తంజావూరనగానే అందరికీ బృహదీశ్వరాలయం గుర్తుకొస్తుందికానీ, అక్కడ అద్భుతమైన ఆలయం ఇంకొకటి కూడా ఉన్నది. చరిత్రతో వెలిగి పోతున్న ఆలయమిది. దీని పేరు బంగారు కామాక్షి ఆలయం. దీని విశేషాలు చెప్పే ముందు, పోయిన సారి బృహదీశ్వరాలయం గురించి రాసిన తరువాత శ్రీ తల్లాప్రగడ రావు గారితో చర్చించడం జరిగింది. అప్పుడు నేనొక ముఖ్య విషయం రాయకుండానే అందరికీ తెలుసన్న ఒక భావంతో రాసానన్నది అర్థమయింది. ఆ తప్పు ఇప్పుడు దిద్దుకోవాలి. తమిళ నాడులో బృహదీశ్వరాలయంకి ఒక శాపం ఉన్నదనీ, అక్కడకి వెళ్లిన రాజులెవరూ నిలవలేదనీ, అక్కడకి సామాన్యులు కూడా వెళ్లకూడదని, వెళితే పూజలు చేయించ కూడదనీ - ఇలా అనేక నమ్మకాలున్నాయి. దీనికి అక్కడి వాస్తు కారణమేమో అని నేను పరిశీలించడం జరిగింది. ఈ మాట నేను రాసిన వ్యాసంలో కనిపిస్తుంది కానీ, చదువరులు వీడెంత అహంకారి? అంత ప్రసిద్ధ దేవాలయానికి తప్పులెంచే శాస్త్రజ్ఞుడా? అని మీరనుకోవచ్చు. ఈ నేపథ్యం ఎరిగిన వాడిని కనక ఎందుకా? అనే కుతూహలంతో చూసాను, అంతే. 'తప్పు' లాంటిది అదేమీ నాకు కనపడలేదు. నేను 'సిధ్ధర్ ' కథ రాసాను కదా, దానికి సంబంధించిన వీడియో కూడా జత చేసాను. ఆ వీడియో లో మీకు ఆయన విగ్రహం పైన ఒక ఎర్ర రంగులో ఉన్న బోర్డు కనిపిస్తుంది, తమిళంలో. దాని మీద "కరువారూరు ఋషి" అని రాసి ఉంటుంది. నేను చెప్పిన కథనంకి రావు గారు గూగులమ్మని అడిగి జోడించిన కథనం ఏమిటంటే రాజరాజ చోళుడుకి, ఈ సిద్ధర్కి ఆఖరికి వివాదం వచ్చి, లింగం నిలవక, ఆలయ ప్రతిష్ట ఆగిపోతే, సిద్దర్ని అందరూ వచ్చి బతిమాలితే ఆయన వచ్చి తాంబూలం పిడచ వేసి బ్రహ్మరాక్షసిని తోలి, రాజు గారికి శాపం పెడతాడని, ఆ శాపంవల్ల రాజ రాజ చోళుడు రాజ్యభ్రష్టుడైనాడని, ఆ కారణంవల్ల ఆ ఆలయానికి చేటు వాటిల్లినదని. అందుకే రాజేంద్ర చోళుడు ఆ ఆలయంలో అర్చించకుండా గంగైచోళవరంలో ఇంకొక శైవాలయం కట్టించాడని. పాఠకులు ఈ చిన్న విషయం కూడా గమనించవలసిందిగా ప్రార్థన.
మేము తంజావూరు వెళ్లేముందు ఒక సంగీత అభిమానితో కలిసాము. ఆవిడ మమ్మల్ని తప్పక బంగారు కామాక్షి ఆలయం చూడమని ప్రోత్సహించారు. ఆవిడ ధర్మమా అని ఆ ఆలయంకి వెళ్ళాము. ధన్యులమైనాము.
ఈ బంగారు కామాక్షి ఆలయం బృహదీశ్వరాలయంకి 4 కి.మీ దూరంలో ఉంటుంది. పైకి విడిగా ఆలయ ప్రాంగణం కనబడకుండా రోడ్డు మీదకే ఉంటుంది. పైన చిన్న గోపురం కానీ 3 అంతస్తులతో, 7 కలశాలతో లోపల చాలా అందంగా ఉంటుంది. లోపల గర్భగుడి కాకుండా మిగతా ప్రదేశాలు వీడియో తీద్దామని ప్రయత్నిస్తే అక్కడి అధికారి నన్ను వెంటనే వారించారు. నేనూ అల్లాంటి మనస్తత్వం ఉన్నవాడిని కాబట్టి, ఇంక ప్రయత్నించలేదు. ఒక్క ప్రాకారమే ఉన్నది. చిన్న గుడి. దీని విశిష్టత ఏమిటంటే ఇక్కడ తెలుగువారే ఆచార్యులు. ఇదెలాగయిందో కింద చూడండి. ఇక్కడ గర్భాలయం కి మామూలు ద్వారాలే కాక పటిష్టమైన shutters ఉన్నాయి. స్తంభాలు, ఆపైన కప్పుకి రంగులు వేశారు. అందువల్ల ఇది ఈ మధ్యన కట్టిన గుడి అని అనిపించచ్చు. కానీ, అక్కడి వారి కథనం ప్రకారం ఇది 400 ఏళ్ల క్రితం గుడి అనీ, అంతకు ముందు ఎంత పురాతనమో తెలియదనీ చెప్పారు.
ఇక్కడ స్థల విశేషం కనుక్కోవడానికి అక్కడ వారిని ప్రార్థించి, ప్రధానాచార్యుల వారిని కలిసాము. ఆయన అనుమతితో ఆయన చెప్పింది వీడియో తీశాను. ప్రమాణం కోసం కింద పొందు పరిచాను. ఆయన పేరు రాజు. మధ్యాన్న స్నాన సంధ్యాదులకోసం ఆయన వెళుతుంటే ప్రార్థించి, ఆయన దగ్గిర సేకరించిన కథ చాలా ఆసక్తికరమైనది.
ఇక్కడ ఉన్న కామాక్షీ అమ్మవారు బంగారు కామాక్షి. ఈ విగ్రహం సిసలైన బంగారంతో చెయ్యబడ్డది. ఇది అసలు కంచిలో ఉన్న కామాక్షి అమ్మవారి ఉత్సవ విగ్రహం. పూర్తి బంగారు విగ్రహం. ఇది బంగారు విగ్రహంగా ఎలా వచ్చిందంటే:
“కంచిలో ఉన్న కామాక్షీ ఆలయంలో అమ్మవారికి కుడిచేతి వైపు గాయత్రి మంటపం ఉన్నది. అంటే శ్రీచక్రం దగ్గిరలో ఉంటుంది. అది (శ్రీచక్రం) ఎవ్వరూ తొక్క కూడదు. అమ్మవారి స్వరూపం కదా? ఒకసారి చతుర్ముఖ బ్రహ్మ వచ్చి అమ్మవారిని దర్శించుకుని, అటువైపు వెళుతూ ఆ శ్రీచక్రాన్ని తొక్కాడట. వెంటనే ఆయనకి చూపు పోయిందట. అప్పుడాయన అమ్మవారిని బహువిధాలగా కీర్తించి, తాను చేసిన తప్పుకి క్షమాపణ అడిగి, ఎలా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి? ఏం చేస్తే నాకు మళ్ళీ చూపు వస్తుంది? అని వేడుకున్నాడు. అప్పుడా తల్లి ఆకాశవాణిగా చెప్పిందట - 'ఒక జ్యోతి స్వరూపంలో నీకు ఒక రూపం గోచరిస్తుంది. ఆ రూపంలో ఉన్నట్లుగా ఒక ప్రతిమని బంగారంతో తయారు చేయించి, దానికి కంచిలో ఉన్న ఏకామ్రేశ్వర స్వామి ఆలయంలో అన్నివిధాలా సేవలు చేసి, తిరుకళ్యాణం చేసి, పూజించు, మళ్ళీ నీకు చూపు వచ్చి, శుభం కలుగుతుంది, నువ్వు మళ్ళీ నీ పదవి పొందుతావు' అని సెలవిచ్చిందట. ఆ రూపంలో కుడి చేతిలో చిలుక, ఎడమ చెయ్యి వయ్యారంగా కిందకి పెట్టి ఉంటుంది. ఈ రూపం చూస్తే మధుర మీనాక్షి రూపం, సత్యనారాయణ స్వామి ఆలయంలో రమాదేవి వామ హస్తం గుర్తుకు రాదూ? రమాదేవికి కుడి హస్తంలో కలువ మొగ్గ ఉంటుంది; ఆ బంగారు కామాక్షికి చిలుక ఉంటుంది. చతుర్ముఖ బ్రహ్మ అమ్మవారు చెప్పినట్లే ఏకామ్రేశ్వర స్వామి ఆలయంలో తిరుకళ్యాణం చేయించి, ఆ మూర్తిని మళ్ళీ కామాక్షీ ఆలయంకి తీసుకు వచ్చి, ఉత్సవ విగ్రహంగా ఇచ్చాడని ప్రతీతి. ఇది ఈ విగ్రహ మూల కథ. అంటే ఈ విగ్రహం ఎంత పురాతనమైనదో ఊహించవచ్చు.
సుమారు 500 వందల నించి 400 వందల ఏళ్ల క్రితం ముస్లిములు మాణిక్యపూర్ దగ్గరనించి దండయాత్రలు మొదలుపెట్టి చాలా ఆలయాలని ధ్వంసం చేశారు. అలా చేస్తున్నారనే భయంతో ఈ ఉత్సవ విగ్రహాన్ని రోజూ అలంకరించి పూజించే అర్చక స్వాములు ఆ విగ్రహాన్ని తీసుకుని పారిపోయి తిరువన్నామలై (అంటే అరుణాచలం) వద్దనున్న 'సెంజికోట' లో ఉంచి కాపాడారు. తరువాత అక్కడకి కూడా ఇటు ముస్లిములు, అటు పాండిచ్చేరి దగ్గిర చేరిన ఫ్రెంచి వారు దొరికింది దొరికినట్లుగా దోచుకుంటున్నారని, అక్కడనించి ఆ విగ్రహాన్ని తీసుకుని తిరువారూరు వచ్చారు. అక్కడ కర్ణాటక సంగీత త్రయంలో ముఖ్యుడైన త్యాగరాజు వారు రాముణ్ణి అర్చించిన ఆలయంలో కొన్నేళ్ళు ఉంచారు. అప్పుడు సంగీత ముమ్మూర్తుల్లో ఒకరైన శ్యామాశాస్త్రి గారు ఆ విగ్రహం తీసుకుని 'ఉడయార్పాలయం' - ఇది అరియలూరు జిల్లాలో ఉన్నది - కి తీసుకొచ్చారు. మళ్ళీ అక్కడనించి తంజావూరు వారే తీసుకువచ్చారు. ఇదే సమయంలో శ్రీరంగం నించి రంగనాథుడి విగ్రహం, ఇంకా కొన్ని విగ్రహాలు ఇలా దేశంలో నలుమూలల్లో దాచబడ్డాయి. శ్రీయుతులు లక్ష్మీనారాయణ గారు తిరుపతి గురించి ఇచ్చిన వివరంకూడా ఇక్కడ మననం చేసుకోవాలి చదువరులు.
ఇక్కడే మీరు ఈ వీడియోని జాగ్రత్తగా వింటే ఒక క్లూ దొరుకుతుంది. ఈ వీడియోలో ఉన్న రాజుగారి పూర్వీకులే ఆ విగ్రహం తెచ్చిన ఆచార్యులు. ప్రాణాలని ఒడ్డి ఆ విగ్రహాన్ని కాపాడారు కాబట్టి వారికి పారంపర్య ఆచార్యత్వం లభించింది. ఆ తెచ్చిన వారు తెలుగువారు. వారు పిలుచుకున్న పేరే 'బంగారు కామాక్షి' కాబట్టి తమిళనాడు నడిబొడ్డులో ఉన్న తంజావూరులో తెలుగు పేరు ఉన్నది. కొంత మంది ఇలా ఎందుకు తమిళ దేశంలో తెలుగు పేరు ఉన్నదని గొణగడం విన్నాను. ఇలా విగ్రహాన్ని తెచ్చేటప్పుడు మధ్యలో ముస్లిములు అన్ని దారులూ ఆపేసి అందరిని తనిఖీ చేస్తున్నారని, విగ్రహానికి పునుగు రాసి, (పునుగు అనేది రాచపిల్లి అనే పిల్లి జాతి నించి స్రవించే ద్రవం) విగ్రహం బంగారంగా కాకుండా, నల్లగా కనిపించేటట్లు చేసి, ఒక కుష్టు రోగంతో ఒంట్లో బాగులేని పిల్లవాడిగా చెప్పి పల్లకీలో మోసుకొచ్చారట. మొత్తానికి ముస్లిముల కళ్ళు కప్పి ఇంత సాహసం చేశారు వారు. అందుకే వారి వంశం వారికి ఇంత గౌరవం దక్కింది. ఇప్పటికీ ఇక్కడ ఆ బంగారం మెరవకుండా విగ్రహానికి పునుగు రాసి ఉంచుతారు. ఇక్కడ అమ్మవారికి అభిషేకం చేసేటప్పుడు తెర వేసి చేస్తారు. ఎవరినీ చూడనీయరు. ఇలా కంచిలో ఉత్సవ విగ్రహంగా ఉన్న బంగారు కామాక్షి ఇక్కడ ధ్రువ విగ్రహంగా వచ్చింది.
ఇంతకీ ఉడయార్ పాలయం జమీందారు దగ్గిర ఉంచిన కామాక్షీ దేవి విగ్రహాన్ని శ్యామశాస్త్రి గారు, ఆనాటికే ముస్లిములని ఓడించి, తంజావూరుని పాలిస్తున్న మరాఠా రాజు (ఈయన శివాజీ సంతతికి చెందిన వాడు) ప్రతాప సింహుడి దగ్గరకి తీసుకువచ్చాడు. ఇంతలో అమ్మవారు ప్రతాపసింహుడి కలలో ప్రత్యక్షమై నాకు ఒక గుడి కట్టించమని, తాను తంజావూరులోనే ఉంటానని చెప్పింది. శ్యామశాస్త్రి గారి గురించి బాగా తెలిసి ఉన్న ప్రతాపసింహుడు ఆయనని చాలా గౌరవించి, ఇక్కడ బంగారు కామాక్షి ఆలయం కట్టించాడు.”
నా ప్రయాణాల్లో పలుచోట్ల ముస్లిముల దుండగాల కథనాలు ఎదురైనాయి. ఇది మరొకటి. ఇవన్నీ మన చరిత్రలో ఎందుకు మిగల్లేదో, మన సామాన్య ప్రజలకెవరికీ ఎందుకు అవగాహన లేదో అన్న ప్రశ్న మనందరం వేసుకుని సమాధానం చెప్పుకోవాలి. నిజం కప్పిపుచ్చడం వల్ల మన జాతి ఎన్నివిధాలుగా నష్ట పోతోందో జనసామాన్యం గుర్తించడం లేదు.
శ్యామశాస్త్రి గారు గొప్ప శ్రీవిద్యోపాసకుడు. అమ్మవారిని ప్రత్యక్షంగా సాక్షాత్కరింప జేసుకున్నవాడు. ధన్యుడు. ఆయన ప్రతినిత్యం ఇక్కడే అమ్మవారిని అర్చించేవాడట. నాకు ఇవి చెప్పిన అర్చకులు - ఆయన పేరు రాజు గారు శ్యామశాస్త్రి గారి వంశజుడేట. వాళ్ళే ఈ విగ్రహం కంచి నుండి కాపాడి తీసుకు వచ్చారట. శ్యామ శాస్త్రిగారు ఎంత కామాక్షి అమ్మవారి భక్తుడంటే అమ్మవారు ఆయనకి ప్రత్యక్షమై నోరు తెరవమందిట. ఆయన నోరు తెరవగానే తాను నములుతున్న తాంబూలం పిడచ తీసి ఆయన నోట్లో వేసిందిట. ఎంత అదృష్టం! ఆ సమయంలో శ్యామశాస్త్రి గారి ఉత్తరీయం మీద పడ్డ ఎర్ర గుర్తులు వారి గురువు గారు కొంతసేపు తరువాత చూసి, నాకా అదృష్టం కలగ లేదే అని వాపోయాడట. శ్యామశాస్త్రి గొప్ప భక్తుడే కాక, గొప్ప సంగీత నిధి, గొప్ప తత్వవేత్త అయినాడు. జీవన్ముక్తుడిగా గొప్ప రచనలు చేసి, పాటలు పాడి అమ్మవారిని మెప్పించి సాయుజ్యం పొందాడు. వీరి గురించి ఒకసారి గొప్ప హరికథా ప్రయోక్త, శ్రీ కొప్పరపు నరసింహాచార్యులవారు చాలా వివరంగా చెప్పారు నాకు. శ్యామశాస్త్రి గారి పూర్వజులు కూడా, త్యాగరాజుగారి పూర్వజులలాగా ఒంగోలు ప్రాంతానికి చెందిన వారు. తిరువారూర్ తరలివెళ్లిన వారల్లో వీరు ఒకరు. ముత్తుస్వామి దీక్షితులు కూడా ఒంగోలు ప్రాంతం వారే అని చెప్పారు.
ఇక్కడ అమ్మవారి జన్మ నక్షత్రం సమయంలో, ఏడాదికి 11 రోజులు మాత్రమే ఉత్సవం చేసి అభిషేకం చేస్తారు. మిగతా రోజుల్లో దగ్గిరలో ఉన్న కామకోటిలో ఉన్న కామాక్షి అమ్మవారికి అభిషేకాలు చేస్తారు. మేమిలా మాట్లాడుకుంటుంటే ఒక భక్తురాలు వచ్చి మా మాటలు వింటూ కామకోటిలో కూడా అద్భుతమైన పూజలు జరుగుతాయని, శ్యామశాస్త్రి గారి పాటలు పాడుకుంటామని చెప్పారు. అక్కడ నవరాత్రుల్లో 30 రోజుల ఉత్సవం జరుగుతుంది. జనం కిటకిటలాడతారని చెప్పారు.
ఇంత చరిత్ర కలిగిన బంగారు కామాక్షి ఆలయం చూడగలగడం మా అదృష్టమని అనుకుంటూ పవిత్రమైన అరుణాచలంకి బయలుదేరాము.