ఈ ప్రపంచంలో అత్యంత విలువైనవి, ప్రాధాన్యత కలిగిన వస్తువుల మూలాలన్నీ ఈ మట్టిలో నుండి ఉద్భవించినవే. బంగారం, ప్లాటినం, మణులు అన్నీ భూమినుండి లభిస్తున్నవే. కానీ తమ స్వయం ధర్మాల ఆధారంగా వాటికి గుర్తింపు లభిస్తుంది. అలాగే, నివసిస్తున్న పరిసరాలు, చుట్టుప్రక్కల సమాజం అపరిశుభ్రంగా ఉండవచ్చు. నివసిస్తున్న ప్రదేశాలు చాలా ఇరుకుగా ఉండవచ్చు. కానీ సాటి మనిషి కష్టాన్ని గుర్తించి మానవత్వంతో ఆదుకొంటూ, మానవజన్మ సార్థకత విలువలను గుర్తించిన సగటు మనిషి యొక్క మనసు ఎంత స్వచ్ఛంగా, పరిశుభ్రంగా, విశాలంగా, పవిత్రంగా ఉంటుందో తమ కర్తవ్యాలతో ఎందఱో మహానుభావులు నిరూపించి మనకు ఆదర్శమూర్తులుగా, స్ఫూర్తి దాతలుగా నిలుస్తున్నారు. అటువంటి కోవలో నిలిచి తన దైనందిన జీవన కర్తవ్యాలతో ఎంతో పరిణితి సాధించిన మహానుభావుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత, శ్రీ దేవరపల్లి ప్రకాశ్ రావు నేటి మన ఆదర్శమూర్తి.
ప్రకాశరావు గారు మన తెలుగు నేల మీద పుట్టి, బాల్యంలోనే కుటుంబసభ్యులతో కలిసి బ్రతుకుతెరువు కోసం ప్రక్క రాష్ట్రమైన ఒడిసా కు వలసవెళ్లి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు తట్టుకొని చివరకు కటక్ ప్రాంతంలో టీ కొట్టు యజమానిగా స్థిరపడ్డాడు. సాధారణ టీ కొట్టు యజమాని ఆదాయం తన కుటుంబ రోజువారి అవసరాలకు సరిపోతుంది. కానీ ఈ మహానుభావుడు తన కుటుంబంతో పాటు మరో పదిమందికి ఆసరాగా నిలబడాలనే సంకల్పంతో ‘ఆశా ఓ ఆశ్వాసన’ అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి, ఆ సంస్థ ద్వారా మురికివాడల్లోని నిరుపేద పిల్లలకు చదువు, ఆహారం అందిస్తున్నారు. తన బాల్యం అంతా చదువుకోవాలని ఆశ ఉన్ననూ అవకాశం లేదు. తన లాంటి పరిస్థితి తన తరువాతి తరానికి ఉండకూడదనే స్థిర సంకల్పంతో తన బస్తీలోని పిల్లలకు తన ఇంట్లోనే ఒక చిన్న స్కూల్ ఏర్పాటుచేసి చదువు చెప్పించడం మొదలుపెట్టారు. ప్రభుత్వ పాఠశాలలో అయితే మధ్యాహ్న భోజన పధకం ద్వారా ఆహారం అందిస్తారు మరి ఈయనది ప్రవేట్ పాఠశాల కనుక తన సంపాదన నుండే ఖర్చు చేసి అక్కడ చదివే పిల్లలకు భోజనం పెట్టేవారు. నేడు ఆ స్కూల్ దాదాపు 70 మంది పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నది. ఇలా ఎన్నో సామాజిక కార్యక్రమాలను తన వంతు బాధ్యతగా నేటికీ నిర్వర్తిస్తున్నారు. ‘అందరూ బాగుండాలి అందులో మనముండాలి’ అనే సూత్రానికి కట్టుబడి ఎన్నో మంచి కార్యక్రమాలను చేస్తున్నారు.
‘ఆరోగ్యమే మహా భాగ్యం’ ‘రక్తదానానికి మించిన దానం మరేదీ లేదు’ ఇవి ఆయన నమ్మిన మరో రెండు సూత్రాలు. అందుకే వందల సార్లు రక్తదానం చేసి నిజమైన మహోన్నత వ్యక్తి అని అనిపించుకున్నారు. నేటికీ రక్తమే కాదు, ఎటువంటి సహాయమైనా వెనుకాడక చేస్తున్నారు. ఆయన రక్తదానం నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. ప్రతి రోజూ హాస్పిటల్ కు వెళ్లి రోగులకు పండ్లు, పాలు అందిస్తేనే తనకు ప్రశాంతంగా ఉంటుంది.
ఆ మహానుభావుని నిస్వార్థ సేవకు తగిన గుర్తింపు లభించిందనే చెప్పవచ్చు. ఆయన అవార్డుల కొఱకు ప్రయత్నించలేదు. అవే ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి. మన కేంద్ర ప్రభుత్వం ఆయనను ‘పద్మశ్రీ’ బిరుదుతో సత్కరించడం ఎంతో సంతోషకరం. ఆ నిస్వార్థ జీవి ఇలాగే పదికాలాల పాటు ఆయురారోగ్య, అలుపెరుగని సామాజిక చైతన్యంతో, మానసిక ప్రశాంతతతో పదిమందికి మార్గదర్శకుడిగా జీవితాన్ని కొనసాగించాలని మనఃస్పూర్తిగా కోరుకుందాం.