ఓ దీపం కథ!

నీరెండలో నీరసించి
దప్పికతో తపియించి
పత్తితో చేసిన ఓ తెలి వత్తి
చక్కటి ప్రమిదలో చేరగిలబడింది
వేడి గాలుల సెగలలో
సన్నటి నడుమును ఊపుతూ
ప్రమిదపు గోడలని హత్తుకొని
ప్రదోషం కొరకు ఎదురు చూస్తోంది
ససంధ్య కడకు రానే వచ్చింది
నలుమూలల చీకటి నాజూకుగా వాలింది
ఇంత జాగేమని వర్తి ఇసుమంత అలిగింది
పాలిపోయిన నా మోము చూడమని
విసువుతో తన మోవి విరిచింది.
కనుచీకటి కిసుక్కున నవ్వింది
ఎచ్చటివో! ఆ తైలపు చుక్కలు
ఒక్కటొక్కటిగ అడుగులేస్తూ ఆ వత్తిని ఊరిస్తూ
పమిదెలోకి జారుతూ తగిలీ తగలనట్లు
దాని తనువును తాకుతున్నాయ్!
అలవికాని ఆనందంతో
ఆ తైలపు ధారలలో
తలతడిపి ఈదులాడి
అటూఇటూ పరుగులాడి
పట్టరాని సంతోషంతో
పక పక నవ్వింది.
ఎవరింతలో ఆమె
ఎదకి నిప్పంటించేరు!
ఈ అగ్గి ఎక్కడిదని అదిరి బెదిరి
తైలపు దెస చూపు మలిపింది…
చలించని చమురు నిర్వేద స్వరంలో
“నీవిప్పుడొక వట్టి దీపపువర్తివి కావు
దివిటీ వలె వెలుగు దివ్య కాంతివి!
ఈ మానవాళికి మార్గదర్శివి!
తనువర్పించే త్యాగశీలివి!
ఆ క్రియకి తోడ్పడే శ్రీలుడను నేను”….
అనే తాత్విక బోధన వింటూ
దేదిప్యమానంగా వెలుగుతూ
తరుగుతున్న తనువుని
తడిమి చూసుకుంది!
రగిలే మనసా!

రగిలే మనసా ఊరుకో!
ఎగిరే వయసూ దాగుకో!
రగిలే రవ్వలు ఎగిరితే
నిప్పంటుకుంటుంది సమాజానికి
ఎగిరే వయస్సు జారితే
ఫక్కుమంటుంది ఈ సమాజం.
విశాల హృదయానికి ఊడలు కట్టి వంచి
పునాదులు తీసి పాతిపెట్టారు!
ఉన్నత భావాల ఉనికి లేకుండా
జై జై నినాదాలతో ఉరి తీసివేసారు!
పరుగిడు హృదయాన్ని వలవేసి పట్టేసి
ఇరుకుగా చుట్టూ ప్రాకారాలు కట్టారు!
నిజాన్ని చీల్చి దాని రక్తం తాగేసి
తప్పక చచ్చిందని ప్రమాణాలు చేసారు!
ఇరుకు సమాజానికి బెరుకు పడ్డా
నీ భావ సంచలనం సాగనీయ్!
సవ్వడి లేకుండా నిశ్చయంగా
సందడి కాకుండా నిర్భయంగా
చప్పుడు చేస్తే వింటుందీ సమాజం
నీ భావలహరి ఇక సమాప్తం!