Menu Close
C-Vasundhara Photo
తెలుగు సాహిత్య చంద్ర చంద్రికలు
డా.సి.వసుంధర
తాళ్ళపాక అన్నమయ్య -2

గత సంచికలో అన్నమయ్య తిరుపతి లో ఘన విష్ణువు అనే వైష్ణవ యతి చేత వైష్ణవం పుచ్చుకొన్న విషయం తెలుసుకొన్నాము. ఆరుద్ర ఈ విషయానికి సంబంధించి ఉన్నట్లున్నదని చెప్పిన ఒక అన్నమయ్య పదం తెల్పాడు.

పుట్టినట్టె ఉన్నవాడ పోలేదు రాలేదు
యిట్టి నీ దాసుడైతే యెంగిలెల్ల బాసె
తెరమరుగు దానాలు దేవుడ నీ కల్పితమే
సొరిది ఈ సురలెల్ల చుట్టాలే నాకు
నిరతి శ్రీ వెంకటేశ నీ మరుగుచొచ్చి నేడు
గురుని యానతి చేత గొంకులెల్ల బాసె. (సంపుటి 8, పుట 8)

ఈ పాట లోని విషయాన్ని గూర్చి ఆరుద్ర మాటలు;
“ధన్యాసి రాగంలో అన్నమయ్య చెప్పిన ఈ కీర్తన ఏ సందర్భం లోనిదో ఏమో గానీ ఇక్కడ బాగా అతుకుతున్నది. వాళ్ళ కులంలో ఎప్పుడూ లేని వైష్ణవాన్ని తామసులుగా ఉండే తమ వంశాన్ని పరమ సాత్వికులుగా చేశారు.”

శైవుడైనట్టి అన్నమయ్య వైష్ణవుడై తిరుపతి వెంకన్నపై రాసిన అన్నమయ్య పదాలు తెలుగు భాషకు భోషాణాలు.

అన్నమయ్య కోసం ఇంట్లో వాళ్ళు వెతికి వెతికి చివరకు విరమించుకునే తరుణంలో అన్నమయ్య తల్లికి జ్ఞప్తికి వచ్చింది. అన్నమయ్య తిరుపతిలో ఉంటాడేమోనని. వెంటనే ఆమె తిరుపతి కి వచ్చి అన్నమయ్యను చూసింది. ఆమె ఇంటికి రమ్మని ఎంత బతిమలాడినా అన్నమయ్య కదలలేదు. ఆ రాత్రి అన్నమయ్యకు ఒక కల వచ్చి అందులో వేంకటేశ్వరుడు తల్లి మాట మీరవద్దు ఇంటికి వెళ్ళమన్నాడు. ఈ విషయం చెప్తూ ఆరుద్ర, ఈ కల అన్నమయ్య జీవితంలో ఎంతో ముఖ్యమైనదని, దాని ప్రాముఖ్యతను తెల్పారు. ఆ ప్రాముఖ్యత ఏమనగా;

అన్నమయ్య సంకీర్తనాల సంపుటాల మొదట ఈ కల వచ్చిన తారీఖున అతని సంతతి వారు భద్రం చేశారు. అందులో ఇలా ఉంది.

“స్వస్తి శ్రీ జయనాభ్యుదయ శాలివాహన శక వరుషంబులు 1346 యగు నేటి క్రోధి సంవత్సరమందు తాళ్ళపాక అన్నమాచార్యులు అవతరించిన పదహారేళ్ళకు తిరువేంగడనాథుడు ప్రత్యక్షమైతేను అది మొదలు ఆ దేవునిపై అంకితంగా అతడు సంకీర్తనలు చెప్పాడు.”

ఆ విధంగా అన్నమయ్య గూర్చి వారి సంతతి వారు రాగిరేకుల మీద చెక్కించారని ఆరుద్ర తెల్పారు.

తల్లితో గూడా ఇంటికి వెళ్ళిన అన్నమయ్య కు వివాహం చేయాలన్న ఆ ప్రయత్నం కొంతముందుగా ఫలించక పోయినా చివరకు ఒక బంధువు ముందుకు రావడంతో ఒకరు కాదు ఇద్దరిని అన్నమయ్య వివాహం చేసుకొన్నట్లు చెప్పిన ఆరుద్ర వారి వివరాలు ఇక్కడ తెలుపలేదు. ఆ ఇద్దరి పేర్లు, తిరుమలమ్మ (తిమ్మక్క), అక్కలమ్మ.

వివాహానంతరం అన్నమయ్య అహోబిలం లోని పీఠాధిపతి శతగోప మునీశ్వరుల వద్ద వేదాంతాన్ని అధ్యయనం చేశాడు. అహోబిలం నరసింహస్వామి పై ఎన్నో కీర్తనలు రచించాడు. నరసింహావతారం అప్పుడు స్వామి ముఖాన్ని వర్ణిస్తూ పదకొండు చరణాలలో పాట రచించాడని చెప్పి ఆరుద్ర
“అటమరి పెటపెట మని బేట్లెగసి – చిటచిట రవముల జిరుతపొగ లెగసి
తటతట మనుచును తరలి వ్రయ్యలై – వటవట మనుచును పగిలె కంభము”
అనే చరణాన్ని ఉదహరించారు.

పగిలిన స్థంభంలో నుండి విజయ, వీర, విమల, భయదసింహం ఎలా వెడలిందో, ఎలా కెరలిందో, ఎలా మెరసిందో తెల్పి, నరసింహం ఘోరసింహం గా మారిన విధం అద్భుతంగా వర్ణించాడు. చివరగా ఆ విష్ణు సింహమే శాంతించి, అహోబిలం లో నారసింహునిగా స్థిరపడినట్లు అన్నమయ్య వర్ణించాడని చెప్పిన ఆరుద్ర అహోబిల నారసింహుడు శ్రీ వేంకట నగమున నున్న వెంకటేశ్వరుడేనని అన్నమయ్య భావించాడని తెల్పారు.

ఈ నారసింహుని కొలిచి పాటలు రాసే సమయంలో అన్నమయ్య కు మరో నారసింహునితో పరిచయం ఏర్పడిందన్నారు ఆరుద్ర. ఆ నరసింహుడే సాళువ వంశం లోని సాళువ నరసింహ రాయలు. ఇతడు తాళ్ళపాకకు దగ్గరలో ఉన్న టంగుటూరు ను పాలించేవాడు.

ఈ సాళువ నరసింహ రాయలు అన్నమయ్యకు బాల్య సఖుడు. స్నేహితుని ఆహ్వానం పై అన్నమయ్య టంగుటూరు వెళ్లి ఆ ఊరి దేవునిపై పాటలు రాశాడు. అప్పటికి సాళువ నరసింగరాయడు రాచమూకలలో పరాక్రమశాలి మాత్రమె. అన్నమయ్య ఆశీస్సులతో రాజ్యం సంపాదించ వచ్చునని అతడు భావించాడు. శ్రీ కృష్ణుని మన్ననతో క్రీడి భూచక్రమెల్ల ఏకాచక్రంగా ఏలినట్లు మీ సహాయంతో ప్రపంచం అంతా ఏలగలను’అన్నాడు నరసింహ రాయలు. అన్నమయ్య ఆశీర్వదించాడు. అది ఫలించింది అని ఆరుద్ర వివరించారు. (స.ఆం.సా. పేజీ 990-1)

సాళువ నరసింహరాయలు అన్నమయ్య ఆశీస్సులతో పెనుగొండలో పట్టం గట్టుకొన్నాడు. అన్నమయ్య ను మరిచిపోకుండా ఆహ్వానించి ఎదురేగి సత్కరించాడు. రాజు కోర్కెపై రోజూ ఒక పాటను దేవునిపై అన్నమయ్య రచించాడు. వాటిని గూర్చి ఆరుద్ర వివరణ;

“అన్నమయ్య తిపిరిదండెల శృతులు తిన్నగా కూర్చాడు. నెర గాన దండెను, వాద్యం దండెను, షడ్జం, పంచమ స్థాయిలు చేసి తేనెలు తేటలుమీద చెరకు పానకం చిలికినట్లు పాటలు పాడాడు. అక్కడున్న కవులంతా చేతులెత్తి మ్రొక్కారు. ఇటువంటి శృంగార భావాలు కాళిదాసాదుల కవిత్వంలో కూడా లేవని జోహారు చేశారు” అని ఆరుద్ర వివరించారు.

అన్నమయ్య కు నరసింహరాయలు పచ్చల కడియాలు, బంగారు జరీ ఉన్న పచ్చడాలు, కెంబెట్టు కుళ్ళాయిలు, అంగదాలు, ఆతపత్రాలు, వింజామరల జోడు మొదలైనవి ఇచ్చాడు.

ఇలా రాజోపచారాలు పొందుతూ అన్నమయ్య రాజధాని లోనూ, స్వగ్రామం లోనూ, తిరుపతి లోనూ, చుట్టుప్రక్కలనున్న దివ్య క్షేత్రాలలోనూ జీవించేవాడు. పెద్ద భార్య తిరుమలమ్మ కుమారుడు వరసింగన. అక్కాంబ కుమారుడు పెదతిరుమలయ్య. ఇతను కూడా సంకీర్తనాచార్యుడే. ఇతనికి ఐదుగురు కుమారులు. అందరూ కవులే.

అన్నమయ్య కు ఒక కూతురు కూడా ఉంది. ఆమె భర్త పేరు రేవణూరి తిరుమల కొండయ్య. ఇతడు కూడా కవే. విద్వత్ప్రచండుడితడు. రామచంద్రోపాఖ్యానము అనే ప్రబంధం రచించినట్లు అతని కుమారుడు తాను రచించిన శకుంతల పరిణయ గద్యలో తెల్పాడు. ఇతని పేరు వెంకటార్యుడు.

అన్నమయ్య కొడుకు బిడ్డలే గాక కూతురు కొడుకు కూడా కావ్యకర్త. ఈ విధంగా అన్నమయ్య వంశంలో వారందరూ కవులై సంకీర్తనాచార్యులై ధన్యులైనట్లు ఆరుద్ర తెల్పారు.

కాలంలో మార్పులు రావడం సహజం. నరసింహరాయలు అన్నమయ్య ను పిలిచి విద్వాంసులు, గాయకుల సమక్షంలో పాడమనగా అన్నమయ్య జీవితంలో మార్పును తెచ్చింది. ఆ పాట నేటికీ ప్రసిద్ధమైన అన్నమయ్య శృంగార కీర్తన గా నిలిచిపోయింది.

యేమెకో చిగురుటధరమున నెడనెడం గస్తూరి నిండెను
భామిని విభునకు వ్రాసిన పత్రిక గాదుకదా?!!
కలికి చకోరాక్షికిం గడగన్నులు గెంపై తోచిన
నిలువున బెరుకగ నంటిన నెత్తురు గాదుగదా?!! …. (సంపుటి 3, సంకీర్తన 417)

ఈ పాట విన్న నరసింహరాయలు కవిత్వం అంటే ఇది’అని మెచ్చుకొన్నాడు. దానితో పాటు రాయలలో అత్యాశ పొడమింది. నాపై ఇటువంటి కీర్తన రచియింపుమని నరసింహరాయలు ధైర్యం చేసి అడిగాడు. అన్నమయ్య చెవులు మూసుకొని నరహరికీర్తన నానిన జిహ్మబరుల నుతింప నోపదు జిహ్వ’అని అక్కడినుండి లేచి వెళ్ళాడు. నరసింహరాయలకు కోపం వచ్చి అన్నమయ్యను పట్టుకు రమ్మని భటులను పంపించాడు.

****సశేషం****

Posted in January 2026, సమీక్షలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *