ఆ పసుపుకొమ్ము
స్వేచ్ఛకు
తూట్లు పడ్డాయి
ఏడడుగుల పేరుతో
తన మనసుపై పడి
గుచ్చుతున్న నాగజెముడు
అతను కావడంతో
అతను
సారా చుక్కకు చిక్కుకున్నప్పుడల్లా
ఆ గుడిసెలోని ఆమె ఆకలి
కడిగిన కంచంగానే మిగిలిపోతుంది
అతను ఎంగిలిపడడు
ఆమెను పడనివ్వడు మరీ
ఆమె ఏంటో
అతనికి తెలుసు
అతనేంటో
ఆమెకు తెలుసు
కనుకే
వారి జీవితం
ఏకమైనా అనుభూతి
తరంగాల మనసు
అతను నిత్యం
అనుమానపు కత్తులు నూరుతూనే ఉన్నాడు
ఆమె నిత్యం
ఉలుకు పలుకులేకుండా
సాగిపోతూనే ఉంది
ఆమెకు తెలుసు
సంసారమనే
బలిపీఠంలో చిక్కుకున్నానని
అతనితో పాటు చిందేస్తే
తెగిపడ్డ పేగులు అనాధలైతాయని
ఎన్ని అక్షరాలను
ఆత్మీయతగా
అల్లుకున్నారో
అనుబంధపు తీగపై
ఆహ్లాదంగా ఆయువును
ఆరగిస్తూ సాగుతున్నారు
ఎన్ని పదాల పూలను
మనసులో దాచుకున్నారో
దహించే గుణమున్న
జీవనాన్ని
దరహాసాలై దాటుకుంటూ ముందుకెడుతున్నారు
ఏ వాక్యంలో నేర్చుకున్నారో
సంసారపు సందెనలో సర్దుకుపోతూ
ఒకరికొకరమని ఒదిగిపోతున్నారు
అతను ఆమె
కష్టసుఖ జ్ఞాపకాలను దాంపత్య కొంగుముడిలో
భద్రంగా దాచుకుంటూ
అక్షరం
పదం గొప్పది అంటున్నది
పదం
అక్షరం గొప్పది అంటున్నది
వాక్యం
అవి రెండూ గొప్పవి
నాకు జన్మనిచ్చాయని
వాటికి నమస్కరిస్తున్నది
అతను
ఆమె గొప్ప అంటున్నాడు
ఆమె
అతను గొప్ప అంటున్నది
మానవత్వ వారసత్వం
వారిరువురు గొప్ప
సృష్టికి జన్మనిచ్చారని
వారికి పాదాభివందనం
చేస్తున్నది.
ఆమె అక్షరమై
ఎదురుచూస్తుంటే
అతను పదమై
పలుకరించాడు
అంతే
వారి జీవితం వాక్యమై
పూర్తయింది
Super