Menu Close
తెలుగు పద్య రత్నాలు
-- ఆర్. శర్మ దంతుర్తి --

ఈ నెల పద్యం మళ్ళీ మన తెలుగువారి పుణ్యపేటి పోతన రాసిన మహాభాగవతం లోదే. హిరణ్యాక్షుణ్ణి మహావిష్ణువు వరహావతారంలో చంపాక హిరణ్యకశిపుడికి కోపం వచ్చింది. తన వారికి రాజ్యం అప్పగించి తపస్సుకి బయల్దేరాడు. కాలి బొటనవేలిమీద నుంచుని భీకరమైన తపస్సు చేసేసరికి ఆ తపోవహ్నికి స్వర్గం అల్లల్లాడటం మొదలైంది. దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గిరకెళ్ళి మొరపెట్టుకుంటే అంభోజాసనుడు వచ్చి చూసాట్ట ఈ తపోవహ్ని ఎక్కడ్నుంచి వస్తోందా అని. వల్మీకం (పుట్ట) లో ఎముకల గూడు తప్ప ఏమీ లేదు. కమండలంలో ఉన్న నీటితో జల్లాడు. ఆయన సృష్టి చేసేవాడు కనక ఆ కమండలోదకంతో మామూలుగా అయ్యి, తేజస్సంపన్నుడై, వెలిగే ప్రభల్తో పుట్టలోంచి బయటకొచ్చాడు హిరణ్యకశిపుడు.

“ఒరే నాయనా అసలు మనిషిని సృష్టించింది నేనే కానీ అసలు ఇటువంటి పట్టుదలా, ఇంతటి తపస్సు చేసే శక్తి ఉంటుందని నేను అనుకోలేదు. ఏం కావాలని నువ్వు అనుకుంటున్నావో కానీ, ఇటువంటి తపస్సు ఎక్కడా విన్నదీ కన్నదీ కాదు. సృష్టికర్తనైన నేనే ఆశ్చర్యపోతున్నాను నీ పట్టుదలకి. ఏం కావాలో కోరుకో” అని అడిగితే హిరణ్య కశిపుడు అడుగుతున్నాడు ఏం కావాలో.  అడిగే కోరికలో వీరరసం కనిపించడానికా అన్నట్టూ ఈ పద్యానికి పోతన వాడిన వృత్తం శార్దూలం.

శా. గాలిం, గుంభిని, నగ్ని, నంబువుల, నాకాశస్థలిన్, దిక్కులన్,
    రేలన్, ఘస్రములం, దమఃప్రభల, భూరిగ్రాహ, రక్షో, మృగ
    వ్యా ళాదిత్య, నరాది జంతు కలహవ్యాప్తిన్, సమస్తాస్త్ర శ
    స్త్రాళిన్, మృత్యువు లేని జీవనము లోకాధీశ! యిప్పింపవే." [7-90]

గాలిలో, నేలమీద (కుంభిని), అగ్నివల్ల, నీటివల్ల (అంబువల), ఆకాశంలో, దశ దిశల్లో, రాత్రి (రేలన్), పగటికాలంలో (ఘస్రములం), వెలుగు చీకట్లలో (తమప్రభల), మొసళ్ళ వల్ల (భూరి గ్రాహ), రాక్షసుల వల్ల (రక్షో), మృగాల, పాముల వల్ల (మృగ, వ్యాళ), ఆదిత్యుల వల్ల (అదితి పుతృలు – దేవతలు; గమనించారా, ఆదిత్యానాంమహం విష్ణుః అన్న భగవద్గీతా వాక్యం?), మానవ జంతువుల వల్ల కలిగే కలహాలలో (నరాది జంతుకలహ వ్యాప్తిన్), ఏ అస్త్ర శస్త్రాలవల్ల కానీ చావు రాకూదదు. ఇదీ కోరిక.

ఓ సారి వెనక్కి చూసుకుంటే హిరణ్యకశిపుడు ఎందుకిలా అడిగాడో తెలుసుకోవడం కష్టం కాదు. తన తమ్ముణ్ణి నీటిలో వరహావతారం లో వచ్చి చంపాడు శ్రీహరి. ఆయనెక్కడుంటాడో తెలుసుకోవడం అసాధ్యం (తన హృదయంలోనే ఉన్నాడన్న విషయం మర్చిపోయి), ఏ రూపంలో వస్తాడో, ఎప్పుడొస్తాడో తెలియదు. ఏయే ఆయుధాలతో యుద్ధం చేస్తాడో అసలే తెలియదు. అందుకే తనకి తెలిసిన ఎవరివల్లా, ఏయే ప్రదేశాల్లోనూ చావు రాకూడదు అని అడిగాడు.

ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎలా చావకూడదనుకుంటూ అడిగాడో అదే కోరికతో తాను ఎలా చావాలో నిర్ణయించుకున్నాడు హిరణ్యకశిపుడు. అందుకే తాను అడిగిన కోరికతో మనిషీ, జంతువూ కాకుండా, ఇంట్లో, బయటా కాకుండా, ప్రాణం ఉన్నదానితో కానీ, లేనిదానితో కానీ కాకుండా హిరణ్యకశిపుడి కోరిక ప్రకారం నృసింహావతారంతో వాణ్ణి సంహరించాడు శ్రీహరి. మరో విషయం ఏమిటంటే జయవిజయులు మానవజన్మ ఎత్తినప్పుడు వాళ్ళు అడిగినది మూడు జన్మలలో శ్రీహరికి శతృవులుగా ఉండాలనేది. శతృవంటే నిరంతరం ఆయన మనసులో మెదుల్తూ ఉంటాడన్నమాట. అలా పక్కలో బల్లెంగా తయారవడానికి అమర్చినవాడే హిరణ్యకశిపుడి కొడుకు ప్రహ్లాదుడు. ఎవరేం చెప్పినా, పాములచేత కరిపించినా శ్రీహరి నామం వదలని స్వంత కొడుకు వల్లే అలా నిరంతరం – తాను ఎంత వద్దనుకున్నా – శ్రీ హరిని స్మరించుకుంటూ ఆయనచేత తాను కోరుకున్న కోరిక ప్రకారం ప్రాణం తీయించుకున్నవాడు హిరణ్యకశిపుడు. ఇదంతా అలా జరగడ్డానిక్కారణం కూడా తన స్వంత కోరిక – అనేక సంవత్సరాలు తీవ్రమైన తపస్సు చేసి మరీ సాధించుకున్నది. అందుకే అంటారు, “ఏదైనా కోరుకునేటపుడు జాగ్రత్త సుమా, నువ్వు అడిగేది నిజంగా అనుగ్రహింపబడవచ్చు” అని.

తపస్సు చేసే మహర్షులు చెప్తారు ఈ విషయం గురించే. కోరిక అనేదే మనకున్న దరిద్రం. దేనినీ కోరవద్దు భగవంతుణ్ణి తప్ప. మనం ఏదైతే కోరతామో అదే మనకి చివరకి బాధ కలిగించే విషయం.  స్వామి వివేకానంద అంటున్నారు చూడండి – “నువ్వు దొంగవి అవ్వాలనుకుంటే, రాజుగారి ఖజానా కొల్లగొట్టడానికి ప్రయత్నించు. వేటగాడివి అవ్వాలనుకుంటే, ఖడ్గమృగాలని వేటాడ్డానికి ప్రయత్నించు. బిక్షగాళ్లని కొల్లగొట్టడానికీ, చీమలని వేటాడ్డానికీ ఏమీ ప్రయత్నం అవసరంలేదు. అందువల్ల నీకు ఏదైనా కావాలనుకుంటే, ఎవరినైనా ప్రేమించాలనుకుంటే, భగవంతుణ్ణి అడిగి ఆయన్నే ప్రేమించు.” అదీ మనం గ్రహించవలసింది; కోరుకునేదెప్పుడూ మనకి బాధ కలిగించేలా ఉండకూడదనుకుంటే ఏమిటి కోరుకునేది? ఏమీ లేదు. అదే సన్యాసం అనే దానికర్ధం. మోక్షం మీద కోరికతో అన్నీ త్యజించాక మిగిలే చివరి కోరిక మోక్షం. అది కూడా త్యజించాక వచ్చేది గీతాచార్యుడు చెప్పిన మోక్ష సన్యాస యోగం. అప్పుడు కలిగేది – అత్మానుభవం. మానవ జన్మ దీని కోసమే అంటూ స్వామి వివేకానంద రామకృష్ణా మఠం స్థాపిస్తూ చెప్పిన మాట – “ఆత్మనో మోక్షార్ధం, జగత్ హితాయచ.”

క్రితం నెల వ్యాసంలో చెప్పినట్టూ విష్ణుకథలు కల్యాణాత్మకాలు. ఎన్నిసార్లు చదివినదే చదివినా ఎప్పటికప్పుడు కొత్తగా ఉండడానిక్కారణం – భగవత్విభూతి. ఆ విభూతి మహాసముద్రం వంటిది కనక పూర్తిగా తెలుసుకోవడం ఎప్పటికీ ఎవరికైనా కానీ అసాథ్యం. మనకి చేయగలిగినది ఏమిటంటే, మనకున్నంతలో మనం కూడా తెచ్చుకున్న పాత్రతో (ఈ శరీరం) ఆ సముద్రం నీళ్ళని అందినంత మేర పట్టుకోవడం.

****సశేషం****

Posted in January 2022, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!