సాహితీ సిరికోన లో ప్రచురించిన కొన్ని గల్పికలు గంగిశెట్టి గారి అనుమతితో సిరిమల్లె పాఠకుల కొరకు ఇక్కడ అందిస్తున్నాము.
నేను ఎప్పుడో యాభైయేళ్ళ క్రితం రాసినపాట. ఇంకా నన్ను వెంటాడుతూనే ఉంది.
అదో దేశ భక్తి గీతం. అప్పట్లో దాన్ని రేడియోలో రోజుకి కనీసం ఒక్కసారైనా ప్రసారం చేసేవారు. ఫలితంగా ప్రతినెలా పారితోషికంగా తృణమో పణమో ప్రసాదించేది ఆ పాట. కాలక్రమేణా వారానికో నెలకో ఓసారి ప్రసారం చేసేపరిస్థితి ఏర్పడింది. తరవాత స్వాతంత్ర్యదినోత్సవం, గణతంత్ర దినోత్సవం, దేశనాయకుల జన్మదినోత్సవాలు మొదలైన పర్వదినాల్లో అరుదుగానైనా వినిపిస్తూండేది.
ఆ తరవాత పాటంటే కేవలం సినిమా పాటే అనేస్థాయికి దిగజారిపోయింది సంగీతం. చివరికి ఆ పాట రాసింది నేనే అనే విషయం మర్చిపోయేంతగా మారిపోయింది కాలం.
ఉన్నట్టుండి ఓ దర్శకుడు దేశభక్తి నేపథ్యంలో చలనచిత్రం నిర్మించాడు. అందులో నా పాటని సందర్భానుసారం వివిధ భావోద్వేగాలతో ఉపయోగించుకున్నాడు. ముగింపులో మతకలహాలు జరుగుతాయి. వాటిని అదుపుచెయ్యడానికి నాయకానాయికలు దేశంకోసం తమ ప్రేమని సైత పణంగా పెట్టడానికి సిద్ధపడే గొప్ప భావోద్రిక్తతలతో కూడిన సన్నివేశం వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో సామరస్యాన్ని పునః ప్రతిష్ఠించడానికి ఆ పాటని శాంతిమంత్రంగా ఉపయోగించుకుని ప్రేక్షకుల గుండెల్లో దేశం ఉదాత్తమైన భక్తిభావాన్ని పాదుకొల్పాడు. దాంతో ఆ పాట ప్రాభవం మళ్ళీ ఉచ్ఛస్థాయికి చేరి మన జాతి వైభవాన్ని దేశానికి చాటింది.
ఆ సినిమా విడుదల కాకముందే పాట తెలుగునాట మళ్ళీ మారుమ్రోగింది.
స్థానిక దినపత్రికలతో మొదలై.., పెద్ద పత్రికల ప్రాంతీయ పుటలమీదుగా.., పెద్ద పత్రికల ఆదివారం అనుబంధాలని దాటి.., బుల్లితెర వార్తావాహినులదాకా ఎక్కడ చూసినా ఆ పాట పుట్టుక వెనుకగల కథనాలే. ఆ కథనాల్లో ప్రధానాకర్షణగా నేను మెరిసిపోతూంటే మా ఇంటిల్లిపాదీ మురిసిపోతూండేవారు. అంత గొప్ప దేశభక్తి ప్రధాన చిత్రంలో నా పాట ఉండటం, ఆ పాట చలనచిత్రానికి ఆయువుపట్టుకావడాలని మించిన ఆనందం ఏముంది? అంతకు మించిన పారితోషికం ఎవరివ్వగలరు?
ఇంక పాటల రచయితలైతే నా ముందు నా రచనానైపుణ్యాన్ని వేనోళ్ళు అప్పుతీసుకుని మరీ పొగిడేవారు. వారే నా వెనుక "ఒంటిపాట ఒక్కలింగం" అని పేరు పెట్టి అక్కసు వెళ్ళగక్కుతూండేవారు.
కేవలం ఒకే ఒక్క పాటతో దశాబ్దాలతరబడి నా పేరు ప్రతిష్ఠలు నానాటికీ పెరిగిపోతూ ఉంటే ఎంతటివారికైనా కడుపు రగిలిపోతుంది. నా పాట కంటే ఎంతో విలువైనపాటలూ పదునైనపాటలూ భావగాంభీర్యంగల పాటలు, సందర్బోచితమైన పాటలు ఇలా రకరకాల పాటల్ని వందలాదిగా రాసిన రాతగాళ్ళెందరో ఉన్నారు. వారిలో ఏ ఒక్కరికీ సరిపోలను నేను. ఆ పాట తీసేస్తే నన్ను ఎవరూ ఏకారణంగానూ గౌరవించాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళెవ్వరికీ రాని గౌరవ పురస్కారాలెన్నో నాకొచ్చాయి. కాబట్టీ వాళ్ళకి ఆమాత్రం కడుపుడుకుండటం సహజం.
స్వాతంత్ర్యదినోత్సవం వచ్చిందంటేచాలు బుల్లితెర వినోదవాహినులన్నింటిలో ఎక్కడ చూసినా ఇదే పాట. నిరంతర వార్తాస్రవంతుల్లో ప్రతి వార్తా కదంబంలోనూ ఎక్కడో ఒకచోట నా పాట వినిపిస్తూనే ఉంటుంది.
చైత్రమాసంలో నా పుట్టినరోజు వచ్చింది. అది నా ఎనభయ్యో పుట్టినరోజు. దాంతో మా కుటుంబ సభ్యులంతా కలిసి అశీతి వేడుకలు జరిపారు.
ఇప్పుడెక్కడ చూసినా స్పర్శవాణులే కదా! దృశ్యచిత్రీకరణ చాలా సులభమైపోయింది. ప్రతివాడూ ఛాయాగ్రాహకుడే. ప్రతివాడూ దృశ్య సంకలన నిపుణుడే. అందరూ కలిసి నా అశీతి సంరంభాల్ని అందంగా కూర్చి చక్కని చలన చిత్రంలాగా రూపొందించి దాన్ని అంతర్జాలంలో పెట్టారు.
అది పెట్టిన నెలరోజులకి ఓ న్యాయవాదినించీ ఇంతపొడుగు ఉత్తరం వచ్చింది.
అందులో ఇలా ఉంది:
అయ్యా, మీరు అంతర్జాలంలో పెట్టిన అశీతి మహోత్సవం తాలూకూ దృశ్యాలని చూశాము. అందులో మా సంస్థకు చెందిన పాటని మా అనుమతి లేకుండా ఉపయోగించడం జరిగింది. ఆ పాటని ఎన్నిసార్లు ఉపయోగించిందీ ఎన్ని నిమిషాల సమయం ఉపయోగించిందీ వివరాల్ని ఈ లేఖలో పొందుపరుస్తున్నాము.
మీరు ఉపయోగించిన పాటకు సంబంధించిన హక్కులని ఫలానా సంగీత దర్శకుడు ఫలానా చలన చిత్ర నిర్మాతకీ.., ఫలానా నిర్మాత ఫలానా బుల్లితెర వినోదవాహినికీ.., ఫలానా వాహిని ఫలానా ఖండాంతర సంస్థకీ.., ఆ ఫలానా ఖండాంతర సంస్థ మా అంతర్జాతీయ సంస్థకీ అమ్మడం జరిగింది. కావున ఆ పాట పూర్తి హక్కులను మా విశ్వసంగీత కళాసంస్థ పొందియున్నది. కనుక ఆ పాటని పూర్తిగా గానీ పల్లవినిగానీ, చరణాలనుగానీ పల్లవి-చరణాల మధ్య కూర్చిన వాయిద్య సంగీతాన్నిగానీ ముందస్తు అనుమతి లేకుండా అనగా తగిన రుసుము చెల్లించకుండా ఉపయోగించుకోవడం శిక్షార్హం. అందుకుగాను మా సంస్థ శిక్షాస్మృతిని అనుసరించి తగిన మొత్తాన్ని దండనగా విధించే హక్కుని మేము పొందియున్నాము.
ఈ పాట విషయమై మీ గురించి వాకబుచేయగా మీరే ఈ పాట రాసిన కవి అని తెలిసినది. అందుకే యథేచ్ఛగా ఈ పాటను పలుమార్లు ఉపయోగించుకున్న విషయం అర్థమైనది. బహుశా మీ పాట హక్కుల గురించి మీకు తెలియకపోవడం వలన మీరీవిధంగా చేసి ఉంటారని మా న్యాయవాదుల బృందం అభిప్రాయపడింది. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అని మీకు ఒకరు చెప్పవలసిన అవసరం లేదు. అయినా అంతగొప్ప పాట రాసిన మీకు దండన విధించడం మా సంస్థ గౌరవానికే భంగకరం. అలాగని పూర్తిగా వదిలిపెడితే అందరూ ఈ తప్పు చెయ్యడమే పనిగా పెట్టుకుంటారు. అప్పుడు సంస్థకి నష్టం కలుగుతుంది. అందువల్ల మీకు ఎటువంటి దండనా లేకుండా కేవలం మా సంస్థ న్యాయశాఖకు మీవల్ల అయిన ఖర్చులని మాత్రమే వసూలు చేయాలని నిర్ణయించింది.
ఇంక ఉత్తరం చదవడం ఆపేసి వెనక్కి తిప్పి చూశాను.
నేను కట్టవలసిన మొత్తం చూడగానే నాకు దిమ్మతిరిగిపోయింది.
అది నా యావదాస్తుల్నీ అమ్మినా సరిపోదు.
నేను ఎప్పుడో యాభైయేళ్ళ క్రితం రాసినపాట. ఇంకా నన్ను వేటాడుతూనే ఉంది.
(ప్రొఫెసర్. గజేంద్ర పాండా గారు ‘యూట్యూబ్’ మాధ్యమంగా సంస్కృతంలో చెప్పిన లఘు హాస్య కథానికకు తెలుగులో అనువాదం)
ఒక గ్రామ సమీపంలోని త్రోవలో ఒక నల్లని బండరాయి పడి ఉండేది. అది సరిగ్గా మార్గమధ్యంలోనే ఉండడం మూలాన ఆ దారిగుండా నడిచే గ్రామస్థులు ఆ రాయి కాళ్లకు తగిలి ఇబ్బంది పడుతుండేవారు. ఒక రోజు ఒక సాధువు ఆ త్రోవలో నడుస్తూ రాయి తన కాలికి తగలడంతో నొప్పితో చాలా బాధపడి తనలాగే ఎందరో పాదచారులు ఇలా కష్టానికి గురి ఔతున్నారని చింతించి అతి ప్రయాసతో ఆ బండరాయిని పెకిలించి అవతల పడేసి తన దారిని పోయాడు.
అప్పుడు ఆ రాయి దొర్లుకుంటూ దొర్లుకుంటూ వెళ్ళి, విధివశాత్తు ఒక బిల్వవృక్షం మొదట్లో పడింది. తెల్లవారి అడవిలో వంటచెరుకు కోసం వచ్చిన కొందరు గ్రామస్థులు ఆ బండరాయిని చూసి ఆశ్చర్యచకితులై కొంత ఆలోచించి “ఆహా! మన కొరకు సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడే ఇలా లింగరూపంలో ఇక్కడ వెలిశాడు” అని చాలా సంబరపడ్డారు. వారు వెంటనే ఊరిలోనికి పరుగెత్తి ఈ విషయాన్ని అందరితో ఆనందంగా చెప్పారు. దాంతో గ్రామస్థులందరూ అక్కడికి వెళ్ళి ఆ రాయిని చూసి ఎంతో పొంగిపోయి వెంటనే దానిని ఆ చెట్టు క్రింద లింగరూపంలో ప్రతిష్టించారు.
వేదమంత్రాల మధ్య ఆ రాయిని అభిషేకించి, పూజించి, నైవేద్యాలను సమర్పించారు. అప్పటినుండి భక్తులు తండోపతండాలుగా అక్కడికి రావడం మొదలుపెట్టారు.
ఈ విధంగా ఆ బండరాయి మరియు బిల్వవృక్షం రెండూ ఆనందంగా ఉండసాగాయి.
ఎందుకంటే ప్రతిదినం శిలకు నీటితో పాలతో అభిషేకం జరిగేది. అలాగే చెట్టు ఆ నీటిని,పాలను పీల్చుకొనేది. అది కూడ రాయితో పాటు పూజ లందుకునేది. దేవవృక్షం అని ఎవరూ దానిని తాకేవారు కాదు. కాని ఇతర వృక్షాల ఆకులను త్రుంచి కొమ్మలను నరికేవారు.
ఇలా చాలా కాలం గడిచింది. ఒకరోజు రాయి మరియు చెట్టుకు మధ్య గొప్ప కలహం చెలరేగింది నేనంటే నేను గొప్పని. నా పాదాల వద్ద పడి ఉన్నావు కాబట్టే నీకింత గౌరవమని చెట్టు, నా కారణం చేతనే నిన్నెవరూ తాకకున్నారని రాయి వాదులాడుకొని చివరకు రాయి ఇక తను అక్కడ ఉండనని దొర్లుకుంటూ, దొర్లుకుంటూ పోయి దూరంగా ఒక నది ఒడ్డున ఇసుకలో పడింది.
మరునాడు ఉదయం గ్రామస్థులు చెట్టు మొదట్లో రాయి కనిపించక పోయేసరికి కంగారుపడుతూ అంతటా దానికొరకు వెదకి నది ఒడ్డునున్న రాయిని గుర్తించలేక విచారంతో తమ ఇళ్ళకు మరలి పోయారు. ఈలోగా కొందరు గ్రామయువకులు ఇది గమనించి ఇక ఈ చెట్టు సామాన్యమైనదే నంటూ చెట్టుకొమ్మలను గొడ్డలితో నరికి వాటిని ఇంటికి తీసికొనిపోయారు. అప్పుడు చెట్టు విపరీతంగా ఏడ్వసాగింది. కాని ఎవరూ దాని మొరను వినలేదు.
అక్కడ ఇసుకలో పడి ఉన్న రాయిని ఒక చెప్పులు కుట్టేవాడు గమనించి " ఈ రాయి నున్నగా భలే బాగుందని " తన ఇంటికి పట్టుకుపోయి దానిపై చెప్పుల నుంచి మేకులను దిగగొట్టడానికి ఉపయోగించసాగాడు.
సీమంటే వానదేవునికి కూడా చిన్న చూపని అందరికి తెలిసిన విషయమే కదా. ఎక్కడ లేని రీతిలో అక్కడ నాగళ్ళ నడాలు విరిగిపోతుంటాయి. పచ్చగా ఉండాల్సిన చేనులు బీడులై గోడును శూన్యంతో వెళ్ళబోసుకుంటుంటాయి. ఆ సీమ సిగలోనే నేను వాడిపోయిన ఓ పుప్పొడి కణాన్ని, నా గురించి చెప్పడమంటే వలసకు వీలునామాను రాయడమే అవుతోంది. గడిసిన గతాన్ని తర్వాత నెమరేసుకుందాం వాడిపోయి దిక్కులు చూస్తున్న వాస్తవంలోకి వద్దాం రండీ.
అది సాయంత్రం నాలుగు గంటలు, అంతలోనే సోముగాడి బైక్ పై ఆదోని రైల్వే స్టేషన్లో దిగాను నేను. వాడు తిరుగుముఖం అయ్యాడు. నేను లక్ష్మీ దేవికి నిలయమైన జేబులోకి చేయివేసి, కరెన్సీ నోటొకటి తీసుకోవడానికే తిరుమల్లో నారాయణుడిలా కూర్చున్న అతని చేతికిచ్చి, నా మొక్కుబడి చెల్లినట్టు గుర్తుగా అతను ఇచ్చిన టికెట్నూ తీసుకొని నన్ను సీమ నుంచి మరోలోక స్వర్గసీమకు తీసుకెళ్ళే రెక్కలులేని వాహనం కోసం ఎదురుచూపులు మొదలెట్టాను.
ఇంతలో యుద్దానికి రణభేరి మోగినట్టు రెక్కల్లేని వాహనమైన పొగబండి కూత చెవుల్లో చేరి నాట్యమాడింది. నేను బ్యాగు భూజానికి మరోసారి నాకు తెలియకుండానే సవరించుకొని రైలెక్కాను.
నువ్వు జరగమంటే నువ్వు జరగమనే తోపులాట టగ్ ఆఫ్ వార్ యను ఆట మొదలైంది. ఆ తోపులాటల ఊపులో ఊగిపోయి ఎట్టాగో అట్టాగా ఇంద్రుడు తన సీటు సంపాదించుకోవడానికి కష్టపడ్డట్టు, నానా తంటాలు పడి కాస్తా జాగాను పుడుక్కొని ఓ సీటులో కూర్చున్నాను నేను.
బియ్యంకై రేషన్ షాపు ముందు క్యూ కట్టినట్టు నా వెనకున్న జనాల దండు ఒక్కసారిగా నెట్టబడింది. ఇంకేముంది క్షణాల్లోనే అలజడికి అంకురం పడింది. ముందున్న బామ్మ గారెళ్ళి ఎదురుగున్న తాతపై పడడం, వలసబోయడానికి పైకెక్కి మరీ కూర్చున్న సామాన్లు సంచికి కట్టిన తాడు తెంచుకుని జనాల నెత్తిన పడడం, నువ్వు దొబ్బావంటే నువ్వు దొబ్బావని ఒకరినొకరు తిట్లతో కడుక్కోవడం మలినమైన మనసు తీరును ప్రదర్శించడం, అన్నీ ఒకదాని వెనక ఒకటి జరిగిపోతుంటే రైలు తనకేమీ పట్టనట్టూ చెవిలో సీసం వేసుకున్న దానిలా పరుగెడుతూనే ఉంది. ఇంతలో ఓ పిల్ల ‘జింకా జింకా’ ని అరవడంతో నాకు తెలియకుండానే నా చూపులు కిటికీలోకి దూరి తినడానికి గడ్డిపోచ దొరకక పరుగుతీస్తున్న జింకలపైన పడ్డాయి. నా మదిలో ఆలోచనలు కూడా వాటితోనే పరుగుతీయడం మొదలెట్టాయి. అప్పుడర్థమైంది నేనే కాదు అవి కూడా వలస బోతున్నాయని. ఏదైతేనేం గీనేలపై బుట్టినందుకు గీబాధలు దప్పవనిపించి నన్ను నేను తమాయించుకుంటూ నా ప్రక్కనే నిలబడిన పిల్లను నేనున్న సీటులో కూర్చబెట్టుకుంటూ యాడికెళతావ్ పిల్లా అని అడిగాను.
గా పిల్ల గబుక్కున చెప్పింది. గుంటూరుకని. ఎందుకెళతావని అడిగ్గా, మిరపకాయల్ తెంపడానికని మిరపకాయంత ఘాటుగా చెప్పింది ఆ పిల్ల. బడికెందుకెళ్ళవని అడిగాను నేను. గట్లెటైతది మా అమ్మ అయ్య మిరపకాయలు తెంచడానికి చేనికెళుతారు, నేను మా బుడ్డొడు తారుపోల్తో కట్టుకున్న గుడిసెలో ఆడుకుంటాం. సాయంత్రమైతే గిన్నెలు తిక్కి కసువూడ్చి పెడతాను, అమ్మొచ్చి బువ్వొండి పెడతాది. బడికెళితే గీ పనులెవరు చేయాలి గందుకే నేనెళ్ళనని ఖరాఖండిగా చెప్పిందా పిల్ల.
నేను బిత్తరపోయి దిక్కులు చూస్తూ ఉండిపోయాను. పిల్లకు చదవుకోవాలని ఎట్లా చెప్పాలో అర్థంగాక. ఇంతలోనే ప్రక్కనున్న వాళ్ళమ్మ నా దగ్గరకొచ్చి ఏమైయ్యా మీరు చదువుకున్నది చాలదా... మా పిల్లల్ని కూడా ఎందుకు పాడుజేస్తారు. పెద్దపెద్ద చదువులు చదివిన మీరేం పొడిచారు, నాయకులిచ్చే ఫించిని డబ్బులకై, గా ఊరూ గీ ఊరూ ఉరకడం తప్ప. మీకే పనుల్లేవు మా పనులెందుకు చెడుపుతారు పిల్లల్ని బడికి పంపమని అందరు జెప్పెవారే, వెళ్ళయ్య వెళ్ళు మీ పనిచూసుకో పో మేమేదో కూలీనాలీ చేసుకుని బ్రతుకుతాముగాని మీరు నీతులు చెప్పక్కరల్లేదని నాపై విరుసుకు పడిందామె. నిజమేలే ఇంట్లో దుమ్మును తీయలేని నేను వాళ్ళకేమీ చెప్తాననుకున్నాను. ఇంతలోనే ఆకాశవాణి చప్పుడులా మీరు చేరవలసిన ప్రయాణం వచ్చినట్టూ మాటొకటి నా చెవిన పడటంతో ఆ పొడవాటి బస్సు దిగి నా ప్రయాణానికి విరామమొచ్చినట్లు తలచి గవర్నమెంట్ వేసిన కుర్చీ లో కూర్చొని నన్ను నా గమ్యానికి తీసుకెళ్ళే మరో పొగబండి రాకకై ఎదురుచూస్తూ ఉండిపోయాను. ఏనాటికైనా నా సీమను పచ్చగా చూడాలని విద్యతో నిండిన అభివృద్ధితో నా సీమలోని ప్రతి గడపలో ఉండే నాగళ్ళ ఆశలను పదికాలాలు చల్లగుండాలని ఆశీస్తూ.