "ధర తగ్గిస్తావా?", అని అడిగింది.

సోమయ్య కొంచెం చిరాగ్గా, "ధర తగ్గించేది లేదు. ముందే చెప్పాను కదమ్మా ఈ పళ్ళు చాలా ప్రత్యేకమనీ?! ఈ పళ్ళు కొనకపోతే మీరు ఈ వేసవిలో మంచి మామిడిపళ్ళ రుచి చూడనట్లే! మామిడిపళ్ళ వ్యాపారంలో నన్ను మించినోడు లేడు. వెంటనే కొనెయ్యండి! ఆలస్యం చేస్తే మీకు ఇలాంటి పళ్ళు మళ్ళీ దొరకవ్", అంటూ ప్రసూనాంబను తన వద్ద పళ్ళు కొనమని బలవంతం చేశాడు సోమయ్య.

చేసేదిలేక చిల్లర కోసం తన చేతి సంచిలో చెయ్యి పెట్టిన ప్రసూనాంబ, "అరెరే! నేను చిల్లర తేవడం మర్చిపోయాను! మళ్ళీ వస్తాను నాయనా", అంటూ కృష్ణానంద చెయ్యి పట్టుకుని గబగబా సోమయ్య దుకాణం నుండి బయటికొచ్చేసింది.

అక్కడినుండి కొంత దూరం నడిచాక రామయ్య దుకాణం వచ్చింది. రామయ్య పళ్ళ వ్యాపారంలో చాలా హడావుడిగా ఉన్నాడు. తన దుకాణానికి వచ్చిన వారివంక కన్నెత్తి చూసే సమయం కూడా అతని దగ్గర లేదు! ప్రసూనాంబ ఒక సంచి తీసుకుని కొన్ని మామిడిపళ్ళు ఏరి రామయ్యకి ఇచ్చి, తూకం వేశాక అతనికి డబ్బులిచ్చి ఆ పళ్ళను కొనేసింది.

అప్పుడు కృష్ణానంద ప్రసూనాంబతో, "బామ్మా! ఇందాక సోమయ్య, తను అమ్ముతున్న మామిడిపళ్ళు తియ్యగా ఉంటాయన్నాడుగా! పళ్ళు అతని దగ్గర తీసుకోకుండా, నిన్ను అస్సలు పట్టించుకోని ఈ రామయ్య దగ్గర ఎందుకు కొన్నావ్? ఈ మామిడిపళ్ళు పుల్లగా ఉంటే నేను తినను!", అన్నాడు.

"ఒరేయ్ ఆనందూ! ఈ మామిడిపళ్ళు కచ్చితంగా తియ్యగా ఉంటాయి. ఒకటి తిన్న తర్వాత ఎలా ఉందో నువ్వే చెప్పు!", అంటూ ఇంటికి వెళ్ళగానే పెరుగన్నంలో రామయ్య దగ్గర కొన్న ఒక మామిడిపండు రసం కలిపి కృష్ణానందకి ఇచ్చింది ప్రసూనాంబ.

కృష్ణానంద సందేహిస్తూ మొదటి ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. మామిడి పండు రుచి అద్భుతం! అది పంచదార పాకమంత తియ్యగా అనిపించింది కృష్ణానందకి.

"బామ్మా! మామిడి పండు భలే తియ్యగా ఉంది. సోమయ్య దుకాణంలో పళ్ళు ఇంతకన్నా తియ్యగా ఉంటాయేమో!”, అన్నాడు కృష్ణానంద.

ఆ సమయంలో అక్కడే ఉన్న మీనాక్షి, "కృష్ణా! ఇందాక నువ్వు బామ్మతో కలిసి బజారుకెళ్ళినప్పుడు మన ఎదురింటి కాత్యాయనిగారు వచ్చారు. ఆవిడ బోలెడు డబ్బులు ఖర్చు పెట్టి సోమయ్య దుకాణంలో మామిడిపళ్ళు కొన్నారట. అవి చాలా పుల్లగా ఉన్నాయని చెప్పి డబ్బులన్నీ వృధా అయిపోయాయని బాధపడ్డారు! ఆవిడలాగే మీరు కూడా సోమయ్య దుకాణంలో పళ్ళు కొని మోసపోతారేమోనని కాత్యాయనిగారు కాస్త కంగారు పడ్డారు. బామ్మకున్న అనుభవజ్ఞానంవల్ల మీరు మంచి మామిడిపళ్ళతో ఇంటికొచ్చారు", అంది.

అది విని, "నిజంగానా??!", అంటూ ఆశ్చర్యపోయిన కృష్ణానంద ప్రసూనాంబను, “బామ్మా! ఆ సోమయ్య అమ్ముతున్న పళ్ళకన్నా రామయ్య పళ్ళు తియ్యగా ఉన్నాయని నువ్వు ఎలా కనిపెట్టావ్?", అని అడిగాడు.

"ఒరేయ్ కృష్ణా! ఎప్పుడైనా తనకంటూ ప్రత్యేకతలేవీ లేనివాడు, అందరూ వాడిని ఏదో ఒక విధంగా గుర్తించి పొగడాలన్న తపనతో తన గురించి తానే లేనిపోని గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. నిజంగా తనలో గొప్పతనం ఉన్నవాడు, మౌనంగా ఉంటూ, వినయంతో తన పని తాను చేసుకుంటూపోతాడు. సోమయ్య, తను అమ్ముతున్న పళ్ళ గురించి మనకు చాలా గొప్పగా చెప్పాడు. అతడి దుకాణంలో పళ్ళను పరిశీలించినప్పుడు నాకు వాటి నాణ్యత అంత బాగున్నట్లుగా అనిపించలేదు. ఓ మాదిరి పళ్ళను సోమయ్య ఎక్కువ ధరకు అమ్ముతున్నాడని అర్ధమయ్యి ధర తగ్గించమని అడిగాను. అందుకు సోమయ్య ఒప్పుకోలేదు సరికదా తన గురించి మరిన్ని గొప్పలు చెప్పడం మొదలుపెట్టాడు! ఆ క్షణం నాకు సోమయ్య అమ్ముతున్న పళ్ళ రుచిపై కాస్త అనుమానం కలిగింది. రామయ్య నాణ్యత ఉన్న పళ్ళని పట్టుకొచ్చాడు. తన పళ్ళ గొప్పతనం గురించి సోమయ్యలాగా రామయ్య చెప్పకపోయినా అతడి దగ్గర పళ్ళు కొనేవారి మాటలను బట్టి ఆ పళ్ళు తియ్యగా ఉంటాయని గ్రహించాను. నా ఊహ నిజమైంది!", అంది ప్రసూనాంబ.

"ఓ అలాగా!! బామ్మా! దీనిబట్టి నాకు ఒక విషయం అర్ధమయ్యింది. ఏ విషయంలోనైనా సరైన నిర్ణయం తీసుకోవాలంటే అందుకు మనం కేవలం ఇతరులు చెప్పిన మాటలపైనే ఆధార పడకుండా, మన తెలివితేటలని కూడా ఉపయోగించాలన్నమాట! అంతేనా?", అని అడిగాడు కృష్ణానంద.

"అవునురా ఆనందం! విషయం సరిగ్గా అర్ధంచేసుకున్నావు", అని నవ్వుతూ అంది ప్రసూనాంబ.

“బామ్మా!  నాకు ఇంకొక మామిడి పండు కావాలి!", అన్నాడు కృష్ణానంద లొట్టలేస్తూ.

"ఇంద… తిను!", అంటూ కృష్ణానందకి మరొక తియ్య మామిడిపండును ప్రేమతో ఇచ్చింది ప్రసూనాంబ.

****సశేషం****

Posted in April 2023, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!