Menu Close
VSRao
అశోక మౌర్య
డా. వల్లూరుపల్లి శివాజీరావు

నీతి శాస్త్రం

అర్ధ శాస్త్రం తరువాత చాణక్య రచించిన మరొక అద్భుత గ్రంధం “నీతి శాస్త్రం”. 17 అధ్యాయాలున్న ఈ గ్రంధం ప్రారంభంలో చాణక్యుడు “నిజం అన్నిటికంటే చేదు అయినది" అని వెల్లడిస్తాడు. జీవితంలోని వాస్తవికత, ప్రజల బలహీనతలు చాణక్యుడికి చాలా బాగా తెలుసు. ప్రజలకు నిజం తెలిసినా, వారికి నిజం మాట్లాడాలని తెలిసినా చివరకు అబద్ధాలనే హత్తుకుంటారు. అందువల్ల ఈయన నిజానికి అబద్ధానికి మధ్యనున్న దూరం, వివాదం తగ్గించటానికి ప్రయత్నించటం జరిగింది.

చాణక్యుడికి ‘మానవీయత’ అన్ని మాటలకంటే గొప్పది. మానవులు ధర్మంతో ముడి వేయబడ్డారు. ఆయన దృష్టిలో దేవుడే ప్రపంచాన్ని పాలించేవాడయితే ఆయనకు కష్టాలే ఉండవు! దైవారాధన, యాత్రలు, పూజ, పవిత్రమైన స్నానం మనస్సును శుద్ధిపరుస్తాయి.

మానవుడు అన్ని వేళలా ప్రశాంతతో, నిగ్రహంతో ఉండాలి. భోజన సమయంలో నిశబ్ధంతో ఉండాలి. ఎవరయితే భోజన వేళల్లో కనీసం ఒక సంవత్సరం పాటు మౌనంగా ఉండగలరో వారికి లక్షల సంవత్సరాలు స్వర్గంలో స్థానం ఉంటుంది అని చాణక్యుడి నమ్మకం!

నీతి శాస్త్రం లిఖించే ముందు చాణక్య మూడు లోకాలకు అధిపతి అయిన మహావిష్ణువుకు మోకరిల్లి ఆయనకు ప్రార్ధన చేసి “అనేక శాస్త్రాలనుంచి సేకరించిన నీతివాక్యాలను వివరిస్తాను” అంటూ ప్రారంభించటం జరిగింది.

వీటిని వివరించే ముందు “ఏ మానవుడు ఈ నీతివాక్యాలను చదువుతాడో, వాటిని అనుసరించి జీవితాన్ని ధర్మ మార్గంలో నడుపుతాడో, తాను వేటిని పాటించాలో, పాటించకూడదో తెలిసిన వ్యక్తి ఉత్తముడు, కొనియాడ దగినవాడు. అందువల్ల ప్రజల మంచి దృష్టిలో పెట్టుకుని నేను నిర్వచించే విషయాలు నిర్ద్వందంగా తెలియజేస్తాను. వీటిని ప్రజలు తగిన విధంగా స్వీకరించి మంచి వైపుకు ప్రభావితమవుతారని ఆశిస్తాను” అని చాణక్య వెల్లడించాడు.

పండితుడైన చాణక్య ప్రతి విషయాన్నీ అనేక కోణాలలో పరిశీలిస్తాడు. సుగుణం, దుర్గుణం ఆయన దృష్టిలో సంబంధిత పదాలే. ఆయన తన నీతిశాస్త్రంలో జీవిత సాఫల్యత, గమ్యం, ధర్మం, సద్గుణం గురించి విపులంగా వ్రాయటం జరిగింది.

అనేక నీతి వాక్యాలలో మచ్చుకు కొన్నిటిని ఈ సంచికలో తెలియజేస్తాను. మరికొన్ని తరువాత సంచికలలో పొందుపరుస్తాను.

2300 ఏళ్ల క్రితం చాణక్య వ్రాసిన నీతి వాక్యాలు ఈ రోజుకూ సముచిత మైనవి, అనుసరణీయమైనవి.

భార్య, భర్త, సంతానానికి, కుటుంబానికి సంబంధించినవి.

  1. ఎవరి పుత్రుడు తనకు విధేయుడో, ఎవరి భార్య ప్రవర్తన తన (భర్త) కోరికలకు, ఆకాంక్షలకు అను గుణంగా ప్రవర్తిస్తుందో, ఎవరి సంపదతో తృప్తి పొందుతారో వారు అతని జీవితానికి భూమి మీద స్వర్గం చూపించగలరు.
  2. తెలివిగల తండ్రులు తమ పుత్రులను నీతిమార్గంలో పెంచాలి; పుత్రుడికి నీతి శాస్త్రంలో జ్ఞానం ఉంటే, మంచి నడవడిక వల్ల అతని కుటుంబ గౌరవం, కీర్తి ఇనుమడిస్తాయి; తమ పుత్రులకు సరి అయిన విద్యను అందించని తల్లి దండ్రులను వారి శత్రువులుగా పరిగణించాలి.
  3. తెలివిగల పురుషుడు మర్యాదగల కుటుంబంలోని కన్యను వివాహమాడాలి; హీన కుల కుటుంబ కన్యను అత్యంత అందగత్తె అయినా వివాహమాడ కూడదు; సమాన అంతస్తు కన్యతో పరిణయం అత్యంత మేలైనది.
  4. సాధారణంగా పురుషుడితో పోల్చితే స్త్రీకి రెండు రెట్లు ఆకలి, నాలు రెట్లు సిగ్గు (బిడియం), ఆరు రెట్లు ధైర్యం, ఎనిమిది రెట్లు కామం (మొహం) ఉంటుంది.
  5. నీ కుమార్తెను మంచి కుటుంబానికి చెందిన వ్యక్తితో వివాహం చేయి; నీ పుత్రుడిని విజ్ఞాన వంతుడిని చేయి; నీ శత్రువును విషాదంతో నింపు; నీ మిత్రులను ధర్మ మార్గంలో నడిపించు.
  6. పుత్రుడిని 5 సంవత్సరాల వరకు లాలించు, తరవాత 10 సంవత్సరాలు దండించు, కాని 16 సంవత్సరాలు వచ్చినప్పటినుంచి అతనిని స్నేహితుడిగా ఆదరించు.
  7. ఎవరి పుత్రుడు తనకు విధేయతో ఉంటాడో, ఎవరి భార్య ప్రవర్తన తన ఆకాంక్షలకు అనుగుణంగా ప్రవర్తిస్తుందో, ఎవరైతే తన సంపదతో తృప్తితో ఉండగలడో అతనికి భూమియే స్వర్గం.
  8. కోకిల (పక్షి) అందం దాని స్వరంలో ఉంటే, స్త్రీ అందం భర్త యెడల అమిశ్రతమైన భక్తి, ప్రేమలో ఉంటుంది. అలాగే కురూపి అందం అతని పాండిత్యం, విద్వత్తులోనూ, సన్యాసి అందం అయన క్షమ లోనూ ఉంటుంది.
  9. ఒక్క సువాసన వెదజల్లే వృక్షం పూచే పుష్పాల వల్ల అడవి మొత్తం అంతా సువాసన మయం అవుతుంది. అలాగే ధర్మపరులయిన పిల్లల వల్ల ఒక కుటుంబం కీర్తి పొందుతుంది, సంపూర్ణమవుతుంది.
  10. సద్గుణాలతో నిండిన ఒక కుమారుడు అవి (సద్గుణాలు) లేని నూరుగురు కుమారుల కంటే చాల ఉత్తముడు. (ఉదాహరణకు దుర్యోధనాదులు).
  11. కష్టకాలాలకు సరిపడా ధనాన్ని నిలువచేసుకోవాలి; ధనాన్ని త్యాగం చేసి భార్యను రక్షించుకోవటం; భార్య కొరకు కలిమిని (సంపదను) కూడా పరిత్యజించాలి; కాని ఆత్మ (ఆత్మ శుద్ధి) పరి రక్షణ కొరకు సంపదను, చివరకు భార్యను కూడా పరిత్యజించాలి.
  12. విధులు నిర్వహించే సేవకుడిని, కష్టాలలో ఉన్న బంధువుని, విపత్తులో ఉన్న మిత్రుడిని, దుర్దశ లో ఉన్న భార్యను నిశితంగా పరిశీలించి, వారు నీకు దగ్గరగా లేదా దూరంగా ఉండాలో నిర్ణయించుకో.
  13. తన పుత్రులకు విద్యను అందివ్వని తలిదండ్రులు వారికి శత్రువులే! అలాగే హంసల సముదాయంలో ఒక కొంగ, ఒక ప్రజా సభలో అజ్ఞాన పుత్రులు కూడా.
  14. జీవిత కాలం (life-span), ఉపాధి పధ్ధతి, ఐశ్వర్యం, విద్య నేర్వటం, మరణ సమయం శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నిర్ణయించబడతాయి.
  15. ఒక స్త్రీ ఎంత అందగత్తె అయినా ఆమెలో సద్గుణం లోపిస్తే ఆమె పైరులు పండని బంజరు భూమి మాత్రమే! ఇది పురుషులకు కూడా వర్తిస్తుంది. పురుషుడు ఎంత సుందరుడయినా, ఆరోగ్యవంతుడయినా, బలవంతుడయినా అతనిలో సద్గుణం లోపించితే అతను నిరర్థకుడు, నిరుపయోగుడు, విలువ రహితుడు.

ధనం, రాజు, రాజ్యం, దైవం, ధర్మం, తదితర విషయాలు

  1. భవిష్యత్తు ఉపద్రవాలకు ధనాన్ని నిలువ చేయాలి. భగవంతుడి ఆగ్రహాన్ని ఏనాడూ తక్కువ అంచనా వేయవద్దు.
  2. భవిష్యత్తులో జరగబోయే ఆపత్తు, విపత్తులకు తట్టుకోవటానికి అవసరమయిన ధనాన్ని భద్ర పరచుకో. “నేను ధనవంతుడను అయినందువల్ల ఆపత్తు, విపత్తులను తట్టుకోవటం నాకేమి భయం” అని విర్రవీగకూడదు. సంపద వీడటం మొదలిడితే ఉన్నదంతా త్వరలోనే కరిగి పోతుంది.
  3. నిన్ను ఆదరించని రాజ్యంలోనూ, జీవనోపాధి లేనిచోట, మిత్రులు లేని ప్రదేశంలోనూ, జ్ఞానం పొందటానికి అనువుగాని చోట నివసించకూడదు.
  4. అయిదుగురు వ్యక్తులు లేని చోట; ధనవంతుడు లేని చోట; వేద శాస్త్రంలో ప్రావీణ్యత లేని బ్రాహ్మణుడు ఉన్న చోట; రాజు, నది, వైద్యుడు లేని చోట; నివసించవద్దు. అలాగే సిగ్గు లేని, ఎవరిని లెక్కజేయని, తెలివిలేని, ధర్మాత్ములు, దయాళువులు కాని ప్రజల మధ్య కూడా నివసించవద్దు.
  5. అవసరమయినప్పుడు, దురదృష్ట సమయంలో, కరువు కాలంలో, యుద్ధ సమయంలో, రాజ్య సభలో, చివరకు స్మశాన వాటికలో కూడా నిన్ను విడనాడని వ్యక్తి నీకు నిజమైన మిత్రుడు.
  6. ఎవరు నీముందు తియ్యగా మాట్లాడుతూ, నీవెనుక నీ వినాశనం కొరకు ప్రయత్నిస్తారో వారు పైన పాలతో నిండిన విషపు కుండ లాంటి వారు.
  7. ఒక వ్యక్తి వంశం ఆతని నడతవల్ల, అతని దేశం (రాజ్యం) అతను ఉచ్ఛరించే భాషను బట్టి, స్నేహం అతని ఉత్సాహహాన్ని బట్టి, దేహం అతను తినే ఆహారాన్ని బట్టి తెలుసుకోవచ్చు.
  8. దుర్మార్గుడిని, సర్పాన్ని పోల్చితే, సర్పం మేలైనది. ఎదుకంటే సర్పం ఒక్క సారే, తాను ఆపదలో ఉన్నదని గ్రహించినప్పుడే, కాటు వేస్తుంది. కాని దుర్మార్గుడు ప్రతి అడుగుకూ కాటు వేస్తాడు. అందువల్ల రాజు (నాయకుడు) మంచి వ్యక్తులు, మంచి కుటుంబాలనుంచి వచ్చిన వారినే తనకు దగ్గరగా ఉంచుకోవాలి. అటువంటి వ్యక్తులను త్యజించకూడదు.
  9. ప్రళయం వచ్చినప్పుడు సముద్రాలు ఉప్పొంగి గట్టులను త్రెంచుకొని, హద్దులను భామిమీద ప్రవహించి సర్వ నాశనంచేస్తూ దిశను మార్చుకుంటాయి. కాని సాధువు ఏనాడూ తన భవత్మార్గాన్ని మార్చడు.
  10. కష్ట పడే వారికి దారిద్య్రం ఉండదు, దేవుడి నామం జపం చేసేవారికి పాపం అంటదు, దేవుడిని స్తుతిస్తూ మౌనంతో ఉన్నవారికి ఇతరులతో వివాదం ఉండదు. ఎల్లప్పుడూ మెలకువగా ఉన్నవారికి (అంటే ఏమరుపాటు లేని వారికి) భయం, అధైర్యం ఉండవు.
  11. ఎవరయితే భయంకరమైన వినాశనం నుంచి, విదేశీ దండయాత్ర నుంచి, దీర్ఘకాల కరువు నుంచి, కుటిల సహచరుడు (సహాయకుడు) నుంచి దూరంగా పారిపోతాడో అతను క్షేమంగా బ్రతుకగలడు.
  12. ఎవరయితే ధర్మ, అర్థ, కామ, మోక్ష పొందడో (సాధించడో) అతను (ఆమె) పదే పదే జన్మిస్తూనే (పుడుతూనే) ఉంటాడు (ఉంటుంది), మృతి చెందుతూనే ఉంటాడు (ఉంటుంది).
  13. మూర్ఖులను గౌరవించని చోటుకు, ధాన్యం బాగా నిలువ చేసిన చోటుకు, భార్య భర్తల మధ్య వైరం లేని చోటుకు లక్ష్మీదేవి తనకు తానే వస్తుంది.
  14. గొప్పతనం దూరదృష్టితో మొదలవుతుంది, వారసత్వం (legacy) తో ముగుస్తుంది. దుష్టురాలైన భార్య, ద్రోహి అయిన స్నేహితుడు, అణకువలేని సేవకుడు, సర్పం ఉన్న ఇంట్లో నివాసం, మృత్యువుని కౌగలించుకున్నట్లే.
  15. నిన్ను అనాదరణ చేసిన దేశం (రాజ్యం)లో నివసించవద్దు. నీకు అవసరమయిన జీవనో పాయం, మంచి మిత్రులు లభించేటట్లు చూడు. ఎల్లప్పుడూ జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉండు.
  16. అవసరమయినప్పుడు నీ సేవకుడి కార్యనిర్వహణను, కష్ట సమయంలో బంధువు ప్రవర్తనను, విపత్తులో స్నేహితుడిని, దుర్దశలో భార్యను పరీక్షించు.
  17. అవరమైన సమయంలోనూ, కష్ట కాలంలోనూ, కరువు సమయంలోనూ, యుద్ధాలప్పుడూ, రాజ దర్బారులోనూ, శవ కర్మకాండల్లోనూ, అక్కరకు రాని మిత్రుడిని విడనాడాలి.
  18. ఎవరయితే చెడిపోయే (నశించే) దాని (వస్తువు) కొరకు చెడిపోని (నశించని) దానిని (వస్తువుని) విసర్జించినా; సందేహం లేకుండా నశించని దానిని విసర్జించినా, అతను నశించే వాటినన్నిటినీ పోగొట్టుకుంటాడు.
  19. మూర్ఖత్వం బాధాకరమైనది. వాస్తవంగా యౌవనం కూడా. వీటికంటే బాధాకరమైనది ఒకరి ఇంటికి బద్ధుడవటం.
  20. ఒక సర్పాన్ని ఒక దుర్మార్గుడు, అవినీతిపరుడుతో పోల్చితే, సర్పం ఒక్క సారే కాటువేసి ఒక వ్యక్తిని వెంటనే చంపుతుంది; కాని ఒక దుర్మార్గుడు, అవినీతిపరుడు ఆతనిని ప్రతి అడుగులోనూ అడ్డుపడి చివరికి చంపుతాడు.
  21. అగ్ని సంభూతుడైన బ్రాహ్మణుడు దేవుని ప్రతినిధి. దేవుడు భక్తుల మదిలో నివసిస్తాడు. సామాన్య వ్యక్తి దేవుడిని విగ్రహ రూపంలో చూస్తాడు. విశాల మనఃసృష్టి ఉన్న వ్యక్తి ఆయనను ప్రతిచోటా చూడగలడు. ఇది మనకందరికీ అవగతం అవ్వాలి.
  22. చంద్రుడు ఒక్కడైనా చీకటిని పోగొడుతుంది. కాని నక్షత్రాలు కోకొల్లలయినా చీకటిని పారద్రోల లేవు.
  23. జీవితం దుఃఖంతో మునిగినప్పుడు నాలుగు విషయాలు ఓదార్పునిస్తాయి. అవి: సంతానం, భార్య, దైవ భక్తులు, దైవ భక్తి.

మరి కొన్ని సునిశిత విషయాలు

  1. ప్రపంచంలో అనేక వస్తువులు, పదార్ధాలను నలగకొట్టి లేదా నూరితే (రుబ్బితే) గాని సంతోషం కలిగించవు లేదా ఉపయోగపడవు. ఉదాహరణకు గోరింటాకు (మెహందీ) ఆకులను రుబ్బితే గాని (చేతికి పెట్టుకున్న తరువాత) ఎరుపురంగు రాదు.
  2. ఇతరులపై ఆధారపడే వ్యక్తి జీవితంలో అరుదుగా పురోగతి సాధిస్తాడు. దీనికి చాణక్య ‘చంద్రుడి’ ని ఉదాహరణగా తీసుకుని ఏవిధంగా వివరించాడు. చంద్రుడు సూర్యుడు మీద ఆధారపడతాడు. సూర్యుడు ఆకాశంలో ఎంతో కాంతితో ప్రకాశిస్తే, చంద్రుడు ఈయన వెనుక దాగుని ఉంటాడు. అలాగే ఒక మానవుడు ఒకరి ఇంట్లో ఆశ్రయం పొంది తలదాచుకుంటే అతను హీనంగా చూడబడతాడు. అందువల్ల స్వశక్తే ఉత్తమం. జీవితంలో ఏదైనా సాధించా లంటే తన వ్యక్తిత్త్వాన్ని తప్పక మెరుగు పరచుకోవాలి.
  3. దురదృష్టం వెంటాడినప్పుడు మానవుడిని తెలివి విసర్జిస్తుంది. కాని దురదృష్టాలు ఒకోసారి ముందుగానే నిర్ణయించబడినందువల్ల ఆసమయంలో మానవుడు హేతుబద్ధతో ఉండే ఆలో చనలను విడిచిపెడతాడు. ఇది ఆతని (ఆమె) వినాశనానికి దారితీస్తుంది.
  4. సర్పాలకు దంతాలలో విషముంటే, తేనెటీగలకు తలలోనూ విషముంటుంది; తేళ్లకు తోకలోనూ విషముంటుంది. కాని చాణక్య నుడివిన ప్రకారం దుష్టుడికి శరీరమంతా విషముంటుంది. అందువల్ల దుష్టుడు అత్యంత విషపూరితమైన వ్యక్తి.
  5. స్వచ్ఛమైన మనసు ఉన్న వ్యక్తి తీర్థయాత్రలకు ఎందుకు వెళ్ళాలి? ధర్మ మార్గం, సన్మార్గంలో పయనించే వ్యక్తి ఇతరుల దుష్ట పనులను ఎందుకు పట్టించుకోవాలి? అనేవి చాణక్యుడి ప్రశ్నలు.
  6. సర్పాలు దేవదారు వృక్ష తొఱ్ఱలలో నివసిస్తే, పద్మం బురదలో పెరుగుతుంది. కాని దాని సుకృతం వల్ల పద్మం మాత్రమే పూజకు అర్హత సంపాదిస్తుంది. ఈ ఉపమానాన్ని కొంతమంది మానవు లకు పోల్చుతూ వారు ఆచరించిన ధర్మం, సన్మార్గం, సద్గుణాలు వల్లనే వారికి పూజార్హత లభి స్తుంది.
  7. సమయాన్ని సద్వినియోగంలో “మహర్షి' గా పేరొందిన చాణక్యుడు “ప్రతి పనికి ఒక సమయాన్ని నిర్దేశించుకుని దానిని పూర్తి చేయాలి; ఒక ప్రణాళిక ప్రకారం పనునులు నిర్వహిస్తే వారు ఉత్తమ వ్యక్తులుగా పరిగణింపబడతారు” అని సూచించాడు.
  8. చీమను ఏనుగుతో పోల్చలేము కాని, రెండూ ఈ విశ్వంలో కలిసి మనుగడ సాగిస్తాయి. దీనిని బట్టి ఒక జంతువు (జీవి) ఏ ఆకారంలో ఉన్నా దాని శ్రమ మాత్రమే ముఖ్యమైనది.
  9. ఒక గోవు ఏ ఆహారం తిన్నా పాలు ఇస్తుంది. ఈ పాలు నుంచి అనేక పదార్ధాలు తయారవుతాయి. అలాగే తెలివిగల వ్యక్తి ఏది చేసినా అయన విజ్ఞానం, తెలివి ఇతరులు అనుసరించ వచ్చు. అయన పలుకులు వింటే మనకు విజ్ఞానం పెరుగుతుంది.
  10. విధి నిర్దేశించిన ప్రకారమే అని జరుగుతాయి. తెలివితో చేసే పనులవల్లనే, శ్రమతోనే ఉత్తమ ఫలాలు దక్కుతాయి.
  11. మానవుడు తాను చేసే పనులవల్లనే ఉన్నత శిఖరాలను అందుకోగలడు. ఒక మామిడి చెట్టు క్రింద కూర్చుని పండిన పండు తన చేతిలోనే పడుతుందని ఆశించవద్దు. కష్టం, శ్రమ లేకుండా అదృష్టం, ఫలితం ఎవరిని వరించదు.
  12. ప్రతి మానవుడు తన జీవితం అంతిమ లక్ష్యం నిర్దేశించుకోవాలి. అన్ని పక్షులు రాత్రి వేళల్లో ఒక చెట్టు కొమ్మ మీద విశ్రమించి ప్రభాత వేళల్లో ఎగిరిపోతాయి. అలాగే ప్రతి వ్యక్తికీ ఈ ప్రపంచం ఒక విశ్రాంతి గది; అది ఎవరి స్వంతమూ కాదు.
  13. గమ్యం లేని, తెలియని వ్యక్తి నిష్ప్రయోజకుడు. సద్గుణం జీవితానికి అందాన్నిస్తుంది.
  14. మంచి గుణం, ప్రవర్తనవల్ల ఆ వ్యక్తి వంశ ప్రతిష్ట పెరుగుతుంది. ఎంత గొప్ప వంశీకుడయినా ఈ సద్గుణాలు లేకపోతే ఆతని గౌరవం తిరిగిపోతుంది.
  15. మానవుడికి జ్ఞానం ప్రధానమైనది. విద్య, పాండిత్యం సద్గుణానికి ప్రతీకలు. ఇవి మానవుడిలో ఉంటేనే విజయాన్ని సాధించగలడు.
  16. సంపదను ఇతరులకు వినియోగిస్తేనే సద్వినియోగం అయినట్లు భావించాలి. ఒక లోభి సంపదను పోగుచేసుకోవటం విలువరహితమైనది; నిరుపయోగమైన సంపద అర్ధరహితమైనది.
  17. ఒక విషయం ఒకరికి ఒప్పు అయితే మరొకరికి తప్పుగా కనిపిస్తుంది. పండితుడు సదా పూజనీ యుడు. ఏ రాజ్య పౌరుడయినా సత్యం విలువ తెలిసిన వ్యక్తిని అందరు గౌరవిస్తారు. ఒక పండితుడికి విద్య, జ్ఞానం శక్తివంతమైన ఆస్తులు. పండితుడు, విజ్ఞానవంతుడు ఏదైనా సాధించగలడు.

చాణక్య తెలిపిన మరి కొన్ని విషయాలను వచ్చే సంచికలో తెలుసుకుందాము.

****సశేషం****

Posted in April 2023, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!