సాహితీ సిరికోన లో ప్రచురించిన కొన్ని గల్పికలు గంగిశెట్టి గారి అనుమతితో సిరిమల్లె పాఠకుల కొరకు ఇక్కడ అందిస్తున్నాము.
మోహన్ కి పెళ్ళయి దాదాపు మూడు నెలలు కావస్తోంది. ఈ మూడు నెలలూ, భార్య అనన్యతో కలసి, బయట భోజన శాలలకు వెళ్ళడం, మిత్రులతో కాలం గడపడం. అనన్య తల్లి గారిల్లు కూడా తమ కార్యాలయాలకు దగ్గరే కావడంతో ఒక్కొకసారి అక్కడకు వెళ్ళి, ఎక్కువసేపు ఉండిపోవడం వంటివి జరుగుతున్నాయి. మోహన్ కు ఇంటి దగ్గర అమ్మ ఎదురు చూస్తూ ఉంటుందని తెలుసు. కాని అనన్యకు బయట తిరగడం సరదా.
మోహన్ తల్లి సౌమ్య, ఉద్యోగం నుండి విశ్రాంతిని పొందింది. ఆమెకు సమయం గడవదనే సమస్య లేదు. ఆమెకు మునుపటినుంచీ, ఇంటి మీద శ్రద్ధ ఎక్కువ. చక్కని పూలతోటను పెంచింది. విజ్ఞుల ఉపన్యాసాలను వింటుంది, మంచి ఆలోచనలను కలిగి ఉంటుంది. ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తుంది. కొత్తగా వచ్చిన కోడలు అనన్య మనసును ఏ విధంగానూ నొప్పించకూడదని నిర్ణయించుకుంది. కొడుకు , కోడలు ఎంత ఆలస్యంగా ఇంటికి వచ్చినా ఎదురు చూస్తూ కూచుంటుంది. అమ్మ నువ్వు పడుకో మా దగ్గర మరో తాళం చెవి ఉంది కదా, తలుపు తెరుచుకుని వస్తాం కదా అని మోహన్ అంటాడు, అయినా సరే వాళ్ళిద్దరూ ఆకలితో వస్తారేమో నని సౌమ్య వంటచేసి పెడుతుంది. మోహన్ అమ్మ బాధ పడుతుందని రెండు ముద్దలు తింటాడు. అనన్య అటువేపైనా చూడకుండా పైకి వెళ్ళి పోతుంది.
అనన్య తనతో ఇప్పటికప్పుడే చాలాసార్లు "మోహన్, చదువుకుని ఉద్యోగం చేసిన మీ అమ్మకీ చాదస్తం ఏమిటి చెప్పు. మనం కొత్తగా పెళ్ళైన వాళ్ళం. సరదాగా ఉండాలనుకుంటాం. ఆవిడ అలా ఎదురు చూస్తూ ఉంటే నాకు భలే చిరాగ్గా ఉంటుంది," అంటూ ఉంటుంది. అమ్మ అంటే ఎంతో ప్రేమ, గౌరవం కలిగిన మోహన్ కు అమ్మ విషయంలో అనన్యకు వివరణలేవీ ఇవ్వాలనిపించదు.
ఆ రోజు మోహన్ తండ్రి వార్షికం, మోహన్ సెలవు పెట్టి ఇంట్లో ఉన్నాడు. బ్రాహ్మణుల కోసం ఎదురు చూస్తున్నాడు. అనన్య రోజూలాగే కార్యాలయానికి వెళ్ళడానికి, పేంటు, షర్టు ధరించి, మేడమెట్లు దిగి, కిందికి వచ్చింది. మోహన్ అన్నాడు, “అనన్యా, సెలవు పెట్టమన్నాను కదా, ఇంట్లో కార్యక్రమం ఉంది. ఈ రోజు ఆఫీసుకు వెళ్ళకు" అన్నాడు. “నేను తిథులూ, కార్యాలూ అంటూ ఇంట్లో కూచోలేను. ఈ రోజు నేను వెళ్ళి తీరవలసిన పనులెన్నో ఉన్నాయి. పైగా ఇప్పుడు ప్రమోషన్ కూడా ఎదురు చూస్తున్నాను” అంది. లోపల వంటిట్లో ఉన్న సౌమ్య బయటకు వచ్చి పాపం వెళ్ళనీయరా,..అంటూ సమర్థించబోయింది. తల్లిగారింట్లో గారాబంగా పెరిగిన పిల్ల, ఆధునికంగా పెరిగింది. చిన్న విషయాలు కూడా ఒక్కొక్కప్పుడు గాలి వానలవుతాయని ఆమెకు తెలుసు. "అత్తగారు మెత్తగా ఉన్నట్లుంటూనే భర్తను రెచ్చగొడుతున్నట్లుగా భావించిన అనన్య, “మీలా నేను మంచి నటించలేను. కొడుకు మీ మాట జవదాటడు.. అయినా ఈ రోజుల్లో ఇలాంటివన్నీ ఎవరు పాటిస్తున్నారు చెప్పండి. కొడుకును కొంగుకు కట్టేసుకున్న మీలాంటి వాళ్ళు తేనె పూసిన కత్తులు” అంటూ ఇంకా ఏదో అనబోతూ ఉండగా మోహన్ ఆవేశంగా చేయెత్తాడు. అనన్య ఈ పరిణామానికి బిత్తర బోయింది. కళ్ళల్లో నీళ్ళు కమ్ముకుంటూ ఉండగా చేతిలో ఉన్న కర్చీఫ్ తో కళ్ళు తుడుచుకుంటూ బయటకు వెళ్ళిపోయింది.
ఇంట్లో కార్యక్రమం యథావిధిగా నడచింది.
ఆ రోజు అనన్య ఇంటికి తిరిగి రాలేదు. సౌమ్య మోహన్ తో “రాత్రి పొద్దుపోయింది, వెళ్లి అమ్మాయిని తీసుకుని రారా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది” అంది. “ఆ సంగతి నేను చూసుకుంటానమ్మా” అన్నాడు మోహన్.
మర్నాడు పొద్దున్న మోహన్ “అమ్మా బయల్దేరు, నువ్వు నాతో రావాలి” అన్నాడు. ‘ఎక్కడికిరా’ అంది సౌమ్య. “నన్నేమీ అడక్కు. నువ్వు రా” అన్నాడు మోహన్. అలాగే బయలు దేరింది సౌమ్య. మోహన్ సరాసరి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్ళి కారు ఆపాడు. సౌమ్యకేమీ అర్థం కాలేదు. అక్కడ అనన్య, ఆమె తలిదండ్రులు ఉన్నారు. సౌమ్యను చూడగానే వాడిపోయిన ముఖం తో ఉన్న అనన్య "అత్తయ్యా, క్షమించండి" అంటూ ఆమె చేతులు పట్టుకుంది. ఏమయింది అర్థంకాక సౌమ్య చూస్తుంటే, మోహన్ తొపాటు చదువుకుని, ఇప్పుడు రక్షణ శాఖలో పనిచేస్తున్న నళిని, సౌమ్యను ఆంటీ అంటూ పలకరిస్తూ బయటకు వచ్చింది. “ఆంటీ, మోహన్ చిన్న నాటకం ఆడాడు. చదువుకున్న అమ్మాయిలు ఇప్పుడు తాము సంపాదించుకుంటున్నాము, స్వతంత్రులం అనుకుంటూ తెలివితక్కువగా ప్రవర్తిస్తున్నారు. గృహ హింస చట్టం, తమకు రక్షణ కలిగిస్తుందని, చిన్న చిన్న విషయాలకే కుటుంబాన్ని రచ్చ కీడుస్తున్నారు. ఇప్పుడు భర్తలకు కూడా చర్యలను తీసుకోగల ధైర్యాన్ని కలిగించేటట్టు తీర్పు వచ్చిందాంటీ. మోహన్ కి మీరన్నా కుటుంబం విలువలు అన్నా ఎంతో గౌరవం, ఆ సంగతి నాకు తెలుసు. అందుకనే అనన్య మీద ఆరోపణ చేసి నాతో నాటకం ఆడించాడు. పాపం అనన్య, ఆమె తల్లీ, తండ్రీ నిన్న రాత్రంతా స్టేషన్ లో ఉండి తెగ కంగారు పడిపోయారాంటీ. అనన్య సంగతి చెప్పనే అక్కర్లేదు. తెగ ఏడ్చేస్తోంది. మోహన్ని పిలవండి అంటూ ఎంతగానో వేడుకుంది.” అంది.
సౌమ్య కొడుకు చేసిన పనికి నమ్మలేనట్టుగా చూసింది. మోహన్ అమ్మభుజం మీద చేయి వేసి, ఇది ఒక విధంగా "మేల్ కొలుపు"లే అమ్మా! మొక్కగానే వంచాలి అని నువ్వే చెప్తావు కదా అన్నాడు. అనన్య అత్తగారి చేయి పట్టుకుని వదలటంలేదు. క్షమించండత్తయ్యా, అంటూనే ఉంది.
ఫోన్ రింగయింది.
"హలో ఎవరు" అన్నాను.
అవతల నుండి "నేను..!"
"ఊ!..చెప్పు" నిరాసక్తంగా నేను.
"ఎలా వున్నారు"
విసుగేసింది. "ఎలా వుంటాను! బాగానే వున్నాను" అన్నాను.
అవతలవైపు నిశ్శబ్దం.
"దానికోసం ఫోన్ చేయాలా"
అసహనంగా అన్నాను.
మౌనం.
ఇంకా చిరాకేసింది. ఇంత పొద్దు పోయినా, ప్రాజెక్ట్ వర్క్ లో తలమునకలై పనిచేస్తున్నా. రేపు చాలా పెద్దవాళ్ళ మధ్య రిపోర్టు సబ్మిట్ చేయాలి.. ఇలాటి పని వత్తిడిలో ఈ కుశలప్రశ్నలు అవసరమా! కాని...
అవతలివైపు నుండి ఏదైనా చురుగ్గా సమాధానం వస్తే ఎలా వుండేదో! అలా మౌనంగా వుంటే నాకెదోలా అనిపించింది. నాలో ఏదో జ్ఞాపకాల తెరలు. మమతల వంతెన. అవునూ, నాకెందుకీ విసుగు? ఎందుకీ అహంకారం? ప్రశ్న గుండె లో ప్రవేశించి, చిన్న కదలిక మొదలై, శరీరమంతా విద్యుత్ లా వ్యాపించి ఏదోలా అనిపించింది. పురుషాహంకారమా?
గుండె గొంతులో కొట్లాడుతాది- ఎంత బాగా అన్నాడు నండూరి! ఆ "నేను" ని నేనెందుకు గుర్తించలేక పోతున్నాను! "నేను" అనడం లో వున్న ఆప్యాయత, అనురాగం, దగ్గరితనం, స్వంతం అన్న posessiveness, చిన్న అధికారం..నేనెందుకు అంగీకరించలేక పోతున్నాను?
నాకు తెలీకుండానే "చెప్పు" అంది నా స్వరం మృదువుగా...నాకు తెలుసు అవతలివైపు ఒక ఆనందతరంగం వెల్లువౌతుందని...
నా చూపు ఎదుటి గోడపై పడింది. కల్యాణశ్రీనివాసుడు చిద్విలాసంగా చూస్తున్నాడు.
ఫోనులో రోమాకు... ఇష్టమైన కాలర్ ట్యూన్... "అభీ న జావో ఛోడ్ కర్ కె దిల్ అభీ నహీ భరా" వస్తోంది..
మోహిత్ ఫోన్ చేస్తున్నాడు...
రోమా...పరధ్యానంగా వున్నా వేమిటి? మోహిత్ నుండి ఫోన్....నీ ఫోన్ కి చేస్తే నువ్వు ఎత్తడం లేదని నాకు చేశాడు అంటూ రోమా తల్లి ఫోన్ ఇచ్చింది....
రో... 'వాట్సాప్..నో ఫోన్... నీ ఫోన్ లో వీడియో కాల్ లో రా'... అంటూ ఆజ్ఞ జారీ చేసి ఫోన్ పెట్టేశాడు మోహిత్.
హాయ్.. మోహిత్ చెప్పు అంది రోమా ఫోన్ చేసి....
వాట్ రో...."నువ్వు ఎందుకు అంత మూడీగా వుంటున్నావు?
ఇది మనం స్వీట్ నతింగ్స్ చెప్పుకునే సమయం...నువ్వు డల్ గా వుండడం నాకు నచ్చడం లేదు....
మన పెళ్లి ఇంకో రెండు వారాల్లోనే...వాట్ రా రో"...అన్నాడు మోహిత్.
"మనసు పెళ్లి పనులపైన లగ్నం అవడం లేదు .....శూన్య మేదో వెంటాడు తున్నట్లుంది" సారీ మోహిత్ అంది రోమా.
చిల్ రా.....అమెరికా లో మన పెళ్లి అంటే నువ్వు ఎంత వుషారుగా వుండాలి...
నువ్వు అలా బాధ పడుతూ వుంటే ఎలా?
అలా బయటికి వెళ్దామా......
షాపింగ్ అని చెప్పు ఆంటీకి....
నో మోహిత్....ఇప్పుడా
'ప్రతిదానికీ ఒక కాలముంటుంది...ఇది కరోనా కాలము అని ఇంట్లో కట్టు దిట్టాలు.. ఆరు నెలలకు సరిపడా సరుకులు తెచ్చేసారు. పైగా మన పెళ్ళి ఎలా అవుతుందా అని ఆందోళన...
ఎక్కువ గుంపులు గుంపులుగా జనం మసల కూడదనే ఆజ్ఞలు'...
కాస్త తలనొప్పిగా కూడా వుంది రాలేను అంది రోమా...
ఓహ్.. సార్రీ రో... రెస్ట్ తీసుకో అంటూ ఫోన్ పెట్టేశాడు మోహిత్
..... ...... ....
అది 2015 వ సంవత్సరం...
వూహాన్ వైద్య విద్యాలయం. చైనా
అనాటమి(మానవ శరీర నిర్మాణం) క్లాస్ జరుగుతుంది.
స్టూడెంట్స్.."మన ముందున్న ఈ దేహం.... పేరుమోసిన సంపన్న వ్యాపార వేత్తది".
అనాటమి ప్రొఫెసర్ క్లాస్ ఎప్పుడూ హాస్యంతో కూడుకుని సరదాగా వుంటుంది...
మన మానవ శరీరము ఒక కర్మాగారం..
శరీరం గొప్పతనం గురించి చెబుతూ..శరీరాన్ని కోస్తూ కొన్ని శరీర భాగాలనునేలపై వేస్తూ ...
ప్రతి అవయం గురించి చెప్పుకు పోతున్నారు.
అరిస్టాటిల్ అన్నట్లు మానవుడు సంఘ జీవి...అలాగే శరీరంలోని ప్రతి అవయవము కూడా
మరొక అవయవము మీద ఎలా ఆధార పడి వుంటుందో వివరిస్తున్నారు.
మానవ శరీరం 60% నీటితో నిండి వుంటుంది. ఏయే శరీర భాగాలు ఎంత శాతం నీటిని కలిగి వున్నాయో, శరీరానికి నీరు ఎంత అవసరమో వివరిస్తూ వున్నారు ...ప్రముఖ చైనా ఫిలాసఫర్.. లా జ్యు (Lau Tzu) క్రీస్తు పూర్వం 500 లో నీటి గురించిన చాలా ఆసక్తి కరమైన తాత్విక విషయాలు చెబుతూ... ....రేమండ్ టాంగ్ (Raymond Tang) నీటి పై చెప్పిన కవిత చెప్పి వినిపించారు.
నిజానికి అనాటమీ చాలా కష్టమైన సబ్జెక్ట్. మానవ శవాన్ని కోస్తూ వుంటే కొంచం భయంగా ఉంటుంది మొదట్లో విద్యార్థులకు. ప్రొఫెసర్..విద్యార్థులలో ఉత్సాహం కలిగే విధంగా పాఠ్యాంశాల తో పాటు.. మధ్యలో ఎన్నో ఆసక్తి కర విషయాలు చెబుతూ విద్యార్థులను ఆకట్టుకుంటారు.
"ఈ వ్యక్తి ఆజానుబాహువు అయి ఉంటాడు. ధనవంతుడు అని ప్రొఫెసర్ చెప్పారు. ఎంతటి సుఖ భోగాలను అనుభవించాడో...మనిషి శరీరం పైన తోలు ....మనిషిని భ్రమలో వుంచుతుందా"....తోలులేని శరీరం చూస్తూ రోమా ఆలోచనలో పడింది. మనిషి లోపల అవయవాలు చూస్తుంటే భయంగా, జుగుప్స గా వుంది.
రోమా మనస్సు ప్రొఫెసర్ చెప్పే అంశం వైపునుండి.....నైరాశ్యం వైపు తిరుగుతూ.. మనిషి ...నిర్జీవి అయితే... మనిషి లోని సిగ్గుని ఆ ప్రాణం తీసుకుని వెళ్లిపోతుందా? చర్మమే కదా మనిషికి అందాన్ని తెచ్చేది. రోమా మనస్సులో మానవ శరీరం గురించి అనేక తాత్విక పరమైన ఆలోచనలు కమ్ముకున్నాయి.
ప్రొఫెసర్..... పెంగ్ అనే విద్యార్థిని ఉద్దేశించి
మానవుని మెదడు, గుండెలో ఎంత శాతం నీరు ఉంటుంది అని అడిగారు.
పెంగ్ యిన్యువ (Peng Yinhua) అప్పటి వరకు...తనకు పెళ్లయ్యాక పుట్టబోయే బిడ్డకు పెట్టే పేర్లు గురించి ప్రియురాలితో...ఫోన్ లో మెసేజెస్ పంపుతూ వున్నాడు. క్లాస్ చాలా ఇంటరెస్ట్ గానే వుంది. దానికన్నా వయస్సులో చిలిపి మనస్సు తొక్కే పరవళ్ళు...ఒక్కో సారి పరిసరాలను విస్మ రింప చేస్తాయి..
పెంగ్ అంతకుముందు తెలిసిన జవాబవ్వడంతో....73% అని టక్కున చెప్పాడు. దట్ ఈజ్ రైట్...
పెంగ్ నువ్వు చాలా తెలివైన వాడివి. కాస్త వినే అంశం పైన పూర్తిగా మనసు లగ్నం చేయి అన్నారు ప్రొఫెసర్ నవ్వుతూ.
క్లాస్ అయిపోయింది.
ప్యూన్... నేలపై పడిన శరీర ముక్కల్ని చీపురుతో ఎత్తి చెత్త బుట్టలో వేశాడు...
..... ...... ....
2019 సంవత్సరం.
వూహాన్ ఆసుపత్రి. చైనా
పెంగ్.........ఆసుపత్రిలో ఉద్యోగంలో చేరాడు. జనవరిలో పెంగ్ కుటుంబ సభ్యులు తూమి కుటుంబ సభ్యులు...ఒక చిన్న విందు ఏర్పాటు చేసి.... పెంగ్ తుమిల వివాహ తేదీ.. ఫిబ్రవరి 21,2020 అని నిర్ణయించారు. పెంగ్ ఆవిషయాన్ని తన స్నేహితులందరికీ చెప్పి ఎంతో సంతోషం వ్యక్తం చేశాడు. ....
రోమా తన పెళ్లి మార్చ్ 21, 2020న అమెరికాలోని మిచిగన్ లో అని పెంగ్ కు తెలియచేసింది.
"రోమా, నీపెళ్ళికి చాలా ముందుగా మేమిద్దరం వస్తాము అని చెప్పాడు పెంగ్. "నా స్వప్నం... జీవితంలో ఒక్కసారైనా తుమితో కలిసి అమెరికా చూడడం" అని చెప్పాడు.
రోమా పెళ్ళి కి హాజరు కావడానికి టికెట్స్ బుక్ చేసుకున్నాడు.....
కరోనా వైరస్ చైనా లోని ఊహాన్ ను వూపేస్తుంది. ప్రజలు ప్రాణ భీతితో వున్నారు. చనిపోయే వారి సంఖ్య రాను రాను పెరగడంతో ప్రభుత్వం ఎన్నో రకాల జాగ్రత్త చర్యలు చేపట్టింది.
పెంగ్ తన డ్యూటీలో చాలా బిజీగా వున్నాడు. తనను గురించి తాను పట్టించుకోవడం లేదు. మొదటిలో రోగులను పరీక్షించేప్పుడు ఎలాటి జాగ్రత్తలు తీసుకోలేదు. అప్పుడు ఆవైరస్ కు ఇంకా నామకరణం జరగ లేదు. ..ఆ వైరస్ గురించి తెలుసుకునే నాటికే ....ఆ వైరస్ పెంగ్ శ్వాస కోసం పై పూర్తి ఆధిపత్యం సంపాదించింది.
కరోనా వైరస్ సోకి...వ్యాధి తీవ్రమైందని తెలిసిన పెంగ్.... రోదన ఎందరి హృదయాలనో ద్రవించి వేసింది. "నాకు బ్రతకాలని వుంది. వైద్య సేవలో... తుమీ ప్రేమలో జీవితం అందంగా గడపాలనీ వుంది అని ఛాతీ బాదుకుంటూ ఏడుస్తున్నాడు పెంగ్. ఈ దేహం చాలించి...అమ్మా,నాన్న..మిమ్మల్ని విడిచి వెళ్ళాలని లేదు. నాకు చావు అప్పుడే వద్దు దేవుడా...వైద్యం తో ఎంతో మందికి సేవచేయాలని వుంది. అమ్మా, నాన్న మిమ్మల్ని నా హృదయానికి హత్తు కోవాలని వుంది. తుమీ...నిన్ను కౌగలించుకుని ముద్దడాలని వుంది.
చావు...ఇప్పుడే రాకు...దయ చేసి నాకు బ్రతుకు బిక్ష పెట్టు....ఒక్కసారి నా వాళ్ళని దగ్గరగా చూడాలని వుంది"...ఆ హృదయ విదారకమైన వీడియో చూస్తుంటే రోమా మనస్సు వికలమైంది....
2018 డిసెంబరు నెల.
యూనివర్సిటీ వార్షికోత్సవంలో "వైద్యో నారాయణో హరిః".. నాటకం జరుగుతోంది. డాక్టర్ పాత్రలో నటించిన పెంగ్కు వింత వ్యాధి సోకుతుంది. నాకు మరణం ఆసన్నమయ్యింది. బ్రతకాలని వుంది. ఎందుకో నాకు బ్రతుకు గురించి ఆశ ఎక్కువైంది. అవును మనం ఆరోగ్యంగా వున్న ఏరోజూ బ్రతుకు విలువ తెలియదు.
దేవా నువ్వు నన్ను కాపాడు.... బిగ్గరగా రోదిస్తాడు. దేవుడ్ని బ్రతిమాలుతూ... ...దేవా...జీవితం పట్ల ఎన్నో కలలు కన్నాను... ఎంతో కష్టపడి చదువుకున్నాను. చదువులో.. ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో...వైద్య వృత్తిని దైవంగా భావించాను...
తల్లితండ్రులకు నేను ఏకైక సంతానం. కాలేజ్ నుండి కొంచెం ఆలస్య మైతే ఎన్ని ఫోనులు చేస్తారో...తిన్నావా, త్వరగా రా...నేను పోతే ఆ ప్రాణాలు ఎలా తట్టు కోగలవు. ఎలా ఫోను చేయగలవు? తల్లి తండ్రుల కళ్ళ ముందు బిడ్డలు పోతే ఎలా తట్టుకుంటారు?
నేను ఎందరో రోగులకు వైద్యం చేస్తున్నాను. నాజీవితాన్ని నా వైద్య సేవలో గడపాలని వుంది.
దేవా నా ప్రియురాలు...నేను వేరు కాదు. నా యెడ బాటును ఆ ఎద భరించలేదు.
మేము మా వైవాహిక జీవితం గురించి ఎన్నో కలలు కన్నాము. మాపుట్టిన బిడ్డకు నీపేరు పెట్టాలనుకున్నాము...నన్ను బ్రతికించు....దేవా నన్ను బ్రతికించు...నాకు చావాలని లేదు....పిచ్చివాడిలా ఎగురుతూ...ఛాతీ బాదుకుంటూ రోదిస్తూ...మృత్యువా... దరికి రాబోకు... రాబోకు ... అంటున్న అతని కనుకొలకులలో నీరు వుబుకుతుంది...శ్వాస తీసుకోవటం కష్టమై....ఛాతీ పట్టుకుని అమ్మా.... అంటూ నేల కొరుగుతాడు".
ఆ నాటకంలో పెంగ్ నటనను అందరూ మెచ్చు కున్నారు.
2020 ఫిబ్రవరి నెల ...
ఆరోజు ఫిబ్రవరి 1. తుమి...దేవుడ్ని వేడుకుంటూ వుంది.
"ఇంకా ఇరవై రోజులే మా పెళ్ళికి సమయం వుంది. దేవా పెంగ్ కు శక్తి నివ్వు, నా పెంగ్ త్వరగా కోలుకునేట్లు చెయ్యి" అంటూ.... కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న... తూమీకి.. "పెంగ్ మరణించాడు" అన్న వార్తతో తుమి వొళ్ళంతా చెమటలు పోశాయి. నమ్మలేనట్లు... ఒక్క సారి నా పెంగ్ ను చూడనివ్వండి అని డాక్టర్లను బ్రతిమాలుతుంది. పెంగ్ తల్లి దండ్రుల, తుమిల దుఃఖాన్ని..చివరిగా పెంగ్ శవాన్ని కూడా చూడలేని వారి దుస్థితిని చూసిన ఎవరికైనా ఆవేదనతో గుండె బరువెక్కి, హృదయాలు ద్రవింపక మానవు.