Menu Close
balyam_main

సామెతలతో చక్కని కధలు

- ఆదూరి హైమావతి

అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు

మారేడు పల్లెలో మల్లన్న అనే యువకుడు నా అన్న వారు లేని అనాధ. ఊహ తెలిసినప్పటి నుంచీ ఆ ఊరి శివాలయం లో పూజారి చెప్పిన పనులేమన్నాచేసి ఆయన పెట్టే ప్రసాదం తింటూ, ఆయన చెప్పే మంచి మాటలు వింటూ, ఆయన దగ్గరే చదవనూ, రాయనూ నేర్చుకుంటూ రోజూలు వెళ్ల దీసుకునేవాడు.

వాడు కాస్త పెద్దయ్యాక పూజారి "చూడూ మల్లన్నా! నీవు పెద్దవాడి వవుతున్నావు. నాకా వయస్సు వస్తున్నది. ఎంతకాలం ఇలా స్వామి వారికి పూజలు చేస్తూ బతుకుతానో తెలీదు. నేను పెట్టే ప్రసాదమూ నీకు చాలదు. కనుక నీవూ ఒక బ్రతుకు తెరువు వెతుక్కోడం మంచిది. ఏదైనా పని నేర్చుకుని చేసుకో. రాత్రులు ఈ ఆలయం చావట్లోనే ఎప్పటిలా  పడుకో, నేనూ ఒంటరి వాడినే! ఇంత కాలం కాస్త తోడుగా ఉన్నావు. నా వృధ్ధాప్యంలో కూడా నాకు తోడున్నట్లు ఉంటుంది. మనిద్దరిదీ ఏదో జన్మ జన్మల బంధం అయివుంటుంది. ఐనా నీకూ బరుకుతెరువుకో దారి ఉంటే మంచిది." అని చెప్పాడు. ఆ మాటలు నిజమే అనిపించాయి మల్లన్నకు.

మరునాడు ఒక గొడ్దలి సంపాదించి, ఊర్లో ఎవరైనా ఏవైనా కొమ్మలు, కట్టెలు కొట్టే పని చెప్తే చేయసాగాడు. వారిచ్చిన సొమ్ము పూజారయ్య వద్ద దాచుకుంటూ, ఏ పనీ దొరకనప్పుడు దగ్గరగా ఉన్న అడవిలో ఎండుకట్టెలు కొట్టి ఊర్లో అమ్ముకుంటూ, వండుకోవడం కూడా నేర్చుకుని తన కాళ్ళ మీద తాను నిలబడటం సాగించాడు. వాడి పట్టుదలకూ, కష్టపడి బ్రతకడం నేర్చుకుంటున్న వాడి తీరుకూ పూజారయ్య సంతోషించాడు.

మంచి ఒడ్డూ పొడుగుతో, బలిష్టంగా, కోరమీసాలు పెంచి ఉన్న మల్లన్న ను చూస్తే ఎవరికైనా కొంత భయం వేయక మానదు. ఐతే వాడి మంచితనం అందరికీ వాడిమీద ఆదరాన్ని కలిగించింది. అంతా ఏపనైనా ఉంటే 'మల్లన్నా!' అని పిలిచి చేయించుకుని వాని కష్టానికి తగినంత ఇవ్వసాగారు.

అది పురాతన కాలపు ఆలయం కావటాన ఆ శివరాత్రికి శివాలయానికి దూరప్రాంతాల నుంచీ కూడా జనం బండ్లు కట్టుకుని వచ్చి చెట్ల క్రింద పడుకుని, బండ్లక్రింద వండుకు తిని మూడురోజులు ఉత్సవాలు తిలకించి వెళ్లారు.

ఆ మూడురోజులూ, మల్లన్న పూజారయ్య మాట ప్రకారం వారికంతా కావాల్సిన సేవలు చేస్తూ రాత్రులు దొంగలవలన భక్తులకు ఏ బాధా కలక్కండా చుట్టూ కాపలా కాస్తూ సేవచేశాడు.

ఆ మరునాడు పూజారీ, మల్లన్నాకూడా బాగా అలసి పోయి ఆదమరచి నిద్రిస్తున్న తరుణంలో అర్దరాత్రివేళ ఇద్దరు దొంగలు వచ్చి ఆలయం తలుపులు పగలగొట్టే ప్రయత్నం చేయసాగారు. ఒక చెట్టు క్రింద చీకట్లో నిద్రిస్తున్న మల్లన్న ఎక్కడి నుంచో తాళం పగలగొడుతున్న శబ్దానికి అదాటున మెలకువవచ్చి కళ్ళు నులుముకుని శబ్దం ఎక్కడ నుంచి వస్తున్నదో గమనించాడు. వెంటనే తన పెద్ద గడకర్ర అందుకుని మెల్లిగా అడుగులేస్తూ ఆలయ ప్రధాన ద్వారం దగ్గరకు వెళ్ళాడు. ఎవరైనా వస్తారేమోని కాపలా కాస్తున్న ఒక దొంగ మల్లన్నను చూసి తన దగ్గరున్న కత్తితో పొడవబోయాడు.

మల్లన్న చాకచక్యంగా తప్పించుకుని తన కర్రతో వాడిమీద దాడి చేశాడు. రెండో దొంగా వచ్చి మల్లన్నమీద పడ్దాడు.

"ఏరా! మాతో తోడైతే భాగమిస్తాం, లేకపోతే నీ శరీరభాగాలు కోసేస్తాం. జాగ్రత్త! మా మాట విను బతికిపోతావ్!. మేము చాలా పెద్ద దొంగలం. శివరాత్రి ఉత్సవాలకు వచ్చిన సొమ్ము మూడు వాటాలేసుకుందాం. లేకపోతే నీవు బతకవు" అని బెదిరిస్తూ చెప్పారు.

దానికి మల్లన్న నవ్వి"ఎదవల్లారా! దేవుని సొమ్ము తింటార్రా! బతకంది నేను కాదు. మీరే" అంటూ వారిని తన కర్రతో కొట్టబోయాడు. దొంగలిద్దరూ ఏకమై మల్లన్న మీద ఎదురు  దాడిచేశారు. కొద్దిసేపు ఇద్దరిమధ్యా కొట్లాట జరిగింది. మల్లన్నకూ కొన్నిదెబ్బలు తగిలాయి. ఐతే బలవంతుడూ, ధైర్యవంతుడు, దైవం సొమ్ము కాయాలనే సద్బుధ్ధిగల మల్లన్న  వారి దెబ్బలకు భయపడక తన బలంచూపి వారిని కొట్టి, కట్టి పడేశాడు.

వారు "అయ్యా! బుధ్ధితక్కువై గుడి దొంగతనానికి వచ్చాం. ఈ ఒక్క సారికీ కాయండి. వదిలేయండి. మరో మారు ఇటు రానేరాము." అని వేడుకున్నారు.

మల్లన్న నవ్వి “ఒరే ‘అందిరే జుట్టూ అందకపోతే కాళ్ళూ' అన్నట్లు ఇందాక నన్ను బెదిరించి, భాగమిస్తామని ఆశపెట్టి, ఇప్పుడు కాళ్ళ బేరానికొస్తార్రా! ఇంత బలవంతులు కష్టపడి పనిచేసుకుని బతక్క దోపిడీలూ, దొంగతనాలూ చేసే మిమ్ము వదిలేస్తే ఇంకా ఎందరిని మీ వాటాల మాటలతో పాడుచేస్తారో, ఎందరిని దోచుకుంటారో మిమ్మల్ని వదిలేది కల్ల" అంటూ ఆలయ స్థంభానికి పెడరెక్కలు విరిచికట్టేసి, పూజారయ్యను లేపి, ఊరివారిని తీసుకొచ్చాడు.

అంతా మల్లన్న పనికి సంతసించి, దొంగలను ఊరి పెద్దలకు అప్పగించి, ఊరివారంతాకలసి మల్లన్నను ఊరి కాపలాదారుగా నియమించుకుని, నెలజీతం ఏర్పాటు చేసారు. పూజారయ్య మల్లన్న మంచి స్వభావానికి ఆనందపడి, అతనికి పని లభించినందుకు ఎంతో సంతోషించాడు.

అదర్రా బాలలూ కష్టపడి మంచిగా బ్రతికేవారికి అంతా మంచే జరుగుతుంది.

Posted in November 2019, బాల్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!