Menu Close
Shabdavedhi pagetitle
-- గౌరాబత్తిన కుమార్ బాబు --

చరిత్రను పునర్లిఖించిన పి.యన్.ఓక్

ప్రతి తరము సమకాలీన సంఘటనల గురించి సరిగా రాసుకోకపోతే భావితరాలు చరిత్ర నిర్మాణం కొరకు ఎంతో శ్రమ పడవలసి వస్తుంది. భారతదేశ ప్రాచీన చరిత్ర విషయంలో జరిగిందిదే. లిఖిత శాసన ఆధారాలున్న మధ్యయుగం, ఆధునిక యుగాల చరిత్ర గురించే అనేకానేక అపోహలున్నాయి. శాసనాధారాలు సరిగా లభించని, కేవలం సాహిత్య ఆధారాలు, అదీ అరాకొరగా లభించే ప్రాచీన కాలం గురించి కరాకండిగా నిర్ణయాలు ప్రకటించడం అంత సుళువు కాదు. మరీ ముఖ్యంగా భారతదేశంలో ప్రాచీన చరిత్ర రాజకీయ సామాజిక సిద్ధాంతాలకు ఆధారమవుతుంది. తప్పుడు సూత్రీకరణలపై ఆధారపడి నిర్మితమైన సిద్ధాంతాలు తప్పుడు ఫలితాలనే ఇస్తాయి. కాబట్టి భారతదేశ ప్రాచీన చరిత్ర గురించి తొందరపడి నిర్ణయాలు చేయడం సరికాదు.

ప్రఖ్యాత ఉర్దూ కథకుడు సాదత్ హసన్ తన కథల గురించి చెబుతూ - "నేను బతికిన కాలం గురించి తెలియాలంటే నా కథలు చదవండి. అవి భరించలేనివిగా ఉన్నాయంటే దాని అర్థం ఆ కాలమే అలాంటిది." భారతదేశ ప్రాచీన సాహిత్యమైన పురాణేతిహాసాలలో చరిత్ర కల్పనలతో విడదీయరానంతగా కలిసిపోయింది. కాబట్టి ఆ సాహిత్యం అప్పటి కాలం గురించి వాస్తవం ప్రతిబింబించిందని అనుకోలేము.

భారతదేశ చరిత్ర రచన ఆంగ్లేయుల కాలంలోనే శాస్త్రీయంగా మొదలైనది అనే వాస్తవాన్ని మనం గుర్తించాలి. అలానే మార్క్సిస్టు ఆలోచనాసరళి కూడా భారతదేశ చరిత్ర రచనపై నిర్మాణాత్మక ప్రభావం చూపెట్టింది. అలానే మొదటిదానిని సామ్రాజ్యవాదం, రెండవదానిని సైద్ధాంతిక నియంతృత్వం ప్రభావితం చేశాయనడం కూడా సత్యదూరమేమీ కాదు. రైట్ వింగ్ వాదనల్లో కొంత అశాస్త్రీయత,మౌఢ్యం ఉన్నప్పటికీ, వాటిలో ఉన్న సహేతుకమైన అంశాలపై నిష్పక్షపాతంగా పరిశోధన జరగవలసి ఉంది.

రైట్ వింగ్ చరిత్రకారులలో మనం కచ్చితంగా చదవవలసిన వ్యక్తులు ఇరువురు :- ఒకరు కోట వెంకటాచలం గారు ఇంకొకరు పురుషోత్తం నగేష్ ఓక్.

పురుషోత్తం నగేష్ ఓక్ మార్చ్ 2 1917న మహారాష్ట్రీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. సంస్కృతం మాట్లాడే తండ్రి, ఇంగ్లీష్ మాట్లాడే తల్లి, మరాఠీ మాట్లాడే బంధువులు, హిందీ మాట్లాడే ఇరుగు పొరుగుల వల్ల ఓక్ గారికి చిన్నతనం నుండి నాలుగు భాషలపై పట్టు చిక్కింది. ఓక్ ఆగ్రా విశ్వవిద్యాలయం నుండి బి.యే పట్టా పొంది...బాంబే విశ్వవిద్యాలయంలో ఎం.యే. చదివి అక్కడే యల్.యల్.బి. కూడా పూర్తి చేశారు. తరువాత ఒక సంవత్సరం పాటు పుణెలోని ఫెర్గ్యూసన్ కళాశాలలో ఆంగ్లోపన్యాసకులుగా ఉద్యోగం చేశారు. తరువాత తన ఇరవై నాల్గొవ ఏట సైన్యంలో చేరి సింగపూర్ లో పోస్టింగ్ పొందారు. క్రమంగా నేతాజీ నేతృత్వంలోని భారత జాతీయ సైన్యంలో చేరి సైగన్ లో ఫ్రీ ఇండియా రేడియోకు కామెంటేటర్ గా, డైరెక్టర్ గా వ్యవహరిస్తూ, నేతాజీకి సన్నిహితులయ్యారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిశాక సరిహద్దు అడవుల వెంబడి వేరొకరి వాహనాల్లో ప్రయాణిస్తూ సింగపూర్ నుండి కలకత్తాకు చేరుకున్నారు. 1947 నుండి 1974 వరకు పాత్రికేయుడిగా పనిచేశారు. హిందూస్తాన్ టైమ్స్ సంపాదక వర్గంలోను, సమాచార మంత్రిత్వ శాఖలో క్లాస్ వన్ ఆఫీసర్ గాను, అమెరికా రాయబార కార్యాలయంలో సమాచార విభాగంలోను పని చేశారు. 1959 నుంచి చరిత్ర పరిశోధనపై ఆసక్తి పెంచుకున్న ఓక్ 1964లో Institute for Rewriting Indian History అనే సంస్థను స్థాపించి అనేక చరిత్ర పుస్తకాలు రచించారు. వాటన్నిటిలో పాఠ్య పుస్తకాల్లో మనం చదువుతున్న చరిత్రపై అనేక ప్రశ్నలు లేవనెత్తారు.

పి.యన్.ఓక్ లేవనెత్తిన అనేకమైన ప్రశ్నల్లో ముఖ్యమైన కొన్నిటిని ఇక్కడ ప్రస్తావించదలచుకున్నాను. అవేంటంటే :- బుద్ధుడు మరియు ఆదిశంకరాచార్యులు జీవించిన కాలాలను సుమారు పదమూడు వందల సంవత్సరాలు తక్కువగా అంచనా వేయడం జరిగింది, ఆర్య అనే పదాన్ని జాతి పరంగా వాడడం తప్పు, వేద కాలాన్ని చాలా తక్కువగా అంచనా వేశారు, శ్రీ రామ, శ్రీ కృష్ణుల కాలాలను సరిగా అంచనా వేయలేదు, అలానే కుతుబ్ మినార్, ఎర్రకోట, తాజ్ మహల్ వంటివి ఎవరిచే, ఎప్పుడు కట్టబడ్డాయి? అనే సంచలనాత్మక ప్రశ్నలు లేవనెత్తారు.

1964లో కొంతమంది చరిత్రకారులు కుతుబ్ మినార్ అసలు పేరు విష్ణు ధ్వజమని, అక్కడ సముద్రగుప్తుని కాలంలో నక్షత్ర వేద పాఠశాల ఉండేదని తెలియజేశారు. అలానే బుద్ధుడి కాలం క్రీ.పూ 1887 నుండి క్రీ.పూ 1807 వరకునని కూడా తెలియజేశారు. కానీ ఇప్పుడు మనం చదువుతున్న చరిత్ర ప్రకారం బుద్ధుడి జననం క్రీ.పూ 563, మరణం క్రీ.పూ 483...అలానే ఇంకో వాదన ప్రకారం వారి జీవిత కాలం క్రీ.పూ 480 నుండి క్రీ.పూ 400 వరకు. కుతుబ్ మినార్ ను అనుకుని ఉన్న టౌన్ షిప్ ను మెహ్రౌలీ అంటారు. మెహ్రౌలీ అంటే మిహిర - అవాలి అంటే విక్రమాదిత్యుని ఆస్థానంలో ఉన్న మిహిరుడనే ఖగోళ శాస్త్రవేత్త నివసించిన ప్రాంతం. కుతుబ్ మినార్ చుట్టూతా 27 నక్షత్రాలకు మంటపాలుండేవి. అదే ప్రదేశంలో ఇప్పటికీ తుప్పు పట్టని ఆ కాలానికి చెందిన ఇనుప స్తంభం ఉన్నది. దానిపై బ్రహ్మి లిపిలో అక్షరాలు రాయబడి ఉన్నాయి. కుతుబ్ మినార్ గురించి ఓక్ చెప్పింది నిజమని మనం కుతుబ్ మినార్ ను సందర్శించినపుడు అనిపిస్తుంది. అలానే యమునా నది ఒడ్డున ఉన్న ఎర్ర కోట పృథ్వీరాజ్ చౌహన్ లు చెందినదని ఓక్ వాదించారు. అలానే తాజ్ మహల్ అసలు పేరు తేజో మహాలయ అని సంచలనాత్మక పుస్తకం రాశారు ఓక్.

భారతదేశ ప్రాచీన చరిత్రను పునర్నిర్మించాలంటే పురాణాలే ఆధారపడదగ్గ గ్రంథాలని ఓక్ అభిప్రాయపడ్డారు. మత్స్య, వాయు, విష్ణు, బ్రహ్మాండ పురాణాలను బట్టి ఇక్ష్వాకు వంశంలో క్రీ.పూ 3138 నుంచి క్రీ.పూ 1634 వరకు ముప్పై మంది రాజులు పరిపాలించారు. మహాభారత యుద్ధం క్రీ.పూ 3138లో జరిగిందని, తరువాత 36 సంవత్సరాలకు అంటే క్రీ.పూ 3102లో శ్రీ కృష్ణుడి నిర్యాణం జరిగి కలియుగం మొదలయిందని కొంతమంది భారతీయులకైనా సంప్రదాయ సిద్ధంగా తెలుసు.

మహాభారత యుద్ధం జరిగేటపుడు సోమధి మగధ రాజుగా ఉన్నాడు. అతని వంశంలో 22 మంది రాజులు 1006 సంవత్సరాలు పరిపాలించారు. వీరి తరువాత ప్రద్యోత వంశస్తులు ఐదు మంది 138 సంవత్సరాలు పాలించారు. వీరి తరువాత శిశునాగ వంశానికి చెందిన పది మంది రాజులు 360 సంవత్సరాలు పరిపాలించారు. ఈ 37 మంది రాజులలో 31వ రాజైన క్షేమజిత్తు కాలంలో బుద్ధుడు జన్మించాడు, 32వ రాజైన బింబిసారుడి కాలంలో జ్ఞానోదయం పొందాడు, 33వ రాజైన అజాతశత్రువు కాలంలో మరణించాడు. ఒకవేళ బుద్ధుడు క్రీ.పూ ఆరవ శతాబ్దంలో జీవించి ఉంటే సొమధి దగ్గర నుండి 32వ రాజైన బింబిసారుడి వరకు సుమారు రెండువేల సంవత్సరాలు గడిచినట్లవుతుంది. అంటే సగటున ఒక రాజు పరిపాలన కాలం సుమారు 82 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇది ఏ మాత్రం తర్క బద్ధం కాదు. అదే బింబిసారుడు క్రీ.పూ 1852 నుంచి క్రీ.పూ 1814 వరకు పరిపాలించాడు అనుకుంటే ఒక రాజు యొక్క సగటు పరిపాలన కాలం 41 సంవత్సరాలు అవుతుంది. ఇది నిజం అవ్వడానికి అవకాశం ఉంది, తర్క బద్ధంగానూ ఉంది.

పాఠకులలో ఎవరైనా ఇదివరకు గమనించారో లేదో, అది శంకరాచార్యుల జీవితకాలం గురించి కంచి పీఠానికి, ఇతర నాలుగు అద్వైత పీఠాలకు భేదం ఉంది. కంచి పీఠం ప్రకారం శంకర భగవత్పాదుల జీవితకాలం క్రీ.పూ 509 నుంచి క్రీ.పూ 477 వరకు. అయితే శంకరులు దేశం నాలుగు మూలాల నాలుగు మఠాలను స్థాపించారనేది జగద్విదితం. పూరి, శృంగేరి, ద్వారక, బద్రీనాథ్ మఠాల ప్రకారం శంకర భగవత్పాదుల జీవితకాలం క్రీ.శ 788 నుంచి క్రీ.శ 820 వరకు. నేను ఆదిశంకరాచార్యుల జన్మస్థలమైన కాలడి వెళ్ళినపుడు కూడా ఈ తేడాను గమనించాను. కాలడిలో శంకరాచార్యుల జన్మస్థలం పెరియార్ నది ఒడ్డున ఉంటుంది. అది శృంగేరి పీఠం అధీనంలో ఉంది. శంకర విజయస్తంభం కంచి పీఠం అధీనంలో ఉంది. ఈ రెండు ప్రదేశాలలో గోడలపై రాసి ఉన్న గురుపరంపరలో కూడా ఈ 1297 సంవత్సరాల తేడా కనబడుతుంది. అలానే బుద్ధుడి జీవితకాలం విషయంలో కూడా పదమూడు వందల సంవత్సరాల సందిగ్ధం ఉన్నదని చూశాం. శంకరాచార్యుల విషయంలో జరిగిన ఈ పొరపాటుకు కారణం - కంచి పీఠం యొక్క గురుపరంపరలో 38వ గురువైన అభినవ శంకరుడినే ఆది శంకరాచార్యులుగా పొరబడడమని ఓక్ అంటారు. తన ఆత్మ బోధ వ్యాఖ్యానంలో అభినవ శంకరుడు తన జననం క్రీ.శ 788 అని చెప్పారు. ఆదిశంకరుల మాదిరే అభినవ శంకరులు కూడా భారతదేశమంతా విస్తృతంగా పర్యటించారు. క్రీ.శ 840లో కైలాస పర్వతంలోని దత్తాత్రేయ గుహలో ప్రవేశించి మరిక కనబడలేదు.

ఓక్ అభిప్రాయం ప్రకారం పురాణాల ఆధారంగా ఈ పదమూడు వందల సంవత్సరాల తప్పును సరిజేస్తూ కలియుగారంభం నుండీ అంటే  క్రీ.పూ 3102 నుండి భారతదేశ చరిత్రను పునర్నిర్మించుకోవచ్చు. నిజంగా ఇది జరగవలసిన పరిణామం. సంకుచిత భావాలు - సామ్రాజ్యవాద ఉద్దేశాలతో రాసినటువంటి చరిత్రను, మధ్య మధ్యలో ఎర్ర సిరా పులమబడిన చరిత్ర పుస్తకాలను భారతీయ దృక్కోణంలో పునః పరిశీలించవలసిన అవసరం ఉంది.

***ఓం తత్ సత్***

Posted in January 2026, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *