ఏమండి ఏం చేస్తున్నారు? ఇంకా నిద్రపోలేదా? కంప్యూటర్ ముందేసుకుని పిచ్చి చూపులు చూస్తూ బుర్ర గోక్కుంటున్న భర్త రామం ని అడిగింది భార్య సౌమ్య.
బుర్ర గోక్కోవటం ఆపకుండానే, భార్య సౌమ్య వైపొక వెర్రిచూపు చూసి మళ్ళీ కంప్యూటర్ వైపు తల తిప్పుకున్నాడు రామం.
ఏమిటీ మాట్లాడరు.. గోకింది చాలు, ఇహ ఆపండి మీ బ్రహ్మానందం వేషాలు.. రెట్టించి అడిగింది ఈసారి.
నీకు తెలియంది కాదు కదా! రేపు క్లయింట్ ప్రెజంటేషన్ ఉంది. డ్రాఫ్ట్ కాపీ పంపించి వారం అయింది. కానీ అసలే మా బాస్ రాక్షసి పర్ఫెక్షనిస్ట్. ఒక పట్టాన ఒప్పుకోదు, అది బాగాలేదు ఇది బాగాలేదని మార్పులు చెయ్యాలని చెప్పింది. ఆమె గారు ఒక జక్కమ్మ. రాజమౌళి లాగా చెక్కుతునే ఉంటుంది చివరినిమిషం దాకా.
అవునులెండి, ఆవిడగారు జక్కమ్మ అయితే, మీరేమో పూరి జగన్నాధ్ మరి. చిటికలో పని అయిపోవాలంటారు. అయినా ఆవిడ గారు అడిగినట్టు చేసి ఇవ్వచ్చుగా! బాసులూ ఊరికెనే అడగరు ఏదీను. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించాలి. అయినా క్లయింట్ ప్రెజంటేషన్ అంటున్నారంటే చాలా ముఖ్యమైనది కదా మరి.
అవున్లే కొంచెం హెల్ప్ చేద్దామని కూడా లేదు. పైగా దానికితోడు సమర్ధింపు ఒకటి. అంతేలే ఏమైనా మీ ఆడవాళ్లు ఆడవాళ్లు ఒకటే కదా? అయినా ఈ జక్కమ్మ గారు పోయిన జన్మలో రాజమౌళికి అక్కో, చెల్లెలో అయివుండాలి గొణుక్కుంటూ పైకి అనేశాడు రామం.
అసలేంటి మీరు? ఆఫీస్ పని ఇంటికి తెచ్చింది కాకుండా, మీ పనిని నన్ను చెయ్యమంటారు? పైగా దెప్పుళ్ళు ఒకటి. అయినా నాకిది అలవాటైపోయుందిలెండి. అంటూ భర్త ముందున్న కంప్యూటర్ లాక్కుంది సౌమ్య.
నా బుజ్జే, నా బంగారమే. నాకు తెలుసోయ్, నేను కష్టపడుతుంటే నువ్వు చూడలేవని. అయినా అదికాదోయ్ నేను చెప్పేది ..అంటూ ఏదో చెప్పబోయాడు రామం.
చాలు ఆపండి మీ కాళ్ళ బేరాలు. ఆ సర్లెండి, నేను చూస్తాను మీరు పడుకోండి. పొద్దున్నే ఆఫీసుకి వెళ్లి ఇది పంపించేయండి మీ లేడీబాస్ కి సరిపోతుంది.
ఇదిగో ఇంకో మాట. రేపు నేను కొంచెం ఎర్లీ గా ఆఫీస్ కి వెళ్ళాలి. నా కారు లో పెట్రోల్ తక్కువగా వుంది. మీ కారు తీసుకువెళతాను. మీరు నా కారులో పెట్రోల్ కొట్టించుకొని ఆఫీస్ కి వచ్చేయండి. లేదంటే ఒకే కారులో వెళదామంటే మీరు సరే అంటే నాకు ఒకే. త్వరగా లేచి నాతో పాటు బయలుదేరతారా?
అయ్యయ్యో వద్దు వద్దొద్దు... నా కారు తీసుకెళ్ళు, నీ కారు లో పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేయించుకొస్తాలే. ఆ మాత్రం చెయ్యలేనా! చెప్పు. నీ ఈ సహాయానికి ప్రతి సహాయం తప్పకుండా చేస్తా బంగారం. నువ్వు చూడు నువ్వు చూడు... కవ్విస్తున్న భార్యను కొంటెగా చూస్తూ చెప్పాడు రామం.
అయినా ఏంటి మీరు ఎప్పుడూ ఈ చివరి నిమిషపు హడావుడి? మీ పనంతా నా నెత్తి మీద పడేస్తారు? ఎవరో ఒకళ్ళం ఉద్యోగం మానేసి ఇంట్లో ఉందామంటే వినరు. ఈ హైదరాబాద్ మహా నగరంలో ఇద్దరం ఉద్యోగాలు చెయ్యకపోతే బతకలేం అంటారు? నా వల్ల కాదు బాబు ఈ హడావుడి జీవితం.
అని కొంచెం విసుక్కుంటూ భర్త వైపు చూసింది. అప్పటికే ముసుగుతన్ని నిద్రలోకి జారిన రామంని చూసి అంత విసుగులోను నవ్వుకుంటూ అతని కంప్యూటర్లోకి తల దూర్చింది.
ఒక పది రోజుల తర్వాత –
ఏమండి ఏం చేస్తున్నారు? ఇంకా నిద్రపోలేదా? కంప్యూటర్ ముందేసుకున్న భర్త రామం ని అడిగింది భార్య సౌమ్య. ఈ మద్యనేగా క్లయింట్ ప్రెజంటేషన్ అయిపోయింది. బాగానే జరిగింది, క్లయింట్ నుంచి మంచి అప్ప్రీసియేషన్ వచ్చిందన్నారుగా. ఇంకేంటి?
అవునోయ్, ఏదో నీ దయ వల్ల ఆ గండం గట్టెక్కాను. కానీ ఈసారి అంతకంటే పెద్ద గండం వచ్చి పడింది.
మళ్ళీ ఏమైంది? ఏమిటా పెద్ద గండం? నా చావుకొచ్చిందిరా భగవంతుడా అని మనసులోనే అనుకుంది సౌమ్య.
ఏమిటోయ్ ఏమీ తెలియనట్లు ఇలా అడుగుతావు? రేపు నా ఇయర్లీ అప్రైజల్. అసలే రెండు సంవత్సరాల నుంచి ప్రమోషన్ లేదు. ఈసారి ఈ బాస్ రాక్షసి ఏమి చేస్తుందోనని భయంగా వుంది.
ఎందుకు అంత భయం. మీరు ఇయర్ మొత్తం బాగా చేసి, మీ గోల్స్ రీచ్ అయ్యి అంచనాలు మించి ఎక్సపెక్టషన్ అయితే ప్రమోషన్ వస్తుంది. పూర్ ఎక్సపెక్టషన్ అయితే రాదు. అంతే కదా?
ఆ ఆ .. అంతే అంతే .. చెప్పడానికి బాగానే ఉంటుంది. కానీ ఈ బాసులు వున్నారు చూడు ఎక్కడో ఒకచోట, ఏదో ఒక పితలాటకం పెట్టి మైనస్ మార్కులు వేసి ప్రమోషన్ రానివ్వరు. అందులో మా లేడీబాస్ మరీను. తిమ్మిని బమ్మిని చేయడంలో ఘటికురాలు.
అయినా ప్రతిసారి బాసు రాక్షసికి భయపడుతూ పనిచేసే బదులు, ఈ ఉద్యోగం మానేసి మరోటి చూసుకోవచ్చుగా.
అయ్యయ్యో! ఈ భార్య రాక్షసి వున్నంతవరకు నాకీ బాసు రాక్షసితో ఇబ్బంది లేదోయ్.
నన్ను ఇన్వాల్వ్ చెయ్యకండి రామం గారు. ప్రతిసారి మీ పని నా నెత్తిమీద పెట్టకండి మీకు దండం పెడతాను.. అయినా మీరు సరిగ్గా పని చేస్తే, సంవత్సరమంతా ఏం చేశారో వాదించండి. లేకపోతే ఎవ్వరేం చెయ్యలేరు.
నేనేం లాయర్ని కాదు, ఆఫీస్ కోర్ట్ కాదు వాదించటానికి. అయినా నేనేం చేసానో నాకు తెలుసు మరియు మా లేడీ బాస్ కి తెలిసివుండాలి కూడా.
అయితే సరే మీ ఇష్టం. అయినా ఇది మీ అప్రైజల్, మీ ఇష్టం. ఆల్ ది బెస్ట్.. నాకు నిద్ర వస్తుంది ... గుడ్ నైట్.
అయ్యయ్యో, అలా అనకోయ్ .. ఈ విషయంలో నీ సహాయం తప్పకుండా కావాలి.
మళ్ళి మొదలుపెట్టారా? అయినా మీ అప్రైజల్ విషయంలో నా సహాయమేంటో? నేనేం చేయగలను?
నువ్వు చేయగలవు..నువ్వు మాత్రమే చేయగలవు. ఎందుకంటే మీరు మీరు ఒకటి కాబట్టి, ఈ లేడీ బాస్ ని ఎలా ఎదుర్కోవాలో నీకు బాగా తెలుసు, ప్లీజ్ .. ప్లీజ్ భార్యామణి.
ఏమిటండీ మీ గోల మీ తిప్పలేవో మీరు పడండి. మధ్యలో నన్నెందుకు ఇబ్బంది పెడతారు? అయినా నా ఆఫీస్ విషయంలో మిమ్మల్ని ఎప్పుడన్నా అడిగానా హెల్ప్ చెయ్యమని?
నువ్వు అడగవు, నీకసలు ఆ అవసరం లేదు. ఎందుకంటే నువ్వు తెలివిగలదానివి. ఈ విషయం చెప్పటానికి నాకేం మొహమాటం కానీ, ఇగో కానీ లేదు. ఇదిగో అనవసరంగా టైం వేస్ట్ చేయక, ఒక్క 30 మినిట్స్ ఇలా వచ్చి కూర్చో చాలు.
ఉద్దరించార్లేండి. ఇలా కాళ్ళు పట్టుకోవడానికి అవమానంగా లేదా మీకు?
అస్సలు లేదు. ఎందుకంటే శ్రీకృష్ణుడంతటి వాడే సత్యభామ కాళ్ళు పట్టుకున్నాడు. నేనెంత. అయినా అందమైన, తెలివైన భార్య సహాయం తీసుకోటంలో తప్పేముంది?
ఈ డైలాగులకేం తక్కువలేదు. సర్లే రండి చూద్దాం... బ్రతుకుజీవుడా..భార్యామణి దిగొచ్చింది. అని ఎగిరి గంతేశాడు రామం.
రామానికి తెలుసు సౌమ్య ఈ పనుల్లో తనకు ప్రతిసారి కాదనకుండా హెల్ప్ చేస్తూనే ఉంటుంది. దానికి ముందు కాసేపు తనతో ఇలాగ మాటల్తో ఆడుకుంటుంది. వాళ్ళిద్దరికీ అదొక సరదా కాసేపు మాటల్తో యుద్ధం చెయ్యడం.
ఒక రెండు రోజుల తర్వాత –
ఎంవోయ్, ఈ వీకెండ్ సరదాగా ఎక్కడికైనా వెళ్దాం.. ఆఫీస్ నుంచి వస్తూనే రామం అన్నాడు సౌమ్యతో
ఏమిటో శ్రీవారెందుకో అంత ఉత్సాహంగా వున్నారు?
నీకు తెలుసుకదోయ్, ప్రమోషన్ వచ్చిందిగా. లెట్స్ సెలబ్రేట్.
ఓహో అయితే బాస్ రాక్షసి వదిలినట్లే?
అబ్బా! ఏం తెలీనట్లు నాటకాలు. ఈ పెళ్ళాం బాస్ రాక్షసికి కూడా ప్రమోషన్ వచ్చిందిగా, మళ్ళీ తమరికేగా రిపోర్టింగ్. మహా సంతోషంగా చెప్పాడు రామం.
ఏమండి! మీకెలా ఉందోకాని, నాకయితే మహా ఇబ్బందిగా వుంది. ఇంట్లో ఏమండి అని, ఆఫీస్ లో మిస్టర్ రామం అని పిలవాలంటే.
నాకయితే భలే తమాషాగా వుందోయ్. ఈ జనరేషన్ జంటలు ఇంట్లోకూడా పేరు పెట్టే పిలుచుకుంటున్నారు. ఆ విషయంలో మనం చాలా నయం కదా!
ఇంట్లో పెళ్ళాంగా, ఆఫీసులో బాసుగా డబల్ యాక్షన్ చెయ్యలేక చస్తున్నాను. అయినా ఇంట్లో, ఆఫీస్ లో కూడా నన్నే చూడాలంటే బోర్ గా లేదా?
అస్సలు లేదు. ఇంటా బయటా కొత్త పెళ్లి జంటలా ఎంచక్కా నిన్నే చూస్తూ వుంటుంటే ఎంత బాగుందో!
ఓహో అలాగా! అయినా ఏంటి ఈ గోల! ఆఫీస్ లో మీరు నాకు రిపోర్ట్ చెయ్యడం నాకేం బాగాలేదు. అందుకే ఇది మానేసి వేరేది చూసుకుంటానంటే వినరు.
అయినా దాసరి గారి సీతారాములు సినిమాలో కృష్ణంరాజులా నేనేమీ నిన్ను "ఏవండోయ్ శ్రీమతిగారు లేవండోయ్ తెల్లారింది" అని పాట పాడి లేపటం లేదు. నువ్వేమి "కాఫీ కాఫీ" అని మారం చెయ్యటంలేదుగా! నవ్వుతూ చెప్పాడు రామం.
కానీ నాకే రాఘవేంద్రరావు గారి ఘరానామొగుడు సినిమాలో నగ్మాలా "ఏంది బే ఎట్లాగ వుంది ఒళ్ళు" అంటానేమోనని భయం. రామం నవ్వులో నవ్వు కలిపింది సౌమ్య.
ఎంతోమంది ఆడవాళ్లు తమ భర్తలకంటే పైస్థానంలో వేరే ఆఫీసులో పని చెయ్యటం పరిపాటి. కానీ, ఒకే ఆఫీసులో భార్య కు రిపోర్ట్ చేసే భాగ్యం, అదృష్టం కొంతమందికే ఉంటుంది. అందులో నేనొక్కడిని. దాన్నిలా అనుభవించనీయవోయ్, బాగుంది.
ఏంటో మీ పిచ్చి. అయినా భార్య అయిన బాస్ చాటున సేఫ్ గేమ్ బాగానే ఆడుతున్నారు. ఇన్నాళ్లు బాగానే ఎంజాయ్ చేశారు. భార్య కాని వాళ్ళు బాస్ అయితే ఎలా ఉంటుందో కూడా మీకు తేలియాలిగా! అందుకే ఒక నెల తర్వాత లాంగ్ లీవ్ తీసుకోవాలనుకుంటున్నాను.
వాట్! లాంగ్ లీవా? ఎందుకు? అర్ధంకాక అయోమయంగా చూసాడు రామం.
మిస్టర్ రామం భర్త గారికి ఒక శుభవార్త. ఇందాక ఆఫీస్ నుంచి వస్తూ, హాస్పిటల్ కి వెళ్లి వచ్చాను. ప్రెగ్నన్సీ కంఫర్మ్ అయింది. మనం త్వరలో అమ్మానాన్నలం కాబోతున్నాం. మీకు సర్ప్రైజ్ ఇద్దామని మిమ్మల్ని హాస్పిటల్ కి రమ్మనలేదు. సిగ్గుపడుతూ చెప్పింది సౌమ్య. మెటర్నిటీ లీవ్ కి అప్లై చెయ్యాలి.
అమ్మ దొంగా! ఓహో అయితే ఈ లేడీ బాస్ కి తోడు మరో బుజ్జి బాస్ వస్తుందన్నమాట త్వరలో. యాహు అంటూ అరుస్తూ సౌమ్య ని దగ్గరికి తీసుకున్నాడు రామం.
మీ కథ ఇప్పుడే చదివాను శీని గారు. సరదాగా, హాయిగా సాగిపోయింది. చివర వరకూ సస్పెన్స్ పెట్టేసారు.
ధన్యవాదములు సత్యం గారు మీకు ఈ కథ నచ్చినందుకు.
మీ కథ ‘లేడీ బాస్’ చదివాను. మీరు వ్రాసిన ఇతర కథలకన్నా కొంత వైవిధ్యంగా వుంది. మీ కథలు ఎక్కువగా మానవ సంబంధాల మీద వుంటాయి. ఈ కథతో మీరు మంచి హాస్యం కూడా వ్రాస్తారు అని ఇప్పుడే తెలిసింది. సరదాగా వుంది. అభినందనలు.