16
హోమ్-థియేటర్ లో సినిమా చూస్తూ పెద్దవాళ్ళు నిద్రలోకి జారుకోడం చూసి, అందరికీ ఓ రౌండ్ గ్రీన్-టీ చేసుకొద్దాం పదమంటూ పారూని పిలిచాడు కిరణ్.
కబుర్లు చెబుతూ 'టీ' తయారీలో మునిగున్న పారూకి దగ్గరగా వచ్చి, భుజాలపై చేతులు వేసాడు కిరణ్. బావతో ఊహించని చేరువకి ఒక్కసారిగా ఉలిక్కిపడింది పారూ.
"అంత ఉలుకెందుకు ప్యారీ? నేను మంచోడినన్నావు. సరేకానీ .. నా ఒకే ఒక ప్రశ్నకు జవాబు చెప్పు. నీ జవాబు మీదే ఎంతో ఆధారపడి ఉంది. ప్రశ్న ఏమంటే... నన్ను పెళ్ళి చేసుకుంటావా?" సూటిగా అడిగాడు కిరణ్.
ఊహించని ఆ ప్రశ్నకి తత్తరపడింది పారూ.
"నిజంగానే అడుగుతున్నా. ఇప్పుడు నీ సమ్మతిని తెలిపితే చాలు. రెండేళ్ల వరకు నాకేమీ తొందర లేదు. నువ్వు నా దానివేనని నిశ్చింతగా చదువుల్లో మునిగి తేలగలను" అన్న కిరణ్ మాటలకి ….తలెత్తి అతని వంక కొద్దిక్షణాలు తీక్షణంగా చూసి, ఫక్కున నవ్వింది పారూ.
“బావగారూ! ఇంకా రెండేళ్ళ సమయంలో నాకైతే, ఇలా నీతో దాగుడుమూతలు ఆడుకోవాలని ఉంది మరి. ‘ప్రేమ ఎంత మధురం’ అని పాడుకోవాలనీ ఉంది. ఇక ఈ ఆటలు, పాటలు అయ్యాక నేనెక్కడికి పోతాను చెప్పు. నీ ప్యారీ సదా నీ సేవలోనే కదా ఉంటుంది." అంటూ పకపకా నవ్వసాగింది.
"అక్కా, టీ ఎప్పుడొస్తుంది అని అందరూ అడుగుతున్నారు." అంటూ కిచెన్ లోకి వచ్చాడు పునీత్.
"ఇదిగో.. మీ అక్క అసలు కదలందే? రెండు నిముషాల్లో వచ్చేస్తున్నాము." అంటూ ట్రే అందుకున్నాడు కిరణ్.
***
టీ' సేవించడం అయ్యేప్పటికీ పదయింది. అందరూ లేచి 'శుభ రాత్రి' చెబుతూ బయటకి నడిచారు. ముందుగా నడుస్తున్న శ్రీనివాస్ గారు ఉన్నట్టుండి అందరూ చూస్తుండగానే నేలమీదకి ఒరిగిపోయారు.
ఒక్కసారిగా కుటుంబ సభ్యులు భయపడిపోయారు. వెంటనే అంబులెన్సుని పిలిచి, వారందరి మధ్యనుండి శ్రీనివాస్ గారిని హాల్లోని సోఫా పైకి చేర్చాడు కిరణ్.
***
ప్రాధమిక పరీక్షలు జరిపిన అపోలో హాస్పిటల్ వైద్యులు శ్రీనివాస్ గారికి ‘స్ట్రోక్’ అని తేల్చి అడ్మిట్ చేశారు. విమల మాటాపలుకు లేకుండా ఉండిపోయింది. అర్ధరాత్రి దాటాక ఎలాగోలా నచ్చచెప్పి అందరినీ ఇంట్లో దిగవిడచి, తిరిగి హాస్పిటల్ వెళ్లేందుకు సిద్దమయ్యాడు కిరణ్.
ఎన్నిమార్లు ఫోన్ చేసినా మీనాక్షి ఫోన్ తీయకపోవడంతో చిరాగ్గా ఉన్న కిరణ్ని చూసి కలవరపడింది పారూ. తమ్ముణ్ణి పిలచి, "మనం ఇంటికి ఎల్లుండి వెళదామా? ఇక్కడ అందరూ బాధలో ఉన్నారు. బావ ఒక్కడే అన్నీ చూసుకోవాలనుకుంటా. నీవేమంటావు పునీత్!" అని అడిగింది.
"ఇక్కడ వీళ్ళకి సాయంగా ఉండాలంటే నాకేం పర్వాలేదు." అనడంతో తల్లితండ్రులకి ఫోన్ చేసి పరిస్థితి వివరించి వారి అనుమతి తీసుకుంది పారూ.
***
తెల్లారక ముందే పనిమనుషుల సాయంతో టిఫిన్లు కాఫీలు తయారు చేసి, కుటుంబ సభ్యులకి సహకారంగా ఉండమని తమ్ముడికి సూచించింది పారూ. విమల గారి వద్దకు వెళ్లి సపర్యలు చేసింది. సోఫాలోనే పడుకుండి పోయిన కిరణ్ని లేపి హాస్పిటల్ కి, మీనాక్షికి ఫోన్లు చేయించింది.
శ్రీనివాస్ గారికి అవసరమయిన వైద్యం మొదలుపెడతారని ఆయన్ని చూసిన డాక్టర్ తెలియజేసారు. స్పృహలోకి రావడానికి సమయం పడుతుందని, కుటుంబ సభ్యులు వచ్చినా బయటి నుండే చూసి వెళ్ళవచ్చన్నారు.
భర్త ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్న విమల గారికి ధైర్యం చెబుతూ, ఆమె అడిగినప్పుడల్లా, మీనా వచ్చేస్తుందని తెలియజేస్తూ... అందరికీ అన్నీ అమర్చేందుకు ప్రయత్నిస్తుంది పారూ.
స్నేహితులతో కలిసి మీనాక్షి బయట ఊరికి వెళ్లిందని తెలుసుకున్నాడు కిరణ్. ఫోన్ కాల్స్ రిటర్న్ చేయకపోవడానికి కారణం తెలియక మాత్రం కోపంగానే ఉన్నాడు. అతన్ని వేధించడానికే మీనా అలా చేస్తుందని, పారూకి అర్ధమయింది.
సాయంత్రానికి శ్రీనివాస్ గారి గురించి మెరుగైన సమాచారం తెలియడంతో అందరూ ఊపిరి తీసుకున్నారు. ఎడమ చేయి, కాలిలో కోల్పోయిన కదిలిక తిరిగి రావడానికి ఫిజికల్ తెరపీ మొదలయిందని, హాస్పిటల్లోని ప్రత్యేక అతిధి రూములోకి మార్చబోతున్నామని తెలిపారు.
రాత్రి తొమ్మిదికి ఫోన్ చేసిన మీనాక్షిని ఇంటిల్లిపాదీ వింటుండగానే చెడామడా తిట్టాడు కిరణ్.
***
మరునాడు పొద్దున్న ఇల్లుచేరి, తల్లిని తీసుకుని హాస్పిటల్ కి వెళ్ళింది మీనాక్షి. శ్రీనివాస్ గారు విమల చేత కిరణ్ కి ఫోన్ చేయించి అందరినీ ఓ మారు తన వద్దకి తీసుకురమ్మని కోరారు.
ఆయన కోరినట్టే, పది నిముషాల్లో అందరూ హాస్పిటల్ చేరుకున్నారు.
ఆయన మాట స్పష్టత కోల్పొయ్యారు. మామూలు స్థితికి వచ్చే అవకాశం మెండుగా ఉందన్నారు వైద్యులు. ఆయన అందరినీ చిరునవ్వుతో పలకరించారు. పేపర్, పెన్ అడిగి తీసుకుని ఊళ్ళకి వెళ్ళవలసిన పారూ, పునీత్, కిరణ్ లు ప్రయాణాలు మానుకుని, విమలకి మద్దతుగా ఉన్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ సందేశం రాశారు.
'మైల్డ్ స్ట్రోక్' కావున తాను త్వరగానే కోలుకుంటానన్న నమ్మకం ఉందని కూడా తెలిపారు.
కిరణ్ చేతిని తన చేతుల్లోకి తీసుకుని, తిరిగి వెంటనే కాలేజీ కి వెళ్లమన్నారు. ఆయన కనబరచిన నిబ్బరంతో అందరి మనసులు తేలికయ్యాయి.
***
షూటింగ్ ముగించుకుని, హైదరాబాదు నుండి ఇంటికి తిరిగి వచ్చేసినా, పారూ మనసంతా శ్రీనివాస్ గారి చుట్టే తిరుగుతుంది. మీనా తల్లితండ్రుల గురించి ఆమె మనసు వ్యధతో నిండిపోయింది. పునీత్ మాత్రం ఇంటిల్లిపాదికీ జరిగిన విషయాలన్నీ పూసగుచ్చినట్టుగా వివరించాడు.
ఓ సాయంత్రం సంగీత సాధన మొదలుపెట్టే ముందు నిరాసక్తతతో ఉన్న కూతుర్ని దగ్గరికి తీసుకుంది శాంత. "శ్రీనివాస్ గారు బాగయిపోతారులే. బాధ పడకు. నీకు ఎన్నెన్నో పనులున్నాయి. కావాలంటే వాళ్లకి ఫోన్ చేసి మాట్లాడు." అంది.
ఒక్కసారిగా తల్లి వడిలో వాలి ఏడవడం మొదలుపెట్టింది పారూ. అమ్మ, అమ్మమ్మ కూడా... నిర్ఘాంతపోయారు. 'ఏమైంది తల్లీ! అంటూ హైరానా పడ్డారు.
కొంతసేపటికి కానీ మౌనం వీడలేదు పారూ. "నాకు ఆయనలో నాన్న కనబడ్డారమ్మా! విమల గారిలో నిన్ను చూసాను. వారి పరిస్థితి బాగోలేదు. మీనాక్షి వారిని అస్సలు పట్టించుకోదు సరికదా.. అసలు వారి గురించి గాని, వారిని సంతోషంగా ఉంచాలన్న ఆలోచన గానీ ఆ అమ్మాయిలో లేవు. అసలలా ఎందుకు ఉంటారమ్మా?
వారిని చులకనగా మాట్లాడుతుంది, అకారణంగా పోట్లాడుతుంది. ఉద్దేశపూర్వకంగా వాళ్ళ పట్ల కఠినంగా నడుచుకుంటుందేమో అనిపిస్తుంది. నాకు బాధగా ఉందమ్మా. ఏమి చేయను? చెప్పు." అంది బాధగా కన్నీళ్లు తుడుచుకుంటూ.
"నీవు చెప్పేది అర్ధమయింది. మనం ఏమి చేయగలం చెప్పు. నీవు హైదరాబాదు వెళ్ళినప్పుడల్లా వారితో సమయం గడుపు. అవసరమయితే కాస్త సేవ చేసి, సంతోషపెట్టేందుకు ప్రయత్నించు. నీ కాస్ట్యూమ్స్ తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఓ పూట వారితో గడుపు. మేము అడ్డు చెప్పము తల్లీ!" అని నమ్మపలికింది శాంత.
"కాబట్టి నీలో నీవు బాధపడి సంగీత సాధనకి అవరోధాలు కల్పించుకుంటే మనందరి కలలు కల్లలవుతాయని గ్రహించుకో. పదమ్మా.. పని మొదలు పెట్టు." ప్రోత్సహించింది అమ్మమ్మ.
'తాను మళ్ళీ హైదరాబాదు వెళ్ళినప్పుడు నిస్సంకోచంగా వెళ్లి శ్రీనివాస్ గారిని చూడవచ్చు, కలవచ్చు అన్న అమ్మ మాటలు పారూని సంతోష పరిచాయి.
దాంతో పారూ బెంగ, దిగులు తగ్గాయి. రెండున్నర గంటల పాటు వారి సంగీత సాధన ఎంతో తృప్తికరంగా సాగింది.
***
ప్రశాంతంగా ఆస్ట్రేలియా ప్రయాణానికి చేయవలసిన పనులు, కావలసిన వస్తువుల పట్టిక తాయారు చేసింది. తీరిగ్గా తోటలో కూర్చుని కిరణ్ కి ఫోన్ లో ఓ చక్కని ప్రేమ గీతం పాడి సందేశంగా పంపింది.
వెంటనే ఫోన్ చేసాడు కిరణ్. "హలో కోకిలమ్మా, నీవంటే ఎంతో ఇష్టం. నీ పాటంటే అంతకన్నా ఇష్టం. చెప్పు ఏమి సంగతి?" అడిగాడు.
"బావా! రెండు వారాల్లో శనాదివారాలు నేనూ, జానీ హైదరాబాదు వస్తాము. కాస్ట్యూమ్స్ రెడీ అయ్యాయి. తీసుకోవాలి. ఓ రోజు శ్రీనివాస్ అంకుల్ ని చూడ్డానికి వెళతాను. వీలుంటే నీవు రాగలవా? సోమవారం పొద్దుటే తిరిగి వెళ్లిపోవచ్చు." అడిగింది పారూ.
"రోజూ మామయ్యా వాళ్ళతో మాట్లాడుతున్నా, నాకూ ఆయన్ని చూడాలని ఉంది. అయితే నేను శుక్రవారమే హైదరాబాదుకి వచ్చి సోమవారం మధ్యాహ్నం తిరిగి వెళతాను." అన్నాడు కిరణ్.
***
మరునాడు పొద్దుటే బ్రేక్-ఫాస్ట్ చేస్తూ.. రెండు వారాల్లో కాస్ట్యూమ్స్ తీసుకునేందుకు... జననీని తీసుకుని వెళతానని తల్లికి చెప్పింది పారూ.
అది వినగానే, "అక్కా నీవు వెళ్ళేదుంటే నేనూ వస్తాను. కిరణ్ బావని కలవాలి. మనం మాలిని పిన్ని గెస్ట్-హౌజ్ లో ఉండవచ్చు. సరేనా? ఆ మీనక్క తో మాటపడే అవసరం ఉండదు. రామనాధం తాతగారు వాళ్ళు మనకీ బంధువులే కదా. తనకెందుకు అంత కుళ్ళు?" అని అడిగినప్పుడు తమ్ముడి ఆలోచనకి పారూతో పాటు అక్కడే ఉన్న అమ్మ, అమ్మమ్మ కూడా ఆశ్చర్యపోయారు.
పునీత్ లో వస్తున్న మార్పుకి కారణం కిరణ్ ప్రభావమేనని స్పష్టంగా తెలుస్తుంది. అమ్మమ్మ వంక చూసింది పారూ. అందరి ముఖాల్లో ఆనందమే కానవచ్చింది.
"అలాగే చేద్దాం. నీవన్నది నిజమే పునీత్! మాలిని పిన్నితో మాట్లాడుదాము." అన్నపారూతో…
"నేను పోయినసారే చెప్పి పెట్టాను. పిన్ని పర్మిషన్ ఇచ్చేసింది. నేను, జానీ అలా సిటీ తిరుగుతాము. నీ పనులు నీవు చేసుకొని వచ్చేస్తుండు. సాయంత్రానికి తాతగారి వాళ్ళింటికి వెళదాము." అన్నాడు పునీత్.
ఇంతలో తన ఆఫీస్ రూము నుండి రామ్ ఉత్సాహంగా వచ్చాడు. "చిత్రలేఖ ప్రొడక్షన్స్ వారు 'ఆలయనాదాలు' అనే టెలి-ఫిలింకి పారూని గాయనిగా, నటిగా కూడా తీసుకుంటామని, సమయం ఇస్తే వచ్చి వివరాలు చెబుతామన్నారు. గాయని పాత్రలో తన పాటలు తానే పాడాలని వారి ప్రతిపాదన. రెండు నెలల పాటు షూటింగ్ జనవరి, ఫెబ్రవరీల్లో హైదరాబాదు, వరంగల్ ప్రాంతాల్లో చేస్తారట." అన్న విషయాన్ని వెల్లడించాడు.
విషయం, వివరం నచ్చాయి పారూకి, అమ్మమ్మకి. "ఈ ప్రాజెక్ట్ మీకందరికీ బాగుంటుందనిపిస్తే... వాళ్ళని రమ్మనండి నాన్నా! విందాము. అప్పటికి మన ఆస్ట్రేలియా టూర్ కూడా ముగుస్తుంది." అని తన సమ్మతిని తెలిపింది పారూ.
"సరే, వచ్చే వారం రమ్మంటాను. ఇకపోతే, శ్రీనివాస్ గారి ఆరోగ్యం గురించి కనుక్కోమన్నావు కదూ శాంతా!" అంటూ రామనాధం గారికి ఫోన్ చేసాడు రామ్.
సుదీర్ఘ సంభాషణ తరువాత, “శ్రీనివాస్ గారిని కొద్ధి రోజులు హాస్పిటల్ రిహాబిలిటేషన్ లో ఉంచి ఇంటికి పంపుతారట. మొత్తం మీద ఆరోగ్యం బాగానే ఉందిట. మాట మెరుగయిందట. కదలిక లోనూ ఆశించిన మార్పు ఉందిట. పూర్తిగా కోలుకునేందుకు సమయం పడుతుందన్నారట." అని వివరించాడు రామ్.
ఇదివరలో కన్నా రామ్ ప్రశాంతంగా, సంతోషంగా ఉంటున్నాడు. ఈ మధ్య కాలంలో, పునీత్ తన చదువు, స్పోర్ట్స్, కంప్యూటర్ క్లాసు తప్పించి ఇంటిపట్టునే ఉండడం ఓ ముఖ్య కారణం.
తండ్రితో కల్పించుకుని మాట్లాడ్డం, అమ్మమ్మకి కాళ్ళు పడతానని అడగడం ఇంటిల్లిపాదీ గమనిస్తున్నారు. దురుసుగా మాట్లాడ్డం కూడా తగ్గిపోయింది. తన ఎలక్ట్రిక్ సైకిల్ ని అమ్మేయవచ్చని, ఆగి మరో రెండేళ్ళకి వేరే ఏదైనా తీసుకుంటానని తండ్రికి చెప్పడం ... పునీత్ లోని మార్పుకి తార్కాణం అనిపించింది అందరికీ.
***
హైదరాబాదు ప్రయాణం నాలుగు రోజులుందనగా విమల గారు పారూకి ఫోన్ చేసి... యోగక్షేమాలు కనుక్కున్నారు. "ఎలా ఉన్నావు పరమేశ్వరీ! శ్రీనివాస్ గారు నీకు ఫోన్ చేయమన్నారు. ఆయన కాస్త కోలుకున్నారు. నీవు ఈ సారి హైదరాబాదు వచ్చినప్పుడు ... ఓ మారు కలవమంటున్నారమ్మా! మేము రేపు హాస్పిటల్ నుండి ఇంటికి వెళతాము." అన్నారామె.
"తప్పకుండా కలుస్తాను ఆంటీ! శ్రీనివాస్ గారికి నమస్కారాలు చెప్పండి." అంది పారూ.
***
మరునాడు సాయంత్రం 'ఆలయ నాదాలు' టెలీ-ఫిలిం టీమ్ తో సమావేశం ఆసక్తికరంగా జరిగింది. మూడు నెలల సమయాన్ని కేటాయించాలని, హైదరాబాదులోనే నివాసముండాలని కూడా అర్ధమయింది. కథా, స్క్రీన్-ప్లే బాగున్నాయి. పారూ పాత్ర పేరు కళ్యాణి. ఓ గాయని. ఆ పాత్రని చక్కగా మలిచారనిపించింది.
అన్ని విషయాలు నచ్చి... ఒప్పందం చేసుకుని జనవరి నుండి మార్చ్ వరకు 'ఆలయనాదాలు' ప్రాజెక్ట్ కి కమిట్మెంట్ ఇచ్చింది పరమేశ్వరి.
***
మళ్ళీ వారానికి శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాదు చేరిన కిరణ్ నేరుగా మేనమామ ఇంటికి వెళ్ళాడు. ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాడు.
"మామయ్యా, మీరు గ్రేట్! నేనూహించిన దానికంటే ఆరోగ్యంగా కనబడుతున్నారు. త్వరలో ఈ వీల్-చైర్ అవసరం కూడా ఉండదు లెండి." అంటుండగా మీనాక్షి తనగది నుండి పరుగున వచ్చింది.
"హలో బావా! ఇవాళ శుక్రవారం కదా! కాలేజీ ఎగ్గొట్టి ఇక్కడున్నావే? నీవొస్తున్నావని ఎవరూ అనలేదు." అని మీనా అన్నదానికి...
"సరే, టైం మధ్యాహ్నం పన్నెండయింది మీనా! ఇంకా నైటీలోనే ఉంటావా? వెళ్లి నీ పనులు చేసుకుని రా. మరో రెండు గంటల పాటు నేనిక్కడే ఉంటాను." అన్నాడు కిరణ్.
శ్రీనివాస్ గారు కిరణ్ని చూసి సంతోషపడ్డారు. "నేను బాగానే ఉన్నాను. స్ట్రోక్ నుండి కోలుకుంటున్నాను. ఇది ఆ దేవుడు చేసిన ఓ హెచ్చరిక ఏమో అనిపిస్తుంది కిరణ్ బాబు! అందుకే .. త్వరితగతిన నా జీవితంలో రెండు ముఖ్యమైన కార్యాలు...పూర్తిచేయాలి అనుకుంటున్నాను.
ఒకటి... 'శ్రీ క్రియేషన్స్' టీవీ ఛానల్ మొదలుపెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుని దాదాపు పదేళ్లయినా ఇప్పటి వరకూ అభివృద్ధి చేయలేదు. కనీసం వచ్చే ఉగాది నాటికి ఆరంభించాలని యోచన. రెండవది ... మా మీనాక్షి కళ్యాణం. ఈ రెండు కార్యాలు సిద్ధిస్తే చాలు నాకు." అని తన మనసులోని మాట వెల్లడించారాయన.
అప్పుడే హాల్లో కి వచ్చిన విమల కిరణ్ కి, భర్తకి ఆపిల్ జ్యూస్ అందించి... కిరణ్ పక్కన కూర్చుంది. భర్తకి రోజుకి రెండుమార్లు ఇంట్లోనే జరుగుతున్న తెరపీ గురించి చెపుతుండగా మీనా ఫ్రెష్ అయి వచ్చి కిరణ్ ఎదురుగా కూర్చుని 'కబుర్లు చెప్పు బావా!" అంది.
"ఏముంది.. అమ్మావాళ్ళని చూసేందుకు వచ్చాను. ఇక పారూ, పునీత్, జానీ రేపు వస్తారు. పారూ తన కాస్ట్యూమ్స్ తీసుకుని, హిందుస్తానీ మ్యూజిక్ క్లాసుకి వెళితే.. ఆమె తమ్ముడు, చెల్లెలు సిటీ చుడతారట. ఇకపోతే, నీ గురించి చెప్పు. చదువు బాగానే సాగుతుంది కదూ!" అన్నాడు కిరణ్.
"మీ ఇంటికి రావడానికి కూడా కష్టంగా ఉంది తెలుసా బావా! ఎప్పుడూ హౌజ్-ఫుల్. నాకు ఊపిరాడదు." అంది విసుగ్గా మీనా.
"నీవెప్పుడంటే అప్పుడు ఇంటికి రావచ్చు, పోవచ్చు. పారూ వాళ్ళు మాలిని పిన్ని గెస్ట్-హౌజ్ లో ఉండడానికి ఇష్టపడుతున్నారులా ఉంది." అని జవాబిచ్చాడు.
మామయ్య వద్ద మరో గంటసేపు గడిపాడు కిరణ్. "నేను వెళ్లే లోగా మళ్ళీ వస్తాను మామయ్యా" అని చెప్పి సెలవు తీసుకున్నాడు.
***
తోబుట్టువులతో శనివారం పొద్దుటే హైదరాబాద్ చేరిన పారూని గెస్ట్-హౌజ్ డ్రైవర్ రమణ రిసీవ్ చేసుకున్నాడు. గెస్ట్-హౌస్ చేరి బ్రేక్-ఫాస్ట్ అయ్యేప్పటికి కిరణ్ వచ్చాడు.
కిరణ్ ఆదేశాల ప్రకారం పునీత్, జననీలు నగరం లోని సందర్శించవలసిన ప్రదేశాల విషయంగా డ్రైవర్ కి స్పష్టమైన ఆదేశాలిచ్చి తోబుట్టువులని పంపాకనే కిరణ్ తో కాస్ట్యూమ్ డిజైనర్ వద్దకి బయలుదేరింది పారూ.
కాస్ట్యూమ్స్ తీసుకుని, మ్యూజిక్ గురువు మహిపాల్ గారిని కలిసాక పారూని నేరుగా చార్మినార్ లోని ఓల్డ్ సిటీకి తీసుకెళ్లాడు కిరణ్. చుడీ బజార్ లోని ప్రతి కొట్టుకి తిరిగారు. రకరకాల గాజులు, బొట్లు తీసుకున్నారు. రోడ్ పక్కనే ఉన్న చిన్న బడ్డీలో మషాలా ఛాయ్ తాగారు.
అక్కడి నుండి బయట పడి, అబిడ్స్ లోని బాలాజీ జ్యువెలరీకి వెళ్లారు. ప్రొపైటర్ కిషన్ ఎదురొచ్చి లోనికి ఆహ్వానించాడు. ఆర్డర్ చేసిన కాలిపట్టాలు తీసుకోడానికి వచ్చానని కిరణ్ చెప్పడంతో, వస్తువుని గిఫ్ట్ బాక్స్ లో పెట్టించి ఇచ్చాడు కిషన్. బిల్ చెల్లించి బయటికి వెళుతుండగా... మీనాక్షి షాప్ లోనికి వస్తూ ఎదురు పడింది.
ఆమెని చూసి 'ఓహ్...గాడ్' అన్నాడు కిరణ్.
వారిని చూసి అవాక్కయిన మీనాక్షి, "బావా నీవా? జ్యువెలరీ షాప్ లోనా?" అనగలిగింది.
"అవును, తన పర్యటన కోసం పారూ షాపింగ్ అంటే... వచ్చాను." అంటూ... అక్కడి నుండి బయటపడి ... నేరుగా 'మౌర్య గార్డెన్స్’ కి తీసుకు వెళ్ళాడు.
****సశేషం****
రచయిత్రి పరిచయం ....
‘నాట్యభారతి’ ఉమాభారతి - నర్తకి, నృత్య గురువు, నటి, రచయిత్రి, టీ.వి చిత్ర దర్శక-నిర్మాత
కూచిపూడి, భరతనాట్యం నృత్యాలలో నిష్ణాతురాలు ఉమాభారతి. నాలుగు దశాబ్దాలుగా దేశవిదేశాల్లో కూచిపూడి నృత్య విస్తరణకు కృషి చేసి ఆ కళకు వన్నె తెచ్చిన మేటి నర్తకిగా, గురువుగా ఖ్యాతి గడించారు ఆమె. పద్నాలగవ యేట అఖిలభారత కూచిపూడి నృత్య పోటీలో గెలుపొంది, 1977 లో ప్రపంచ సాంస్కృతిక సభలచే ఆహ్వానింపబడి, ఆంధ్ర ప్రదేశ్ సాంస్కృతిక విభాగం వారిచే సాంస్కృతిక రాయబారిగా పరిగణింపబడిన అప్పటి యువ నర్తకి, ఉమాభారతి.
1970 లో ‘కూచిపూడి రంగప్రవేశం’ గావించి, 20 సంవత్సరాల వయసుకే విదేశీ పర్యటనలు, జాతీయ అంతర్జాతీయ గుర్తింపు, సినీ రంగ ప్రవేశం, చిత్ర నిర్మాణం కూడా చేపట్టి కళారంగంలో ఎనలేని కీర్తినార్జించింది ఉమాభారతి.
బాలనటిగా ‘సుడిగుండాలు’ చిత్రంలో, కథానాయకిగా ‘చిల్లరదేవుళ్లు’ చిత్రంలో, ఊర్వశి గా NTR సరసన ‘యమగోల’ చిత్రంలో నర్తించిన ఉమాభారతి 1976 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి కోసం విద్యార్ధి దశలోనే ‘భారతీయ నృత్య రీతులు’ అనే 30 నిముషాల డాక్యుమెంట్రీ నిర్మించారు.
సేవే ధ్యేయం, నృత్యం మార్గంగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక ప్రతినిధిగా… విద్యానిలయాల నిర్మాణాలకి, వరద బాధితుల నిధికి, నేత్రదాన శిబిరాలకి, 2 వ తెలుగు ప్రపంచ సభలకు, ‘రామసుబ్బయ్య పేద విద్యార్ధుల స్కాలర్షిప్ ఫండ్’ కు స్వచ్చందంగా నృత్య కార్యక్రమాలను చేసారు.
సౌతాఫ్రికా, మారిషస్, సెషిల్స్ ఆంధ్ర మహాసభల నిర్వహణలో నృత్య ప్రదర్శనల ద్వారా ఆలయ నిర్మాణ నిధులకి, తెలుగు భాషా-సంస్కృతి ప్రాచుర్యం పెంపొందించే కార్యక్రమాలకి నిధులు సేకరణకి నృత్య ప్రదర్శనలు చేశారు.
అమెరికా లోని వివిధ (25) దేవాలయ నిర్మాణ సంస్థల నిధుల సేకరణార్ధం సాంస్కృతిక పర్యటనలు నిర్వహించారు. 1982 లో హూస్టన్ లో అర్చన ఫైన్-ఆర్ట్స్ అకాడెమీ స్థాపించి ప్రవాసాంధ్రుల యువతకి నృత్యశిక్షణ కొనసాగిస్తూ జెమిని టి.వి కి ‘అలయనాదాలు’ టెలీ సీరియల్ నిర్మించి దర్శకత్వం వహించారు.
ఐదు దశాబ్దాలుగా కొనసాగుతున్న కృషికి గుర్తింపు:
శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి చేతుల మీదగా స్వర్ణకంకణం, ‘నాట్యభారతి’ అనే బిరుదు, పాండుచేరి గవర్నర్ నుండి L.V.R ఫౌండేషన్ వారి ‘రాజ్యలక్ష్మి అవార్డ్’. ‘వంశీ’ వారి ‘ఉత్తమ ప్రవాసాంధ్ర కళాకారిణి’ పురస్కారం, ఆంధ్రప్రదేశ్ సినీ గోయర్స్ వారి ‘జవహర్లాల్ నెహ్రూ సెంటినియల్ అవార్డ్, U.S.A హూస్టన్ ‘ఏషియన్ విమెన్స్ వారి ‘వుమన్ ఆఫ్ ది ఇయర్ ’ అవార్డ్, ‘TANA’ వారి సాంస్కృతిక పురస్కారం... ఆమె అందుకున్న కొన్ని పురస్కారాలు.
రచయిత ఉమాభారతి:
తెలుగు భాషా సాహిత్యాల పట్ల మక్కువతో 2012 నుండీ నృత్యేతర రచనా వ్యాసంగంలోకి అడుగుపెట్టి ఉమా రాసిన కథానికలు, కవితలు, నృత్యనాటికలు తెలుగునాట ప్రముఖ పత్రికల్లోను, పలు అంతర్జాల పత్రికల్లోను ప్రచురించబడ్డాయి. విదేశీ కోడలు – కధా సంపుటి (2013), ఎగిరే పావురమా – నవల (2015), సరికొత్త వేకువ – కధా సంపుటి (201 7), వేదిక – నవల (2016), నాట్యభారతీయం – వ్యాసా సంపుటి (2018) ..ఇప్పటివరకు పుస్తక రూపంగా వంగూరి ఫౌండేషన్ వారి ప్రచురణాలగా వెలువడిన గ్రంధాలు. నాట్యభారతి ఉమాభారతి కధలు – కధా సంపుటి (2023) లో వెలువడింది.
ఆమె తాజా నవల ‘హృదయగానం – నేడే విడుదల’ – నవల (2024) లో సిరికోన సాహిత్య అకాడెమీ వారి ఉత్తమ నవలగా గెలుపొంది, ‘జొన్నలగడ్డ రాంభొట్లు, సరోజమ్మ స్మారక పురస్కారం’ అందుకుంది.
నృత్య నాటికలకు గుర్తింపు:
ఆమె రచించి, నిర్వహించిన ‘భరతముని భూలోక పర్యటన’ ‘పెళ్లి ముచ్చట’, ‘మానసపుత్రి’, ‘లయగతులు’, ‘తెలుగింటి వెలుగు’ నృత్యనాటికలకి అమెరికాలోని ‘తానా’, ‘ఆటా’ వారి ఉత్తమ ప్రదర్శన అవార్డు, సృజనాత్మకతకి గుర్తింపు పొందారు.
విద్యాభ్యాసం: M.A (Pol. Science) – Osmania Universisity
కుటుంబ నేపధ్యం: తల్లితండ్రులు: కీ. శే. మేజర్ సత్యనారాయణ, కీ. శే. శ్రీమతి శారద.
భర్త: డా. మురళి మోహన్ కోసూరి, సంతానం: డా. సత్యజిత్, డా. శిల్ప-సంతానం.
కూచిపూడి గురువులు – పద్మశ్రీ వెంపటి చిన్నసత్యం, ‘కళాప్రపూర్ణ’ శ్రీ వేదాంతం జగన్నాధ శర్మ
భరతనాట్యం గురువులు – పద్మశ్రీ ఫకీరుస్వామి పిళ్ళై, కళైమామని శ్రీ. టి.ఆర్. రాధాకృష్ణన్