Menu Close
Kadambam Page Title
ఈ నలుగురే అతని వెలుగు....
-- చందలూరి నారాయణరావు

కంటితో ఎంత పోట్లాడినా
నిద్ర బాకీ తీర్చేది లేదని తెగేసి చెప్పింది.

మత్తు బిళ్ళతో చేసిన మోసానికి
నీకిదే శిక్షని ముఖం చాటేసింది.

గదిలో అర్ధరాత్రి దాకా
నిశబ్దాన్ని తాగి తూలుతూ
దిగులు మడుగులో జారిపడ్డాడు.

పక్కనే జాలిపడ్డ పుస్తకం దగ్గరకొచ్చి
నిజాలను తాగించి నిద్రపుచ్చేలోగే
తనూ కునుకుతో నేలకు వాలింది.

ఒక్క ఆవలింత కూడా
కనుచూపు మేరలో కనిపించక
గడియారానెక్కిచూపు
అమాంతం  డైరీలోకి దూకింది.

ఒక్క వాక్యం నడవని
డైరీలో నేటి పేజి ఖాళీగా కుములుతుంటే
కట్టలు తెగిన కళ్ళ నీరు
నేటి అనుభవాన్ని కోసుకొని ఎటో వెళ్లిపోయింది.
తడిసి చీకిన కాగితంపై  కలం వాలడానికి ఇష్టపడలేదు.

కృత్రిమ సంతోషమైన నిద్రకు ముఖమంతా
మత్తు ముసురుతో మంచానికి వ్రేలాడుతోనే ఉంది.

నిశబ్ధం మేట వేసి చెవులు
మనసుకు సంబంధం తెగినట్లు
దూరంగా ఎవరినో చూస్తున్నాయి.

తాగిన నిజాలకు ఆరాయింపులేక
తప్పులు బయటకురాలేక
లోపలే  మనిషికి శిక్ష వేశాయి

కలసిరాని కాలానికి
మా తప్పులేదని గోడ గడియారంలోని
మూడు ముల్లులు కలసి
గుసగుస లాడుకొంటున్నాయి.

ఇన్ని బరువులను
తాను భరించలేనని నిద్ర
తనకు విశ్రాంతి అవసరమని
తరలి వెళ్లిపోయింది.

బాకీ తీర్చవలసిన కళ్ళు
తలుపులను శాశ్వతముగా మూసుకున్నాయి.
ఆలేస్యంగా తెల్లరే ఆ గది పెందలేకడనే
తెరచుకున్నది.

నిశబ్దం టపటపలాడుతూ
రెక్కలు విప్పుకొని దుర్వార్తతో
ఊరి కనురెప్పలపై వాలి తట్టి చెప్పింది.

పుస్తకములో  కలం తలముడుచుకొని ఏడుస్తూనే ఉంది.

టేబుల్ కు అతుక్కున్న అట్ట  తలెత్తనూలేదు...

తెల్ల కాగితాలు నల్లని ముఖంతో
నేలను పారాడుతున్నాయి....
మౌనంగా రోదిస్తూ బీరువాలో పుస్తకాలు

అతని ఆస్తులం మేమేనని గర్వంగా చింతిస్తున్నాయి...
పుస్తకం, కలం, అట్ట, కాగితం
ఈ నలుగురితో
అతని అంతిమ యాత్ర ముగిసింది.

బయట నలుగురు అతని అక్షరాల గురించి మాట్లాడుకొంటున్నారు ఆనందంగా ....
ఇంటిలోని మనుషులు అతని మాటలు కోసం ఇల్లంతా వెదుకుచున్నారు వేదనగా.......

Posted in May 2020, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!