అయ్యగారి వారి ఆణిముత్యాలు
(అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు)
కవితాశిల్పము కం. భావాందోళికపై నుడి రావము తూర్యంబు గాఁగఁ బ్రతిభావీధిన్ ఠీవిగఁ గవితాశిల్పము ఠేవణము(1)నుఁ జూపు మెఱవడి(2)కి వందనముల్ (1)దిటవు (2) ఊరేగింపు భావము- భావము అనే పల్లకిమీద పలుకుయొక్క ధ్వని వాద్యపుమ్రోత కాగా, ప్రతిభ అనే వీధిలో గొప్పగా కవితాశిల్పము తన దిటవును ప్రదర్శించే ఊరేగింపునకు నమస్కారములు. 255 వాక్కు చం. అశుభముఁ బల్కరాదు జన, మా పరమాత్మ యొసంగె వాక్కు నే పశుఖగజిహ్మగాదులకు వశ్యము గాని వరంబుగా సదా నిశితవిచక్షణాభరితనిర్మలచిత్తముతో వచింపఁగా దశదిశలన్ శుభాకరముఁ దథ్యము గూర్చును పల్కుశక్తియే256 కవితాస్పందన ఉ. సంబర మెంత కూర్చినవొ చక్కని మీ కవితాసుమంబు లా యంబర మంత సంతసిల? నద్భుతగంధము సోఁకి యాడవే యంబుదముల్ ముదంబున? నయంబుగ నర్తన సేయు కేకి యా డంబర మీ భువిన్ దెలుప ఢక్కలు ముక్కలు గాక మానునే? 257 శ్రీవేంకటేశ్వరవైభవము మ.కో. భోగ మన్నను నీదు భోగమె భోగిరాట్శయనా! మహా భాగు లెందఱొ నీదు దర్శనభాగ్య మొంది నుతించి, రే తీఁగ(1) వల్కిన రాగ మైనఁ ద్వదీయవైభవవర్ణనన్ భాగధేయము గాఁగ రంజిలు భావిభావుక(2)దాయియై (1) దేవమానవవాగ్గేయకారుల వాద్యతంత్రి (2) శుభము/మంగళము 258 ప్రభాతదర్శనము కం. వరువాత(1)దర్శనముతోఁ గరువా తరువాత పనుల ఘనశుభములకున్? బరువా తనయుని రక్షణ? పరు(2) వాతపవారణముగఁ బట్టిన స్వామీ! (1) ప్రాతఃకాలము (2) పరువు=పర్వతము భావము- ప్రాతఃకాలమున నీ దర్శనము చేయగా, దాని తర్వాత చేసే పనుల వలన కలిగే దిట్టమైన శుభములకు కరువు ఉండదు. నీ పుత్రుని రక్షణ నీకు భారమా? (గోగోపాలుర రక్షణ కొఱకు) పర్వతమును గొడుగుగా ఎత్తి పట్టుకొనిన ఏలికవు నీవే కదా.259 సౌందర్యము శా. స్త్రీసౌందర్యము గూర్చెఁ గంజుఁడు ముఖశ్రీపద్మపత్రాక్షులన్ హాసబ్రహ్మరసాకరోష్ఠదరకంఠశ్యామలాస్రంబులన్ వ్యాసాపీనపయోధరాల్పకవలగ్నాలన్ సరోనిమ్ననా భీసారోరునితంబపల్లవనయావిర్భూతహస్తాంఘ్రులన్. భావము- స్త్రీ యొక్క అందమును బ్రహ్మదేవుడు వీటిలో సమకూర్చేడు – ముఖకాంతి, తామరరేకులవంటి నేత్రములు, నవ్వు మఱియు అమృతమునకు నిలయమైన పెదవులు, శంఖము వంటి మెడ, నల్లని కురులు, విరివి కలిగి బాగుగా బలిసిన స్తనములు, చిన్నదైన నడుము, కొలను వలె నుండి లోతైన బొడ్డు, చేవ కలిగిన తొడలు, పిఱుదులు, చిగురాకుల కోమలత్వముతో ఆవిర్భవించిన చేతులు మఱియు పాదములు.260