అదే ..... పెద్ద మేలు
కవిత్వానికి కొలతలు లేవు
ప్రతిదీ కవిత్వమై పోతోంది.
కవికంటూ అర్హతలు లేవు
కలంపట్టినవాడల్లా కవైపోతున్నాడు.
పదాల్లో అర్ధం కాదు పరమార్ధం స్ఫురించాలి
వాక్యాల్లో విరుపులుంటే చాలదు మెరుపులు వరించాలి
పదాలపేర్పులో ఓర్పుకావాలి, చెప్పేతీర్పులో నేర్పుకావాలి.
భావంతో పాటు జీవం కవితలో తోణికిసలాడాలి.
కవితను చదువుతూఉంటే
కొంతవింతగా, ఒకింత కవ్వింతగా
కాసింత గిలిగింతగా, మరికొంత పులకింతగా
విషయాన్ని విశేషం వెన్నాడాలి.
మన కవిత ఒకరికి ఓదార్పు మరొకరికి రహదారి కావాలి
అందరినీ దరిచేర్చాలి, అదే పదివేలు.
మన కవితను ఒక్కరు దీవించినా,
ఒక్కరు ప్రేమించినా,
ఒక్కరు ఆదరించినా చాలు,
అదే పెద్ద మేలు.
సహజ కవిత్వానికి, కవికి నిజమైన రివాజు