ఇన్నినాళ్ళు
ఇన్నినాళ్ళు ఏమయ్యావో మామ
దూరాలు పొడుచుకుని కాలాలు మారిపోయాయి.
నీవులేని క్షణాల్ని దోసిట్లో ఒంపుకుని
గొంతు తడబడుతోంది.
ఉన్నఫళంగా ఊరు వలస పోతుంటే
నిశ్శబ్దాలు రాలుతున్నాయి.
మనసులు మూగబోతున్నాయి.
నువ్వుకావాలని పిల్లలు మారం చేస్తున్నారు.
బతుకుమాటు బాధల్ని వివరించలేక
కన్నీరుగా వేలాడుతున్నాను.
అర్ధం కాని భాషలా
పొడిపొడిగా రాలుతున్నాను.
ఇంటి నిండా ఖాళీ ప్రపంచం నెలకొనివుంది.
అలలా నీ వొచ్చి పోయినపుడు
ఇచ్చిన జ్ఞాపకాల్ని మరలా మరలా
ఒంపుకుంటూ
ఈ కాలాన్ని ఈదుతున్నాను.
గాయం చేసిన కాలాన్ని నిందించలేను
ఉపాధి లేని ఊరుని దోషిగా నిలబెట్టలేను.
కారణాల వెతుకులాటలో
వేలాడే కాలాన్ని ప్రశ్నిస్తున్నాను.