Menu Close
వీక్షణం-160వ సాహితీ సమావేశం
ప్రత్యక్షసమావేశం, కవిసమ్మేళనం & పుస్తక ఆవిష్కరణలు
– ప్రసాదరావు రామాయణం –
vikshanam-160

వీక్షణం సాహితీ గవాక్షం (కాలిఫోర్నియా) 160వ సమావేశం తేదీ 17/12/25న హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో సాయంత్రం 4 గం.నుండి రాత్రి 9 గం. వరకు అత్యంత ఆసక్తిదాయకంగా జరిగింది.

గత 13 సంవత్సరాలు పైగా నిరాటంకంగా, నిరంతరాయంగా, నిర్విఘ్నంగా ప్రతి నెలా జరుపుతున్న ఈ సాహితీ సమావేశాలు ప్రపంచంలోనే ఒక అద్భుతం. ప్రతి నెల అంతర్జాలంలో జరిగే సమావేశాలు ఈసారి ప్రత్యక్షంగా, ముఖాముఖీ జరగడం సాహిత్యాభిలాషులకు ఒక పండుగ దినమైంది! ప్రేక్షకులతో మందిరము నిండిపోయి గేటు బయటకూడా నిలుచుకుని శ్రద్ధగా విన్నారు.

వీక్షణం వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ గీతామాధవి గారు, వీక్షణం భారతీయ ప్రతినిధి శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గార్ల స్వాగత వచనాలతో సభ ప్రారంభమైనది.

ఈ సమావేశంలో 5 పుస్తకాలను ప్రముఖులు ఆవిష్కరించారు. గీతామాధవి గారి “అనగనగా అమెరికా” కాలమ్స్ పుస్తకమును శ్రీ దాస్యం సేనాధిపతి గారు ఆవిష్కరించారు, ప్రముఖ కవి శ్రీ వసీరా గారు బహు చక్కగా సమీక్షించారు. శ్రీ రామాయణం ప్రసాదరావు గారి “నిను చేరని లేఖలు” పుస్తకమును డాక్టర్ గీతా మాధవి గారు ఆవిష్కరించారు, ప్రఖ్యాత కవి శ్రీ వైరాగ్యం ఫ్రభాకర్ గారు అద్భుతంగా సమీక్షించారు. బాలబంధు శ్రీ గద్వాల సోమన్న గారి 86వ పుస్తకం “గిజిగాడు గూడు”ను శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారు ఆవిష్కరించారు, ప్రముఖ కవి శ్రీ సాధనాల వేంకటస్వామి నాయుడు గారు సమీక్షించి అందరిని ఆకట్టుకున్నారు. పిమ్మట కవయిత్రి డాక్టర్ అవధానం అమృతవల్లి గారి పుస్తకం “మట్టి చివురు”ను గీతా మాధవి గారు ఆవిష్కరించారు, డాక్టర్ బుక్కపట్నం రమాదేవి గారు విపులంగా సమీక్షించారు. తరువాత గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారి పుస్తకం “కవితా సౌరభాలు”ను శ్రీ నాళేశ్వరం శంకరం గారు ఆవిష్కరించారు, ప్రముఖ కవి శ్రీ గంటా మనోహరరెడ్డి గారు ముచ్చటైన మాటలతో, మధుర గళంతో, ఆధునిక కవులను ఉటంకిస్తూ సభికులను అందరిని అలరించారు.

ముందుగా ప్రఖ్యాత వ్యాఖ్యాత విశ్వైక గారు నేటి అతిధులను పరిచయం చేస్తూ వేదికపైకి ఆహ్వానించారు.

1.దాస్యం సేనాధి పతి గారు (ఉదయసాహితీ తెలంగాణ అధ్యక్షులు)
2. శ్రీ సుబ్బరాయ శర్మ గారు (ప్రసిద్ధ సినీ, రంగస్థల నటులు)
3.వసీరా గారు (ప్రముఖ కవి)
4.మౌనశ్రీ మల్లిక్ గారు (ప్రముఖ సినీ,టీవీ గేయ రచయిత)
5. సాధనాల వెంకటస్వామి నాయుడు గారు
6.శ్రీమతి రాధాకుసుమ గారు (కవిసమ్మేళన సామ్రాణి )
7.శ్రీ నాళేశ్వరం శంకరం (ప్రముఖ కవి)
8. శ్రీ కందుకూరి శ్రీరాములు గారు (ప్రఖ్యాత కవి వర్యులు!)
9. శ్రీమతి వరలక్ష్మి గారు (ప్రఖ్యాత రచయిత్రి, గీతామాధవి తల్లిగారు)
10.శ్రీ ఘంటా మనోహరరెడ్డి గారు (ప్రముఖ కవి)

వేదిక ఎంత సౌందర్యాన్ని సంతరించుకుందో!!

ముఖ్య అధితి, ప్రఖ్యాత కవి శ్రీ దాస్యం సేనాధిపతి గారు కవితలు పాఠకుల నోర్లలో నానేలాగా ఉండాలని, కవులు మంచి విషయాలు ఎన్నుకొని చక్కగా మొదలుపెట్టి, కొనసాగించి ఆకర్షణీయంగా ముగించాలని కవులకు సలహా ఇచ్చారు. వీక్షణం అధ్యక్షురాలు డాక్టర్ గీతా మాధవి గారు ఒక విలక్షణమైన వ్యక్తి అని, కధలు వ్రాసారు, కవితలు కూర్చారు, పాటలు పాడారు, లఘుచిత్రాలు తీసారు, నవలలు రచించారు, నెచ్చెలి పత్రికను నిర్వహిస్తున్నారు. వీక్షణం గవాక్షాన్ని స్థాపించి 13 సంవత్సరాలనుంది నిర్విరామంగా నెలనెలా నిర్వహిస్తున్నారని చెప్పి సభికులనందరిని ఆకట్టుకున్నారు. ప్రథమ ప్రతినందుకున్న ప్రముఖ నటుడు శ్రీ సుబ్బరాయ శర్మ గారు శ్రీమతి గీతా మాధవి గారు బహుముఖ ప్రఙ్ఞాశాలి అని, వారి కవితలు కధలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయన్నారు. ఆత్మీయ అతిధి కవి, విమర్శకుడు శ్రీ నాళేస్వరం శంకరం గారు గీత గారు గోదావరి తీరాన పుట్టి, మంజీరా ఒడ్డున తిరిగి, ప్రస్థుతం నయాగారాలో తెలుగు సాహిత్యాన్ని పారిస్తున్నారని అన్నారు. మరో అతిధి ముఖ్య కవి శ్రీ కందుకూరి శ్రీరాములు గారు జగ్గంపేటలో జన్మించి కాలిఫోర్నియాలో స్థిరపడి తెలుగు సాహిత్యంలో వెలుగులు చిమ్ముతున్నారన్నారు. మరో అతిధి సినీ టీవి గేయ రచయిత శ్రీ మౌనశ్రీ మల్లిక్ గారు గీతా గారి కవితలను 25 సంవత్సరాలనుండి చదువుతున్నానని, ఆమె ఒక ఇంద్రధనస్సు అని పేర్కొన్నారు. ఒక చక్కని కవితను, ఒక పాటను పాడి అందరినీ ఆకట్టుకున్నారు.

తదుపరి కుసుమ ధర్మన్న కళాపీఠం అధ్యక్షురాలు శ్రీమతి రాధాకుసుమ గారి ప్రార్ధనా గీతంతో ప్రారంభమై వారి నిర్వహణలో కవిసమ్మేళనం జరిగింది. రామాయణం ప్రసాదరావు అనే నాతో సహా 40 మంది కవులు తమ అద్భుత కవితా గానాన్ని వినిపించారు. సభ కరతాళ ధ్వనులతో మార్మోగిపోయింది.

తరువాత గీతామాధవిగారు రచించిన ‘అనగా అనగా అమెరికా’ కాలమ్స్ పుస్తకాన్ని శ్రీ దాస్యం సేనాపతి గారు ఆవిష్కరించారు. ఆవిష్కర్త మాట్లాడుతూ తెలుగు సాహిత్యం విశ్వ వేదికపై వర్ధిల్లాలని ఆకాక్షించారు. పుస్తకాన్ని శ్రీ వసీరాగారు సమీక్షించారు. వారి సమీక్ష ఇది:

“అనగనగా అమెరికా….ఇది గీతా కాలమ్ ….కాలమ్ కథల పుస్తకం. ఇది కాలమ్ అయినప్పటికీ దీన్ని కథల పుస్తకంగానే పరిగణిస్తాను నేను.

ఇందులో అమెరికాలోని తెలుగోళ్ల గోడు చెప్పారు, గొప్పలూ చెప్పారు. వాళ్ల కష్టసుఖాలను సానుభూతితో చెప్తూనే సున్నితమైన వ్యంగ్యం, హాస్యంతో చమత్కార బాణాలు వేశారు. కొన్ని చోట్ల తన అభిప్రాయాలేమీ చెప్పకుండానే,ఎలాంటి వాఖ్యానాలూ చెయ్యకుండానే మనుషుల్నీ పరిస్థితుల్నీ ఉన్నదున్నట్టు చూపించారు. కొండని అద్దంలో చూపించినట్లు చిన్ని కథల్లోనే సాంస్కృతిక పరంగా మనవాళ్ల భ్రమలూ భయాలూ అవలక్షణాలు మంచిలక్షణాలూ అన్నీ చూపించారు. అక్కడి సమాజాన్ని మనలోకి రానియ్యరు, మన పిల్లలు రానిస్తారు. అక్కడే వీళ్లకీ పిల్లకీ పేచీ. పిల్లల వీకెండ్ కథ చూడండి. అమెరికాలో మన పిల్లల పరిస్థితికి అద్దం పడుతోంది. పిల్లల మనోభావాలను చక్కగా చెప్పారు. ఒక చిన్నిపాప మనసులోంచి కథ చెప్పారు. మన సంస్కృతి పరిరక్షణ పేరుతో తల్లి తండ్రులు తమ కలల్ని ఆశల్ని అభిప్రాయాలను పిల్లల మీద ఎలా రుద్దుతారో చూపించారు. వీకెండ్లో సైతం పిల్లలకి ఊపిరాడకుండా చేస్తున్న వైనాన్ని చూపించారు. ఈ కథలో పిల్లల తరపున వకాల్తా పుచ్చుకున్నారు గీతగారు. వ్యక్తి స్వేచ్ఛ కేంద్రంగా నడిచే అమెరికా సమాజంతో సర్దుబాటు అసలు సమస్య. అమెరికా జీవితం కావాలి. డాలర్లు కావాలి. ఇక్కడి నుంచి తీసుకెళ్లి నెత్తిన మోస్తున్న ఫ్యూడల్ విలువల్ని దించుకోలేరు. తాము వదిలించుకోలేక పోగా అవన్నీ పిల్లల మీద రుద్దుతారు. పాపం పసివాళ్లు నోరువిప్పి చెప్పుకోలేని హింసని భరించాల్సి ఉంటుంది. అటువంటి హింసనే పిల్లల మనోభావాల్లోంచి ఎంతో సున్నితంగా చెప్పారు డాక్టర్ కె.గీత.
ప్లే డేటు…దీనికి పూర్తిగా భిన్నమైంది. భారత దేశంలో బాల్యంలో సహజంగా లభించే స్నేహాలూ ఆటలూ అమెరికాలో అంత తేలిగ్గా దొరకవు. ఇక్కడ చాలా ఫ్రీగా సహజంగా పిల్లలు వీధుల్లోనూ, కమ్యూనిటీల్లోనూ ఆడుకుంటారు. అమెరికాలో ఉంటే పిల్లల్ని కలిపి, ఆడుకోవడానికి పెద్దలే ఏర్పాటు చెయ్యాలి. అటువంటి ఏర్పాటే ప్లేడేటు. స్థల కాలాలు మారినప్పుడు ఇటువంటి ఏర్పాట్లు తప్పవేమో. అయినా దీనిలోని ఐరనీని చాలా సున్నితంగా చూపించారు.. అమ్మలూ అమ్మమ్మలూ చేసే వ్యాఖ్యలు హాస్యంగానే కాకుండా కామన్సెన్స్ తో ఉంటాయి. అమెరికా పెంపకం అక్కడి భారతీయుల భయాందోళనలు రిఫ్లెక్టు చేస్తోంది. ఇద్దరు కౌమార ప్రాయంలోని స్కూలు పిల్లలు. వాళ్ల తల్లుల సంభాషణ. ఒక పిల్ల పెళ్లిచేసుకోననీ జీవితాంతం లివ్ ఇన్ రిలేషన్ షిప్లో ఉంటానంటుంది. ఇంకొక పిల్ల అసలు ఈ ఇండియన్ తల్లి తండ్రులకు పుట్టే కంటే అమెరికన్ తల్లితండ్రులకు పుడితే బాగుంటుంది అనుకుంటుంది. ఇందులో వాళ్లతప్పేం లేదు. వాళ్లున్న సమాజం అలాంటిది. దాన్నుంచి ఇన్సులేట్ చెయ్యలేరు. ఈ ఇద్దరు పిల్లలూ వాళ్ల తల్లి తండ్రులకు ఆందోళన కలిగిస్తారు. వారి ఆందోళన వాస్తవం. మనం సానుభూతితో అర్థం చేసుకోవాల్సిందే. మరి పిల్లల తప్పేంటి? అమెరికా బడిలో చదువిస్తూ అక్కడి సంస్కృతితో సంపర్కం లేకుండా ఎలా ఉండగలరు. మరి పేరెంట్స్ ఆందోళనకి కారణం వారి వెనుకబాటు తనమా? ముఖ్యంగా మన ఇంట్లో మన సంస్కృతిని కాపాడు కోవాలనే తాపత్రయంలో పిల్లల సఫొకేషన్ గురించి ఆలోచించడం లేదా? ఈ లాంటి ప్రశ్నలన్నీ లేవనెత్తుంది అమెరికా పెంపకం కథ. ఏది ఏమైనా కౌమార ప్రాయంలో పిల్లల పెంపకం, ముఖ్యంగా భారతీయ సంతతికి చెందిన వారికి కత్తి మీద సాము లాంటిదే. గీతగారు ఈ విషయమే తన కథలో చెప్పారు.

ఇండియా అమ్మా అమెరికా అమ్మా:
ప్రపంచంలో ఎక్కడికెళ్లినా ప్రేమలో అమ్మ అమ్మే. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా అమ్మచాకిరి కూడా అమ్మదే. చంద్రమండలం లోనైనా అమ్మ చాకిరి మాత్రం మారదు. ఒక గ్రహాంతర వాసి కుతూహలం కొద్దీ ఇండియా అమ్మనీ అమెరికాలో అమ్మనీ ప్లేసులు తారుమారు చేస్తుంది. అమ్మలు అటూ ఇటూ మారిపోతారు. వాళ్ల చాకిరీ ఏమైనా మారిందా? అనేదే పాయంటు. గ్రహాంతర వాసి కనుగొన్న సత్యం ఏమిటి? అది మాత్రం మీరు చదవాల్సిందే. చాలా సీరియస్ ఇష్యూని ఫన్నీగా, ఫాంటసీ జోడించి మరీ చెప్పారు డాక్టర్ కె.గీత.

హ్యాపీ హోలోవెన్ అమెరికా వాళ్ల దెయ్యాల పండగ. ఇండియా నుంచి కొత్తగా వచ్చిన ఇల్లాలికి దెయ్యాల పండగ విచిత్రంగా తోచింది. పండగ వాతావరణాన్ని గృహిణి దృష్టిలోంచి కొద్దిపాటి సెటైనరికల్ టోన్లో కథ చెప్పారు డాక్టర్ గీత. కానీ దెయ్యాల పండక్కీ దసరా పండగ పప్పుబెల్లాలకీ పోలిక కనిపిట్టిందా గృహిణి. హాలోవిన్ పండగ గురించి గప్పాలు పోయిన భర్త, చివర్లో భార్య ఇచ్చిన షాక్ కి కెవ్వుమని అరిచి పడిపోయాడు. ఏమిటా షాక్. తెలుసుకోడానికి మీరీ పుస్తకం చదవాల్సిందే.

అమెరికా పోలీసుల క్రమశిక్షణ, తక్షణ స్పందన మనల్ని అబ్బుర పరుస్తాయి. టిక్కెట్లు రాయడంలో వాళ్ల తెలివి చురుకుదనం అంతా ఇంతా కాదు. మరి మన పోలీసుకీ వాళ్ల పోలీసులకీ పోలికల్లేవా? అదేంటో రీసెర్చి చేయించి మరీ చెప్పించారు డాక్టర్ కె.గీత గారు. ఆ రీసెర్చి తెలియాలంటే మీరు చదవాల్సిందే అనగనగా అమెరికా…గీతాకాలంలో పోలీసు కోటా అమెరికాలోని తెలుగు కుటుంబంలో దీపావళి ఎలా ఉంటుంది. అక్కడి ఇబ్బందులు, పరిమితుల్లోనే మన వాళ్లు దీపావళి పండగ ఎలా జరుపుకుంటారు. ముఖ్యంగా అక్కడి మనవాళ్ల పిల్లలకి తల్లితండ్రులకీ దీపావళి సరదాలు, పండగరోజు కూడా ఉద్యోగ విధులూ, బాణాసంచా ఖర్చులూ ఇలా పండగ పరిస్థితుల్ని ఒక చిన్ని కథలోనే చక్కగా వివరించారు. ఈ కథలో అసలైన దీపావళి గురించి భర్తగారు చేసిన హిత బోధకి భార్య ఇచ్చిన కౌంటర్ మామూలుగా ఉండదు. చుక్కలు కన్పించాల్సిందే. అదేంటో అనగనగా అమెరికా చదివి తెలుసుకోండి. ముఖ్యంగా కొసమెరుపు మిస్ కాకండి.

కిం కం పిన్ని: ఈ పుస్తకంలో ఒక తెలుగు మహిళ తీయని విజయ గాధ కం కిం పిన్ని కథ. ఆమె పక్కా పదహారణాల తెలుగు ఆడబడుచు. అమెరికా వేషభాషలతో అమెరికా సమాజంలో చక్కగా కలిసిపోయింది. ఆమె కథ రాయాలంటే ఒక నవల అవుతుందేమో కూడా. అమెరికాలో నిలదొక్కుకోడానికి ఆమె పట్టుదలా చేసిన కృషీ నిజంగా అబ్బురపర్చేవే. అమెరికన్ యాక్సెంటు ఇంగ్లీషు మాట్లాడ్డంలో గానీ ప్రవర్తనలో గానీ ఆమె పర్ఫెట్. తెలుగోళ్లు అమెరికన్ ఇంగ్లీషుతో ఆడంబరాలు పోయేచోట కమ్ కిమ్ కామేశ్వరి అబ్బుర పరిచే ట్విస్ట్ ఇచ్చింది. అదేంటో నేను చెప్పడం లేదు మీరు చదవాల్సిందే అనగనగా అమెరికాలో కం కిం!

శివరాత్రి ‌క్షీరాభిషేకం: రామేశ్వరం పోయినా శనీశ్వరం వదల్లేదనేది సామెత. శనీశ్వరం ఎక్కడో ఉండదు. మన సంకుచితమైన మనస్తత్వంలోనే ఉంటుంది. వైరాగ్యం ఇచ్చే దేవుడు శివుడు. అటువంటి శివుడికి శివరాత్రి రోజున క్షీరాభిషేకానికి వెళ్లినా కూడా, మనోళ్ల కక్కుర్తి ఎంత దారుణంగా ఉంటుందనేది ఈ కథలో చెప్పారు డాక్టర్ కె.గీత గారు. ఆ కక్కుర్తిని చూస్తే శివుడు సైతం శివశివా అంటూ కళ్లు మూసుకోవాల్సిందే. ఎందుకో మీరే తెలుసుకోండి.

సెల్ఫ్ సర్వీస్ వ్యూహంతో మనుషుల్ని ఊడ్చేస్తాయి యంత్రాలు. మనుషులకి ఉన్న ఉద్యోగాలు పోతాయి. కొత్త వాళ్లకి ఉద్యోగాలు దొరకవు. అది అమెరికన్ల కయినా సరే అక్కడి మనోళ్లకయినా సరే. సెల్ఫ్ సర్వీస్ వ్యాపార మర్మాన్నీ, దాని వెనుక నిరుద్యోగాన్నీ వివరించారు కె.గీత తమ కథలో.

మామూలు మనుషులు తమ కష్టసుఖాలు చెప్పుకున్నప్పుడు వాళ్ల వ్యక్తిగతమైన స్వభావాలూ, సమాజంతో పడే ఘర్షణలూ ప్రతిఫలిస్తాయి. ఇద్దరు తల్లుల సంభాషణే పెళ్లీ- పేరంటం కథ. అమెరికాలో ఎన్నేళ్లుగా స్థిరపడినా మనోళ్లు ఇక్కడి నుంచి తీసుకెళ్లే భూస్వామ్య సాంస్కృతిక భావజాలాన్ని వదులుకోలేరు. తమ పిల్లల్ని అక్కడి ప్రజాస్వామిక భావజాలానికీ సంస్కృతికీ దూరంగా ద్వీపాల్లాగా పెంచాలనుకుంటారు. అది సాధ్యమా? ఈ ఘర్షణనుంచి బయట పడటానికి వాళ్లు ఎంచుకునే మార్గం ఏమిటీ? వాళ్లు మారడమా? లేక దేశం మారడమా? ఇలాంటి సీరియస్ ప్రశ్నల్ని లేవనెత్తే కథ పెళ్లీ పేరంటం.

అమెరికన్ ఇంగ్లీషు చాలా తమాషా కథ. అమెరికా వాడి ఇంగ్లీషు వేరు మన ఇంగ్లీషు వేరు. ఉచ్చారణ మాత్రమే కాదు. మనం వాడే కొన్ని పదాలు వాళ్ల కసలు వాడుకలోనే ఉండవు. బాగా ఇంగీలీషు వచ్చనుకున్న వ్యక్తి విమానం దిగుతూనే ఏ క్యూ’లో నిలబడాలో తెలుసుకోవడం దగ్గర్నించి మన ఇంగ్లీషు పండితుడి పాట్లు మొదలవుతావు. చివరికి అతడికో గురువు దొరుకుతుంది. ఆ కంపల్సరీ గురువు ఎవరో కాదు తన చిన్నారి కూతురే. ఈ కూతురు నేర్పిన ఇంగ్లీషేంటో తెలిస్తే మీరూ అబ్బుర పడతారు. సరదాగా చెప్పినా సీరియస్ స్టోరీ- మన వాళ్లకి ఎదురయ్యే సమస్యలే ఇవన్నీ…ఇలా మన ఇంగ్లీషుకి అమెరికన్ ఇంగ్లీషు పదాలతో పదకోశం రాస్తే చాలా ఉపయోగంగా ఉంటుందని డిజిటల్ లింగ్విస్టు డాక్టరు గీతగారికి నా మనవి.

అక్కడ మన సంస్కృతిని కాపాడ్డానికి వ్యక్తులూ సంస్థలూ పడే తాపత్రయాలూ, చేసే ట్రిక్కులను కూడా ఎక్కడా వదిలి పెట్టలేదు, ఎడా పెడా వాయించారు గీతగారు. కాకపోతే సుతిమెత్తని హాస్యంతో. జావా రావులాంటి యంత్రభాషకి అంకితమైన తమాషా మనుషుల్ని చూపించారు గీతగారు. అంతేకాకుండా మనుషులు పార్కులో పలకరించుకుని మాట్లాడ్డాన్ని కూడా డాలర్ల ఆదాలోకి మార్చేకుని మురిసిపోయే అతి తెలివిమంతుల్ని కూడా నిర్మొహమాటంగా చూపించారు గీతగారు. చిన్ని కాలమ్ లో లోతైన కథలు చెప్పడం చాలా కష్టం. ఆ లోతైన కథలు తేలిగ్గా చెప్పడం ఇంకా కష్టం. అటువంటి కష్టసాధ్యమైన రచనలు అలవోకగా చేశారు డాక్టర్ కె.గీత. వారికి హృదయపూర్వక అభినందనలు.” అని ముగించారు వసీరా గారు.

ఆ పిదప శ్రీ ప్రసాదరావు రామాయణం గారి పుస్తకం “నిను చేరని లేఖలు” పుస్తకాన్ని డా.గీతామాధవి గారు ఆవిష్కరించారు. శ్రీ వైరాగ్యం ప్రభాకర్ గారు పుస్తక సమీక్ష చేశారు. ప్రసాదరావు గారి ప్రసంగం ప్రేక్షకులలో భావోద్వేగాన్ని కలిగించింది. వచ్చే జన్మంటూ ఉంటే ప్రసాదరావుగారికి చెల్లెలుగా పుట్టాలని కోరుకుంటున్నాను అని గీతమ్మ అన్నప్పుడు నా ఏడుపును ఆపుకోలేకపోయాను.

గద్వాల సోమన్న గారు” గిజిగాని గూడు” (తన 86వ పుస్తకమును) శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారు ఆవిష్కరించారు, శ్రీ సాధనాల వేంకటస్వామి నాయుడు గారు సమీక్షించారు. అవధానం అమృతవల్లి “మట్టి చీపురు” పుస్తకమును గీతా మాధవి గారు ఆవిష్కరించగా, ప్రముఖ కవయిత్రి, పాటల రచయిత శ్రీమతి బుక్కపట్నం రమాదేవి గారు సమీక్షించారు. శ్రీ గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్ గారి “కవితా సౌరభాలు” పుస్తకాన్ని నాళేశ్వరం శంకరం గారు ఆవిష్కరించారు. కవితాసౌరభాలపై ఘంటా మనోహరరెడ్డి గారి సమీక్ష శ్రోతలను ఆకట్టుకుంది. ఆవిష్కరణలు సమీక్షలు ఆసక్తిదాయకంగా జరిగాయి.

సాహిత్య పిపాసి, కవి గీతామాధవిగారికి దక్షిణ హస్తం, కార్యక్రమాలను పూర్తిగా తన తలపై ధరించి నిస్వార్ధంగా నిర్వహించే సహృదయులు శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారు. వారికి 2025గానూ వీక్షణం జీవన సాఫల్య పురస్కారంతో ఘనంగా సన్మానించారు. ప్రశంసాపత్రపటంతో, తలపాగా పెట్టి, పూదండను మెడనవేసి, శాలువా కప్పి అతిధులు ఘనంగా సన్మానించారు. ఇది అత్యంత సముచితం. వారిని సభ తమ కరతాళ ధ్వనులతో అభినందించింది. కృతజ్ఞతా పూర్వంగా ఈ ఘన సత్కారానికి రాజేంద్రప్రసాద్ తనకు దక్కిన అపూర్వ గౌరవమని, కవుల ప్రోత్సాహానికి ధన్యవాదాలు తెలిపారు.

తదుపరి కుసుమ ధర్మన్న కళాపీఠం అధ్యక్షురాలు శ్రీమతి రాధాకుసుమ గారి ప్రార్ధనా గీతంతో ప్రారంభమై వారి నిర్వహణలో కవిసమ్మేళనం జరిగింది. రామాయణం ప్రసాదరావు అనే నాతో సహా 40 మంది కవులు తమ అద్భుత కవితా గానాన్ని వినిపించారు. సభ కరతాళ ధ్వనులతో మార్మోగిపోయింది. సభా వ్యాఖ్యాత శ్రీమతి విశ్వైక గారు తన వాక్చాతుర్యంతో వ్యాఖ్యానాలతో సభను హుందాగా నిర్వహించటంలో విజయం సాధించారు. కవిసమ్మేళన సామ్రాట్ డాక్టర్ రాధా కుసుమ గారు తన చెరగని నవ్వులతో, సమయోచిత వ్యాఖ్యలతో సాహితీ ప్రియులను సంబరపరిచారు. కవిసమ్మేళనంలో 40 మంది కవులు, కవయిత్రులు పాల్గొని తమతమ కవితలను వినిపించి ఆహుతులు అందరిని అలరించారు.

అతిథులకు, నిర్వాహకులకు, సమీక్షకులకు, కవులకు వీక్షణం సమన్వయకర్తలు సముచితంగా సత్కరించారు. చివర శ్రీమతి గీతా మాధవి గారు సభలో పాల్గొన్న వారందరికి ధన్యవాదాలు చెప్పి సభను ముగించారు. సభ చాలా చక్కగా నిర్వహించారని తదుపరి సమావేశానికి ఎదురుచూస్తుంటామని కవులు ఆనందాన్ని వ్యక్తపరిచారు.

ఆద్యంతం ఆసక్తిదాయకంగా జరిగిన ఈ సమావేశ వీడియోని ఇక్కడ చూడవచ్చు.

********

Posted in January 2026, వీక్షణం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *