Menu Close
Kadambam Page Title
ఎంత కష్టం!
-- భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు

మోహంనుండి, అదికలిగించే దాహంనుండి
అజ్ఞానం నుండి, అదికలిగించే ఆవేదననుండి
శూన్యంనుండి, అదికలిగించే శోకంనుండి
ఆకర్షణనుండి అదికలిగించే అశాంతినుండి
తప్పించుకోవటం ఎంతకష్టం!

కష్టాలనుండి, అవికలిగించే నష్టాలనుండి
కోరికలనుండి, అవికలిగించే కన్నీటిచారికలనుండి
జన్మలనుండి, అవికలిగించే ఖర్మలనుండి
కలతలనుండి, అవికలిగించే నలతలనుండి
తప్పించుకోవటం ఎంతకష్టం!

కలలనుండి, అవివేసే వలలనుండి
మనసునుండి అదిచేసే మాయనుండి
బలుపునుండి అదికలిగించే అలుపునుండి
జ్ఞాపకాలనుండి,అవికలిగించే వ్యాపకాలనుండి
తప్పించుకోవటం ఎంతకష్టం!

అనుమానంనుండి, అదిసృష్టించే పెనుభూతంనుండి
అబద్ధాలనుండి అవిసృష్టించే అశుద్ధాలనుండి
ఆకృత్యాలనుండి అవికలిగించే అనృతాలనుండి
పరువునుండి అదికలిగించే బరువునుండి
తప్పించుకోవటం ఎంతకష్టం!

తృష్ణనుండి అదికలిగించే కష్టాలనుండి
దూరంనుండి అదికలిగించే భారంనుండి
ఎదనుండి అదికలిగించే సొదలనుండి
వయసునుండి అదికలిగించే వెగటునుండి
తప్పించుకోవటం ఎంతకష్టం!

వలపునుండి అదికలిగించే వగపునుండి
వేదననుండి అదికలిగించే శోధననుండి
క్రోధంనుండి అదికలిగించే ఖేదంనుండి
జననంనుండి అదికలిగించే మరణంనుండి
తప్పించుకోవటం ఎంతకష్టం!

Posted in November 2019, కవితలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *