చిత్రకవిత
చుక్కమల్లెలు, మందారము
చం. విరిసిరిసంపదల్ ధరను వేడుకగా సృజియించె ధాత; యీ
విరిసిన చుక్కమల్లియల శ్వేతశుభాకరరూప(1) మెంచి మ
త్సరమున “నెఱ్ఱరం గొకటె సంచర(2) మంత యలందె(3) నేల యీ
కరణి విరించి నా?” కనుచుఁ గష్టము నొం దొక పుష్ప మల్లదే.
(1) స్వచ్ఛతకు చిహ్నమగు తెల్లని దళములపై శుభప్రదమైన
కుంకుమరంగు బొట్టులుకూడిన ఆకృతి
(2) శరీరము (3) పూసెను
డాలియాలు
మత్తకోకిల. ఇంతచక్కని యార్తవ(1)ద్వయ మెందుఁ గానఁగ శక్య మీ
వింత సృష్టివరంబెగా; కనువిందుగా వికసించి తా
మెంతొ ప్రీతిగఁ బల్కరింపఁగ నింగితంబు(2) గలట్టి సు
స్వాంతముల్ మనసార మెచ్చి ప్రశాంతతన్ బడయున్ గదా
(1) పుష్పము (2) అభిప్రాయము తెలిపెడి భ్రూభంగము