ఎవడిని తొక్కుతవో...
ఎవడిని నెత్తిన నెట్టుకుంటవో..
నీకు తప్ప ఎవడికెరుకయ్యా...
నువస్సలే తలతిక్కలోడివి తైతక్కలాడుతవు
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా...
ఎప్పుడు పుడితివో...
ఎట్ల పుడితివో...
ఎవరికి తెలుసయ్యా...
అమ్మ నాన్న లేకుండనే పుట్టి సృష్టికి అమ్మవైతివి
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా
సృష్టి మూలం అమ్మంట
అమ్మే..కనిపించే దేవతంట
అంతటి అమ్మైనా నీ ఆటలో బొమ్మంట
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా
లింగానికి అంగము పుట్టెనయ్య
అంగానికి లింగము పుట్టెనయ్య
లింగ అంగ సంగమాన్ని సహించే శ్రీకారం అమ్మనయ్యా
ఆ అమ్మ నీలోనే సగమయ్యా...
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా
పాకుతను పొర్లుతను
నా.. నా..అల్లరి చేస్తను
అర్ధనారీశ్వరుడైనా నీ గడ్డము లాగుతను
మంగళ సూత్రం నములుతను
ఎంతైనా...నీ బిడ్డను కదయ్యా...
ఈ బిడ్డను ఏడిపిస్తవో...నవ్విస్తవో...
నీ ఇష్టమయ్యా...
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా
ఏడ్చినా...నవ్వినా...బాల్యం ముద్దుగుంటదయ్యా
ఆ బాల్యాన్ని పదేళ్ళకే పండబెట్టి
దేహ దాహమును లేపి మోహములో ముంచుతావయ్యా...
వెగటు కలయికను సగటు సరసం చేసి
లింగాకారానికి చిహ్నమంటవు
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా
మోసం చేయుట మాయతో పెట్టిన విద్య నీకు
మోసపోవుట ఆశతో పట్టిన విద్య మాకు
ఆశ ఆయువు తీయుట వాయువుతో విద్య కాలానికి
ఏ విద్యైనా...! నీ మిద్యే కదయ్యా...
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా
ఓంకారానికి నువ్వు పుట్టావు
నీ గుండెలోంచి ఒకడు పుట్టాడు
వాడి కడుపులోంచి ఒకడు పుట్టాడు
వాడి దేహమునుంచి ఎవడెవడో పుట్టాడు
ఎవడెవడినుంచో మేము పుడితిమి
ఎవడెవడిని ఎందుకు పుట్టిస్తవో...?ఎందుకు పండబెడతవో...?
మొదట పుట్టిన నీకె తెలుసు
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా
తైతక్కలాడి ఆడి విసుగొచ్చినదేమోనయ్యా
కోతివైనవు
నా కన్నును నేనే..తింటనంటు మన్నునుంచి
మిన్నుకురికినవు
అడ్డమొచ్చిన ఆహమును ఓ తన్ను తన్నినవు
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా
నువ్వు మారుతై విష్ణుమూర్తిని కొలుస్తవు
విష్ణుమూర్తి రామమూర్తై నిన్ను కొలుస్తడు
మేము మీ ఇద్దరి రామాయణమును కొలుస్తము
మీరిద్దరూ ఏకమై మా బ్రతుకు భాగవతమును కొలుస్తరు
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా