Menu Close
లేఖిని – కథా లోగిలి
సేకరణ, కూర్పు – అత్తలూరి విజయలక్ష్మి
మనసు పొరల్లో
– మీనాక్షీ శ్రీనివాస్ –

డిసెంబర్ చలి నగరాన్ని వణికిస్తోంది.

ఉదయం ఐదు గంటల వేళ హాయిగా వెచ్చగా కప్పుకుని, మరింత వెచ్చదనాన్ని ఇస్తూ, తన చుట్టూ ఉన్న చేతుల్ని విడిపించుకుని లేవాలంటే, ఊహూ అస్సలు మనసొప్పడంలేదు. కానీ తప్పదు, ఏంచేస్తాం? లేవాలి.

లేస్తూనే రెండు అరచేతుల్నీ రుద్దుకుని, ‘ప్రభాతే కరదర్శనం…’ అంటూ చిన్నప్పుడెప్పుడో అమ్మ వల్లెవేయించిన శ్లోకం మనసులోనే చదువుకుని పాదం నేల మోపాను.

దంతధావనం కానిచ్చి, ఫిల్టర్‌లో డికాక్షన్ వేసి, తలుపు బయటనించి లాక్‌చేసి ఫర్లాంగ్ దూరంలో ఉన్న పాలకేంద్రానికి బయలుదేరా.

పాలపేకెట్ వేసే కుర్రాడు గత వారం రోజులుగా రావడం లేదు ఎందుకనో?

ఉదయాన్నే ఎంతో నిబద్ధతతో వచ్చి పాలపేకెట్లనీ, పేపర్లనీ ఇంటింటికీ వేసే ఆ కుర్రాళ్ళంటే నాకెంతో గౌరవం, ఇష్టం. అంత చిన్న వయసునుండీ తమ పొట్ట తాము పోసుకుంటూ, కొండకచో తల్లి తండ్రులను కూడా సాకే వాళ్ళ నిస్వార్థత అంటే నా కిష్టం. అవును, వాళ్ళకు స్వార్థం తెలియదు. ఎందుకంటే వాళ్ళింకా పసివాళ్ళు.

ఆలోచనతోనే చెవుల మీదుగా చీరచెంగు కప్పుకుని వెళ్ళి పాలపేకెట్స్ తీసుకు వస్తున్న నాకు, గాంధీ బొమ్మ కనిపించింది. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ అహర్నిశలూ అక్కడే నిలబడి, దేశానికి స్వాతంత్ర్యం కోసం నే పోరాటం చేసిన ఫలితం ఇదా అన్నట్లు జాలిగా చూసే ఆయన కళ్ళు… ఆయన ఆత్మ పడే క్షోభని తెలుపుతున్నాయా అనిపిస్తుంది నాకు అది చూసినప్పుడల్లా.

నడుస్తున్నదాన్నల్లా ఠక్కున ఆగాను. తలతిప్పి బొమ్మకి కొంచెం వెనగ్గా ఉన్న చెత్తకుప్ప తొట్టి పక్కగా కర్రపోటేసుకుని ఓ ముసల్ది కూచున్న భంగిమ. క్షణకాలం అయోమయం. నేనిప్పుడే కదా ఇలా వెళ్ళాను అప్పుడున్నట్లు లేదే! ఇంతలో ఎలా?

ఒక్క క్షణం నన్ను దాటుకుంటూ వేగంగా వచ్చిన నల్ల రంగు వేను, అంతే వేగంగా మళ్ళీ నన్ను దాటుకుంటూ వెళ్ళడం గుర్తొచ్చింది.

బహుశా అదొచ్చింది ఈ పని మీదేనేమో!

నాలుగు రోడ్ల కూడలి, మధ్యలో ట్రాఫిక్ పోలీస్‌లా ‘గాంధీ‘. విగ్రహం కనక పాపం నిగ్రహంగా, నిబ్బరంగానే ఉంటాడెప్పుడూ. అంత చెత్తలోనూ. అసలు అలా నాలుగు రోడ్ల జంక్షన్లో, అది కూడా అలా మహాత్ముడి పక్కనే చెత్తకుండీ పెట్టాలన్న ఆలోచన మన నగరపాలక సంస్థ వారికి మాత్రమే రాగలదు. ఆ ఏరియాలో వాళ్ళంతా పాపం ఎలాగో అక్కడి దాకా వస్తారు. కానీ దగ్గరగా పోయి చెత్త అందులో వెయ్యాలంటే అసహ్యం మరి… అందుకే చుట్టూ పోసి పోతారు. ఆపైన ఆవులూ, కుక్కలూ, పందులూ ఆశ కొద్దీ చేసే చిందర వందర.

ఇప్పుడా తాతకు దీటుగా, నేనున్నా నీకు తోడుగా అన్నట్లు కర్రపోటేసుకుని కూర్చున్న భంగిమలో ఓ ముసల్ది ఆ చెత్త మీద.

చీరచెంగుతో ముక్కు మూసుకుంటూ, ఎత్తెత్తి అడుగులు వేస్తూ కాస్త దగ్గరగా వెళ్ళి చూస్తునా! తెరుచుకునే ఉన్న ఆ కళ్ళు… నిస్తేజంగా, ఆశ్చర్యంగా, అపనమ్మకంగా నా వైపే చూస్తున్నట్లున్నాయి.

తొంభై ఏళ్ళ తొక్కు, ఎండిన గుండెలు, చిక్కి శల్యమై తోలుతిత్తిలా వేళాడుతున్న ఆకారం.

అసలిలాంటి పని, ‘ఇంతపని’ ఎవరైనా చెయ్యగలరా? అని ప్రశ్నిస్తున్న గాజు కళ్ళు. కాస్త తెరచుకున్న బోసినోరు, చీకేసిన తాటి టెంకలాంటి ఎండిపోయిన జుట్టూ, శరీరంతో పోటీగా జీర్ణమైన అరకొర చీరముక్క వీధిపాలైన మానాన్ని కప్పుతూ. తిని పారేసిన విస్తరాకులా, వాడి పారేసిన వస్తువులా విస్సిరి పారేసారు. ఒక్క సారిగా గుండె కలచినట్లయింది, కడుపులో దేవినట్లయింది.

అలా రెండుమూడు నిముషాలు చూస్తే… ఆ కనురెప్పలు తాటించినట్లయ్యింది, చలికో… లేక ఆ క్రూర కలికో, ఆ దేహం వణికినట్లయ్యింది. ఇంతకూ ఆ ప్రాణం ఉన్నట్లా? లేనట్లా?

నా ఒంట్లోంచి ఆవిరులు. అప్పటిదాకా వణికించిన చలి, కంటపడ్డ నిర్దాక్షిణ్యానికి బెదిరి పారిపోయినట్లుంది.

ఏం చెయ్యాలి? అసంకల్పితంగా నూటెనిమిదికి ఫోన్ కలిపాయి వేళ్ళు. ఊహూ… ఎవరూ తియ్యడంలేదా ఫోన్. అదేమిటి, అది అత్యవసర సర్వీస్ కదా! మరి ఫోన్ తియ్యడం లేదేమిటీ? అదంతే… ‘ఇదీ నేటి భారతం’ అంతరాత్మ గొణుక్కుంది.

‘పద పద, అవతల నీకోసం బోలెడు పనులు ఎదురుచూస్తున్నాయి’ అంతరాత్మ అదిలించింది.

ఛ!  ఉండు. పనులెప్పుడూ ఉండేవే, పాపం ఎవరో అభాగ్యురాలు, ఇంకా కొనఊపిరి ఉన్నట్లే ఉంది. తనుగా వచ్చి అక్కడ కూర్చునే స్థితిలో లేదు, ఆ తల్లి పాలు తాగి పెరిగిన తనయుడెవరో ఇలా విసిరి పారేసినట్లున్నాడు… ఎంతకూ పోని ఆ ప్రాణం మీద కసితో.

ఇప్పుడేం చెయ్యాలి?

అక్కడున్న ఆ రెండుబొమ్మలకూ దీటుగా ప్రాణమున్న బొమ్మలా నిలబడిపోయిన నాలో చిరు కదలిక. దూరంగా రోడ్లూడ్చి, ఆ చెత్తనెత్తుకెళ్ళే నగర పారిశుధ్య కార్మికులు… ట్రాక్టర్‌తో. ప్రాణం లేచొచ్చింది. అలా పట్టనట్లు వదిలేసి వెళ్ళలేక, అక్కడ ఉండి ఏం చెయ్యలేక నలుగుతున్న నా మనసుకు ఊరట.

చెయ్యెత్తి రమ్మన్నట్లు నే చేసిన సైగ గమనించినట్టున్నారు… చేస్తున్న పనిని  వదిలేసి పరుగుపరుగున వచ్చారు ‘ఏటండమ్మా…’ అంటూ. చూపించాను మౌనంగా.

‘వార్నీ… ఎవులో ముసల్దాన్ని ఇలా చెత్తమీద పారేసారు… చెత్త నా… ‘ పరుగుపరుగున దగ్గరకు వెళ్ళారు.

ఆ ఘాతుకాన్ని చెప్పే దుస్థితి తప్పిస్తూ అప్పటికే ఆ ప్రాణం అనంతవాయువులో కలిసిపోయింది. వీళ్ళు కదపగానే పక్కకు ఒరిగిపోయింది.

“ఛ…  ఛ! ఏటీ మడుసులిట్టగవుతున్నారు. పండు ముసల్దాన్ని కుళ్ళిపోయిన పండునిసిరేసినట్ట్లు ఇసిరి పారేసిపోయారు. సాకనేకపోతే ఏ అనాదాశ్రమంలోనైనా పడేచ్చుగదా! ఇంత సల్లో… ఇలా సెత్త మీన… సెత్త మడుసులు, సెత్త ఎదవలు” గట్టిగా తిడుతూ ఆ ముసలిదాన్ని తను కప్పుకున్న పాత రగ్గులో సుట్టబెట్టాడు అతను. ఆ చెత్తతో బాటు పడెయ్యడానికి మనసు రాక అనుకుంటా ఒద్దికగా గాంధీ బొమ్మ చుట్టుతా ఉన్న సర్కిల్‌లో పెట్టాడు.

ఆమె కథ ముగిసిపోయిందని అర్థమైన నేను అక్కడ ఇంక ఒక్క క్షణం నిలవలేకపోయాను.

నాలుగడుగులు వేసాను, మనసులో తెలియని బాధ, ఇదీ అని చెప్పలేని బాధ… అమ్మతనాన్నే విసిరేయగలిగిన మనిషితనం వెక్కిరింపుగా ఫక్కుమంది.

చేతిలో పర్స్ తెరిచి చూసా రెండు నోట్లున్నాయి ఐదొందలవి, మరో ఆలోచన రాకముందే అతనిని పిలిచి చేతిలో పెట్టా ఆ తల్లిని బుగ్గిచెయ్యమంటూ.

“ధర్మతల్లులు… అట్టాగే” అంటూ అందుకున్నాడు. ఆ క్షణం నాకు తెలియదు డ్యూటీ దిగిన వెంటనే ఆ నోట్లు కల్లుదుకాణంలో చెల్లవుతాయని.

కాళ్ళకు రాళ్ళుకట్టినట్టు భారంగా పడ్డాయి అడుగులు.

ఆ రోజంతా కళ్ళముందు తెరచి ఉన్న ఆ గాజుకళ్ళే! ప్రశ్నిస్తున్న ఆ గాజుకళ్ళే!

ఇలాకూడా చేయగలరా? ఆశ్చర్యం, అపనమ్మకం నిండిన ఆ గాజు కళ్ళే!

జవాబులేని ప్రశ్న మనసుని తొలిచేస్తూంది. మనిషి పయనం ఎటువైపు?

అన్యమనస్కంగానే పనులు పూర్తిచేసి అరగంట ముందే ఇంట్లోంచి బయటపడ్డా. మరి నెలంతా ఆటోలకూ, బస్ కోసం దాచుకున్న వెయ్యి వెళ్ళిపోయిందిగా. అయినా బాధపడలేదు. త్వరత్వరగా నడక సాగించా ఆఫీస్ వైపు.

పని… పని… పని… ఊపిరిసలపని పని. రోజంతా మనసుని ఉదయం జరిగిన చేదు సంఘటనకు దూరం చేసి, కాస్త శాంతినిచ్చింది.

***

సాయంత్రం ఆఫీస్ అయ్యాక, నాతో బాటే పని చేసే నళినితో బాటు కబుర్లు చెబుతూ నడుస్తున్న నా కాళ్ళు ఠక్కున ఆగిపోయాయి. అక్కడ కొంచెం దూరంలో గంగరావి చెట్టు కింద… అదే రగ్గు… అదే ముసల్ది… అవే మూతపడని గాజు కళ్ళు, ప్రశ్నిస్తున్న గాజు కళ్ళు. పక్కనే ఎప్పుడూ అదే సెంటర్‌లో అడుక్కునే బిచ్చగాడు. గుండెలవిసేలా ఏడుస్తూ, తన తల్లి చనిపోయిందనీ, దహనానికి ధర్మం చెయ్యమంటూ… మొద్దుబారిన మెదడుకు మరో షాక్… దెబ్బతిన్న మనసుకు మరో దెబ్బ.

జరిగింది ఊహించడానికి ఈసారి పెద్దగా కష్టపడలేదు…

అంటే ఉదయం అంత బాధ్యతగా, ఆ తల్లి కన్న కొడుకు దురాగతాన్ని దుయ్యబట్టి, తన నమ్మకాన్ని కొల్లగొట్టి ఆ అనాథ ప్రేతానికి దహనం జరపమని తను ఎంతో నమ్మకంగా ఇచ్చిన సొమ్మే కాక, పదో, పరకకో ఆ శవాన్ని ఇలా బిచ్చగాళ్ళకు అమ్ముకున్న వాడు ఇంకెంతటివాడో కదా? ఇదా లోకం!

నా నిశ్చేష్టతనీ, అసహనాన్నీ అర్థం చేసుకున్న నళిని చెప్పిన విషయాలు నన్ను ఇంకా నరకంలోకి తోసేసాయి.

రెండుమూడు రోజుల వరకూ ఆ శవంతో తన వ్యాపారం కానిచ్చే ఆ బిచ్చగాడు తరువాత ఆ శవాన్ని ఏ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్‌కో ఇంకా లాభానికి అమ్ముకుంటాడు. ‘చాలా మామూలుగా (కేజువల్‌గా) నళిని చెప్పిన సమాచారం నాకు ఊహకైనా అందనిది. 

‘ఎక్కడున్నాను నేను? లోకం, సమాజం, మనిషి ‘ఇంత’ మునుముందుకు పోతుంటే నేనింకా ఏ కాలంలో ఉన్నానో తలుచుకుంటే నామీద నాకే అంతులేని జాలేసింది.

ఈ ఆలోచన పెంటకుప్ప మీద పడేసేటప్పుడే వాడికి వచ్చి ఉంటే బహుశా ఆ పని ‘వాడే’ చేసి ఉండేవాడేమో! అదే కొంచెం చదువూ, గట్రా ఉన్న వాడైతే అవయవాలనీ అమ్ముకోచ్చని తెలిసే అవకాశం ఉండేదేమో! అవివేకంతో, తెలియనితనంతో పాపం ఎంత నష్టపోయాడో కదా! పోనీలే ఇంకా చెల్లో, భార్యో, తండ్రో, అన్నతమ్ముడో, కూతురో ఉండే ఉంటారు…ఆ కొరత తీర్చడానికి.

ఆ కళ్ళూ, ఆ సంఘటనా చాలా రోజుల పాటు నన్ను ఎంతో అస్థిమితానికి గురి చేసింది. కొనఊపిరితో ఉన్న ఆ అవ్వ శవాన్ని దహనం చేయమని డబ్బిచ్చినా, చేయకుండా శవంతో కూడా వ్యాపారం చేయడాన్ని జీర్ణించుకోలేకపోయాను.

ఎలా? మనిషిలో పెరిగి పెద్దవుతున్న ఇలాంటి స్వభావాన్ని ఎలా పసిగట్టడం? ఎలా అరికట్టడం?

నానాటికి డబ్బు జబ్బుతో రోగగ్రస్థులై విలువలను అధఃపాతాళానికి అణగదొక్కేట్టున్న ఈ వైరస్‌ని ఎలా అరికట్టడం?

***

“అబ్బా జానూ! ఏమిటదీ ఎందుకలా ఎప్పుడూ దిగులుగా, ఏదో ఆలోచిస్తూ అన్నీ పోగొట్టుకున్నదానిలా ఉంటావ్? ఈ మధ్య మరీ…” వారం నుంచీ  బాగా గమనిస్తున్న నా భర్త వేసిన ప్రశ్నకు ఒక్క సారిగా భోరుమన్నాను. కొంత గుండె బరువు తగ్గేకా, ఏడుస్తూనే నే చూసిన ఆ ఘాతుకం చెప్పేను.

గుండె బరువు తగ్గేదాకా ఏడవనిచ్చి… అప్పుడు పెదవి విప్పారు.

“చూడూ! మనిషి దిగజారడం ఇప్పుడు మొదలవలేదు. అలా అని అంతా అలాగా లేరు. దానికి నువ్వే ఉదాహరణ. ఆ ఘోరాన్ని చూసి బాధపడ్డావు. మనిషిగా స్పందించావు, అంతవరకూ బాగానే ఉంది. కానీ అతనెవరికో ఆ డబ్బిచ్చి దహన సంస్కారాలు చేయించమన్నావు చూడు అదే నువ్వు చేసిన తప్పు. ఆ నిముషంలో అసలు నువ్వే ఆ శవాన్ని ఏ ఆటోలోనో తీసికెళ్ళీ ఆ పని చేయచ్చు, లేదా ఓ స్త్రీగా ఆ పని నువ్వు చేయలేకపోతే నన్ను పిలవచ్చు…”

“ఏమో! నాకప్పుడా ఆలోచన రాలేదు, అయినా ఎవరో తెలియని అనాథ  శవాన్ని…”

“నిజమే! ఇప్పుడు నీ బాధ చూడలేక అలాంటి ఆలోచన వచ్చింది కానీ, అదే ఆ రోజు నిజంగా నువ్వలా చేస్తే నా రియాక్షన్ ఎలా ఉండేదో! అమ్మతల్లోయ్, నీ జాలిగుండె, మంచితనంతో నిజంగానే నాకు పిచ్చెక్కినట్లుంది.

లేకపోతే ఇలాంటి తప్పుడాలోచనా, తప్పుడు సలహా ఎలా ఇస్తాను? చూడు బంగారం, నువ్వు అక్కడ చూసింది ఏ చనిపోయిన కోడో, కుక్కో లేకపోతే పందో కాదు తల్లీ అది మనిషి శవం. అర్థమవుతోందా మనిషి… అలా డబ్బులిచ్చి దహనం చేసేయమనడమో, లేకపోతే మనమే తీసికెళ్ళి తగలబెట్టడమో చట్టరీత్యా నేరం, అది మనవాళ్ళదైతే ఫర్వాలేదు కానీ ఎవరిదో తెలియకుండా, ఎలా చనిపోయారో తెలియకుండా ఆ పని చేస్తే…

మన దేశంలో చట్టాన్ని గౌరవించడం, ఆచరించడం తెలియకపోయినా దుర్వినియోగం చేయడం మాత్రం మహా భేషుగ్గా వచ్చు. అప్పుడు సీన్‌లోకి ఎవరో వచ్చి ఆ శవం తన తల్లిదనీ, చంపేసి కాల్చేసారనీ కంప్లైంట్ ఇస్తే చాలు. మనకు జన్మంతా లాక్కోడానికీ, అందులోంచి బయటపడలేక గింజుకోడానికీ సరిపోదు. వద్దమ్మా! నీ మితిమీరిన మంచితనంతో అలాంటి కష్టాలు తేకు. బాధ్యత గల పౌరుడిగా అలాటివి ఎదురైనప్పుడు పోలీసులకు తెలియచెయ్యి. అది కూడా ఇప్పుడు అలా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళను వేధించద్దని చట్టం వచ్చింది కనుక. సరేనా! 

జానూ! నిజంగా చెబుతున్నా, మనసున్న మనుషులుగా మనకు ఇలాంటి సంఘటనలు ఎదురైతే ఇకముందు, మనం చేయగలిగిన, చేతనైన సాయం చేద్దాం, అందుకు నా సహకారం కూడా నీకుంటుంది. అప్పుడిలా గిల్టీ ఫీల్‌తో బాధపడే అవసరం ఉండదు.

ఇదే కాదు, రోడ్డు మీద జరిగే ప్రమాదాలు పట్టించుకోవడంలో, ఆడపిల్లల మీద జరిగే అఘాయిత్యాలను ఆపడంలో కానీ, ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే చేయూతనివ్వడంలో కానీ, అలా ప్రతివిషయంలో ‘ఎవరైనా సాయం చేస్తే బాగుండు, ఎవరూ చేయడం లేదే’ అనుకోవడం మానేసి చేయగలిగిన ఆ సాయం ఏదో అలాంటి పరిస్థితి ఎవరికి ఎదురైనా వారే చేస్తే, సమస్యలు కొంతవరకూ తీరతాయి కదూ” అనునయంగా అన్న ఆయన మాటలు నన్ను ఆలోచనలో పడేసాయి కొంత ఉపశమనాన్ని కలిగిస్తూ.

***

రోజులు గడుస్తున్నాయి. మెల్లిమెల్లిగా మనసు కుదుటపడుతున్న సమయంలో మరో అరాచకం.

రోజూలాగే ఆఫీస్‌నుండి కలిసి వస్తున్న నళినీ, నేనూ కొంచెం దూరంలో జనం అంతా పోగయి ఉండడం చూసి ఏదైనా రోడ్డు ప్రమాదమా? అనుకుంటూ అక్కడకు చేరాం.

అక్కడ ఓ పిచ్చిది, ఒంటిమీద సరైన బట్టలు లేకుండా, ఓ తాగుబోతు చేతుల్లో. అంతా సినిమా చూస్తున్నారు. ఇంకా కొందరైతే నిస్సిగ్గుగా సెల్‌లో రికార్డ్ చేస్తున్నారు. ఆ క్షణం నాకేమైందో నాకే తెలియ లేదు. ఒక్క ఉదుటున అక్కడకు చేరి ఆ తాగుబోతుని ఒక్క తోపు తోసాను. అసలు ఆ క్షణం అంత బలం, ధైర్యం నాకెలా వచ్చిందో?

అక్కడ పక్కనే పేవ్‌మెంట్ మీద అమ్ముతున్న చొక్కా ఒకటి తీసుకుని ఆమెకు తొడిగి, ఓ ఆటో పిలిచి నళిని సాయంతో ఆ అమ్మాయిని అందులో ఎక్కించి అక్కడకు దగ్గరలో ఉన్న ఓ అనాథాశ్రమానికి తీసికెళ్ళి అందులో చేర్చాను.

మండుతున్న నా మనసు అప్పటికి చల్లబడింది. అప్పుడప్పుడు ఇంకా నా కళ్ళముందు కదలాడే ఆ ‘గాజుకళ్ళలో’ ఈసారి చిరు సంతోషం కనబడింది. కేవలం బాధపడడం కాక అలాంటి సందర్భాలలో నా కర్తవ్యం బోధపడింది.

********

Posted in January 2026, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *