నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన ఈ సినిమా గురించి కొన్ని విషయాలు పంచుకుందామని ఈ సోది. కౌముదిలో పోతన భాగవతం గురించి రాస్తున్నాను కనక ఇది కూడా బాగుంటుందని చెప్పడానికే ఈ వ్యాసం. అసలు సినిమాల గురించి రాసే అనుభవం నాకు లేదని వప్పుకోవడానికేమీ అభ్యంతరం లేదు కానీ ఈ సినిమా గురించి మాట్లాడే ముందొక సరదా కధ చెప్పుకుని ముందుకెళ్దాం.
ఒక బీదవాడు దేవుడి గురించి తపస్సుచేసాడు. ఆయన కనిపించాక ఏం కావాలో కోరుకో అంటే ఇంట్లో వారితో చర్చించి మర్నాడు కోరుకుంటాను అన్నప్పుడు సరే అన్నాడు భగవంతుడు. భార్య డబ్బు కోరుకోమంది. ముసలి తల్లితండ్రులకి ఈ డబ్బులవల్ల వచ్చే అనర్ధాలు తెలుసేమో, లేదా మనవడు ఉంటే ఆడుకోవచ్చు అనిపించిందో, తమకి మంచి ఆరోగ్యం, మనవడు పుట్టేలా కోరుకోమన్నారు. ఈయనకి పెద్ద ఇల్లు కావాలని, అత్తా కోడళ్ళు రోజూ కీచులాడుకోకూడదనీ అడగాలని కోరిక. భగవంతుడు ఇచ్చేది ఒకటే కోరిక. ఇవన్నీ తీరడం ఎలా? ఆ రోజు ఆలోచించి మర్నాడు భగవంతుణ్ణి అడిగాడు – “మా అమ్మానాన్నలు మంచి ఆరోగ్యంతో నా పెద్ద భవంతిలో సేవక జనం దాస్యం చేస్తూండగా బంగారు ఉయ్యాలలో మనవణ్ణి చూసుకుంటూ మా ఆవిడతో సఖ్యంగా ఉండేలా అనుగ్రహించు.” బాగుంది కదా? అలా అన్నీ ఒక్క దెబ్బకి కొట్టేసాడు. ఇదే విధంగా “దంశవ్రాతములుం బిపీలికలు మేదః క్రవ్య రక్తంబులన్… మహావల్మీకమం దింద్రియభ్రంశం బింతయు లేక నీకు నిలువం బ్రాణంబు లెట్లుండెనో? [పోతన భాగవతం. 7-82]” అని బ్రహ్మగారు హిరణ్యకశిపుడితో ఆశ్చర్యంగా అని ఏమి కావాలో కోరుకో అంటే, ఒక్క దెబ్బతో కొట్టాడు కావాల్సినవన్నీ “గాలిం, గుంభిని, నగ్ని, నంబువుల, నాకాశస్థలిన్, …. సమస్తాస్త్ర శస్త్రాళిన్, మృత్యువు లేని జీవనము లోకాధీశ! యిప్పింపవే. [పోతన భాగవతం. 7-92]. కనీసం అలా అనుకున్నాడు.
అయితే be careful of what you wish for, you may get it, అన్నట్టూ ఎలా చావకూడదని అనుకున్నాడో అలాగే చావాలని తనకి తానే ముహుర్తం పెట్టుకున్నాడు. ఇది భైరవభట్ల కామేశ్వర రావు గారు చెప్పిన విషయం. ఇదే జీవితంలో ఉన్న అతి పెద్ద paradox. ఎప్పుడైతే తామసిక గుణంతో ఏదైనా పంతం పట్టి సాధించుకుంటామో అది మనకి సాధారణంగా పనికిరాదు లేదా అలా వచ్చేది మన వినాశనానికి కారణమౌతుంది. ఇదే రావణ తపస్సులో కూడా కనిపిస్తుంది – పదివేల ఏళ్ళకో సారి ఒక్కో శిరస్సూ నరుక్కుంటూ బ్రహ్మని ప్రత్యక్షం చేసుకోవడం. ఆయన కనిపించాక నాకు అమరత్వం కావాలని అడగడం. అయితే వాడి పక్కనే కూర్చుని తపస్సుచేసిన విభీషణుడు ఏమడిగాడు అదే బ్రహ్మగారిని? “ప్రీతేన యది దాతవ్యో వరమేశృణు సువ్రత, పరమాపద్గరిస్యాపి ధర్మే మమ మతిర్భవేత్.” నా తపస్సు నచ్చి వరం ఇయ్యదల్చుకుంటే విను, ‘ప్రాణాయాయమైన కష్టం వచ్చినా సరే నా మనస్సు ధర్మ మార్గంలోనే ఉండాలి.’ ఇది భగవంతుడికి దగ్గిర దారి; కోరికలనేవే లేకపోవడం, నేను కాదు నువ్వే, నాహం కర్తా, హరిః కర్తా; దీనివల్లే సంతోషం కలుగుతుంది కానీ తామసిక తపస్సు వల్ల కాదు. దీనికి నచ్చి బ్రహ్మ విభీషణుడికి ఇచ్చిన వరం చిరింజీవిగా ఉండు అని. అయితే ఈ నరసింహావాతారంలో మెలిక ఏమిటంటే ప్రహ్లాదుడు తండ్రి బ్రహ్మని ఎలా కోరాడో అదే విధంగా చెప్తాడు తండ్రికి సమాధానం భగవంతుడు ఎక్కడున్నాడనేది దాదాపు అవే పదాలు వాడుతూ – కలఁ డంభోధిఁ, గలండు గాలిఁ, గలఁ డాకాశంబునం, గుంభినింగలఁ, డగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్……తండ్రి! వెదకంగా నేల యీ యా యెడన్ [7-274].
బ్రహ్మ జ్ఞానం వచ్చాక ఏమి కనిపిస్తుంది? ప్రప్రంచం అంతా పూర్తిగా బ్రహ్మ మయం తప్ప మరేమీ కాదు. ఈ ప్రపంచం అనేదే లేదు, ఉన్నదే ఒకటి. ప్రజ్ఞానం బ్రహ్మా. అహం బ్రహ్మాస్మి. తత్వమసి. అయమాత్మా బ్రహ్మ. సర్వం ఖల్విదం బ్రహ్మ. ఇదే విశ్వరూప సందర్శనం. కనిపించే, వినిపించే అన్ని విషయాలు, ఉన్నవీ లేనివీ అన్నీ బ్రహ్మ మయం తప్ప మరొకటి లేదు (యశ్చకించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రూతయే పివా, అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణస్థితః). విశ్వరూప సందర్శనం అంటే వంద చేతుల్తో యాభై మొహాలతో భగవంతుడు ఆకాశంలో కనిపించడం కాదు. మనం రోజువారీ నిత్య జీవితంలో చూసే ప్రతీదీ భగవంతుడిగా కనిపించడమే విశ్వరూపం.
ఈ విషయాలు మార్చకుండా వెకిలి వేషాలూ, పదాలు వాడకుండా సినిమా అనేది తీయడం ఈ రోజుల్లో కనా కష్టం. అయినా వీరు ఇందులో అలా చూపించగలిగారంటే అద్భుతమే. ప్రహ్లాదుణ్ణి సముద్రంలో పారేసాక అక్కడ భగవంతుడు కుర్రాణ్ణి చేతుల్లోకి తీసుకుని అంటాడు - నేను కూడా నిన్ను చూడ్డానికి చాలా తపిస్తున్నాను సుమా. ఇదే మనం వినే విషయం – మనం ఒక అడుగు ముందుకి వేస్తే భగవంతుడు పది అడుగులు ముందుకి వస్తాట్ట. అలా స్వీయానుభవంతో భగవంతుడు కనిపించాక కావాల్సినదేమిటి? ఏమీ లేదు. శివానందులు చెప్పినట్టూ ఏది తెలిస్తే ఇంకేం తెలియనక్కర్లేదో అది వచ్చాక ఇంకా అడిగేదేముంది? నారాయణీయంలో చెప్పినట్టూ ప్రహ్లాదుడు “యత్త్రైలోక్య మహీయసోపి మహితం సమ్మోహనం మోహనాత్, కాంతం కాంతి నిధానతోపి, మధురం మాధుర్య ధుర్యాదపి…. ” అనేది ప్రత్యక్షంగా అనుభవించాడు. ఈ విషయం తెలిసాక స్వాధికారంగా చెప్తాడు ప్రహ్లదుడు తండ్రితో … కలఁ డంభోధిఁ, గలండు గాలిఁ, గలఁ డాకాశంబునం, గుంభినింగలఁ.. అంటూ. దానికి కోపం వచ్చి నువ్వు చెప్పే శ్రీహరి ఈ స్థంభంలో ఉన్నాడా అంటే …. స్తంభాంతర్గతుఁ డయ్యు నుండుటకు నే సందేహమున్ లేదు నిర్దంభత్వంబున నేఁడు గానఁబడు బ్రత్యక్షస్వరూపంబునన్ [7-282] స్థంభంలో ఉండడమే కాదు నీ అహంకారం వదిలితే ప్రత్యక్షంగా కనిపిస్తాడు కూడా అంటాడు కొడుకు. ఎందుకంటే తాను స్వయానా అప్పటికే ఆయన్ని సర్వం ఖల్విదం బ్రహ్మా… అంటూ చూసాడు కాబట్టి. ఈ విషయాలన్నీ సినిమా లో బాగా చిత్రీకరించారు.
మనం రోజూవాడే ఇంగ్లీషులో ఆరో అక్షరంతో మొదలై నాలుగు అక్షరాలతో వచ్చే పదం వాడకుండా ఈ మధ్యన ఆసలు ఏ సినిమా (ఏ బాషలోనూ) కూడా రావడం లేదు కనక ఈ సినిమా మంచి డైవర్షన్. కధ పలచబడకుండా మసాలాలు, పనికిమాలిన డేన్సులూ, దెబ్బలాటలూ లేకుండా ఉన్న కధ ఉన్నట్టు చిత్రీకరించడం మరో మంచి విషయం. చివరిలో విష్ణువుతో యుద్ధం బాగా తీసారు – భాగవతంలో ఉనట్టే - దాదాపు ఏదీ మార్చలేదు. నారసింహుడు కనిపించగానే హిరణ్యాక్షుడు భయంతో పారిపోకుండా వీరోచితంగా పోరాడాడు. చివర్లో ప్రహ్లాదుడు నా తండ్రికి మంచి గతి కలగాలి అని అడిగితే ‘వాడు నా చేతికి తగలగానే వాడి పాపాలన్నీ పోయాయి’ అంటాడు విష్ణువు. దీనికి మరో విశేషం ఏమిటంటే ఈ హిరణ్యకశిపుడు విష్ణువుకి అతి దగ్గిరైన వాడు – ప్రతీరోజూ విష్ణువుని తల్చుకుంటూ ద్వేషంతో రగులుతున్నా. అందువల్ల వాణ్ణి సంహరించేటపుడు వళ్ళో పెట్టుకుని మరీ సంహరించాట్ట. ఇది వాడి తమ్ముడైన హిరణ్యాక్షుడికి కూడా దక్కని, హిరణ్యకశిపుడికి మాత్రమే దక్కిన అదృష్టం. దీన్నే నారదుడు యుధిష్టిరుడితో చెప్తాడు శిశుపాలుడు పోయాక వాడి శరీరంలోంచి పోయే కాంతి కృష్ణుడిలో కలిసినప్పుడు – కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు….హరి చెందన్ వచ్చు ధాత్రీశ్వరా [7-18] అంటూ. ఇక్కడ మరో విషయం – నారదుడు, ప్రత్యక్షంగా విష్ణువుని చూసినవాడు. ఆయన తల్లి కడుపులో ఉన్న ప్రహ్లాహుడికి ఇచ్చిన మంత్రం పనిచేయకపోవడం అనే ప్రశ్నే లేదు. దీని గురించి స్వామి సత్యానంద గారు అంటారు – ప్రపంచంలో నిన్ను భార్యా/భర్తా బిడ్డలతో సహా ఏదైనా, ఎవరైనా వదిలేయవచ్చు, వెన్నుపోటు పొడవవచ్చు. కానీ గురువు నీకు ఇచ్చిన మంత్రం ఎప్పటికీ విడవదు. ఇది భాగవతంలో అనేకచోట్ల కనిపిస్తుంది. ప్రహ్లాదుడి మొహం ముగ్ధ మనోహరంగా ఉంది యానిమేషన్ లో.
అయితే ఈ సినిమాలో కొన్ని విషయాలు నాకు నచ్చనవి కూడా ఉన్నాయి. మొదటిది, రాక్షసుడంటే కోరలు ఉండాలనీ అసహ్యమైన రూపంతో ఉండాలనీ ఒక భ్రమ అనుకుంటా మనకి. అందువల్ల హిరణ్యాక్షుణ్ణి మిగతా వారినీ కోరలు పెట్టి చూపించారు. ఇది అనవసరం. మంచి బట్టలు వేసుకుని రోజూ గోల్ఫ్ ఆడుకుంటూ, జనాలు ఎలా ఛస్తున్నా, తాను ఎలా వారిని పీడిస్తున్నా, ఎన్ని అబద్ధాలు ఆడుతున్నా, ప్రపంచం ఎలా పోయినా నాకేం, అనుకునే వారు లాప్ టాప్ లు పట్టుకుని చేతిలో ఉన్న సెల్ ఫోన్ తో అనేకానేక రాక్షస విషయాలు చేయగలరు, కోరలూ అవి లేకుండా. ఒకేసారి పదేసి ఇరవయ్యేసి రాక్షస పనులు చేసేవారు ఈ కాలపు రావణాసురులే. వీళ్ళకి కోరలు లేవు, అతి సామాన్యంగా, సౌమ్యంగా కనిపించినా ఒకేసారి పదేసి దరిద్రం పనులు చేయగలవారికి పది తలలు ఉన్నట్టే. అప్పట్లో కత్తీ, డాలూ, గదా, చేతిలో ఉంటే ఇప్పుడు సెల్ ఫోన్, లాప్ టాప్ లు చాలు హాని చేయడానికి. హాట్ స్టార్ లో హనుమాన్ అనే సీరియల్ వస్తోంది అది చూసినవారికి రావణుణ్ణి మామూలుగా చూపించడం, అవసరం అయినప్పుడు పది తలలూ ఒకేసారి వచ్చి రావణుణ్ణి చూపించడం కనిపిస్తుంది కానీ పది తలలు ఒక శరీరంతో వికృతంగా ఉన్నవారే రావణులు అని చెప్పడం బాగోలేదు. రెండోది, శుక్రాచార్యుడు మృతసంజీవని తెల్సినవాడు అందువల్ల చచ్చిన రాక్షసులని బతికిస్తూ హిరణ్యాక్ష హిరణ్యకశిపులకి తామసిక యుద్ధం నేర్పాడు అన్నారు సినిమాలో. అయితే చచ్చిపోయిన హిరణ్యాక్షుణ్ణి శుక్రాచార్యుడు ఎందుకు బతికించలేదు? పైగా అక్కడే నుంచుని హిరణ్యకశిపుడి చేతికి తమ్ముడి చితికి పెట్టమని మంట ఎందుకు అందించాడు?
హిరణ్యకశిపుడు విష్ణువు కోసం ముల్లోకాలు వెతకడం, వైకుంఠం వెళ్ళినా ఆయన కనిపించకపోవడం “ఎదురై పోర జయింప రా దితనిఁ; గా కెందేనియుం ..[8-557] అనేది లేదు. హోలికా అనే హిరణ్యకశిపుడి సోదరి ప్రహ్లాదుణ్ణి మంటల్లోకి తీసుకెళ్ళడం మనకి తెలియని మరో కధ. హిరణ్యాక్షుడు విష్ణువు చేతిలో చనిపోయాక అక్కడే అన్నీ చూస్తూ ఉన్న శుక్రాచార్యుడు పారిపోవడం. ఇవి భాగవతంలో లేవు. హిరణ్యకశిపుడు తపస్సులో ఎముకలు మాత్రమే మిగిలినట్టు ఉంది భాగవతంలో కానీ సినిమాలో కొంత తేడాగా చూపించారు. లీలావతి పేరు మరోలా ఉంది, కయాధు అని. అది ఫర్వాలేదనుకోండి. ఒకట్రెండు చోట్ల కొంత తేడా ఉన్నా అది పెద్ద లెఖ్ఖలోకి రాదు. తెలుగు నేర్చుకోవడం, హిందూ మతం, పురాణాలు చదవడం అనేవి నామోషీగా ఉన్న ఈ రోజుల్లో కనీసం ఈ సినిమా వల్ల కొంత ఇష్టం ఏర్పడవచ్చు పిల్లలకి.
చాలా చోట్ల కన్నీళ్ళు వచ్చే సీన్లు ఉన్నా కొన్ని నవ్వు వచ్చే విషయాలు కూడా ఉన్నాయి. హిరణ్యాక్షుడు దిగ్విజయం తర్వాత ఇంద్రుణ్ణి పట్టుకోబోతే ‘మనిద్దరం స్నేహంగా ఉందాం’ అని ఇంద్రుడు అన్నప్పుడు హిరణ్యకశిపుడు అంటాడు ఇంద్రుడితో – నేను తపస్సుకు వెళ్ళినప్పుడు మా ఆవిణ్ణి చెరపట్టావు, నీతో నాకు స్నేహమా? నిజమే కదా?
ఈ సినిమా ఈ మధ్యన వచ్చిన మంచి యానిమేషన్ వర్క్ అని చెప్పుకోవాల్సిందే. యానిమేషన్ మరీ అంత డిస్నీ, పిక్సార్ వారి స్థాయిలో లేదు కానీ దాదాపు దగ్గిర్లోకి వచ్చినట్టే. (నా రేటింగ్ - 4.5/5)
ఈ వ్యాసంలో ఉన్న పద్యాలు, మిగతా భాగవతం ఇక్కడ చూడవచ్చు - అక్కడే భాగవతం ఫోన్ మీదకి దింపుకుని చదువుకోవడం ఎలా అనే విషయాలు ఉన్నాయి.