వీక్షణం-112వ సమావేశం ఆన్ లైన్ సమావేశంగా, అత్యంత ఆసక్తిదాయకంగా డిసెంబరు 12, 2021 న జరిగింది. ఈ సమావేశం డా.కొండపల్లి నీహారిణి గారి కథ "మృత్యుంజయుడు" కథాపఠనంతో ప్రారంభమైంది.
ఈ కథ నీహారిణి గారి తండ్రిగారయిన పెండ్యాల రాఘవరావు గారి జీవిత ఆధారంగా, రజాకార్ల పోరాట కాలంలో జరిగిన యదార్థవిషయాలను అనుసరించి రాసిన కథ. పెండ్యాల రాఘవరావు గారు రజాకార్ ఉద్యమంలో పాల్గొన్న కమ్యూనిస్ట్ యోధులు. ఆనాటి పోరాటాలలో మూడుసార్లు జైలుశిక్ష అనుభవించారు రాఘవరావు గారు. దాదాపు 5 ఏళ్లు జైలు జీవితం గడిపారు. పోలీస్ ఆక్షన్ తరువాత ప్రథమ సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. జైలునుంచే నామినేషన్ వేసిన రాఘవరావు గారు రెండు MLA స్థానాలు, ఒక MP స్థానాన్ని గెలుచుకున్నారు.
పెండ్యాల రాఘవరావు వరంగల్ జిల్లా మొదటి పార్లమెంటేరియన్. 1952 నుండి 1956 వరకు కమ్యూనిస్టుపార్టీ తరపున కమ్యూనిస్టు వీరునిగా, ఎం .పి గా 5 ఏళ్లు ఢిల్లీలో ప్రతిపక్ష నేత గా పనిచేసారు. ఆయన అనుభవాల జ్ఞాపకాలైన ‘నా ప్రజా జీవితం' పుస్తకానికి నీహారిణి సంపాదకత్వం వహించారు. ఆ పుస్తకానికి ఆయన సహోద్యమకారులు రాసిన ముందుమాటల్లో అప్పట్లో వారి తండ్రిగారిపై జరిగిన దాడిని "మృత్యుంజయుడు" కథగా మలిచి రాసేరు. ఈ కథ నీహారిణి గారి ‘రాచిప్ప‘ కథా సంపుటి లోనిది.
ఇక కథ విషయానికి వస్తే-
‘మృత్యుంజయుడు ‘కథ పోరాట వీరుని కథ. అవి తెలంగాణ లో ఆనాడు జరిగిన నవాబు పాలనపై, రజాకార్ల అన్యాయాలపై పోరాటాలు జరిగిన రోజులు. కమ్యూనిస్టులు ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ప్రయత్నించి విజయవంతమైన రోజులు. కథానాయకుడు రాఘవరావు గారు.
రాఘవరావు గారు భూస్వామి, కరణం గారి కొడుకు. అయినా ఆయన తన తండ్రిని ఎదిరించి ప్రజాపోరాటానికి పిడికిలి ఎత్తిన వీరుడు. ఉద్యమసమయంలో రాఘవరావు పైన దాడులు జరిగాయి. పోలీసుల నుండి పోరాటంలో గెలవడం విశేషం. పార్టీ లోకి తాను తీసుకొచ్చి ఆశ్రయం ఇచ్చిన వ్యక్తే తనపై కుట్రపన్ని చంపాలనుకుంటాడు. అది గ్రహించిన కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కార్యాలయం వారే నిర్ణయం తీసుకుని అతనికి మరణశిక్ష ను విధించిన ఆనాటి యదార్థగాథను కథగా మలిచారు కొండపల్లి నీహారిణి గారు.
నిస్వార్థ సేవ చేసిన ఎందరో కమ్యూనిస్టు యోధులు మనకు ఉన్నారు. అటువంటి యోధుడు పెండ్యాల రాఘవరావు గారు. ప్రత్యక్ష పోరాటానికి ఎన్నో పథకాలు వేయాల్సి ఉంటుంది. ఆ క్రమంలోనే శంకర్ అనే ఒక షూటింగ్ ఎక్స్పర్ట్ ను పార్టీ లోకి తీసుకుని అతనిని దేశ సేవ వైపు మళ్ళించాలని ప్రయత్నం చేసారు. కాని శంకర్ తన పాత గుణాలను వదులుకోలేదు. అతని అరాచకాన్ని పార్టీ అరికట్టింది మరణశిక్ష విధించింది. ఈ సన్నివేశాన్ని చిన్ని చిన్ని సంఘటనలతో ఉత్కంఠ భరితంగా కథగా అల్లారు నీహారిణి గారు.
ఆ తర్వాత రేగడివిత్తులు నవలా రచయిత్రి, ప్రముఖ కథారచయిత్రి శ్రీమతి చంద్రలత, శ్రీమతి ఉదయలక్ష్మి, శ్రీమతి భవాని, శ్రీ సి.బి.రావు, శ్రీమతి రమణ, శ్రీ ఆచార్యులు, శ్రీ రాజశేఖరం, డా||కె.గీత, శ్రీ శ్రీధర్ రెడ్డి మొ.న వారు కథా చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణా మాండలికంలో రాసిన ఈ కథని నీహారిణి గారు చదవడం వల్ల కథ మరికాస్త గొప్పదనాన్ని పొందిందని అంతా కొనియాడారు. శంకర్ పాత్ర మీద, కథలో అతడి మరణం పట్ల, పార్టీ నిర్ణయం పట్ల సుదీర్ఘ చర్చ జరిగింది.
ఆ తర్వాత జరిగిన కవి సమ్మేళనంలో డా||కె.గీత, డా|| కొండపల్లి నీహారిణి, శ్రీ కృష్ణకుమార్ పిల్లలమఱ్ఱి, శ్రీ శ్రీధర్ రెడ్డి, శ్రీ దాలిరాజు వైశ్యరాజు, మొ.న కవులు పాల్గొన్నారు. చివరగా శ్రీమతి గునుపూడి అపర్ణ గారు స్వయంగా రాసిన "దీపలక్ష్మి" గీతాన్ని అతి శ్రావ్యంగా పాడడం విశేషం. అర్థవంతంగా జరిగిన ఈ సభలో స్థానిక సాహిత్యాభిలాషులు ఆసక్తిదాయకంగా పాల్గొని సభను జయప్రదం చేశారు.
వీక్షణం-112 వ సమావేశాన్ని "వీక్షణం" యూట్యూబు ఛానలులో ఇక్కడ చూడవచ్చు. https://youtu.be/2GFJt9SgP9g