అయ్యగారి వారి ఆణిముత్యాలు
(అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు)
శ్రీవిష్ణువు
వృత్తప్రాససీసము
వందారుజనకామ్యమందారు నిందిరా
సరసహృన్మందిరు సరసిజాక్షు
నిందీవరాసితసుందరఘనకాయు
సింధుగంభీరు రక్షితకరీంద్రు
బృందారకమునీంద్రబృందార్చితపదార
విందు గోవిందు ముకుందుఁ గుందుఁ
గందర్పరిపుసఖు సందీప్తకౌస్తుభ
చందనాంచితవక్షుఁ జక్రహస్తు
తే.గీ. మణిగణభ్రాజితోరుకంకణకిరీట
కటకకుండలకేయూరుఁ గనకవసను
దందశూకవ్రజేశ్వరతల్పు నంద
నందను భజింతు డెంద మానంద మొంద 43
సీ. మా వ్రాఁత లన్నియు మా వ్రాఁతలను దిద్దు
మహిమాన్వితమ్ములై మహిని వెలయ
మాచేతఁ జేయించు మా చేత లన్నింటి
సిద్ధింపఁజేసి మా చేతములను
చేతనమ్ములు సేయఁ జేతులెత్తి యొనర్తు
వందనమ్ములు హరిచందన మగు
కందమ్ము లర్పింతుఁ గన్దమ్ము లీక్షింప
డెంద మానందమ్ము నొంది మమ్ము
తే.గీ. నందనోద్యానవనపుష్పబృందగంధ
మత్తచిత్తంబునకు నివి హత్తుకొనఁగ
నందనందన! గోవింద! నరసఖా! ము
కుంద! బృందావనవిహారి! యందుకొనుమ 44
తే.గీ. క్షీరసాగరపుత్రియే శ్రీమతియయి
నిన్ను సేవింప మేమిచ్చు వెన్నపాలు
నీకు లెక్కయె లోకేశ? నెమ్మనమున
విన్నపాలు కృపాబ్ధివై విన్నఁ జాలు 45
కం. బృందావనచారీ! సుర
బృందావన! (1) శ్రితమనోఽoబుజేందిందిర!(2) హే
ఇందీవర(3)నిభగాత్రా!
ఇందీ(4)వర! పాహి దినకరేందుసునేత్రా! 46
(1) రక్షించినవాడు (2) భ్రమరము (3) నీలికలువ (4) లక్ష్మి
శా. వాత్సల్యం బొలికించు కన్నుఁగవతో భక్తానురాగంబుతో
సత్సాంగత్యము గూర్చి యెల్లపుడు నీ సాన్నిధ్యమే యిచ్చి మా
కుత్సాహంబు నొసంగుమా శరధికన్యోల్లాసదాస్యాంబుజా!(1)
తాత్సారంబును మాని యేలుమ మమున్ దాక్షిణ్యవారాన్నిధీ! 47
(1) సాగరపుత్రియైన లక్ష్మీదేవికి ఉల్లాసమునిచ్చు ముఖకమలము కలవాడా
కం. పదరాజీవమ్మే(1)గతి
పదరా జీవమ్ము నిలిపి వారించదె యా
పద రాజీవమ్మున(2); కా
పదరాజి వహించి విష్ణుభజన యొనర్పన్ 48
(1) పాదకమలమే (2) ఏనుగు
ఉ. ఏ చరణంబు లోకముల కెల్లను దిక్కయి కాచు బ్రహ్మమో
ఏ చరణంబుఁ దాఁ గడిగి సృష్టివిధాయకుఁడే తరించెనో
ఏ చరణంబు నొత్తు సిరి యెప్పుడుఁ బాయని ప్రీతిభీతులన్
ఆ చరణంబు మా కిడు శుభాకర మీ నవవత్సరంబునన్ 49
మానిని కుండలమండితకర్ణదరస్మితకోమలగండవిభానన! యా
ఖండలవందితచందనచర్చితకౌస్తుభపీతదుకూలయుతా
ఖండలసద్ఘనగాత్రమయూఖవిఖండితదాసజనాఘతమో
మండల! పాహి! ధరాధరవాస! రమాపృథివీశ! దయాంబునిధీ! 50
పం. రమాధరానివాసవక్ష! బ్రహ్మసేవితాంఘ్రిభూ
సమస్తలోకపావనీప్రశస్తచారువిగ్రహాఽ
సమప్రభూ! ప్రభూతరమ్యసౌమ్యనృత్యసేవితా!
నమత్స్వభక్తగానకేళినందివర్ధనోత్సుకా! 51
మ.కో. మార్గశీర్షము నందుఁ జక్కని మార్గమందున శీర్షమం
దర్గళంబువినా(1) సమంచిత మైన భక్తి భజించినన్
భార్గవాప్తుని(2), మార్గనాముని(3), బాధలున్ భయదుర్గతుల్
నిర్గమింపవె? యిర్గడల్(4) సుఖలేఖితాలయి సాగఁగన్ 52
(1) అడ్డంకులు లేకుండా
(2) శివునకు / ఏనుగునకు, ఆప్తుడైనవానిని
(3) కస్తూరీనామముకలవానిని (విష్ణువును)
(4) రెండుప్రక్కలు (ఇహపరములు)