ముందుమాట:
సీతాకోకచిలుకలు:
ఒక పల్లెలో పెరుగుతున్న పిల్లలు సుబ్బు, బుజ్జి, శీను, మహేశు, లష్మి, సీత. వీరి స్నేహం ఎలా కొనసాగింది? ఎవరి నేపథ్యం ఏమిటి? చివరకు వాళ్లేమి సాధించారు? కాలా, శ్యామా, నీలా, శోణా ఎవరు? పిడుగుల చెట్టు కథ ఏమిటి? కాత్యాయని, వరదరాజులు, మల్లిఖార్జున ఎవరు? వీరందరితో పాటు మధ్యలో వచ్చే అనేక ఆసక్తికర అంశాలు మిమ్మల్ని మరో భాగం కోసం ఎదురుచూసేలా చేస్తాయి. రంగుల హరివిల్లు లాంటి, స్వేచ్ఛగా ఎగిరే సీతాకోకచిలుకల ప్రపంచంలోకి అడుగుపెడదాం రండి.
అనామిక ధారావాహికను ఆదరించినట్లు గానే ఈ సరికొత్త ధారావాహికను కూడా అభిమానించండి. మీ సలహాలు సూచనలు మీ కామెంట్స్ రూపంలో తెలియజేయ ప్రార్థన.
— మీ నాగమంజరి గుమ్మా
“సచ్చినోడా ఎక్కడ తగలడ్డావు? సంటిది గుక్కపెట్టి ఏడుస్తుంటే సెవుల్లో సెట్లు మొలిచాయా?” దుర్గమ్మ నోరు పెట్టుకుని విరుచుకు పడుతోంది. పుల్లల మోపు దించుకుంటూ “వస్తున్నాను పిన్నీ” అన్నాడు సుబ్బు.
“పొద్దున్ననగా పోయావు. ఇప్పుడా రావడం? ఈ నాలుగు పుల్లలు రేపటికే సరి. మళ్ళీ పుల్లల వంక పెట్టుకుని అడవికి పోతావు.” దుర్గమ్మ నోరు కట్టు తెగిన ఏరులా వల్లిస్తూనే ఉంది. సుబ్బు రెండేళ్ల చెల్లిని చంకనేసుకుని జేబులోనుంచి జామకాయ తీసి దాని చేతికిచ్చాడు. సుబ్బుని చూడగానే వాడి చెల్లి ఠక్కున ఏడుపు ఆపేసింది. అన్న ఇచ్చిన జామకాయ కొరుకుతూ మళ్ళీ సుబ్బుగాడి నోటికి అందించింది.
“నువ్వు తినవే చెల్లీ.. అమ్మ నాకు అన్నం పెడుతుంది” అన్నాడు ఆశగా.
“ఆఁ మీనాన్న తెచ్చి పోసిన రాశులేవి లేవు. అదిగో ఆ మూల కుండలో గంజి ఉంది. పోసుకుని తాగు. బకాసురుడిలా అంతా తాగేస్తే మళ్ళీ రాత్రికి ఉండదు” అంటూ సూచనో, హెచ్చరికో అన్నట్లు చెప్పింది దుర్గమ్మ. సుబ్బు చెల్లిని కిందకి దింపి పాకలోకి వెళ్ళేడు. అన్నం కనిపిస్తుందేమోని అటు ఇటు చూస్తూ మూలగా ఉన్న కుండలో ఉన్న గంజిని చిన్న చట్టిలోకి ఒంపుకున్నాడు. మిరపకాయ ముక్క కొరికి గంజి గటగటా తాగేసాడు. ఆకలి తీరలేదు. దుర్గమ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది. గంజి కుండ మీద మూత పెట్టి బయటకి వచ్చేశాడు. పొద్దున్న పుల్లలకోసం అడవికి వెళ్ళినప్పుడు చద్దన్నం తినలేదు. అడవిలో దొరికిన వాక్కాయలు, చింతచిగురు, బలుసుపళ్ళు తిని కొండవాగులో నీళ్లు తాగి కడుపు నింపుకున్నాడు. రోజులో ఏదో ఒకపూట పస్తు మామూలైపోయింది సుబ్బుకి.
సుబ్బు తండ్రి వీర్రాజు వూళ్ళో వ్యవసాయం చేసేవాడు. అంతో ఇంతో బాగానే గడిచిపోయేది. సుబ్బు వాళ్ళ అమ్మ కడుపుతో ఉండగా ఏదో చికాకు చేసింది. ఉన్న పొలాన్ని తాకట్టు పెట్టి వైద్యం చేయించాడు వీర్రాజు. అయినా ఫలితం దక్కలేదు. సుబ్బు తల్లి, కడుపులో ఉన్న చెల్లి ఇద్దరూ దేవుడి దగ్గరకు వెళ్లిపోయారు. అయిదేళ్ల సబ్బుకు అవేవీ తెలియదు. కొత్త అమ్మ వచ్చిందని సంబర పడ్డాడు. “అమ్మా” అని పిలవబోతే “పిన్ని” అని సవరించింది దుర్గమ్మ. తన పొలంలోనే కూలీగా పనిచేయడం మొదలుపెట్టాడు వీర్రాజు. ఇల్లు గడవక, తాకట్టు విడిపించలేక, వడ్డీలు కట్టలేక ఉన్న పొలాన్ని మొత్తంగా షావుకారుకే అప్పజెప్పేసాడు వీర్రాజు. ఈలోగా దుర్గమ్మకు కూతురు పుట్టింది. చనిపోయిన భార్యో, కూతురో మళ్ళీ పుట్టారని సంతోషించాడు వీర్రాజు. కాలం ఒకేలా నడవదు కదా. పొలంలో పనిచేస్తున్న వీర్రాజును ఉల్లిపాము కరిచింది. వైద్యం జరగడంలో ఆలస్యమై మొదటిగా కాలు, తరవాత మొత్తం శరీరం కుళ్లిపోయి మరణించాడు.
అప్పటివరకు కష్టం తెలియని సుబ్బిగాడికి వయసుకు మించిన భారం నెత్తిన పడింది. దుర్గమ్మకి ప్రత్యేకమైన కోపం ఏది లేకపోయినా ఆస్తులు తెగనమ్మిన భర్తను తలచుకుని, కళ్ళ ముందు కనబడుతున్న సవతి కొడుకుని కసురుకునేది.
వాడి చిన్ని బుర్రకి ఇవేవీ తెలియవు. అన్నం ఎప్పుడూ ఉండదని, పిన్ని ఎప్పుడూ తిడుతుందని, ఒక పూట మంచినీళ్ళే తాగి పడుకోవాలి అని మాత్రమే తెలుసు. ఈ కష్టాలను వాడి చెల్లి నవ్వుతో మరిచిపోతాడు. రానురాను దుర్గమ్మ దాష్టికం పెరిగిపోయింది. అప్పుడప్పుడు సుబ్బిగాడి మీద చేయి చేసుకునేది.
ఒకరోజు సుబ్బిగాడు అడవిలో నుంచి పుల్లలు ఏరుకొచ్చి గుమ్మంలో దింపుతున్నప్పుడు, అదే దారంట పోతున్న అయ్యవారు వాడిని చూశారు. ఆయన ఆ ఊరిలో వీధిబడి నడుపుతారు. అందరికి ఆయన అంటే గౌరవం. చిన్నవయసులోనే అలవి కాని భారం మోస్తున్న ఆ పసివాడిపై జాలి పడ్డారు. వాడు గంజి తాగి, స్థిమిత పడే వరకు ఆగారు. తరువాత వాడి దగ్గరకు వెళ్ళి “ఒరేయ్ నువ్వు వీరిగాడి కొడుకు సుబ్బిగాడివి కదూ” అన్నారు. సుబ్బిగాడు దెయ్యాన్ని చూసినట్లుగా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు.
“అయ్యోరా ! ఏంది ఇయ్యాల నీ కన్ను మా సుబ్బిగాడి మీద పడింది?” అంది దుర్గమ్మ.
“చూడు దుర్గమ్మా! నీ కొడుకు తెలివైన వాడు. వాడిని బడికి పంపించు. వృద్ధి లోకి వస్తాడు” అన్నాడు అయ్యవారు.
“ఈడు నాకొడుకా” ఎక్కిరించింది దుర్గమ్మ .
“సాల్లే అయ్యోరా. ఈడు సదువుకుంటే నాకు పుల్లలు ఎవరు తెస్తారు? నీళ్ళు ఎవరు తెస్తారు? సంటి దాన్ని ఎవరు సూస్తారు? ఇయ్యన్ని అవని పనులు కానీ తమరు దయసేయండి.” అంది దుర్గమ్మ.
“వారానికి ఒకసారి పుల్లలు తెస్తాడు, రోజంతా నాదగ్గరే ఉంటాడా ఏం? ఉదయమో, సాయంత్రమో నీళ్ళు తెచ్చి పోస్తాడు, చంటి దాన్ని వాడితో పాటే తీసుకు వస్తాడు లే” అన్నారు అయ్యవారు ఎలాగైనా సుబ్బిగాడిని బడికి తీసుకు వెళ్లాలన్న తాపత్రయంతో.
సుబ్బిగాడిని దగ్గరకు పిలిచి “నీ జట్టులో శీను, బుజ్జి, మహేశు బడికి వస్తున్నారు తెలుసా?” అన్నాడు అయ్యవారు రహస్యంగా.
సుబ్బిగాడు తల గోక్కున్నాడు.
“అయ్యోరా నన్ను పోనీయ్య్” అంటూ తుర్రు మని పారిపోయాడు సుబ్బిగాడు.
అయ్యవారు నిట్టూరుస్తూ ముందుకి కదిలారు.
……
సుబ్బిగాడు గుప్పిట నిండా గులకరాళ్ళు ఏరుకొచ్చాడు. వాడి చెల్లి సీత ముందు కూర్చున్నాడు. గుప్పిట తెరిచి గులకరాళ్ళన్నీ కింద కుప్పగా పోసాడు. సీత కిలకిలా నవ్వింది. సుబ్బిగాడు మట్టి అంటుకున్న సీత బుగ్గ మీద ఒక ముద్దిచ్చి, ఒక రాయి చేతిలో పెట్టి, “ఇది పట్టుకో” అన్నాడు. “బడికి వెళ్తాను.” ఒక రాతిని బయటకు విసిరి “బడికి వెళ్ళను” అన్నాడు. మళ్ళీ సీత చేతికి మరొక రాయి ఇచ్చాడు. “బడికి వెళ్తాను” అన్నాడు. ఇంకొకటి బయటకు విసిరి “వెళ్ళను” అని అన్నాడు. సీతకి గులకరాయి ఇచ్చినప్పుడల్లా కిలకిలా నవ్వుతోంది. అలా సీతకొకటి ఇస్తూ, బయటకొకటి వేస్తూ ‘వెళ్తాననీ, వెళ్ళననీ’ లెక్క వేసుకున్నాడు. చివరి రాయి సీతకిచ్చాడు. “సీతా రేపు మనం బడికి వెళ్తామే” అన్నాడు. అది ఆనందమో, ఆత్రుతో తెలియని భావన వాడికి కలిగింది. చొక్కా అంచుతో చెల్లి బుగ్గలు తుడిచాడు. జేబులో నుంచి ఒక పరింకాయ సీత నోట్లో పెట్టేడు. “సీతా! రేపు బడికెళదామె” అన్నాడు మళ్ళీ. సీతకేమి అర్ధం అయ్యిందో మరోసారి కిలకిలా నవ్వింది.
…….
చీకటి ఉంటుండగానే సుబ్బు నిద్ర లేచాడు. కసవు చిమ్మేశాడు. నీళ్ళు నింపేశాడు. మొహం కడుక్కున్నాడు. ఓ రెండు దోసిళ్ళ నీళ్ళు గబగబా తాగేసాడు. ఇంక ఏం చేయాలో వాడికి తోచలేదు. అలా చెరువు గట్టుకు వెళ్ళాడు. అడవి మల్లెపూలు, కొండగోగు పూలు, ఇంకా ఏవో పేరు తెలియని పూలు అన్నీ ఏరుకొచ్చాడు. చొక్కాలో పోసుకుని ఇంటికి వచ్చాడు. ఈలోగా సీత లేచింది. పువ్వులు పక్కన పెట్టి సీతకు మొహం కడిగాడు. దుర్గమ్మ ఏ కళనుందో రెండు గ్లాసుల్లో టీ పట్టుకొచ్చి సుబ్బి గాడికి, సీతకి ఇచ్చింది. సీత చప్పట్లు కొట్టింది. ఊదుకుంటూ ఊదుకుంటూ ఆ నీళ్ళ టీ ని అమృతంలా తాగేడు సుబ్బిగాడు. చెల్లికి కూడా తాగించాడు. ఈలోగా ఆ దారంట పోతున్న బుజ్జిగాడిని సుబ్బి చూసేడు. బుజ్జిగాడి నోటిలో ఒక పుల్ల, నెత్తి మీద నీళ్ళ కుండ ఉన్నాయి.
“ఒరేయ్ బుజ్జి! నాను ఇవాళ బడికొత్తన్నాను రా! అయ్యోరు రమ్మన్నారు. సీత కూడా వత్తాది.” అని అరిచి చెప్పేడు. వెళ్ళిపోతున్న బుజ్జిగాడు టకీమని నిలబడిపోయాడు. నోట్లో ఉన్న పుల్ల ఊసేశాడు.
“ఏటీ? మళ్ళీ సెప్పు?”
“ఓసోస్, ఇనబడనేదేటి? నానూ బడికొత్తన్నాను.”
“పెపంచకం మారిపోనాదేటి ఒరే!” అంటూ దగ్గరకొచ్చి, నెత్తి మీద కుండ దింపి, చెవిలో మెల్లగా… “దురగమ్మ వూ కొట్టినాదేటిరా?” అన్నాడు ఆరాగా.
“మరే!” అన్నాడు సుబ్బిగాడు అదే స్వరంతో.
సీత వచ్చి బుజ్జి గాడి నిక్కరు పట్టుకు లాగింది. నిక్కరు జేబులోనుంచి లేత చింతకాయ ముక్కను తీసి సీత చేతికి అందించాడు బుజ్జి. “అవును గానీ, అయ్యోరు ఏటన్నార్రా?”
“నన్ను బడికి రమ్మన్నారు. అంతే!”
“అయితే వొచ్చిన మాటేగా? ఒట్టు?” నమ్మకం కుదరక చెయ్యి జాచాడు బుజ్జి. చేతిలో చెయ్యేసి గిల్లాడు సుబ్బిగాడు.
“అయితే బేగొచ్చి, నాను కూడా వచ్చేత్తాను” అని కుండ తలకెత్తుకున్నాడు బుజ్జి గాడు.
దుర్గమ్మ మట్టి చట్టితో గంజన్నం, పక్కనే పిండొడం తెచ్చి పెట్టింది. ఆశ్చర్యంగా చూశాడు సుబ్బిగాడు. “తినేసి పో” అంది.
సుబ్బిగాడు చెల్లికో బుక్క పట్టించి, తానో బుక్కెడు తాగి, పిండొడియం కొరికి, సీతతో మాట్లాడుతూ పకాలి పూర్తిచేశాడు. మూతి తుడుచుకుని, చెల్లి మూతి తుడిచి, చట్టి కడిగి బోర్లించాడు. సీతని చంకనేసుకుని “పిన్నీ! నే బడికెళ్తున్నా” అని కేకేసి బయలుదేరిపోయాడు.
…….
సుబ్బిగాడు బడికి వెళ్ళేసరికి బుజ్జి, మహేశు వచ్చేరు.
“నేను సెప్పినాను గదేటి సుబ్బిగాడు బడికి వత్తాడని… నువ్వే నమ్మనేదు” అని మహేశుతో అన్నాడు బుజ్జి.
సీతకి జీడి ఉండ ఇచ్చాడు మహేశు.
“పదరా అయ్యోరు వచ్చేత్తారు” అంటూ చెరొకపక్క భుజాల మీద చేతులు వేసి సుబ్బి గాడిని బడి అనబడే అయ్యోరు అరుగు మీదకి తీసుకెళ్లారు.
సీతని గోడ పక్కగా కూర్చోబెట్టేడు.
“శీనుగాడు ఏడి రా?” అడిగాడు సుబ్బు.
“రేత్రి ఆడి నాన్న బాగా తాగొచ్చి శీను గాడి అమ్మని కొట్టాడట. ఈడికి కోపమొచ్చి పక్కన ఉన్న పచ్చడి బండ ఒట్టుకుని ఆళ్ల నాన్నని బాదేశాడట. నడుం ఇరిగి పోయిందని ఆళ్ల నాన్న ఏడిసి పడిపోతే ఈడు అక్కడ నుండి పారిపోనాడట. ఇంకా ఇంటికి రానేదు.” పెద్ద డిటెక్టివ్ లా ఫోజు పెడుతూ మహేశు చెప్పేడు.
సుబ్బిగాడికి ఎక్కడో తడుతోంది… “ఒరేయ్ నేను శీను గాడ్ని సూసేను రా.” అన్నాడు ఎక్కడో ఆలోచిస్తూ…
“ఎక్కడ సూసేవురా?” బుజ్జి, మహేశు ఇద్దరూ ఒకేసారి అరిచినట్టు అడిగారు.
“ఉండేహే. పొద్దుగాల నీళ్లు నింపినాను. తర్వాత కొండవారకి పోయినాను. కొండగోగు పూలు ఏరినాను… అద్దిగో… అక్కడ కొండగోగు పూలు ఏరతా ఉంటే ఎవులో సెట్టు సాటుకు పోయినట్టు అనిపించినాది. పొద్దుపొద్దున్నే ఎవులో సెంబొట్టుకుని వొచ్చినారనుకున్నాను. శీను గాడే అన్నమాట” స్వగతంలా అనుకుంటూ పైకే అనేసాడు.
“అమ్మనీ… కొండవారకి పారిపోనాడా… సీకట్లో బయం ఎయ్యనేదురా ఎదవకి?” అన్నాడు బుజ్జి.
“ఒరేయ్ అటు సూడండ్రా” సీత సుబ్బు నిక్కరు పట్టి లాగితే అటు చూసిన సుబ్బు వెంటనే నేస్తాలుకి చెప్పాడు. సుబ్బు చూపిన పంతులు గారి ఇంటి వెనక్కి చూసారు బుజ్జి, మహేశు. సగం నిక్కరు, ఒక చేయి, ఒక కాలు కనిపిస్తున్నాయి.
“శీనూ… ఇటు రారా” లో గొంతుకతో పిలిచాడు బుజ్జి.
శీను తల బయటపెట్టి, అడ్డంగా ఊపాడు. “పర్నేదు రా ఎహె” మహేశు పిలిచాడు. “సీత, సుబ్బు వచ్చారు”
శీను ఒక్కసారిగా “ఆఁ” అంటూ చెవి మీదకు చెయ్యి పోనిస్తూ అటు వైపు తిరిగాడు. పంతులు గారు నిలబడి ఉన్నారు అక్కడ.
“ఏరా! రాత్రి మీ నాన్నని కొట్టావట? ఎక్కడికి పారిపోయావురా?” అడిగాడు పంతులుగారు.
“అయ్యోరా సెవ్విడు…” అంటూ “మాయమ్మని సితక తంతున్నాడు అయ్యోరా. కోపమొచ్చి బండతో ఒక్కటేశా… సచ్చిండేమో అని బయమేసి పారిపోయా” చెప్పాడు శీను.
“లేదులే. బాగానే ఉన్నాడు. పొద్దున్న లేచి ఏమన్నా తిన్నావా?” అడిగాడు పంతులుగారు.
తల అడ్డంగా ఊపాడు వాడు. ఇంట్లోంచి ఆకులో అన్నం, గిన్నెలో చారు పట్టుకొచ్చింది పంతులుగారి భార్య. ఆమెకి ఓసారి దన్నవెట్టి కూర్చున్నాడు శీను. వాడి ముందు ఆకు పెట్టి అన్నంలో చారు పోసింది. ఇంగువ వాసన వెగటుగా ఉన్నా, ఆకలి ముందు అది తెలియలేదు శీను గాడికి. ఆవురావురుమంటూ తినేసి, ఆకు బయట పారేసి, చెయ్యి కడుక్కుని వచ్చాడు. అక్కడే ఉన్న సిలవరు ముంతతో కడుపునిండా నీళ్లు తాగాడు. “వెళ్లి మీ జతగాళ్లతో కూర్చో” చెప్పేడు పంతులుగారు.
శీను గబగబా ముందు వసారా లోకి వచ్చాడు. సీత చేతులిచ్చింది. సీతని చంకనేసుకుని, సుబ్బు పక్కన కూర్చున్నాడు శీను. ముందు కూర్చున్న బుజ్జి, మహేశు శీను పక్కకి వచ్చారు. మహేశు శీను చేతిని పట్టుకుని వాసన చూసాడు. “అమ్మగారు అన్నవెట్టిందా?” అడిగాడు. “అయ్యోరు సెవి పిండేరు” అన్నాడు వాడు.
“అమ్మగారు దేవతరా… సుబ్బు నువ్వు సూసావా అమ్మగారిని?” అడిగాడు బుజ్జి.
“నేదురా” అన్నాడు సుబ్బు. “సూత్తావులే! ఆయమ్మ అందరికి అన్నీ ఇత్తాది” భక్తిగా దండం పెట్టేడు మహేశు.
“ఓసోస్ కొత్త నేస్తవు…” ఆడ గొంతు వినిపించి వెనక్కి తిరిగాడు సుబ్బు.
ఎంకన్న కూతురు లష్మి. “సీతా” పిలుస్తూ చేయి జాచింది. కిలకిలా నవ్వుతూ శీను చేతుల్లోంచి లష్మి చేతుల్లోకి వచ్చింది సీత.
“ఇయ్యేల నుంచి సుబ్బు, సీత మన జత. ఆటల్లోనే కాదు. బళ్లోనీనూ…” బుజ్జి. అందరూ చేతులు కలిపారు. సీత కూడా కిలకిలా నవ్వుతూ చెయ్యి కలిపింది. సుబ్బు, సీతల్లాగే, బుజ్జి, శీను, మహేశు, లక్ష్మి అందరూ ఒకప్పుడు బాగా బతికి, కాలం కలిసి రాక చితికిన కుటుంబాలే.
బుజ్జి వాళ్ళ నాన్న వడ్రంగం చేసేవాడు. అందరికి ఎడ్లబళ్ళు, నాగళ్లు మొదలైన కర్రపని చేసి ఇచ్చేవాడు. ఒకసారి చేసి ఇస్తే తరాలు మారి, ఆ వస్తువు చేతులు మారేది కానీ, మరమ్మత్తుకు వచ్చేది కాదు. అంత చేవ గల కర్ర వాడి నైపుణ్యంగా చేసేవాడు. దానితో పని ఎక్కువగా దొరికేది కాదు. పైగా వ్యవసాయానికి ట్రాక్టర్లు, మర నాగళ్లు రావడంతో పని పూర్తిగా పోయింది. చాలా రోజులు ఖాళీగా ఉన్న తర్వాత ఊళ్ళో ఉన్న మిగతా జనంతో కలిసి, ఇళ్లకు స్లాబ్ వేయడానికి సెంట్రింగ్ పనులు నేర్చుకుని, వాళ్ళతో వెళ్ళసాగాడు. ఒకసారి సర్వే కర్రకి మేకు కొడుతూ ఉంటే పక్కన పెచ్చు ఎగిరి కంట్లో గుచ్చుకుంది. వైద్యం చేయించినా కన్ను మాత్రం రాలేదు. కంటికి అడ్డంగా గుడ్డ కట్టుకొని, ఇంటికే పరిమితమైపోయాడు బుజ్జి తండ్రి. ఇంటి బరువు పదేళ్ల బుజ్జి మీద పడింది. అడవికి వెళ్ళి పుల్లలు, గింజలు, కాయలు సేకరించుకుని రావడం, నీళ్లు మోయడం, చుట్టుపక్కల ఎవరికైనా కార్యాలప్పుడు నీళ్లు మోసి పదో పరకో ఇంట్లో ఇవ్వడం వాడి పని. తల్లి మిషన్ మీద జాకెట్లు లాంటివి కుట్టి కాస్త సంపాదిస్తుంది.
శీను తండ్రి తాపీ పని చేస్తాడు. చేతికి డబ్బులు వచ్చిన నాడు బాగా తాగి శీను అమ్మని కొడతాడు. తర్వాత అన్నం తిని పడుకుంటాడు. శీను అమ్మ, అప్పుడు మొగుడికి అన్నం పెడుతుంది, ఆ మర్నాడు మొగుడికి తెలివి వచ్చినప్పటి నుంచి శోకాలు పెడుతుంది. శీను నాన్నకి చిరాకేసి, మిగిలిన డబ్బులు వాళ్ళ అమ్మ మీద విసిరి బయటకి వెళ్ళిపోతాడు. శీను అమ్మ ఆ కొన్ని డబ్బులతోనే ఇల్లు గుట్టుగా లాక్కొస్తుంది. శీను అప్పుడప్పుడు బుజ్జి, సుబ్బులతో అడవికి వెళ్లి ఆకులు తెచ్చి అమ్మకు ఇస్తాడు. శీను అమ్మ ఆ ఆకులతో విస్తర్లు కుట్టి దుకాణాలకు ఇస్తుంది.
మహేశు అమ్మ నాన్న ఇద్దరూ మసూచి పోసి చచ్చిపోయారు. మహేశు నాన్నమ్మ ఉన్న కొద్దిపాటి పొలం చేసుకుంటూ చిన్నప్పటి నుంచి వాణ్ణి పెంచింది. అమ్మ నాన్న సచ్చిపోయినప్పుడు పసుపు రాసినాక ఫోటోలు తీశారు. అవే తెలుసు వాడికి. అంతే. అమ్మని చూళ్ళేదు, నాన్నని చూళ్ళేదు వాడు. నలుగురిలో కాస్త బొద్దుగా ఉండేది వాడే. బుజ్జి రివటలా పొడుగ్గా ఉంటాడు. శీను సుబ్బు కంటే కొంచెం పొడుగు. కానీ ఇద్దరూ ఒకేలా కనిపిస్తారు.
వెంకన్న ఊళ్ళో సంచీ వైద్యం చేస్తాడు. అడవిలోకి వెళ్లి మందు ఆకులు, మూలికలు, వేర్లు తెస్తాడు. పసర్లు, పొడులు, గుండలు చేసి పొట్లాలు కట్టి ఉంచుతాడు. వైద్యం కోసం వచ్చినవారి దగ్గర గింజలో, కాసులో తీసుకుని, ఒక పొట్లం ఇచ్చి నీళ్లతోనో, తేనె తోనో రంగరించి నాకమంటాడు. వారం వారం జరిగే సంతల్లో మూలికలు, వేర్లు పరిచి అమ్ముకుంటాడు. ఒక్కత్తే కూతురు లక్ష్మి. లక్ష్మీ అమ్మకు జ్వరం, విరేచనాలు వస్తే, ఏవో పొడులు నీటిలో కలిపి తాగించాడు. విరేచనాలు కట్టలేదు. ఆవిడ ప్రాణం కడగట్టింది. “ఆయుష్షు అంతే. ఏం చేస్తాం?” అన్నాడు. అప్పటి నుండి తండ్రి అడవికి వెళ్తే వెనకే వెళ్ళేది లక్ష్మి. పేరుకు లక్ష్మి అయినా అందరూ పిలిచేది లష్మి అనే…
అలా సుబ్బు, బుజ్జి, శీను, లష్మి అడవి కలిపిన స్నేహితులు అయితే మహేశు సాయంకాలం ఆటల్లో కలిసిన స్నేహితుడు. వీళ్ళందరికి ముద్దు సీత. ఈ అడవి సీతాకోకచిలకల భవిష్యత్తు ఏమిటో… గమ్యమేమిటో…
******
“చూడండి మిత్రులారా! మనలో నాయకుడు అంటూ ఎవరూ లేరు. భుజబలం, యుక్తి, చాకచక్యం, నేర్పరితనం, వేగం అందరిలోనూ సమానం. సాధారణంగా మనలాంటి వారు గుంపుగా ఏర్పడినప్పుడు ఒకరిని నాయకునిగా ఎన్నుకోవడం జరుగుతుంది. మిగిలిన వారు నాయకుని సూచనలు అనుసరిస్తారు. కొన్నేళ్ళు బాగానే జరుగుతుంది. ఎప్పుడైనా నాయకుని ఆలోచన విఫలమైతే, అనారోగ్యం వస్తే, గాయపడి శక్తి హీనుడైతే, లేదా అనుచరులలో ఒకరికి పేరాశ కలిగితే ఆ నాయకునికి హాని తలపెట్టే ఆలోచన చేస్తాడు. గుంపులో కొంతమందిని తనవేపుకు తిప్పుకుంటాడు. వర్గాలు ఏర్పాటు చేస్తాడు. మనకు ఆ సమస్య రాకుండా ముందే మనం జాగ్రత్త పడ్డాం. ఏడాదిగా మనం కొల్లగొట్టిన సొమ్ములో సగం మన అవసరాలకు ఉమ్మడిగా ఉంచుతూ, మిగిలిన సగం మన నలుగురం పంచుకుంటున్నాం. ఎవరి వ్యక్తిగత అవసరాలకు, కుటుంబాలకు వాడుకుంటున్నాం. కానీ ఇలా ఎన్నేళ్లు చేయగలం?” ఆగాడు విషయం చెప్తున్న నల్ల ముసుగు వ్యక్తి. ఎరుపు, నీలం, ఆకుపచ్చ ముసుగులు ధరించిన వారు అంతవరకు మౌనంగా వింటున్నారు.
“కాలా! ఎన్నాళ్ళు ఏమిటి? అర్ధం లేని ప్రశ్న. మన ఒంట్లో సత్తువున్నన్నాళ్ళు సంపాదిస్తూనే ఉంటాం.” అన్నాడు ఆకుపచ్చ ముసుగువ్యక్తి.
“అన్ని రోజులు మనవి కావు శ్యామా. రేపు కాకపోతే మరో రోజు మనం పట్టుబడే అవకాశం ఉంది.” చెప్పాడు కాలా.
“నా దగ్గర ఒక ఉపాయం ఉంది చెప్పనా?” అన్నాడు నీలం ముసుగు వ్యక్తి.
“చెప్పు నీలా… అందరం ఆలోచనలు పంచుకోడానికే ఇక్కడ చేరాం” చెప్పాడు కాలా.
“మనం ఒక సైన్యాన్ని ప్రత్యేకంగా తయారు చేసుకుంటే? మన నాయకత్వంలో వారే దోపిడీలు చేస్తారు. మనం అజమాయిషీ చేయడమే” చెప్పాడు నీలా.
“ఆలోచన బాగుంది. మనం ఉమ్మడిగా ఉంచిన సొమ్ము చాలా ఎక్కువగా ఉంది. ఆ సొమ్ముతో ఆయుధాలు కొని, బలిష్టంగా ఉన్న వ్యక్తులను ఎన్నుకొని వారికి శిక్షణనిద్దాం.” చెప్పాడు ఎర్రముసుగు వ్యక్తి.
“అవును శోణా! నీ ఆలోచన కూడా బాగుంది. అయితే భవిష్యత్ కార్యక్రమం ఆలోచన చేయండి.” చెప్పాడు కాలా.
“బలిష్టమైన, వయసులో ఉన్న వ్యక్తులను నేను సమీకరిస్తాను, అది నాకు సులువైన పని” చెప్పాడు శ్యామా.
“ఆయుధాల సేకరణ నా వంతు” చెప్పాడు శోణా.
“కొన్ని ఆయుధాలు కమ్మరి వద్ద చేయించాలి. ఆ పని నేను చూసుకుంటాను” చెప్పాడు నీలా.
“అంతే కాదు ఇంకా కొన్ని పనులున్నాయి. వినండి” అంటూ మరికొన్ని వివరాలు చెప్పాడు కాలా.
అతడు చెప్పిన వివరాలు విని, సమ్మతిగా తల ఊచారు ముగ్గురూ.
…….
“ష్. అయ్యోరొస్తున్నాడు.” చెప్పింది లష్మి. అందరూ నిశ్శబ్దం అయిపోయారు. అయ్యోరు అందరిని కలయజూసారు. సుబ్బు, సీత కనిపించారు. ఇద్దరినీ దగ్గరకు రమ్మని పిలిచారు. సుబ్బుకు కొత్త పలక, బలపం తీసి ఇచ్చారు.
…….
“ఈరోజుకు ఈ సమావేశం ఇంతటితో ముగిద్దాం. ఇప్పుడు ఎవరి పనులు వారు చూసుకుంటూ, వచ్చే పున్నమి నాటి రాత్రి కలుద్దాం” చెప్పాడు కాలా.
శ్యామా, నీలా, శోణా అంగీకార పూర్వకంగా తల వూచి లేచి నిల్చున్నారు. దగ్గరలోనే పచ్చిక మేస్తున్న వారి గుర్రాలను పిలుస్తున్నట్లు ఊళ వేసాడు కాలా. నాలుగు గుర్రాలు సకిలించుకుంటూ వచ్చి నిలిచాయి. ఎవరి గుర్రాన్ని వారు అధిరోహించారు. నాలుగు దిక్కుల వైపుగా నాలుగు గుర్రాలు సాగిపోయాయి.
…….
అయ్యవారు వచ్చి అందరి చేత సరస్వతీ నమస్తుభ్యం చెప్పించారు. అక్షరాలు దిద్దించారు. సుబ్బును దగ్గరకు పిలిచారు. కొత్త పలక వాడి చేతిలో పెట్టి, బలపం పట్టించి, ఓం నమః రాయించారు. పక్కనే నిల్చున్న సీత కిలకిలా నవ్వి చప్పట్లు కొట్టింది. అమ్మగారు వచ్చి ముందుగా సీత చేతిలో బెల్లం ముక్క పెట్టింది. తర్వాత పిల్లలందరికీ మరమరాలు, బెల్లం పంచింది.
చేతవెన్నముద్ద పద్యం చెప్పించారు. పంచతంత్రం కథలు చెప్పారు. ఉదయం నిద్ర లేవగానే అరచేతులు చూసుకోవాలని, కరాగ్రే వసతే లక్ష్మీ శ్లోకం చదువుకోవాలని చెప్పారు. శ్లోకం నోరు తిరగలేదు కానీ ‘అరచేతులే కదా చూసేద్దాం లే’ అనుకున్నాడు సుబ్బు. ‘దండమయా విశ్వంభర’ పద్యం చెప్పి, ‘ఈ రోజుకి బడి చాలు’ అని అందరినీ ఇంటికి పొమ్మన్నారు అయ్యవారు.
శీను, బుజ్జి, మహేశు, లష్మి వారి పలకలను తెచ్చి అయ్యవారి ఇంటి గడప పక్కనే పెట్టారు. సుబ్బు కూడా తన పలకను తెచ్చి అక్కడ పెట్టాడు. సీతను మహేశు భుజాల మీదకు ఎత్తుకున్నాడు.
నాలుగడుగులు వేశాడో లేదో ‘ఒరే సీత కునికీసిందిరా’ అన్నాడు బుజ్జి.
“సీత అటు ఇటు తూగకుండా నువ్వు సూసుకో” అన్నాడు మహేశు.
సీత తూగకుండా వెనుక లష్మి, పక్కన మరో ఇద్దరు జాగ్రత్తగా చూసుకుంటూ సుబ్బిగాడి ఇంటి వరకు తీసుకువచ్చారు. దుర్గమ్మ సీతను ఎత్తుకుంది. “రేయ్ సుబ్బు, అన్నం తినేసి రారా” అని చెప్పి, వెళ్లిపోయారు స్నేహితుల బృందం. అయ్యవారు చెప్పినట్లు కాళ్ళు, చేతులు కడుక్కున్నాడు సుబ్బు. చట్టిలో గంజన్నం, పిండొడం తెచ్చి ఇచ్చింది దుర్గమ్మ. ఆత్రంగా తాగేసి మూతి తుడుచుకున్నాడు సుబ్బు.
“పిన్నీ, ఆడుకొని వచ్చి నీళ్లు నింపుతాను” చెప్పాడు సుబ్బు. దుర్గమ్మ ముఖంలో ఏ భావము లేదు. వద్దనలేదు కాబట్టి, ఒప్పుకున్నట్లే అనుకోని తుర్రున పరిగెత్తి పోయాడు సుబ్బు.
****సశేషం****
రచయిత్రి పరిచయం:
నాగమంజరి గుమ్మా గారు వృత్తి రీత్యా ఉపాధ్యాయిని. ప్రవృత్తి: సాహిత్య సేవ. భాషణం, పఠనం, లేఖనం మూడూనూ..
కవితలతో మొదలై పద్యాలు, ఖండికలు, నాటిక, యక్షగానం, నృత్యరూపకం, వ్యాసం, సమీక్ష, గీతం, కథలు, నవల… ఇలా వీలైనన్ని, చేతనైనన్ని సాహితీరూపాల్లో రచనలు చేయడం వారికి నిత్యకృత్యమైనది. వారు వ్రాసిన శ్రీగణేశ చరిత్ర, విశ్వనాథ శతకం, ఆరామద్రావిడ వంశ ప్రవరలు, ఆయుష్మతి, పుష్పమంజరి పుస్తకాలుగా ముద్రితమయ్యాయి. అనేక దిన, వార, పక్ష, మాస, ద్వైమాస పత్రికలలో వారి రచనలు ప్రచురితమయ్యాయి.
అవకాశం దొరికినప్పుడల్లా పురాణ ప్రవచనాలు చెప్పడం, పిల్లలకు శ్లోకాలు పద్య పఠనంలో శిక్షణ నివ్వడం. ముగ్గుల పోటీల్లో, మాస్టర్స్ అథ్లెటిక్స్ లో రాష్ట్రస్థాయిలో బహుమతులు, పతకాలు పొందడం జరిగింది.