అయ్యగారి వారి ఆణిముత్యాలు
(అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు)
ముందుమాట: సంస్కృతాంధ్ర సాహిత్య పిపాసి, నిత్య సాధనా పారంగతుడు, మాతృభాషాభిమానం మెండుగా కలిగి సాహిత్య సేవకై తపించేవాడు, శాస్త్ర సాంకేతిక విజ్ఞాన ఘనుడు, అమ్మవారి అనుగ్రహ పాత్రుడై బహుభాషా కోవిదుడుగా ప్రభవించి నేటికి వేలపద్యాలను చక్కటి వ్యాకరణ శుద్ధితో రచించి ఎంతోమంది తెలుగు భాషాకోవిదుల మన్ననలను పొందిన శ్రీ అయ్యగారి సూర్యనారాయణమూర్తి గారి విరచితమైన పద్యాల గ్రంథాలయం నుండి వారి అనుమతితో కొన్ని ఆణిముత్యాలను సేకరించి మరల మన సిరిమల్లె పాఠకుల కొఱకు ఇక్కడ పొందుపరుస్తున్నందుకు ఎంతో ఆనందముగా ఉన్నది. శ్రీ అయ్యగారి సూర్యనారాయణమూర్తి గారి ప్రతి పద్యమూ ఒక అద్భుతమే. ఆయన దేవీకటాక్ష వరసిద్ధుడు. అందులో నుండి కొన్నింటిని మాత్రమే ఇక్కడ అందిస్తున్నాము.
ఆ.వె.
అయ్యగారివారి యాణిముత్యా లివి
ఆదరించి చదివి యాలకించి
ముదము నొంది, కూర్చి మూర్తికవిత్వమ్ము
తనియఁ జేయరారె తత్వ మరసి