బహు భాషా గాన కోకిల "ఎస్ జానకి"
ఆమె స్వరం మృదు మధురం.. ఆ గానం వీనుల విందు.. ఉరికే జలపాతం.. ఆమె గొంతులో సప్త స్వరాలు పలుకుతాయి. తన సుస్వరాలు పగలే వెన్నెలను కురిపిస్తాయి. తన పాటలతో ప్రేక్షకుల మనసులను నీలి మేఘాలలో తేలిపోయేలా చేస్తుంది. పక్షుల కిలకిల రావాలైన, పసిపాపల కేరింతలైనా, అమ్మ పాడే లాలి పాటలైనా, ఆమె గొంతులో సరాగాలై విరబూస్తాయి. 'సిరిమల్లె పువ్వా' అంటూ యువతను ఉర్రూతలూగించినా, 'సిరిమల్లె పువ్వల్లే నవ్వు' అంటూ ప్రేక్షకులకు తీపి గాయాలు చేసినా ఆమెకే చెందుతుంది. ఆమే మన గాన కోకిల జానకమ్మ. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, బెంగాలీ, ఒరియా, ఇంగ్లీష్, సౌరాష్ట్ర, జర్మనీ ఇలా అనేక భాషల్లో పాటలు పాడి సంగీత ప్రియుల మనుసు దోచిన సుమధుర గాయని ఎస్ జానకి. ఆమె స్వరం సూపర్ మాడ్యూలేషన్ శక్తికి ప్రసిద్ధి చెందింది. ఇది చిన్నపిల్లల నుండి వృద్ధ మహిళల వరకు ఎవరికైనా అనుగుణంగా ఉంటుంది. అలనాటి జమున నుంచి నిన్న మొన్నటి హీరోయిన్ల వరకు అయిదు తరాల కథానాయికలకి ఆమె స్వరం ఆలంబన అయ్యింది. తెర ముందు కనిపించే కథానాయికలకు ఆమె స్వరం అతికినట్టు సరిపోతుంది.
1938 ఏప్రిల్ 23న గుంటూరు జిల్లా రేపల్లె దగ్గరలో గల పల్లపట్ల గ్రామంలో జానకి గారు జన్మించారు. ఆమె తండ్రి శ్రీరామమూర్తి ప్రముఖ ఆయుర్వేద వైద్యులు. చిన్నతనంలో కూతురు సంగీతాభిలాషను గమనించి ప్రముఖ సంగీత విద్వాంసుడు శ్రీ పైడి స్వామి దగ్గర సంగీతంలో శిక్షణ ఇప్పించారు. పైడి స్వామి గారి దగ్గర సంగీతములో మెళకువలు నేర్చుకుంది. అప్పటినుంచి తన పదో తరగతి వరకు వివిధ సంగీత కచేరీల్లో పాడి మంచి పేరు తెచ్చుకున్నారు జానకి. తొమ్మిదేళ్ల వయస్సులో మొదటిసారిగా స్టేజ్ మీద పెర్ఫారామెన్స్ ఇచ్చింది. నాదస్వర విద్వాన్ జానకి 20 ఏళ్ళ వయస్సులో మద్రాసు వచ్చి AVM స్టూడియో లో గాయనిగా చేరింది. 1957 లో తన గాత్రాన్ని తమిళ సినిమాలకు ఇచ్చింది. 1959లో రాంప్రసాద్ గారిని వివాహము చేసుకుంది. ఆయన జానకి గారి కెరీర్ కు పూర్తిగా సహకరించేవారు. ఆయన 1997 లో కార్డియాక్ అరెస్ట్ వలన చనిపోయారు.
జానకి గారు 60 దశకం ప్రారంభములో కన్నడ సినిమాల్లో పాటలు పాడి మంచి ప్లే బ్యాక్ సింగర్ గా పేరు సంపాదించారు. ఇంచుమించు ప్రముఖ నేపధ్య గాయకులతో, అలాగే ప్రముఖ సంగీత దర్శకులతో పనిచేశారు. 1969లో జానకి పి.బి.శ్రీనివాస్ తో కలిసి ఒక ఇంగ్లీష్ పాట పాడారు. ముఖ్యంగా ఆమె ఇళయరాజా సంగీత దర్శకత్వంలో అనేక అద్భుతమైన పాటలకు జీవం పోశారు. నిజానికి ఎమ్.ఎస్.విశ్వనాథన్ తొలి దశలోనే జానకితో ఎన్నో గొప్ప పాటలు తమిళంలో పాడించారు. 'నీ లీల పాడెద దేవా' అంటూ జానకి ఆలపించిన పాటకు ఆమెకు తెలుగులో ఎనలేని క్రేజ్ తీసుకొచ్చింది. పాటల్లో మిమిక్రీ మిక్స్ చేసి సంగీత ప్రపంచాన్ని మెప్పించింది. పదహారేళ్ళ వయసు చిత్రంలోని 'కట్టుకథలు చెప్పి నేను కవ్విస్తే' పాటలో పండు ముసలావిడ గొంతు, 'గోవుల్లో తెల్లన గోపయ్య నల్లన' పాటలో చిన్న పిల్లాడి గొంతు, పెద్దవాళ్ల స్వరం, 'చిన్నారి పొన్నారి కిట్టయ్య' పాటలో పిల్లాడి గొంతు, శ్రీవారి శోభనం చిత్రంలోని 'అలకపానుపు ఎక్క నేల చిలిపి గోరింక' పాటలో బామ్మ గొంతులతో పాడే పాటల వంటివి ఆమె గొంతులోని వైవిధ్యానికి ఉదాహరణలు.
60 -80మధ్య కాలములో సుమారు 1000 కి పైగా పాటలు మలయాళం సినిమాలకు పాడి మలయాళీ కాకపోయినప్పటికీ రికార్డు సృష్టించింది. మలయాళం సినిమాల్లో పాటలు పాడి ఎన్నో అవార్డులను కూడా గెలుచుకుంది. బాలీవుడ్ సంగీత దర్శకుడు బప్పిలహరి జానకిని హిందీ చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. ఆవిడ, కిషోర్ కుమార్ తో అనేక హిట్స్ డ్యూయెట్లు పాడారు. 6 దశాబ్దాల కాలం గాయనిగా ఉంటూ నాలుగు నేషనల్ ఫిల్మ్ ఆవార్డులు, 33 స్టేట్ అవార్డులు, తెలుగు పాటలకు 12 నంది అవార్డులను సాధించారు. జానకి 17 భాషలలో పాటలు పాడి చాలా భిన్నమైన గాయనీగా పేరు ప్రఖ్యాతులు సాధించి దక్షిణాది నైటింగేల్ అనే పేరు కూడా సంపాదించుకున్నారు. జానకి తన కెరీర్ లో సుమారు 50,000 పాటలు పాడారు. ఆవిడ కన్నడ సినిమా పరిశ్రమకు సంగీతానికి చేసిన సేవలకు గుర్తింపుగా మైసూర్ విశ్వ విద్యాలయం వారు జానకి గారికి గౌరవ డాక్టరేట్ డిగ్రీ ని ప్రదానం చేసారు, తమిళనాడు ప్రభుత్వం కలైమామణి పురస్కారంతో సత్కరించింది. 2013 భారత ప్రభుత్వం పద్మభూషణ్ బిరుదును ప్రదానం చేస్తాము అంటే తాను భారత రత్న టైటిల్ పొందడానికి అర్హురాలినని చెప్పి పద్మ భూషణ్ ను తిరస్కరించారు. పద్మభూషణ్ అవార్డు చాలా ఆలస్యంగా వచ్చినందుకు దాన్ని తిరస్కరించిన అతి కొద్ది మందిలో ఆమె ఒకరు. మైసూర్లోని మానస గంగోత్రి థియేటర్ లో ఎస్ జానకి చివరిసారిగా ప్రేక్షకుల కోసం ప్రదర్శన ఇచ్చారు. అందులో ఆమెకు స్టాండింగ్ ఒవేషన్ లభించింది. ఆమె కుమారుడు మురళీకృష్ణ కూడా ఆ సమయంలో చాలా భావోద్వేగాలకు గురయ్యారు. అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడే పదవి విరమణ చేయాలనుకున్నట్లు ఆమె ఆ సందర్భంలో పంచుకున్నారు. ఎందుకంటే అనేకమంది యువ, కొత్త కళాకారులకు మార్గం సుగమం చేయడానికి ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏది ఏమైనా నేటి తరం గాయనీ మణులకు జానకమ్మ ఒక రోల్ మోడల్. ఆమె స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు.