అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ – హూస్టన్ నుండి నేను ఉమాభారతి.
మా యొక్క వినూత్న దృశ్య-శ్రవ్య ధారావాహిక —వైకుంఠపాళి – జీవన రాగాల పరంపర గురించి ఓ మాట.
ఈ ధారావాహిక నా జీవిత అనుభవాల, కళా ప్రయాణాల, మరియు మానవ సంబంధాల పరంపర. ఇది కేవలం కథలు కాదు—ప్రతి దృశ్యం ఒక భావోద్వేగం, ప్రతి శబ్దం ఒక జీవన స్పందన. నాట్యం, సంగీతం, కవిత్వం, మరియు నిజ జీవిత సంఘటనలు కలిసి, ఈ ధారావాహిక ఒక జీవన నాటకంగా రూపుదిద్దుకుంది.
ఇది చూసే ప్రతి ఒక్కరి మనసును తాకేలా, ఆలోచింపజేసేలా, జీవితం పట్ల కొత్త దృష్టిని కలిగించేలా రూపొందించాం.
ఇది మా ప్రయోగం కాదు—మా పిలుపు. జీవితం అనేది వైకుంఠపాళిలా, ఎక్కడో ఒక చోట, ఒక మెట్టు ఎక్కించేది, ఇంకొక చోట, ఒక పాము కాటేసేది. కానీ ప్రతి క్షణం, ప్రతి అనుభవం, ఒక కళాత్మక ప్రకటన.
ఉపాధ్యాయినిగా, రచయితగా, నాట్య గురువుగా, కళాకారిణిగా, గృహిణిగా, తల్లిగా ఇప్పటికి నాలుగు దశాబ్దాలుగా జీవించిన నా అనుభవాల సమాహారమే వైకుంఠపాళి.
2026 జనవరి నుండి ఈ దృశ్య, శ్రవ్య ధారావాహిక మీ ముందుకి రానుంది.
మా ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహించమని, ఆదరించమని హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాము.
…………………………………
సమాజంలోని సంఘటనల ఆధారంగా, ఎన్నో విశేషాలు, విషయాలని అక్షరీకరించిన నవలిక వైకుంఠపాళి!
వైకుంఠపాళి – భావోద్వేగాల నాట్యం, ఒక జీవిత గీతం. పాఠకులు, ప్రేక్షకుల మనస్సులని తాకేలా ఆలోచింపజేసేలా సృష్టించిన వినూత్న దృశ్య, శ్రవ్య ధారావాహికగా మీ ముందుకు తీసుకుని వస్తున్నాము.
……………………………………
రంగుల రేఖలతో అల్లిన చిత్రంలా
ప్రతి క్షణం ఓ స్వప్నపు తళుకులా,
అందమైన కల – జీవితం
ప్రతి అనుభూతి ఓ మృదువైన పాటలా.
సాగిపోతే –
మన ఆశల నౌక విజయతీరాలకే చేరుతుంది.
కానది ఆగిపోతే –
ఆ పైవాడి మాయాజాలంలో ఓ మౌన విరామవుతుంది
నిజానికి…
మనమంతా భగవంతుడు ఆడే వైకుంఠపాళి లో పావులం,
మన ప్రయాణం ఆయన సంకల్పం.
అందుకే మరి జీవితం ..
ఒక అందమైన కల మాత్రమే కాదు,
ఒక ఆధ్యాత్మిక అన్వేషణ,
ఒక మౌన గమనం,
ఒక కాంతిమయ స్వప్నం.
జీవితం… ఒక వైకుంఠపాళి
ఒక్క దెబ్బకు నిచ్చెనతో పైపైకి ఎక్కేసినట్టే, ఒక్క మలుపులో పాము కాటుతో కిందకి పడిపోతాం.
ఆట మొదలయ్యే ముందు ప్రతి క్షణం – ఆశతో నిండి ఉంటే
డైస్ వేసే ప్రతి క్షణం – అనిశ్చితితో నిండి ఉంటుంది.
ఎక్కడ నిచ్చెన ఉందో తెలియదు,
ఎక్కడ పాము దాగుందో ఊహించలేం.
కానీ…
వైకుంఠపాళి …
డైస్ వేసేది భగవంతుడు కనుక ఆట ఆడేది మనం కాదు,
మన ప్రయాణం – ఆయన సంకల్పం.
— మీ ఉమా భారతి.
********
మొదటి భాగంలో :
బిడ్డ లోని వెలితిని కాక వెలుగుని వెలికి తీయగల గురువు కోసం సాగే ఓ తల్లి తపన తీరేనా? అన్వేషణ ముగిసేనా?