ట్రైన్ దిగి ఆ మాణిక్యపురం అడ్రస్ ఎంక్వయిరీ చేసి, ప్రణవిని, పిల్లల్ని, ఆ లగేజ్ ని తీసుకుని, నానా అవస్థలు పడి ఆ పల్లెటూరు చేరుకున్నాడు మూర్తి. వాళ్ళు చెప్పిన అడ్రస్ కి చేరుకున్నారు. వాళ్ళు చెప్పిన ఇంటికి తాళం పెట్టి ఉంది.
రాజన్ కి ఫోన్ చేసాడు మూర్తి.
“అవును ఆ తాళం నీకు అందించే స్థితిలో మేము లేము. నేను ముందే చెప్పాను కదా అవస్థ పడతావని. కాదు కూడదు అని వచ్చావు. ఇప్పుడు వాపోయి ఏం లాభం. సరే నా మాట వినకుండా వచ్చావు. ఇప్పుడు ఏం చేద్దాం అంటావు చెప్పు?” అంటూ అడిగాడు రాజన్.
“మేం సగం దూరం వచ్చేశాక మీరు ఫోన్ చేశారు. తిరిగి వెళ్లే అవకాశం లేకపోయింది. అంతేగాని మీ మాటను ఎదిరించాలని కాదు. తాళం ఎవరి చేతనైనా పంపిస్తే… సామాన్లు ఇంట్లో పెట్టేసి, మేము హాస్పిటల్ కి వస్తాం,” అన్నాడు మూర్తి.
“మనిషిని పంపిస్తాను. సామాన్లు సంగతి అతను చూసుకుంటాడు. నువ్వు వాళ్ళని తీసుకుని, ఈ హాస్పిటల్ కి వచ్చేసేయ్,” అంటూ హాస్పిటల్ అడ్రస్ చెప్పాడు రాజన్.
కొద్దిసేపటికి ఒక అబ్బాయి వచ్చాడు. అతను, “మీరు వెళ్ళండి. వీటిని నేను చూసుకుంటాను,” అని చెప్పి మూర్తిని, ప్రణవిని, పిల్లల్ని పంపించేశాడు.
***
“ఏం బావా! వాళ్ళు వచ్చారా?” అంటూ ఫోన్ చేసి అడిగింది రాణి.
“హా… వద్దంటున్నా వచ్చేసారు. మళ్ళీ మనింటికి ఎక్కడ వస్తారోనని… అక్కడ ఎవరూ లేరు అని చెప్పి, మాణిక్య పురం అడ్రస్ చెప్పా. అక్కడకు పోయి లగేజ్ బయటపడేసి… హాస్పిటల్ కి వస్తున్నారు.” అంటూ చెప్పాడు.
“అందుకే చెప్పా… వాళ్ళు బయలుదేరక ముందే చెప్పమని, నా మాట వినలేదు. ఇప్పుడేం చేస్తావ్?” అంది.
“ముందు చెబితే కావాలని చేసాం! అనుకుంటారు. రానీలే… ఏం చేయాలో తరువాత ఆలోచిద్దాం.”
“ఇంకేంటి ఆలోచించేది?” అంటూ ఫోన్ కట్ చేసేసింది రాణి.
***
ప్రణవి, మూర్తి వాళ్ళు హాస్పిటల్ కి వెళ్ళారు.
అక్కడ సెక్యూరిటీ లోపలకు పంపించకుండా ఆపేసారు. ప్రణవి “నేను అతని భార్యని. వారిని చూడాలి. పంపించండి ప్లీజ్,” అంటూ రిక్వెస్ట్ చేసింది.
“లేదమ్మా ఎవరిని పంపకూడదు. పాస్ ఉండాలి. గేట్ పాస్ లేకపోతే లోపలికి ఎవరిని పంపించము. దారికి అడ్డం లేవండి… ఇక్కడ నుంచి వెళ్లిపోండి,” అంటూ తరిమేసాడు.
“మా వాళ్లకు ఫోన్ చేస్తాను. వాళ్లు వచ్చేవరకు… ఆడ వాళ్లు, పిల్లలు కదా ఇక్కడ కూర్చునివ్వండి,” అంటూ అడిగాడు మూర్తి.
“అలా లోపలికి రానీయ కూడదండి. రూల్స్ ఒప్పుకోవు. కాదు కూడదు అని మిమ్మల్ని లోపలికి రానిస్తే… ఇక్కడ సీసీ కెమెరాలు అవి ఉన్నాయి. మా ఉద్యోగాలు పోతాయి. మీ వాళ్ళు వచ్చి గేటు పాస్ ఇచ్చేవరకు, బయట ఎక్కడైనా కూర్చోండి. అది కూడా ఒక్కరికి మాత్రమే పరిమిషన్ ఉంటుంది. దారికి అడ్డం లేవండి,” అంటూ అక్కడి నుంచి పంపించేసాడు సెక్యూరిటీ.
మూర్తి రాజన్ కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేదు. పోనీ ఎవరింటి కన్నా వెళదామన్నా… ఆ ఊర్లో వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. ఈ ప్రయాణాలతో అందరూ నలిగిపోయి ఉన్నారు. ఓ పక్క పిల్లలు ఆకలికి ఏడుస్తున్నారు.
ఆ దగ్గరలో ఒక హోటల్ ఉంటే అక్కడికి తీసుకెళ్లి వాళ్లకి తినిపించి, పెద్దవాళ్లు కూడా కాస్త తిన్నాము అనిపించుకుని… వచ్చి హాస్పిటల్ బయట చెట్టు కింద గట్టు లాగా ఉంటే దానిమీద కూర్చున్నారు.
మళ్లీ రాజన్ కి ఫోన్ చేసాడు మూర్తి. ఇప్పుడు బిజీ టోన్ వచ్చింది.
‘నిజంగా నే హాస్పిటల్లో ఉన్నారా? లేదా మిస్ గైడ్ చేసారా? అలా చేస్తే ఊరుకుంటానా! మళ్ళీ పోలీసులకు చెప్తాను కదా! అలా చేయరులే… అయినా పొరపాటు చేసాను. వాళ్ళు ఎవరూ అక్కడ లేరంటే నమ్మేసి... అక్కడికి వెళ్ళక పోవటం పొరపాటు అయింది. వెళ్ళి చూడాల్సింది,’ అని అనుకున్నాడు మూర్తి.
ఇంతలో మూర్తి జేబులో ఉన్న ఫోన్ రింగ్ అయ్యింది.
****సశేషం****
రచయిత్రి పరిచయం ..
పేరు: ఘాలి లలిత B.A:Bed; కలం పేరు: ప్రవల్లిక
రచనలు: మట్టి పాదాలు కవితాసంపుటి, ఆహా కథాకుసుమాల సంపుటి, మర్మదేశం సైంటిఫిక్ ఫిక్షన్ బాలల నవల (“సిరిమల్లె” పత్రికలో ధారావాహికగా వెలువడింది.), కొలిమి (మినీ నవల) (ప్రస్తుతం “సిరిమల్లె” పత్రికలో ధారావాహికగా వస్తున్నది.)
పురస్కారాలు: 1. జిల్లా కలక్టర్ గారిచే ఉగాది పురస్కారాలు నాలుగు సార్లు; 2. గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి గురజాడ రాష్టీయ పురస్కారము; 3. సావిత్రిబాయి పూలేజాతీయస్థాయి ఆదర్శ ఉపాధ్యాయిని పురస్కారం; 4. ఆదర్శ మహిళా పురస్కారం; 5. పాతూరి మాణిక్యమ్మ కీర్తి పురస్కారం; 6. గుర్రాల రమణమ్మ సాహితీ పురస్కారం; 7. గుఱ్ఱం జాషువా పురస్కారం; 8. సత్యశ్రీ పురస్కారం; 9. గాడ్ఫాదర్ ఫౌండేషన్ నుంచి సాహితీ పురస్కారం; 10. సరోజినీ నాయుడు సాహితీ పురస్కారం; 11. విద్వాన్ విశ్వం ఉత్తమ కథా పురస్కారం; 12. అక్షరయాన్ నుంచి తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా 2022 లో సాహిత్య స్రష్ట పురస్కారం; 13. తానా వారి నుంచి 10,000 నగదు, సత్కారం; 14. సరోజినీ నాయుడు ఎక్స్ లెన్స్ అవార్డు.
బిరుదులు: ప్రతిలిపి బెంగుళూరు వారి నుంచి ‘సాహితీ విశారద’ బిరుదు మరియు తెలుగు కవితా వైభవం హైదరాబాదు వారినుంచి ‘సహస్రకవిమిత్ర’.
సాహిత్య పరంగా చేపట్టిన బాధ్యతలు: తెలుగు భాషోద్యమ సమితి ప్రధాన కార్యదర్శి; గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా నెల్లూరు విభాగానికి అధ్యక్షురాలు; నెరసం సహ కార్యదర్శి; సింహపురి సాహితీ సమైఖ్యలో కార్యదర్శిగా కొంత కాలం పనిచేశారు.
ప్రస్తుతం, అక్షరయాన్ రచయిత్రుల సంఘంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ అక్షర యాన్ బాలికా, బాలుర విభాగములను నెలకొల్పారు. 108 మంది రచయితలచే మాయలోకం అనే గొలుసు నవలను రాయిస్తునారు. అలాగే శ్వేత ధామం అనే గొలుసు కట్టునవలను సాహితీ సిరికోన అనే సామాజిక మాధ్యమం లో మహిళలచే రాయిస్తున్నారు. బాల బాలికలచే నల్ల హంస అనే మరో గొలుసు నవలను కూడా వ్రాయిస్తున్నారు.