Menu Close
Vempati Hema photo
జీవనస్రవంతి (సాంఘిక నవల)
వెంపటి హేమ

"మీ నాన్నపోలిక రాబట్టి ఎర్రగా బుర్రగా, కాస్తంత అందంగా కనిపిస్తావు గాని - అంతకన్న ఎక్కువ నీలో ఏముందనిరా? నక్కెక్కడ, నాగ లోకమెక్కడ! ఆ అమ్మాయిని కన్నెత్తి చూసే తాహతు నీకుందనే అనుకుంటున్నావా ఏమిటి? ఎంత ధైర్యం నీకు" అంటూ దుయ్యబట్టేసరికి జీవన్కి కళ్ళు తెరిపినబడ్డట్టయ్యింది, తల్లి కోపానికి కారణమేందో తెలియడంతో...

ఆ అమ్మాయి అలా తనకు కాఫీ తెచ్చిపెట్టడమన్నది తప్పా? ఒకవేళ తప్పైనా, తనేమీ కాఫీ కావాలని అడగలేదు కదా! ఇక అది తన తప్పెలాగౌతుంది? ఎంత ఆలోచించినా తన తప్పేమిటో తెలియలేదు జీవన్ కి. ఆ తికమకలో నోరు రవంత తెరిచి ఆశ్చర్యంగా తల్లివైపు చూస్తూ ఉండిపోయాడు.

దాంతో మరింత కోపం తెచ్చుకుంది మీనాక్షి. "ఏమిట్రా ఆ చూపు! నంగనాచి, తుంగబుర్రలా - నోరెళ్ళబెట్టి మరీ చూస్తున్నావు? యాజులు గారు మనకు అన్నం పెట్టి, బ్రతుకుతెరువు చూపించిన మహానుభావుడురా! ఆయన కుటుంబానికి ద్రోహం తలపెడితే, మనకింక జన్మజన్మలకూ పుట్టగతు లుండవురా! కుక్కకుంటుందిరా విశ్వాసం" అంది కొడుకువైపు కౄరంగా చూస్తూ.

జీవన్ కి నోటమాట రాలేదు. యాజులు తాతగారికి తాను తలపెట్టిన ద్రోహమేమో అతడికి అంతుచిక్కలేదు. ఎంతో బలవంతం మీద నోరు పెకలించుకొని మాటాడాలని చూశాడు...

"ఎందుకమ్మా అంతలేసి మాటలు అంటున్నావు? తాతయ్యకు నేనేం ద్రోహం చేశానమ్మా! కనీసం అదైనా చెప్పి తిట్టమ్మా" అంటూ ప్రాధేయపడ్డాడు.

"నోరు మూసుకోరా అడ్డగాడిదా! ఏమీ ఎరగనట్లు కబుర్లు! పిల్లి కళ్ళు మూసుకుని పాలు త్రాగుతూ, తనని ఎవరూ చూడడంలేదనే అనుకుంటుందిట! ఇంక బుకాయించడం మానెయ్యి, నేను నా కళ్ళతో చూశా...  అసలు ఏం చూసుకునిరా నీకింత పొగరు? ఏదో ఒక ఉద్యోగం చేసుకుని, నాలుగురాళ్ళు సంపాదించుకోలేని దుర్దశలో ఉన్న నీకు ఆ పిల్లనిచ్చి పెళ్ళిచేస్తారని ఎలా అనుకున్నావురా! ఆశ అందలమెక్కాలని ఉంటె, రాత గాడిదలను కాయమందిట!”

హమ్మయ్య! ఇప్పటికి ఊడిపడింది అసలు కారణం! కాని జీవన్ కంగారుపడ్డాడు, "లేదమ్మా - లేదు, నాకలాంటి ఊహలేమీ లేవు" అన్నాడు. అదే నిజమైతే తన తల్లికి కోపం రావడం సమంజసమే, కాని తన స్థితి ఏమిటో తనకు తెలుసు. తనకలాంటి దురూహలేమీ లేవు కదా - అనుకున్నాడు జీవన్. ఆ విషయం తల్లిని సముదాయించి చెప్పడానికి నాందిగా తల్లి చేతులు రెండూ పట్టుకోవాలని చూశాడు, కానీ మీనాక్షి విదిలించేసింది.

"నన్ను క్షమించమ్మా! ఈ వేళే మొదటిసారి ఆ అమ్మాయి ముఖం నేను చూడడం జరిగింది. ఆ పిల్ల ఎవరో నాకు తెలియదు. నన్ను నమ్మమ్మా! నేనెవ్వరికీ ఏ అన్యాయమూ ... " అంటూ ప్రాధేయపడుతూ ఏదో చెప్పబోయాడు. కాని, మధ్యలోనే కొడుకుని మాట పూర్తి చెయ్యనీకుండా అడ్డొచ్చి మాటాడింది మీనాక్షి…

"చాల్లే! నీ అతి తెలివి మాటలు కట్టిపెట్టు. నేను చూడకపోతే ఇంకా ఇంకా వగలు పోదువు గాని, కాని, నేనంతా చూశా! నువ్వా అమ్మాయివైపు చూస్తూ ముసిముసిగా నవ్వడం నేను కనక చూడకపోయి ఉంటే..."

తల్లిమాటను మధ్యలోనే ఖండించాడు జీవన్, "ఓ అదా! నువ్వు చెప్పేది ఇప్పటికి నా మట్టి బుర్రకు అర్థమయ్యిందమ్మా! నిజం చెప్పాలంటే, ఆ పిల్లను చూసి కాదు, ఆ పిల్లన్న మాటలకు నాకు నవ్వొచ్చింది, సభ్యత కాదని, అక్కడకూ బలవంతంగా నవ్వు ఆపుకుకోవాలని ప్రయత్నించా, '1 - 4 - 3' అంటూ ఒక ..."

కొడుకుని మాట పూర్తిచెయ్యనియ్యలేదు మీనాక్షి, "1-4-3" ఏమిటిరా నీ బొంద! వెధవ కబుర్లు చెప్పి నన్ను మాయ చెయ్యాలని చూడకు. నన్ను బురిడీ కొట్టించడం నీ వల్ల కాదు. అంతా నా కర్మ! నా కడుపున చెడబుట్టావు కదురా! అసలు నువ్వు పుట్టకుండా ఉంటే నా బ్రతుకు వేరేగా ఉండేది. పుట్టి నా పుట్టి ముంచావు." బీపీ ప్రకోపించిందో ఏమో గాని, మీనాక్షి మాట తూలింది. కోపంలో తల్లన్న మాటకు ఉలిక్కిపడి చూశాడు జీవన్.

"అసలు ఈ విషయం కనక తెలిస్తే, యాజులుగారు మనల్నింక గుమ్మం తొక్కనిస్తారంటావా? ఇన్నాళ్ళూ కూడగట్టుకున్న మంచితనమంతా చిటికెలో మంటలో కలిసిపోదా! ఎంత అవమానం! ఐపోయింది ...  క్షణంలో అంతా ఐపోయింది" అంటూ కొంగు ముఖాన కప్పుకుని, నేలమీద చతికిలబడి కుమిలి కుమిలి ఏడవసాగింది మీనాక్షి.

ఖిన్నుడై, మ్రాన్పడిపోయాడు జీవన్. దుఃఖంతో, అవమానంతో అతని మనసు ఉడికిపోతోoది. "ఏ తప్పూ చెయ్యని తనకు ఇదేమి శిక్ష" అనుకున్నాడు దుఃఖంతో.

ఒకవేళ తెలిసో, తెలియకో తను తప్పుచేసినా కూడా గుండెలకు హత్తుకుని మరీ తన తప్పును సరిదిద్ది, నాలుగు ఓదార్పు మాటలు చెప్పవలసిన కన్నతల్లి - ఇలా తను చెయ్యని నేరానికి, కనీసం తన సంజాయిషీ కూడా సరిగా వినిపించుకోకుండా తనను తప్పుపడుతోంది - అనుకునేసరికి, అతనికి దుఃఖం పొంగి పొరలింది! ఇంకా అక్కడే నిలబడి తల్లిచేత మాటలు పడే శక్తి తనకింక లేదనిపించి, వెంటనే చెప్పులైనా తొడుక్కోకుండా ఇల్లు విడిచిపెట్టి బయటికి వచ్చేశాడు జీవన్.

* *  *

ఆకాశంలో మచ్చుకైనా ఒక్క మబ్బుతునకలేదు. ఎర్రని ఎండపడి, కాలినపెనంలా ఉంది రోడ్డు. చెప్పులజోడు లేనిదే ఆ రోడ్డుమీద నడవడమంటే, ఖణఖణలాడే నిప్పులగుండం తొక్కినట్లే! అదేకాక మనసులోని ఆరాటం లాగే, కడుపులోని ఆకలి కూడా దహించేస్తూండడంతో దగ్గరలోనే ఉన్న పార్కుకి వెళ్లి, అక్కడున్న కుళాయిదగ్గర కడుపునిండా నీళ్ళు తాగి, పెనవేసుకుని పెరిగిన రావి, వేప చెట్ల గుబురు క్రింద కట్టిన అరుగుమీద, ఆ చల్లని నీడలో కూర్చుండిపోయాడు జీవన్.

కాని చల్లని ఆ చెట్ల నీడ అతనికి సేదదీర్చిన సుఖాన్ని ఇవ్వలేకపోయింది. బయటి గాళుపుకన్నా వేడిగా మండుతోంది అతని మనసు. తల్లి అన్న మాటలు అతని హృదయంలో ప్రతిధ్వనించి, అతన్ని బాధ పెడుతున్నాయి. తనతల్లి క్రూరమైన చూపులు అతని మనసుపొరల్లో, తెరపై సినిమాలా ప్రత్యక్షంగా కనిపించి వెంటాడి వేధిస్తున్నాయి. అతని మనసు పరిపరి విధాలుగా దుఃఖిస్తోంది.

తనతల్లి చెప్పినదంతా నూటికీనూరుపాళ్ళూ నిజం! తానామె కడుపున చెడబుట్టిన వాడు, సందేహం లేదు. తను కడుపున పడ్డది మొదలు, ఆమెకు కష్టాలూ కన్నీళ్ళు మొదలయ్యాయి. తను పుట్టకముందే తండ్రిని పోగొట్టుకున్న అభాగ్యుడు! పుట్టిన కొద్దిరోజులకే అమ్మమ్మ కళ్ళుమూసింది. తనకింకా బాల్యం గడవకముందే తననెంతో ప్రేమించే తాతయ్యకూడా పరమపదించాడు. తండ్రి వైపు వాళ్ళు తననసలు పట్టించుకోలేదు. మామయ్య కుటుంబం తనను శతృవులా చూశారు. చివరకు తన తల్లే, తనకోసం తెగింపుగా ఇల్లు వదలివచ్చి యాజులుగారి ఇంట్లో వంటమనిషిగా చేరింది. ఆ తరవాత ఆమె తనను ఎంత శ్రమించి పెంచిందో తనకు తెలుసు. అలాంటప్పుడు అమ్మకి నచ్చని పని తనెందుకు చేస్తాడు! ఒక్కనాటికి చెయ్యడు. చెయ్యడు గాక చెయ్యడు! కానీ అమ్మ నమ్మటల్లేదే! తనను కని, పెంచి పెద్దచేసిన తన తల్లే, తన్ను శంకించిందంటే - ఇక తను ఒక దురదృష్ట జాతకుడనడానికి, సందేహంలేదు. రేపు యాజులు తాతయ్యగారు కూడా తననిలాగే అపార్ధం చేసుకుంటే - ఇంక తనకు నిజంగానే ఎంతమాత్రం పుట్టగతులుండవు, కనీసం తానీ అవమానాన్నుండెలాగైనా తప్పించుకోవాలి - అన్న ధృఢనిశ్చయానికి వచ్చాడు జీవన్. తానిది భరిస్తూ బ్రతకలేడు.

"నిజంగా నేనొక నష్టజాతకుడను! నాతోపాటు నా చుట్టూ ఉన్నవాళ్ళకు కూడా నా అరిష్టం చుట్టుకుంటుంది కాబోలు! నేను కనక పుట్టకపోయుంటే, నిజంగానే అమ్మ జీవితం ఇలా కాకుండా, మరోలా బాగుండేదేమో! తాతయ్య అమ్మకి పెళ్లిచేసి, కొత్త జీవితాన్నిచ్చి ఉండేవాడేమో!"

వల్లమాలిన అవమాన భారంవల్ల జీవన్ ఊహల్లోకి వెర్రిమొర్రి ఆలోచనలు పుట్టుకురావడం మొదలుపెట్టాయి. తన తల్లి జీవితంలో, తన పుట్టుకవల్ల జరిగిన తప్పును, కనీసం ఇప్పుడైనా ఏదో ఒక విధంగా సరిదిద్దాలన్న కఠోర నిర్ణయం తీసుకున్నాడు జీవన్.

*      *      *

అంత ఎండలోనూ, జీవన్ తిండైనా తినకుండా బయటకు వెళ్ళిపోగానే మీనాక్షిలోని తల్లిప్రాణం గిలగిల లాడింది, కానీ బింకంగా, ఆకలైతే వాడే వస్తాడు లెమ్మని మనసు సరిపెట్టుకోవాలని చూసింది. అయినా, ఆమెకు కొడుకు పక్కన లేకుండా తిండి తినాలనిపించలేదు. తను కూడా తిండి తినకుండా, కొడుకుకోసం ఎదురుచూస్తూ కూర్చుంది చాలాసేపు. ఎంతకీ జీవన్ తిరిగి రాలేదు. ఇక వేళవ్వడంతో, ఎక్కడివక్కడ వదలి, ఇంటికి తాళం వేసి 'స్వగృహా ఫుడ్సు' వాళ్ళ పని చెయ్యడం కోసం, భోజనం చెయ్యకుండానే వెళ్లిపోయింది మీనాక్షి. .

భగభగ మనే మిఠాయి పొయ్యిదగ్గర కూచోగానే, ఆ వేడి ముందు ఆమె మనసులో వేడి చప్పగా చల్లారిపోయిందో యేమో, కొడుకు అభోజనంతో ఉన్నాడన్న చింత బయలుదేరింది మీనాక్షి మనసులో. నెమ్మదిగా ఆమెలో కొడుకును ఘోరంగా తూలనాడినందుకు పశ్చాత్తాపం మొదలయ్యింది. జీవన్, తన దగ్గరున్న తాళంచెవితో తలుపు తెరుచుకుని, భోజనం వడ్డించుకుని తింటే బాగుండునని కోరుకుంది. కొడుకు అసలే ఆకలికి ఆగలేడన్నది గుర్తుకొచ్చి ఆమె లోలోన కొడుకును తలుచుకుని మధన పడడం మొదలుపెట్టింది .

తను భోజనం చెయ్యలేదన్న విషయం కన్నా జీవన్ భోజనం చెయ్యలేదన్న విషయమే ఎక్కువగా గుర్తువచ్చి బాధిస్తోంది మీనాక్షిని. కాని ఇంటికి వెళ్లి వచ్చే అవకాశం మాత్రం ఆమెకు దొరకలేదు. స్వగృహా ఫుడ్సుకి ఏదో ఒక స్పెషల్ ఆర్డర్ రావడంతో, ఆ రోజు ఎడతెగని పని అయ్యింది. ఆ మిఠాయిలు పూర్తయ్యేసరికి యాజులుగారి ఇంటి వంటవేళ దాటిపోవడంతో, చుట్టాలు కూడా ఉన్నారు, మాట రాకూడదని, ఆమె వెంటనే అటునుండి అటే తప్పనిసరిగా యాజులుగారి ఇంటికి వెళ్ళిపోయింది.

ఆ రాత్రి వంటంతా పరధ్యానంగానే చేసింది మీనాక్షి. మనసు ఎంత పీకుతూన్నా యాజులుగారి ఇంటి భోజనాలు, సద్దుబాట్లూ అన్నీ ఐతేగాని, ఇంటికి వెళ్ళీ వెసులుబాటు దొరకలేదు ఆమెకి. ఎంత తొందరపడినా, అన్నీ సర్దుకుని, తన ఇల్లు చేరేసరికి యధాప్రకారం తొమ్మిది అయ్యింది.

ఇంటికి వచ్చిన మీనాక్షికి ఎప్పటిలా జీవన్ ఎదురుగా వచ్చి పలుకరించి చేతిలో సామాను అందుకోలేదు. తలుపుకి వేసిన తాళం వేసినట్లుగానే ఉంది. తాళం తీసుకుని లోపలకు ప్రవేశించిన మీనాక్షికి గుండె గుభేలుమంది. మధ్యాహ్నం తాను ఎక్కడ వదలి వెళ్ళిన గిన్నెలు అక్కడనే ఉన్నాయి. జీవన్ భోజనం చేసిన జాడ ఏమాత్రమూ లేదు.

అలా జీవన్ భోజనానికి రాకుండా ఉన్నాడంటే, వెంటనే మీనాక్షికి కొడుకు క్షేమాన్ని గురించిన ఆదుర్దా మొదలయ్యింది, మనసు కీడును శంకించింది.

"ప్రాజ్ఞుడైన కొడుకుని తిట్టరాని తిట్లన్నీ తిట్టాను, ముందువెనుకలు పట్టించుకోకుండా అనరాని మాటలు అన్నాను! అన్నీ పడికూడా, ఎదిరించి నన్నొక్క మాటైనా అనలేదు వాడు. యాజులు గారి కుటుంబానికి  ద్రోహం చేశాడన్న ఉక్రోషంతో వున్నానేమో, వాడేం చెపుతున్నాడో కూడా విన్నపాపాన పోలేదు, నేనూ ఒక తల్లినేనా! అయ్యో" అనుకుంటూ, కన్నీరు పెట్టుకుంది మీనాక్షి. కొడుకుమీద సింపతీ పెరగడంతో, మీనాక్షికి తొలిసారిగా వచ్చింది ఈ ఆలోచన, "ఒకవేళ ఆ తింగరి పిల్లే చొరవ చేసిందేమో! వాడు నిజంగానే అలాంటి తప్పు ఏమీ చేసి ఉండకపోవచ్చు, అనవసరంగా వాడిని తూలనాడేనేమో!" అలా అనుకోగానే ఆమె దుఃఖం ఇనుమడించింది. కొడుకు రాకకోసం మరింతగా ఎదురు చూడడం మొదలుపెట్టింది ఆమె.

పొద్దుట తెచ్చిన భోజన పదార్ధాలను తొలగించి, ఇప్పుడు తాను తెచ్చిన పదార్ధాలను ఒకవారగా, వడ్డనకు సిద్ధంగా ఉంచింది, జీవన్ రాగానే వడ్డించడానికి వీలుగా! తనకు, ఏకాదశనీ, శివరాత్రనీ ఏదో వంకన ఉపవాసాలు చెయ్యడం అలవాటే, కాని జీవన్ ఆకలికి ఆగలేడు. అలాంటిది, భోజనానికి వచ్చిన వాడిని తిండి తిననీకుండా తనే తిట్టి తిట్టి తరిమివేసింది - అన్నది తలుచుకుని తలుచుకుని దుఃఖపడింది మీనాక్షి. ఇక చేసేదేమీ లేక వీధి గుమ్మం తెరుచుకుని, కొడుకు రాకకోసం ఎదురు చూస్తూ, చీమ చిటుక్కుమన్నా కొడుకు వచ్చాడనే అనుకుంటూ, నిద్రాహారాలు మాని గుమ్మంలో ఎదురుతెన్నులు చూస్తూ కూర్చుండిపోయింది మీనాక్షి.

అలా కొడుకు రాకకోసం ఎదురు చూస్తూ కూర్చుందన్న మాటేగాని, రకరకాల ఆలోచనలు ఆమె మెదడును నమిలి తింటున్నాయి. ప్రేమ ఉన్నవారు తిట్టినట్లు పగవారు కూడా తిట్టలేరు - అంటారు! అలాగే చాలా చాలా చెడ్డ ఆలోచనలు ఆమె మనసులోకి వస్తున్నాయి. మనసు చెదిరి పరిపరి విధాలుగా ఆలోచిస్తోంది ఆమె. ఏ చిన్న అలికిడైనా, ఉలికిపడి, జీవన్ వచ్చేశాడనే ఆశతో ఆ అలికిడి ఐన వైపుగా కళ్ళు విశాలం చేసుకుని చూస్తోంది. ఆలస్యమైన కొద్దీ ఆమె ఆరాటం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతోంది.

ఊరంతా సద్దుమణిగింది. జనం గాఢనిద్రలో ఉంన్నారు. పక్కింటి గడియారం పన్నెండు కొట్టింది. ఆ గంటల శబ్దం వింటున్న మీనాక్షికి, అవి ఎవరో తన గుండెపై సమ్మెటతో కొడుతున్న దెబ్బలులా అనిపించింది. పరిపరివిధాలుగా ఆమెకు కొడుకు క్షేమాన్ని గురించిన చెడ్డ ఆలోచనలు పుంఖానుపుంఖాలుగా వస్తున్నాయి...

"రెండవ ఆట సినిమా విడిచాక వచ్చిన జనం కూడా సద్దుమణిగి పోయారు. చిత్రంగా ఉంది! జీవన్ ఇంత రాత్రి వరకూ ఎప్పుడూ ఇంటికి రాకుండా ఉన్నది లేదు. కొంపదీసి ఏ అఘాయిత్యమైనా తలపెట్టలేదు కదా !" ఆ ఆలోచన రాగానే మీనాక్షి గుండెలు వేగంగా కొట్టుకోడం మొదలుపెట్టాయి. అర్ధరాత్రి వేళ ఏం చెయ్యడానికీ లేక అసహాయంగా బాధపడుతూ, జీవన్ వచ్చే దారివైపు చూస్తూ ఉండిపోయింది ఆమె.

కొడుకు రాకకోసం, కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుతెన్నులు చూస్తున్న మీనాక్షికి గడచిన జీవితo కళ్ళకు కట్టినట్లయింది.

"పాపాత్మురాలిని, ఎంతపని చేశాను! నా ప్రాణానికి ప్రాణం, నా జీవితసర్వస్వమైన నా బంగారు తండ్రిని ఒళ్ళు తెలియని శివమ్ వచ్చి, ఏదో దుష్టశక్తి ఆవహించిన దానిలా ఎన్నెన్నిమాటలన్నాను! వీడికోసమే కాదా నేను తెగింపుగా ఇల్లు విడిచి వచ్చినది! వీడి కోసం కాదా, నేను పగలూ రాత్రీ విశ్రాంతి అన్నది లేకుండా కష్టపడేది! వీడే కనుక లేకపోతే నా బ్రతుక్కింక అర్థమేముంటుంది?" అలా గతం తలుపుకి వచ్చి గుండెల్ని పిండేస్తూoడడంతో ఆమె కింక కన్నీరు ఆగలేదు. కన్నీటి వెల్లువలో కరిగిపోయిన గతం మళ్ళీ కళ్ళకు కట్టింది.

****సశేషం****

Posted in October 2022, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!