అన్నా... నీ అనురాగం
నేడు కుటుంబ వ్యవస్థలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సామాజిక పరిస్థితులు, జీవన స్థితిగతులు ఎన్నో మార్పులకు నోచుకొంటున్నాయి. అందుకనే నాడు ఉన్న ఉమ్మడి కుటుంబ జీవనం నేడు దాదాపు మారిపోతున్నది. చిన్న వయసులోనే పిల్లలు కూడా తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ చదువుకుంటున్నారు. ఇక తోబుట్టువుల మధ్య అనురాగ ఆప్యాయతల ఆలంబనలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇది మనందరం అంగీకరించాలి. అట్లని అది తప్పు కాదు. భౌతికంగా దూరంగా ఉన్నా, సామాజిక మాధ్యమాల ద్వారా ఎక్కడ ఉన్నా, ఏ సమయంలో నైనా పలకరించుకొనే భాగ్యం మనకు కలుగుతున్నది. ఒక చెల్లెలు తన పుట్టినరోజునాడు తన అన్న దీవెనల కోరుతూ పాడుకొన్న ఈ మధుర గీతం మీ కోసం...
చిత్రం: ఆడపడుచు (1967)
సంగీతం: టి. చలపతి రావు
గీతరచయిత: దాశరథి
నేపధ్యగానం: సుశీల
పల్లవి :
అన్నా... నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం
ఓ అన్నా నీ అనురాగం...
పుట్టిన రోజున మీ దీవనలే... వెన్నెల కన్నా చల్లదనం
ఓ అన్నా నీ అనురాగం..
చరణం 1 :
మల్లెలవంటి మీ మనసులలో చెల్లికి చోటుంచాలి
ఎల్లకాలము ఈ తీరుగనే చెల్లిని కాపాడాలి..
పుట్టిన రోజున మీ దీవనలే... వెన్నెల కన్నా చల్లదనం
ఓ అన్నా నీ అనురాగం.... ఎన్నో జన్మల పుణ్యఫలం
ఓ అన్నా...
చరణం 2 :
అన్నలు మీరే నా కన్నులుగా... నన్నే నడిపించాలి
తల్లీ తండ్రీ సర్వము మీరై... దయతో దీవించాలి
పుట్టిన రోజున మీ దీవనలే... వెన్నెల కన్నా చల్లదనం
ఓ అన్నా నీ అనురాగం... ఎన్నో జన్మల పుణ్యఫలం
ఓ అన్నా...
చరణం 3 :
ఇల్లాలినై నేనెచటికేగినా... చెల్లిని మదిలో నింపాలి
ఆడపడచుకు అన్నివేళలా... తోడూ నీడగా నిలవాలి
పుట్టిన రోజున మీ దీవనలే... వెన్నెల కన్నా చల్లదనం
ఓ అన్నా నీ అనురాగం... ఎన్నో జన్మల పుణ్యఫలం
ఓ అన్నా..