శుభాకాంక్షలు – నాదానుభూతి
అయ్యగారి సూర్యనారాయణమూర్తి
శుభాకాంక్షలు సీ. శరదిందుహిమబిందుసరకుందశరబృంద సురనదీదిందీరశుభ్రగాత్ర సుకుమారసుకుమారశుకవారపికసార సుస్వరాక్షరశబ్దశోభ నీయ ఘనసారపరిశుద్ధఘనసారలయబద్ధ పదబంధబంధురబంధువు లయి మనసార విని సారమును సారసమరంద మిందిందిరము వోలె నందుకొనఁగఁ తే.గీ. బాఠకులు, నిత్యమా పరబ్రహ్మ నెందు సందియములేక కను భాగ్య మొంది మనుజ భవము తరియించు కవితానుభవముఁ బంచి మంచి కలిగించ నెంచి ప్రార్థించువాఁడ [శర=ఱెల్లు, దిందీర=నురుగు, బంధుర=ప్రియము] భావము- శరత్కాలపు చంద్రుడు, మంచుబిందువుల హారము, మొల్లలు, ఱెల్లు గడ్డి, ఆకాశగంగ, నురుగు – వీని వలె తెల్లని శరీరముకల దేవి (సరస్వతి) మంచి కుమారుని యొక్క (నా యొక్క) కోమలము, ఎన్నో చిలుకల, శ్రేష్ఠమగు కోయిలల, వంటి చక్కని స్వరముకలిగిన శాశ్వతమగు/వర్ణములతోకూడిన శబ్దముల శోభ నాకు ప్రసాదించగా, కర్పూరము వలె నిర్మలమై గొప్ప రసము మఱియు లయ కలిగిన పదముల అల్లికలకు ప్రియమైన చుట్టాలై, మనసు నిండేలా కవిత్వమును ఆలకించి, కమలములలోని మకరందమును ఆస్వాదించే తుమ్మెదలవలె కవితా సారమును చదువరులు అందుకొనగా, ఎందులో అయినా విస్సందేహముగా పరమాత్మను ఎప్పుడూ దర్శించగల భాగ్యమును పొంది, నరజన్మ సార్థకమయ్యే కవితానుభవమును అందరికీ పంచిపెట్టి మంచిని కలిగించే ఆలోచనతో భగవంతుణ్ణి ప్రార్థిస్తాను. సీ. ఎలుగెత్తి పిల్చిన నేలుకొ మ్మంచును బరువెత్తి(1) చేరెడు పాలకుండు గళమెత్తి నామంబు గానంబు గావింప నిలువెత్తు దైవమై నిలుచువాఁడు కయిలెత్తి(2) శిరముపైఁ గైమోడ్పు సేయఁగా తెరలెత్తు(3) కృపఁ గాంచు దిక్కు తానె తనువెత్తు ప్రతిజీవితనుమనోబాధలఁ(4) గరమెత్తి(5) తఱిమెడు కన్నతండ్రి తే.గీ. ఎత్తు శిఖరాల నెక్కలే కెవరు వేఁడ చిత్తమునుఁ జిక్కఁబట్టుక(6) చెంతఁజేర సరసహృదయుఁడు వేంకటేశ్వరవిభుండు కొండ దిగివచ్చు కొండంత యండ యగుచు (1) పరుగెత్తి (2) చేతు లెత్తి (3) పొంగు (4) ప్రతి ప్ర్రాణి శారీరిక, మానసిక కష్టములను (5) చెయ్యి పైకెత్తి (6) గట్టిగా పట్టుకొని నాదానుభూతి ఉ. వెంటను గంచుచెం బొకటి వేడుకగాఁ గొని కొండమెట్లనే జంటను గోరి యెక్కెఁ బ్రభుసన్నిధి వేడుకొనంగఁ బెండ్లికై, తుంటరి చేయి జారి పడి దొర్లుచుఁ దెన్గునఁ బద్య(1)నాదమై ‘టంటట టంటటం టటట టంటట టంటట టంటటమ్మనెన్’ (1) ఉత్పలమాల
********
103
ఈ పద్యములు, వాక్యములు పూర్వ కాలంలోని “భారతి” , ” కృష్ణా పత్రిక” లను గుర్తుకు తెస్తున్నాయి. ఆ రోజుల్లో చిన్న తరగతుల తెలుగు పుస్తకాల్లో కూడా మంచి గ్రాంథిక తెలుగు ఉండేది.
శ్రీ అయ్యగారి సూర్యనారాయణ గారు సరస్వతీ పుత్రులు. ధన్యులు.
“