రాజశేఖర్ ది పీలేరు. అతనికి ముష్టూరునించీ ఒక పెళ్ళి సంబంధం వచ్చింది. అమ్మాయిని చూడ్డానికి మాధవ్ ని తోడుగా రమ్మన్నాడు.
ఇద్దరూ బుల్లెట్ వేసుకుని బయలుదేరారు. పీలేరు నించీ మహల్, కత్తివారిపల్లె, ఎర్రకోట పల్లెల మీదుగా అడ్డదారిలో ముష్టూరు చేరడానికి అరగంట పట్టింది. పెళ్ళికూతురి ఇంట్లో అందరూ వారికోసమే ఎదురుచూస్తున్నారు. అందుకే వాళ్ళని చూడగానే ఎక్కడలేని హడావిడి మొదలైపోయింది.
ఆ అమ్మాయి అన్నగారు ఎదురొచ్చి ఇద్దరికీ కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చాడు. కడుక్కుని వచ్చేసరికి తుడుచుకోవడానికి తువ్వాలిచ్చాడు. సాదరంగా లోపలికి ఆహ్వానించాడు. ఇద్దర్నీ కూర్చోబెట్టాడు. అంతలోనే అమ్మాయి తల్లి వచ్చి తనని తాను పరిచయం చేసుకుంది. వాళ్ళిద్దరినీ కూర్చోబెట్టింది. తను కూడా ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది, "మ్మేయ్, అమ్మిని తోడుకొని రాండి" అంటూ హుకుం జారీ చేసింది.
గడపదాటి లోపలకి రావడానికి సిగ్గుపడుతున్న అమ్మాయిని పొదివి పట్టుకుని తీసుకువచ్చిందొక ముత్తైదువ. ఎదురుగా పరిచిన చాపమీద కూర్చోబెట్టి తను కూడా పక్కనే కూర్చుంది.
అబ్బాయి తరఫున మాధవ్ ఆ అమ్మాయిని అడిగాడు, "మీ పేరేమిటమ్మా?"
"మంజుల"
"ఏం చదువుకున్నారు?"
"మా అమ్మ చెప్పిందిగా?"
అంతలోనే రాజశేఖర్ కల్పించుకున్నాడు, "చెప్పాల్సింది అమ్మ కాదు, నువ్వు"
"సెవెన్త్ పాస్."
"ఎక్కడ?"
"జడ్పీ హై స్కూల్లో"
"అదే, ఏ వూర్లో?"
"ఈ ముష్టూర్లోనే"
"పరవాలేదు మాటలు సుమారుగానే వస్తాండాయి. పాటలు కూడా ఇదే మాదిరి జోరుగా వస్తాయా ?"
"...."
"పరవాలేదు పాడు"
అతను ఆ అమ్మాయిని మరీ బలవంత పెడుతూంటే వాళ్ళమ్మ కల్పించుకుంటూ, "ఏదో నాలుగు నాట్ల పాటలు వస్తాయిలే నాయినా ఇబ్బుడు పాడితే మరేదుండదు. దానికే ఎనక్కి తగ్గుతా వుంది" అంది.
కానీ రాజశేఖర్ మాత్రం తగ్గదలచుకున్నట్లు లేడు. అందుకే ఏకంగా వరస కలిపేస్తూ, "పాడేది రావాల్నే గానీ ఏ పాటలైతే ఏంది. పాడమనత్తా" అన్నాడు.
మంజులకి మండినట్లుంది. అందుకే, "టీవీలో ఏపిచ్చేట్లుగా ఉంటే చెప్పు పాడతా" అంది.
ఇంతలావు పాటకత్తె వచ్చిందని టీవీలోళ్ళు కాసుకుని కూర్చున్నారా అనుకున్నాడు రాజశేఖర్. కానీ పైకి మాత్రం "టీవీలో ఏపించేది నానించీ కాదుగానీ నీకు కుట్లు అల్లికలు ముగ్గులు ఇట్లాంటివైనా వచ్చా?"
మంజుల తల పైకెత్తి చూసింది. ఆ చూపుల్లో, ఏం నాకు రాకపోతే నువ్వు పెడతావా ముగ్గులు? అనే ప్రశ్నవుంది.
ఆ తరవాత లేచి వెళ్ళి మంచినీళ్లు తెచ్చిపెట్టమన్నాడు.
ఆమె నీళ్ళు తేవడానికి వెళ్తూంటే మాధవ్ తో రహస్యంగా, "సరింగా సూడు, కాళ్ళేడైనా కుంటతా ఉందేమో" అన్నాడు.
అతను చెప్పిందేమిటో అర్థం కాక మాధవ్ అయోమయంగా చూస్తూ కూర్చున్నాడు. రాజశేఖర్ చెప్పింది మాధవ్ కి అర్థం కాలేదేమోగానీ మంజుల అన్నగారికి మాత్రం బాగా అర్థం అయింది. అందుకే రాజశేఖర్ మాట చెవిన పడగానే అతనికి ఒళ్ళు మండింది. ఈ రోజుల్లో కూడా ఇలా పెళ్ళి చూపుల్లో పరీక్షలు పెట్టే పరిగలనాయాండ్లు ఉంటారా అని ఆశ్చర్యపోయాడతను. వెంటనే రాజశేఖర్ని లేచి పొమ్మని చెబుదామనిపించిందతనికి. అయినా చెల్లెల్ని చూడ్డానికి వచ్చినవాడిని అవమానించి పంపించడం మర్యాద కాదని తమాయించుకున్నాడు.
మంజుల తెచ్చిన నీళ్ళు తాగాడు రాజశేఖర్. ఆ తరువాత ఆమెని వెళ్ళి కూర్చోమన్నాడు. మాధవ్ వైపుకు తిరిగి "ఏమైనా అడుగుతావా" అన్నాడు. మాధవ్ కి ఏం అడగాలో పాలుపోక తన కుర్చీలో ఇబ్బందిగా కదిలాడు.
రాజశేఖర్ అత్తవైపు తిరిగి, "అత్తా కడపటిగా ఓ మాటడుగుతా. కోపం చేసుకోగాకు. నీ కూతురి జడ బో జంపుగా ఉంది. సొంతం జడేనా లేక సవరం పెట్టించినావా? ఈ నడుమ ఇంత పొడుగు జడలు ఎవరు పెంచుకుంటాండార్లే. దానికే అడిగినా" అన్నాడు.
ఈసారి మంజులగానీ వాళ్ళమ్మగానీ మాట్లాడలేదు. వాళ్ళన్నయ్య మాట్లాడాడు, "నాగ్గూడా ఒక అనుమానం వస్తాంది. బైట బూట్లిప్పినావుగానీ సాక్సులు ఇప్పలా. నీకు ఎడంకాలికి రెండు వేళ్ళు లేవంట ఏదీ సూపియ్యి" అన్నాడు.
దాంతో రాజశేఖర్ ముఖంలో కత్తివేటుకి నెత్తుటి చుక్క మిగల్లేదు. అయినా తను మగాడు. అంత సులభంగా లొంగిపోతే తన మగతనానికే అవమానం. అందుకే, "చూపులకి రమ్మని ఇట్లా అవమానించేది మర్యాద కాదు" అన్నాడు.
"అవులే.., చూపులకొచ్చి జెడ ఇప్పి చూపించమనేది మంచి మరేదే గానీ లేచి ఎలబారు. నువ్వు కాంపౌండరే కాదు. డాక్టర్ అమ్మామొగుడివైనా మాయమ్మిని నీకిచ్చేదిలేదు" అంటూ బైటికి దారిచూపించాడు.
బతుకు జీవుడా అంటూ ఆ నీచ నికృష్ట సన్నివేశాన్నించీ బైట పడ్డాడు మాధవ్. కానీ రాజశేఖర్ కాలికి రెండువేళ్ళు లేవనే విషయం ఇంత జిగ్రీదోస్తు తనకే తెలియదు. మరా మంజుల అన్నగారికెలా తెలిసిందబ్బా అన్నది మాధవ్ కి అంతు పట్టని రహస్యంగా మారి అతని మెదడుని తొలిచేస్తోంది.
మీకు తెలిస్తే చెప్పి పుణ్యం కట్టుకోండి.
***
ఈ రోజుల్లో కూడా పెళ్ళిచూపుల్లో ఇంత దారుణంగా ప్రవర్తించేవాళ్ళుండటం, అలాంటి వాడితో కలిసి తను పెళ్ళిచూపుల్లో పాల్గొనడం మాధవ్ కల్లో కూడా ఊహించలేని నిజం. ఆ తరవాత కూడా రాజశేఖర్ రెండుమూడుసార్లు పెళ్ళి చూపులకి రమ్మని పిలిచాడుగానీ మాధవ్ కి మాత్రం ధైర్యం చాల్లేదు. అందుకే ప్రాణం పోయినా రానని ఖచ్చితంగా చెప్పేశాడు.
***
ఎవరికి తప్పిన నాకు తప్పదుగా. ఆ రాజశేఖర్ గాడికి శతపెళ్ళిచూపులోత్సవం జరిగి ఆర్నెల్లు దాటింది. ఇంక లాభం లేదని వరలక్ష్మీవ్రతం సందర్బంగా ఇందాకే ఓ కొత్త సంబంధం చూసి సెట్ చేసాను. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో తెలుసా? వాడు ఫస్ట్ రిజెక్ట్ చేసిన అమ్మాయే. ముదుర్స్ ప్లస్ ముదుర్స్ ఈజ్ ఈక్వల్ టు అదుర్స్. కాబట్టీ వచ్చే నెల ఐదోతారీకునే పెళ్లి. మీరు వస్తానంటే మీకూ శుభలేఖ పంపిస్తా. బంధుమిత్ర సపరివారంగా వచ్చేయండి.
*హెచ్చరిక: కరోనా పోలీసులున్నారు జాగ్రత్త.*
డాబా మీద కుర్చీలో కూర్చుని పుస్తకం చదువు కుంటున్నారు పార్థసారథి గారు. పుస్తకం లోని అక్షరాలు మసక బారినట్లనిపించాయి. తలెత్తి చూశారు సందె వెలుగు సన్నగిల్లుతోంది. పుస్తకాన్ని, కళ్ళద్దాలను తీసి ప్రక్కన పెట్టేసి....లేచి పచార్లు చేయసాగారు.
క్రిందినుండి పైకి పాకుతూ వచ్చి, పైన డాబా పిట్ట గోడను దట్టంగా అల్లుకుంది సన్నజాజి తీగ. వీడీ వీడని మొగ్గలతో చెట్టు నిండుగా కనుల పండువగా ఉంది. వాటి పరిమళాలతో, పరిసరాలను గుభాళింప చేస్తున్నాయ్! దగ్గరగా వెళ్లి, ఆ మొగ్గలను చేతితో సున్నితంగా స్పృశిస్తూ... తల వంచి, ఆ సువాసనను గుండెల నిండుగా పీల్చుకున్నారు, ఆయన.
తల పై కెత్తి...తనలో తాననుకున్నారు.
"పిచ్చిమొహంది...పిచ్చిమొహందని...ఇన్ని పూలను ఇలా వదిలేసే బదులు. ఎంచక్కా కోసుకుని, నెరిసీ, నెరవని..తన జడ ముడిలో పెట్టుకోవచ్చుగా? మెట్లెక్కటానికి మోకాళ్ళ నెప్పయితే నన్ను అడగొచ్చు కదా, కోయమని?
ఉహూఁ... పెట్టుకోదు. పెట్టుకుంటే, తన అందాన్ని చూసి, నేను బాగుపడి పోనూ? అలాంటి నయనానందం నాకు, దక్కితే.. తనకెంత నష్టం? దీని పంతం తగలెయ్య!!" పార్థసారథి గారికి, వారం క్రితం, తనకు, భార్యకు జరిగిన గొడవ గుర్తొచ్చింది...
ఆ రోజు.....
ఆ రోజు పార్థసారథి బజారు నుండి ఇంటికొచ్చేసరికి భార్య వసుంధర బైట గేటు దగ్గరే నిలబడి ఎదురింట్లో అద్దె కుంటున్న గోపాలంతో మాట్లాడుతోంది.
'ఆయన ఇక్కడి కెందుకొచ్చాడు? వసూకి, ఆయనతో మాటలేంటి?’ అనుకున్నారు మనస్సులో..
ఆ గోపాలం కొన్నాళ్ల క్రితం ఎదురింట్లో కి అద్దెకు వచ్చాడు. ఎక్కడో ఏదో వెలగ బెడుతున్నాడట. ఒంటరిగా ఉంటున్నాడు. వాళ్ళు వీళ్ళ ద్వారా విన్నదాన్ని బట్టి పార్థసారథి గారికి గోపాలం మీద సదభిప్రాయం లేదు.
"ఏమండీ సారధి గారు..బాగున్నారా" గోపాలమే ముందు పలకరించాడు.
"ఆ...ఆ..." అంటూనే, ఆగకుండా లోపలికి నడిచారు పార్థసారథి.
"సరేనండీ గోపాలం గారు, ఏదైనా అవసరమనుకుంటే పనిపిల్లను పంపండి" అంటుంది వసుంధర.
"థాంక్స్ వసుంధర గారు" అంటూ, గోపాలం వెళ్లిపోతున్నట్లు, భార్య తన వెనుకే లోపలికి వస్తున్న
ట్లు..అర్ధమైనది ఆయనకు.
లోపలికి వచ్చి కాళ్ళుకడుక్కొని కూర్చున్న భర్తకు "టీ" ఇవ్వటానికి వచ్చింది వసుంధర.
"ఏంటటా...గోపాలం గోడు?" 'టీ' కప్పు అందుకుంటూ అడిగారు.
"వాళ్ళ పని మనిషికి జ్వరం అట, మనకి చేసే రావమ్మ రెండు రోజులు చేసి పెడుతుందేమోనని వచ్చారు"
"నువ్వు నా ఈడు వాడిని పట్టుకుని 'గోపాలం గారు' అనక పోతే...
"అన్నయ్య గారు" అనొచ్చుగా?"
"అందరిని అన్నయ్యా, అని పిలవకపోతే కొంపలేమైన, మునుగుతాయా"
"నేనన్నదేమిటి....నీవనేదేమిటి?"
"మీరనేది ...బాగానే అర్ధమౌతుంది, మాటలు మార్చినా, మొఖం తెల్సిపోతూనే ఉంది... ఇవాళ, నిన్న...ముప్పై ఏళ్ల పైనుంచి చూస్తూనే ఉన్నాగా?"
"ఒక్క వాక్యం అంటే..వ్యాసమంత చెప్తావ్...అందుకే...నిన్నా దిక్కుమాలిన సీరియల్స్ చూడొద్దు
అనేది."
"చూస్తే మీకేమిటి నష్టం? వండి పెట్టటం లేదా? సకల సేవలూ చేస్తూనే ఉన్నాగా, ఇప్పటికీ....?"
"ఛ...ఏది మాట్లాడినా..పెడర్ధమే..నవ్వు, సరసం తెలియదు.. "
"నిజమే నాకు అవి తెలిస్తే మీతో తిట్లు తింటూ, ఇంట్లో ఎందుకు పడి ఉంటాను? వచ్చేపోయే వాళ్ళతో సరసాలాడుతూ వాకిట్లో కూచునేదాన్ని."
"నాతో ఆట్టమే.. చేతకాని దానివి, ఊరోళ్లతో ఏం ఆడతావ్ లే..." నవ్వారు పార్థసారథి.
భర్త నవ్వు ఆమెను మరింత రెచ్చగొట్టింది.
"మీకు తెల్సినంత, నాకు తెలిస్తే...కొంప కొట్టుకు పోయేది...అవ్వ...నిన్నటికి నిన్న...ఆ, విమలను
ఏం అడిగారు?"
"ఏం అడిగాను?"
"అసలు అడిగే మాటేనా అది?"
"నేనేం అడిగానే...ఎవరన్నా వింటే ఇంకేదో అనుకుంటారు ..."
"సిగ్గూ శరం లేకపోతే సరి.. ఛీ.. ఛీ"
"నువ్వా 'ఛా' గుణింతం ఆపి, చెప్పేడువ్...నువ్వనుకుంటున్నావా, ఆమెమన్నా చెప్పిందా"?
"నా చెవులారా విన్నాను."
"ఏమని? నాకసలు గాభరాగా ఉంది...ఏవో...అభాండపు బండలు సిద్ధం చేసుకుని కూచున్నట్లున్నావ్"
"ఆ..నాకదే పని..నిన్న మీరు వాకిట్లో కూచున్నపుడు విమల మీ ముందుగా వెళుతూ, పలకరించిందా?" నిలదీసిందామె.
"పలకరించింది...అంతేగా!"
"అంతే కాదు...అపుడు మీరేం అడిగారామెను?"
"నాకు, బి.పి. పెరుగుతూంది.. గుర్తులేదు..తొరగా చెప్పేడువ్"
"మరదలా...మళ్లీ ఏమైనా 'నెల' తప్పావా?" అని అడగలేదూ?"
"హో..సి, నీ అమ్మా కడుపు బంగారం గానూ..అదా? ఏదో..మరదలు కదాని..సరదాగా సరసమాడాను,.. అది కూడా..నేనేమైనా ప్రక్కకు పిల్సుకెళ్ళి అడిగానా...నీ ముందేగా? అయినా, పల్లెటూళ్లలో ఇలాంటి మాటలు మామూలే."
"అయితే మాత్రం..ఆమెకు నెల తప్పితే మీకెందుకు, సంవత్సరం తప్పితే..మీకెందుకు...మీ కవసరమా చింత చచ్చినా పులుపు చావలేదని, రేపో మాపో అరవైలో పడతారు, బట్టతల బైట పడినా..."
"పిచ్చి పిచ్చిగా వాగకు... ఇదివరకు నీకింత నోరు లేదు...ఉండసలు...ఆ టి.వి. బ్రద్దలు కొట్టేస్తే గాని, నీకీ వింతరోగం తగ్గేలా లేదు."
"బద్దలు కొట్టపోతే..బూడిద చేయండి...నేను కూడా వాకిట్లో...."
"ఛస్...ఆగు...చిరాకు తెప్పిస్తున్నావ్ ..నీకింత నోరు లేస్తోందేమిటీ మధ్య? 'ఉస్కో..అంటే..'ఇస్కో.. ఇస్కో.' అంటున్నావ్ ?"
"పెళ్లయిన ముప్పైఏళ్లకు పైగా మూసుకుని, మూసుకుని బతుకుతూనే వున్నాను. ఇంకెప్పుడు చచ్చాక తెరవనా నోరు?'
"ఆపింక... వయస్సు వద్దంటుంది...లేకపోతే చెంపలు పగిలిపోయేవి."
"అయ్యో..ఆ ముచ్చట కూడా చాలాసార్లు తీర్చుకున్నారుగా?
"ఛీ.. ఛీ.” గొణుక్కుంటూ లేచి బైటకు వెళ్లిపోయారు పార్థసారథి.
****
ఆ రాత్రి ఆయన బైట నుండి భోజనం పార్సిల్ తెచ్చుకుని, తిన్నారు. వసుంధర వంట చేసి, ఆయన బైట నుండి తెచ్చుకున్న పార్సిల్ తిని పడుకోవడం చూసి, తను తినకుండా అలాగే పడుకుంది.
యాభైఏళ్లు దగ్గర పడుతున్న తను ఇంకా చిన్నపిల్లా? కనపడ్డ వాళ్ళందరినీ "అన్నా" అని పిలవక పోతే..వాళ్ళతో ఏమన్నా లేచి పోతానా? కొంచెం బుద్ధులు కాకపోతే ఇపుడు కూడా హద్దులు, ఆరళ్లు
పెట్టటానికి? మొగాడ్ని, మొగుడిననే, అహంకారం చూపించుకోవటం....హోటలు నించి ఎన్నాళ్ళు తెచ్చుకు తింటారో తిననీ...తనకీ బండ చాకిరీ అయినా,తప్పుతుంది...' అనుకుందామె.
నేనేమి తప్పు మాటన్నాను? పేరెందుకు...అన్నయ్యా అనొచ్చుగా అన్నాను. ఆ మాటకి ఎంత దూరం లాక్కెళ్ళింది? 'ఎంత తల బిరుసు కాకపోతే..అంత నిర్లక్ష్యమా? రాత్రి తినలేదే అనుకో..తెల్లారి వండొచ్చుగా? "రండీ తిందురు గాని,” అని పిలవొచ్చుగా? నాకే అంత బెట్టు తక్కువా? జేబులో డబ్బులు తక్కువా? 'అమ్మా, తల్లీ.. అంటూ లొంగిపోతే..ఇప్పటికే భుజాలు నొక్కటం మొదలు పెట్టింది...ఏకంగా నెత్తినెక్కి తొక్కుతుంది...' అనుకున్నారాయన.
తెల్లారింది....
ఆమె తన ఒక్కదానికే ఏ ఉప్మానో, అట్టునో, వేసుకు తిని సరిపెట్టేసుకుంటుంది. కాదంటే..ఓ గిద్దెడు బియ్యంలో, ఓ గుప్పెడు పెసర పప్పు వేసుకుని, పులగంలా చేసుకుని తింటుంది. ప్రాణానికి... తేలిగ్గా ఉంది..రోజూ టిఫిన్లు, అన్నం, పప్పు, పులుసు, వేపుళ్లు...ఇన్ని చేసినా...తినేప్పుడు ఇంకా "పోనీ అదొండక పోయావా, ఇదొండక పోయావా" అంటూ..కడుపుతో ఉన్న ఆడమనిషిలా...కోరికలు...చేసే వాళ్ళుంటే, చచ్చేవాళ్ళు కూడా లేచి వస్తారంట... తిననీ...ఎన్నాళ్ళు తింటారో....' అనుకుందామె.
పార్థసారథి గారు, రెండు రోజులు పార్సిల్ తెచ్చుకుని, కడుపులో ఏదో తేడా చేసేసరికి..తనూ ఓ చారెడు బియ్యం వండుకుని, కర్రీ పాయింట్ నుంచి కూరలు తెచ్చుకోవడం మొదలుపెట్టారు.
వసుంధర గారింట్లో ప్రక్కనున్న రెండు గదులు అద్దెకిచ్చారు.
ఆ ఊరి గ్రామ సచివాలయంలో సెక్రటరీ గా చేస్తున్న ఆమె పేరు వాణి. అవివాహిత.
వంట గదిలో నుండి పార్థసారధి ప్రక్క గదిలో వాణికి వినిపించేలా
"అమ్మా వాణీ, బ్రూ కాఫీ కలుపుకుందామంటే పంచదార డబ్బా కనపట్టం లేదు...మీది కొంచం తేమ్మా అన్నారు.
"నేనే దాచానులేమ్మా వాణీ, చారెడు పంచదార కలుపుకుని తాగి, ఒళ్ళంతా షుగరు పులుముకుంటే చేసే ఓపికలు..ఇక్కడెవరికీలేవు..తే బోకు." వింటున్న వసుంధర అన్నది.
"హుమ్...." అనుకుంటూ చప్పటివే త్రాగటం మొదలు పెట్టారు పార్థసారథి.
******
అదిగో....అలా..మొదలై చిలికి చిలికి .....చిట పట లై...ఇదిగో..ఈ పూట వరకూ కొనసా....గుతూనే....ఉంది అనుకున్నారు పార్థసారధి.
పుస్తకాన్ని, కళ్ళద్దాలను తీసుకుని మెల్లగా క్రిందకు దిగసాగారు.
తెల్లారి...శ్రావణ శుక్రవారం, అదేరోజు వరలక్ష్మీ వ్రతం కూడా. ఉదయమే లేచిన వసుంధర తలంటుకుని జారుముడి వేసుకుంది నుదుట కుంకుమబొట్టు, పాదాలకు పసుపు రాసుకుని,
పూజకు, ఏర్పాట్లు చేసుకుంటున్నది. పార్థసారధి గారు వెళ్లి, మామిడి మండలు విరుచుకు వచ్చారు. వాటిని గడపకు కడుతూ, అక్కడే ఏదో పని చేసుకునే భార్యకు వినిపించేలా...అన్నారు,
"కొంతమంది...మొగుడికి తిండి పెట్టరు గానీ...వాడి ద్వారా వచ్చే పసుపు కుంకుమలు మాత్రం కావాలి.
ఆ మాటలు విన్న వసుంధర, తల తిప్పకుండానే అన్నది,
"అవును....మాకేమన్నా పసుపు, కుంకుమలు గూర్చి, తెలుసా పాడా? పుట్టి, పురిటి నాడు నుంచే బొట్టూ, మూడో ఏటినుండే చేతులకు రబ్బరు గాజులు, కాళ్లకు గజ్జెల పట్టీలు పెట్టుకుని..ఇల్లంతా సందడి చేస్తూ తిరిగిన మాకేం తెలుసు వాటి గూర్చి? పెళ్లినాడు వస్తూ..వాళ్ళ తాత, ముత్తాతలు, పండించిన పసుపు, కుంకుమలు బళ్ల కెత్తుకువచ్చి మా ముందు పోసేవరకు మాకు వాటి గురించి తెలీదాయే..."
"వామ్మో...ఏక వాక్య ప్రశ్నకు, వ్యాసరూప జవాబులు..." అనుకుంటూ...తలతిప్పి గోడకున్న
టి.వి. వేపు కసిగా చూశారు. కోపం తగ్గలేదు..ఏమిటీ ఎదురు జవాబులు....
"ఏ కూరగాయలకో వెళ్ళినపుడు చెప్పుల్లేకుండా...బజాట్లో..ఏ చేతబడి సరుకులో తొక్కివచ్చి వుంటావ్...వాటి ప్రభావమే ఇలా..." అర్ధమై చావదు... దెబ్బతో నోరు మూసుకుని..పనిచేసుకుంటది...' అనుకున్నారాయన.
"నిజమే....చెప్పుల్లేకుండా తొక్కింది సప్తపది లో తమరి కాలునే...అప్పటి నుంచే ఇట్లా తయారయ్యాను".
విసిరిన రాయి వెనక్కొచ్చి తగిలింది.
చూపులనే బాణాలుగా చేసి, సంధించి వదిలారు. అవి లక్ష్యాన్ని ఛేదించ గలవనే నమ్మకం ఆయనకే లేక, ..పట్టించుకోనట్లు బైటకు నడిచారు.
వసుంధర పూజ దగ్గర నైవేద్యానికి, పాయసం, పులిహోర, గారెలు, పూర్ణాలు చేస్తుంది.
ఆమెకు తెలుసు! భర్త భోజన ప్రియుడని!! పాయసం మీదనుండి తేలివచ్చే నేతి సువాసన, పూర్ణాల్లోని యాలకుల గుభాళింపు, పులిహోర తాలింపులో నుండి లేచి...పలుచగా తరలి వస్తున్న ఇంగువ ఘుమ ఘుమలు..పార్థసారధి గారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయ్!
ఓరకంట భర్తను గమనిస్తూ ఆయనకు వినిపించాలనే అంది వసుంధర,
"ఈ వేళ, కొంతమందికి నోట్లో ఊట బావిలో నీళ్ళూరినట్లు ఊరుతాయ్...."
అసలే జిహ్వను కష్టంగా, కంట్రోల్ చేసుకుంటున్న ఆయనకు తిక్కరేగి అన్నారు,
"ఆ..కావలసిన వాళ్ళు ...చేదతో కావాల్సినంత చేదుకోవచ్చు."
ఆమె మోమటు తిప్పి నవ్వుకోవటం ఆయన కళ్ళ బడింది!!
******
పూజ పూర్తి చేసుకున్న ఆమె...అవతల గదిలో ఉన్న వాణి ని పిలిచింది.
"ఏంటి ఆంటీ..." అంటూ వచ్చింది వాణి.
"చూడమ్మా వాణీ, ఇదిగో..ఈ గిన్నెల్లోవి నీకు. ఈ పళ్ళెం మీ అంకుల్ గదిలో వున్నారు ఇవ్వు." చెప్పింది వసుంధర.
ఒక పెద్ద పళ్ళెంలో అన్నీ విడి విడి గిన్నెలలో పెట్టి ఇచ్చింది.
"మీరే ఇవ్వండి ఆంటీ" అంది వాణి.
"నా తల్లివి కదూ...ఇవ్వమ్మా" బ్రతిమాలింది వసుంధర.
తప్పక వెళ్ళింది వాణి.
"ఏం... మేము తినక పోతే...పూజాఫలం దక్కదటనా?" బెట్టుగా అంటూనే పళ్ళెం అందుకున్నారాయన.
నవ్వుకుంటూ వెనుతిరిగిన ఆమెను కంగారుగా పిలిచారు.
"ఏంటి అంకుల్?""
"పూర్ణాలు ఎలా తినాలో తెలుసా వాణీ?" ఫక్కున నవ్వుతూ చెప్పింది.
"నోటితో అంకుల్"
"అది అందరికీ తెలుసమ్మా...వయస్సులో ఉన్నపుడు ...ఇలాంటి జోకులు నేనూ చాలా వేశాను గానీ...."
గడపవతల నిలబడి వింటున్న వసుంధర "ఇప్పటికీ తగ్గలేదులే.." చిన్నగా గొణుక్కుంది.
"ఇదుగో...వేడివేడిగా ఉన్న ఈ పూర్ణాన్ని చూపుడువేలుతో, ఇలా లోపలికి నొక్కాలి... చిల్లుపడుతుంది కదా...దానిండా కరిగిన నెయ్యి నింపాలి..శనగపప్పు, కొబ్బరి, బెల్లం, యాలకుల మిశ్రమంలో ఈ నెయ్యి కలిశాక...వుంటుందమ్మా..నేతి గిన్నె ఏది?"
వాణీ...నీకో మాట చెప్పనా? ఈ పూర్ణాలు మా వసూ చేస్తే వచ్చే రుచి ఎవరు చేసినా రాదు..."
"అంకుల్...నేతి గిన్నె తెస్తా" నవ్వుకుంటూ బైటకొచ్చిన వాణికి గడపబైట నేతిగిన్నెతో నిలబడిన
వసుంధర కనిపించింది.
"ఇంత గిన్నెతో ఎందుకు ఆంటీ?"
"ఆ వేలు...నా మణి కట్టంత వుంటుందమ్మా..ఒక్కో దానిలో గిద్దెడు తక్కువ..పట్టదు..."
"ఆంటీ నా గదిలో ఫోన్ మోగుతోంది....మీరివ్వండి..." అంటూనే తుర్రుమంది వాణి.
******
సాయంత్రం గదిలో నుండి బైటకు వచ్చిన వాణీకి, కనిపించిన దృశ్యం.....!!
డాబా మీద నుండి సన్నజాజులను దోసిట తో జాగ్రత్త గా క్రిందికి, జార విడుస్తున్న అంకుల్!!
క్రింద నిలబడి వాటిని పదిలంగా పైట చెంగు లోకి పట్టుకుంటున్న ఆంటీ!!
శబ్దం రాకుండా నవ్వుకుంటూ, నిశ్శబ్దంగా లోపలికి వెళ్ళింది వాణి.
అర్థ రాత్రి దాటి ఒకటో రెండో గంటలు గడిచి ఉంటుంది. ఎర్ర పెయింట్ డబ్బాలు, కుంచెలు పట్టుకొని, ఎర్ర చొక్కా, లుంగీ తో అతను ఆ వీధిలో తెల్లగోడల పై ఏదో రాస్తున్నాడు. అతను రాస్తున్నదేదో అతనికి పెద్దగా అర్థం కాదు. పగలు వేళలో చదివిన వారు పెద్దగా ఎప్పుడు పట్టించుకోరు. అతని వెనుక ఒక నల్లమూతి ఎర్ర కుక్క. దాని తోక పొడుగ్గా బారెడంత ఉంది. అది ఆ వీధి లోని తెల్ల గోడలను, దండెలకు వేలాడే కాషాయ రంగు బట్టలను, రోడ్డు అంచుల్లో పెరిగిన పచ్చని గడ్డిని చూసి, పళ్ళన్నీ బయటపెట్టి గుర్రు గుర్రు మంది. గట్టిగా మొరగడం మొదలు పెట్టింది. దాని అరుపులు విని ఇంకొన్ని వీధి కుక్కలు, కొన్ని పిచ్చి కుక్కలు అక్కడ చేరాయి. కర్ణ కఠోరమైన వాటి అరుపులు విని అతను ఆనందం గా నవ్వాడు. తనతో వచ్చిన గజ్జి కుక్కను ప్రేమగా నిమిరి ఇంకా గట్టిగ అరవమన్నట్లు తల ఊపాడు.
72 ఏండ్ల భారతమ్మ ఉలిక్కిపడి లేచింది. పక్కన్నే ముసుగు తన్ని పడుకొని ఉన్న భర్త భుజం గట్టిగ ఊపుతూ
"అబ్బా, లేవండి. ఎలా నిద్ర పోగలుగుతున్నారు? ఆ కుక్కల అరుపులు వినబడడం లేదా? అలా పొయి అదిలించి రండి."
దామోదరం గారు ముసుగు తీయకుండానే "అవే పోతాయి లేవే. హాయిగా పడుకో. ఎందుకు మనకు కంఠ సోష, రెండు గులక రాళ్లు దండగ." అన్నాడు.
"నిద్ర ఎలా పడుతుందండీ?" సాగతీసింది భారతమ్మ. "అవి అంతలా అరుస్తుంటే... ఎవరినైనా కరిస్తే?"
కదలకుండా జవాబిచ్చాడు "అవి మొరిగే కుక్కలే!"
"అబ్బా. మాకు తెలియదు లెండి సామెత. వాటిలో పిచ్చి కుక్కలు కూడ ఉన్నట్లున్నాయండి. పోయి ఒక్కసారి అదిలించి వస్తురూ. రాత్రిళ్ళు సరిగ్గ నిద్ర లేదు. పగలు పనంతా అయ్యాక కాస్త రెస్ట్ తీసుకుందామంటే అదీ లేదు. పొద్దున్న ఒక పక్కన నేను లలిత సహస్రం చేసుకొంటున్నాను. బయట ఈ కుక్కల రచ్చ. చివరికి కాసేపు పూజ కూడా చేసుకోనివ్వడం లేదు."
ఆయన ముసుగు తీసి కళ్ళు నిలుపుకుంటూ అన్నాడు. "పక్క ఇళ్ల వాళ్ళకి పట్టని గొడవ మనకెందుకు? అన్నట్లు వాటికి దేవుడి మీద నమ్మకం ఉండదే."
భారతమ్మ ఎత్తుకొంది. "భలే వారే. మన పక్కింటి రామారావు గారి కుక్క.. సాయిబాబా బొమ్మ కనిపిస్తే చాలు... ముందు కాళ్ళు రెండు పై కెత్తి దండం పెడుతుంది. తెలుసా?"
"అది ఇంటి కుక్కే. ఇంటి వారి సంస్కారమే వస్తుంది. ఇవి ఎక్కడెక్కడో తిరిగి నానా చెత్త తిని ఆలా అరుస్తాయి. ఇంటి కుక్క ఇంటికి కాపలా కాస్తుంది. వీధి కుక్క ఎవరు చూడకుండా లోపలికి వచ్చి ఏదో ఒకటి, పాలో, పప్పో నాకి వెళుతుంది. రోడ్డు మీద వేగంగా పోయే వాహనాల వెనక పడి అరుస్తాయి. మనం నడిచిపోతుంటే వెనుక నుండి వచ్చి పిక్కలు పట్టుకొంటాయి. ఇలా చేయడానికి పెద్దగా కారణం ఏమి కనపడదు. వేటి సిద్దాంతం వాటిది. వాటికి ఈ ఇంటి కుక్కలను చూస్తే వళ్ళు మంట. ఇంత విశ్వాసం ఏవిటి ఆ ఇంటి మీద వీటికి అనుకొంటాయి. వాటిని కూడా రోడ్డు మీదకు ఈడ్చి సమసమాజం స్థాపించాలనుకొంటాయి. ఈ వీధి కుక్కలకు ఒక భాష కూడా ఏడ్చింది. అక్కకెక్కడో ఒక వీధి కుక్క అరిస్తే దీనికేదో అర్థం అయ్యి ఇదీ అరుస్తుంది. ఆ కుక్క ఢిల్లీ లో అరిచిన, బీజింగ్ లో అరిచిన, మాస్కోలో అరిచినా వీటికి వినబడుతుంది."
ఆమె మంచం దిగి రెండు గ్లాసుల నిండా నీళ్లు తెచ్చి ఒకటి భర్త కు ఇచ్చి, ఒకటి తాను తాగుతూ మురిపెంగా అంది. "సరే లెండి. ఈ కుక్కల సైకాలజీ, సిద్దాంతం. అయినా పక్కింటి వాళ్ళ సంగతి మనకెందుకు. మీకు ధైర్యం జాస్తి కాబట్టి మీరే వెళ్లి వాటిని తరిమేయండి. ఇన్నేళ్ళనుండి చూస్తున్నాను కదా. కుక్కలేమి, పులులైన మీరు భయపడరు."
ఆయన ఒకసారి ఆమె వైపు దీర్ఘం గా చూసి, "చూడు. ఈ కుక్కల గొడవ ప్రపంచం అంత ఉండేదే. అవి అంత తొందరగా వదిలిపోవు. కలి ప్రభావం లేని కలియుగం ఉంటుందా? సమయం వచ్చినపుడు అవే పోతాయి. దిగులు పడకు. హాయిగా నిద్రపో." అంటూ మళ్ళీ ముసుగు తన్నాడు.
"ఏమ్ మొగుడబ్బా!" అనుకొంటూ ఆమె పడుకుంది.
.....................
మరుసటి రోజు అదే సమయానికి భారతమ్మ ఉలిక్కిపడి లేచి, చెవులు రిక్కించి వినడం ప్రారంభించారు. రెండు చేతులతో నిద్రిస్తున్న భర్త ను భుజాలు పట్టుకొని గట్టిగా ఊపుతూ
"విన్నారా! కుక్కలు అరవడం లేదు!"
ఆయన మెల్లగా లేచి దుప్పటి నడుము వరకు జరిపి అన్నాడు. "అరవడం లేదు అంటూ మళ్ళీ విన్నావా అంటావేమిటే?" ఆమె పట్టించుకోలేదు.
"ఈ కుక్కలన్ని ఏమయ్యాయబ్బ?"
ఆయన నవ్వుతూ అన్నాడు.
"బాగుంది సంబడం. అరిస్తే ఒక బాధ. అరవలేదని ఇప్పుడొక బాధా? వాడెవడో రైలు పట్టాల పక్కన ఇల్లు కట్టుకున్నాడట. రైలు పోయే శబ్దం లేకపోతే నిద్ర పట్టేది కాదట."
ఆమె "అది కాదండి. ఈ కుక్కలన్ని ఏమై పోయినట్లు?"
ఆయన తాపీగా చెప్పాడు. "పొద్దున మున్సిపాలిటీ వాళ్లకు ఫోన్ చేసి చెప్పాను. పట్టుకు పోయినట్లున్నారు."
ఆశ్చర్యంగా చూసింది భారతమ్మ.
"మనకెందుకన్నారు?"
నవ్వుతూ ఆయన సమాధానం చెప్పాడు. "ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. నా పని నేను చేశాను. ఇక పడుకో."
"హమ్మయ్య. పీడ విరగదయ్యింది. ఇంక రాత్రుళ్ళు హాయిగా నిద్రపోవచ్చు." అంటూ ఆమె పడుకొంది.
ఆమె వైపు జాలిగా చూస్తూ ఒక నిట్టూర్పు విడిచి ఆయనా పడుకొన్నారు.
..............
ఆ రాత్రి ఎర్ర చొక్కా అతను వచ్చి ఇంకో కొత్త గోడ వెతుక్కుని ఆ రోజు నినాదం రాసి, పెయింట్ ఓడుతున్న కుంచెను పట్టుకొని తాను రాసిందానిని తృప్తి గా చూసుకున్నాడు.
"బంధింపబడ్డ అమాయక పిచ్చి కుక్కల నన్నిటిని వెంటనే విడుదల చేయాలి. మున్సిపాలిటీ వారి దౌర్జన్యం నశించాలి."
ఇట్లు
పిచ్చి కుక్కల హక్కుల సంఘం
అతని వెనుక చొంగ కారుస్తూ అప్పుడే నాలుగు కొత్త కుక్కలు వచ్చి చేరాయి. అవి నాలుగు నల్ల మూతుల ఎర్ర కుక్కలే. వాటి తోకలు పొడుగ్గా బారెడంత ఉన్నాయి.
బావుందండీ శ్రీముఖి గారు గల్పిక