యవ్వనపు వనంలో
ఆమె మనసు మల్లెపువ్వే
విచ్చుకోగానే
పరిమళం చూపుల గుండా
అతన్ని చుట్టుముట్టింది
ఆ పరిమళ స్పర్శ తాకి
అతని ఆశలు రెక్కలు విచ్చుకున్న తుమ్మదలై
ఆమెను చుట్టుముట్టాయి
వారిరువురిప్పుడూ
రతి దారానికి కట్టబడి
ఒకే మనసు కలిగిన తనువులు
అతని మాట మనసుపై పడి
అతని చెయ్యి వీపుపై పడ్డప్పుడల్లా
ఆమె మనసు నిప్పు పొయ్యి అయై
మండే కట్టెలో కన్నీళ్ళను ఉంచుకుని కుమిలిపోతుంటది
అంతలో
తన పేగే మల్లెతీగై మెడకు చుట్టుకోవడంతో
చన్నీళ్ళ కుండై నవ్వుతుంటది
తన గుండె మంటపై తనే వర్షమై...
ఆమెకు
తన కలల యవ్వనమే
ఆవేదన అలలై బాధిస్తున్నది
అతను
గుడిసె గుర్తుకురాని
ఆంబోతై
ఊరిలో ఉరకలేయడంతో
ఆమె అతని హృదయంలో
పరిమళిస్తున్న పువ్వు
అతను ఆమె హృదయంలో
విహరిస్తున్న తుమ్మెద
వారివురూ చూపుల అలల పరావర్తనంలో చిక్కి
ఊహాల సుడిగుండమై
వలపు మేఘాలతో
తలపు చినుకులతో
ఆశలను కౌగిలించుకొని
విరహనది అంచులను దాటి
ఏకాంత రసకేళి సవ్వడితో
ఒదిపోయారు
ప్రేమ సాగరతీరాల్లో
అతను
చినుకులతో
సాళ్ళ మధ్య తడుస్తున్నాడు
ఆమె
తటుకులతో
గుడిసె మధ్య తడుస్తున్నది
వారి జీవితం ప్రకృతి ప్రభుత్వ అవరోధాల మధ్య పూడ్చబడిన
ఆశలతో తడుస్తున్నది
ఎంతైనా దేశానికి వెన్నెముకలు కదా
అంతైనా తడవకపోతే
దేశం పచ్చగా ఎలా ఉంటుంది మరీ ..!
ఆమె పువ్వైతే
అతను తుమ్మెదైతాడు
అతను పువ్వైతే
ఆమె తుమ్మెదైతాది
దాంపత్యం మంటే
ఓ మనసుతో కదిలే రెండు తనువులు మరి..