సాంఘిక జన జీవన నాగరికత ఏర్పడినప్పటి నుండి మనిషి తన అభ్యున్నతికై స్వార్థచింతనతో సామాజిక అసమానతలను సృష్టించి వాటిని పెంచి పోషిస్తూ అగ్రవర్ణాలు, నిమ్నజాతులు అనే వివక్షతను సంఘంలోని కొన్ని వర్గాలకు అనుగుణంగా మలుచుకొని తద్వారా ఎంతో ఉన్నత స్థితికి చేరుకొన్నారు. దాని పర్యవసానం సమాజంలోని బడుగువర్గ ప్రజలు ఎటువంటి అభివృద్ధిని, సమాజ స్థాయిని చేరుకోలేక ఎన్నో అసమానతల అవమానాలతో తమ జీవితాలను గడిపేవారు. అటువంటి వారి పట్ల సానుభూతిని కలిగి, సమాజంలో ఏర్పడిన అసమానతనలు తొలగించేందుకు, ఆ వర్ణ వివక్షను రూపుమాపి మనుషులందరూ ఒక్కటే అని నిరూపించేందుకు ఎంతోమంది మహానుభావులు తమ వంతు బాధ్యతతో కృషి సల్పారు. తమ రచనల ద్వారా అభ్యుదయవాదాన్ని వినిపిస్తూ ప్రజలలో సమసమాజ చైతన్యస్ఫూర్తిని నింపేందుకు అలుపెరుగక శ్రమించారు. ఆ అసమానతల దాష్టికాలను స్వయంగా అనుభవించి తద్వారా ఎంతో మానసిక క్షోభను పొంది ఆ స్వానుభవంతో, సమసమాజ నిర్మాణ అవరోధాలను అధికమించి, తన అనుభవపూర్వక ఆలోచనల స్రవంతికి అక్షరరూపం కల్పించి, తన అభ్యుదయ రచనల ద్వారా ఎంతోమందికి చైతన్య స్ఫూర్తిగా నిలిచి తను కలలుగన్న ఆ నవసమాజ స్థాపనకై పాటుపడిన మహోన్నత వ్యక్తి, పద్మభూషణ్ డా. గుర్రం జాషువా, నేటి మన ఆదర్శమూర్తి.
సెప్టెంబరు 28, 1895 వ సంవత్సరంలో గుంటూరు జిల్లాలోని వినుకొండలో మన జాషువా గారు జన్మించారు. బాల్యంలోనే జీవితం అంటే ఆటుపోటుల ఆలంబనమే అని అర్థం చేసుకొన్నాడు. అందుకు కారణం, తను పెరిగిన వాతావరణంలో జరుగుతున్న సామాజిక అసమానతల అర్థంలేని మూఢనమ్మకాలు, ఆచారాలు. ప్రతి మనిషిలో ప్రవహించేది ఒకటే రక్తమైనప్పుడు ఈ వివక్షలు ఎందుకు అని తనను తాను ప్రశ్నించుకుంటూ తనలాంటి వారికి జరుగుతున్న అవమానాలను, ఛీత్కారాలను భరిస్తూ, తను అనుభవిస్తున్న పేదరికం, కులమతభేధాలనే తన గురువులుగా మలుచుకొని సాహిత్యాన్ని వినిపించడం మొదలుపెట్టారు. అదే ఆయనను ఆ తరువాత ఉపాధ్యాయ శిక్షణాలయంలో ఉపాధ్యాయుడిగా, ఉన్నత పాఠశాలలో తెలుగు పండితుడిగా, ఆకాశవాణిలో కార్యక్రమ నిర్వాహకుడిగా బ్రతుకుతెరువుని కొనసాగేటట్లు చేసింది. తన అక్షర మాలతో నిజాన్ని నిర్భయంగా చెప్పి అన్యాయాన్ని ధైర్యంగా ఎందుర్కొనే బలాన్నిచ్చింది.
సమాజంలో ప్రతి మనిషికి జన్మించిన తరువాత తన అభీష్టానికి అనుగుణంగా తన జీవితాన్ని మలుచుకుని అభివృద్ధి పథంలో సాగేందుకు ఎన్నో అవకాశాలు, హక్కులు ఉన్నాయి. కానీ సంఘంలోని స్వార్థపూరిత వ్యక్తుల మత ఛాందస సిధ్ధాంతాల వల్ల ఆ అవకాశాలు లభించక తమ కనీస హక్కులను కూడా కోల్పోయి సమాజంలో ఎటువంటి గుర్తింపు నోచుకొనక అత్యంత దీనమైన స్థితిలో తమ మనుగడ సాగించిన దీనుల గాథలు, ఘట్టాలు చరిత్రలో మనకు కోకొల్లలు. అటువంటి దయనీయమైన స్థితిగతులను ఎత్తిచూపుతూ, జీవన సమతుల్యం సాధించేందుకు ఉన్న వనరులను వివరించే రచనలు ఎన్నో వచ్చాయి. అవి భావకవిత్వ ఒరవడి నుండి విడివడి సామాన్యునికి కూడా అర్థమయ్యే పదభాషలో ఉండటం ఒక గొప్ప వరమైంది. అటువంటి సమసమాజ ప్రయోజనం ఆశించి రచనలు చేసిన వారిలో గుర్రం జాషువా ప్రథముడు. నాడు సమాజాన్ని పీడిస్తున్న మూఢాచారాలు, వర్ణవివక్ష అంశాలుగా ఎన్నో రచనలు చేశారు.
ప్రపంచంలోని ఏ జీవరాశికి లేని వర్ణ వివక్ష మనుషులకు మాత్రమే ఎందుకుంది. భగవంతుని దృష్టిలో అందరూ సమానమే అయినప్పుడు నిమ్నజాతి వారికి ఆలయాలలో ప్రవేశం ఎందుకు ఉండదు. తన మొరను వినమని దేవాలయ ప్రాంగణంలోనే నివసించే గబ్బిలం ద్వారా సందేశాన్ని పంపిస్తూ వ్రాసిన ‘గబ్బిలం’ పద్య ఖండిక ఎంతో ప్రాచుర్యాన్ని పొందింది. ఎన్నో గ్రంథాలను, మరెన్నో కవితా ఖండికలను సందర్భానుసారంగా ఆయన రచించారు. వాటిలో ఎంతో ప్రాచుర్యం పొందినవి కూడా ఉన్నాయి. ఆయన రచనలే సాహిత్య ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక ఉనికిని స్థిరపరిచాయి. అనేక పురస్కారాలతో పాటు, పద్మభూషణ్ గౌరవం కూడా దక్కేలా చేశాయి.
"వడగాల్పు--నా జీవితమైతే, వెన్నెల--నా కవిత్వం" అని శ్రీ జాషువా గారు తన గురించి తన రచనలలో ఉటంకించారు. నాటి సామాజిక అంశాలైన పేదరికం, వర్ణ వివక్షే తనకు రచనకు స్ఫూర్తి గా ఎంచుకుని అందులోని లోటుపాట్లను, సాంఘిక తిరోగమన అంశాలను ఎత్తిచూపుతూ సహనం మరియు మూఢాచారాలను ఎదుర్కునే ధైర్యం ఆయుధాలుగా, కత్తి కన్నా కలం గొప్పది అనే సిద్ధాంతాన్ని నమ్మి తన రచనల ద్వారా సంఘంలో ఒక చైతన్యాన్ని తెచ్చేందుకు, తద్వారా ఏర్పడే సమాజ శ్రేయస్సుకై తన వంతు కృషిని కొనసాగించారు. ఆయన పుట్టుకకు ఒక సార్థకత చేకూరి ఆయనను ఆదర్శమూర్తి గా నిలబెట్టింది. తెలుగు సాహిత్య రంగంలో అభ్యుదయ నవయుగ వైతాళికుడై, కవికోకిల, కవి దిగ్గజ - నవయుగ కవిచక్రవర్తి, కవితా విశారద, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్ ఇలా ఎన్నో బిరుదులతో, సాహితీ చరిత్రలో తనదైన ముద్రను, ఉనికిని జాషువా గారు సాధించారు. సమసమాజ నిర్మాణానికి ముఖ్యంగా బడుగువర్గాల అభ్యున్నతికి, పేదరిక నిర్మూలనకు తన అక్షర ఆయుధంతో పోరాడి, అలసి 1971 జూలై 24 న తన 75 వ ఏట పరమపదించారు. కానీ ఆయన కృషితో సమాజంలో వచ్చిన మార్పు నిజంగా అభినందనీయము.
విలువైన వ్యాసం.