మనందరం ఒక విషయం అవగాహనతో అర్థం చేసుకోవాలి. ఎవ్వరూ పుట్టుకతోనే కవిగా, సాంకేతిక నిపుణుడిగా, వైద్యుడిగా, రాజకీయవేత్తగా, సామాజిక శ్రేష్ఠుఁడుగా, కార్మికుడిగా, కర్షకుడిగా జన్మించరు. మనం పెరుగుతున్న కుటుంబ పరిస్థితులు, సామాజిక స్థితిగతుల ఆధారంగా మన ఆలోచనా విధానం ఉండి తదనుగుణంగా మన భవిష్యత్తు నిర్ణయమౌతుంది.
కొందరికి తల్లిదండ్రుల ఆలోచనలు, స్థిర సంపాదనలు రుచించి వాటినే అనుసరిస్తారు. మరికొందరు వేరే దారిని ఎంచుకొని పయనిస్తారు. కొందరు రాణిస్తారు మరికొందరు వెనకపడి పోతారు. అంతమాత్రాన అస్థిత్వాన్ని కోల్పోయినట్లు కాదు. ధనవంతులైన వారు ధన సంపాదనే ధ్యాసగా, శ్వాసగా ఉంటే, ధనం లేనివారు ఆ ఆర్ధిక స్థితిమంతులను చూసి అసూయ, ద్వేషాన్ని పెంచుకుంటూ బ్రతుకుతారు. మరికొందరు తెలివిగా తమ స్వశక్తితో మంచి స్థితిని చేరుకోవడానికి ప్రయత్నించి సఫలమై మంచి ప్రామాణిక జీవితాన్ని అనుభవిస్తారు.
మనిషి ప్రశాంతంగా జీవించాలంటే సర్వసౌఖ్యాలు అవసరం. వాటిని పొందాలంటే డబ్బు ఉండాలి. ఇది నేటి మనందరి మనస్తత్వం.
కానీ ఎన్నో జీవిత సత్యాలను, వాస్తవ సుఖమయ జీవన ప్రస్థానానికి, అస్తిత్వంతో కూడిన స్థిరత్వాన్ని సాధించడానికి ఎటువంటి ఆర్థిక వనరులు, సౌఖ్యాలు అవసరం లేదు. మన ఆలోచనలను నియంత్రించుకుని నిగ్రహంతో ఉండగలిగిన రోజు, మనమేమిటో తెలుసుకొన్న రోజు, అసలు మనిషిగా మన జన్మకు సార్థకత, సాఫల్యం బోధపడుతుంది. అందుకు ఎంతో సహనం, సౌకుమార్యం, స్వేచ్ఛ అవసరం. నిరంతర జీవన సమస్యలతో, బాధ్యతాయుత కర్మలతో కట్టిపడేసిన మన జీవితంలో అది సాధ్యమా అనే సందేహం ఉంటుంది. పట్టుదలతో శ్రమిస్తే, మానసికంగా, శారీరకంగా ధృడత్వాన్ని పొందగలిగిన రోజు మనిషి, లింగబేధం, వయోబేధం లేకుండా తను అనుకున్న సిద్ధిత్వాన్ని పొందగలరు.
ఈ మధ్యనే పరిచయమై అతి తక్కువ కాలంలోనే ఆప్తమిత్రుడై అన్ని విషయాలను నిరభ్యంతరంగా పంచుకునే స్థాయికి చేరిన నా మిత్రునికి, నాకు మధ్య జరిగిన ఒక సంభాషణలోని మాటలను విశ్లేషిస్తే నాకు కలిగిన కొన్ని పదాల అర్థాలు, పరమార్ధాలు నేడు వివరిస్తున్నాను.
ఆత్మ పరివర్తన, ఆత్మావలోకనం, ఆత్మ పరిజ్ఞానం, ఆత్మ బంధం, ఆత్మ గంధం.
ఆత్మ పరిజ్ఞానంతో, ఆత్మ పరివర్తన కలిగి ఏ విషయాన్ని అయినా వివరిస్తే అది అందరికీ ఆమోదయోగ్యమై ఉపయోగకరంగా ఉంటుంది. ఆత్మ పరివర్తన లేకుండా కేవలం ఆత్మ పరిజ్ఞానం తో వివరిస్తే విలువైన సమాచారం ఉంటుంది కాని అందులో కొంత స్వార్థ చింతన కనపడుతుంది. అహంభావం కూడా గోచరిస్తుంది. ఆత్మావలోకనం నిరంతరం చేసుకుంటూ పోతుంటే చివరకు కలిగేదే ఆత్మ పరివర్తన. ఆ దశలో ‘నేను’ నా దేహం అనే భావన నుండి మనిషి తన అనుభవపూర్వక జీవిత సారాన్ని జోడించి తన పుట్టుక పరమార్థాన్ని గ్రహించే స్థాయికి చేరుతాడు. అన్నిటికీ అతీతమైన ఆత్మస్వరూపాన్ని వీక్షించే స్థాయికి చేరుతారు. అప్పుడు తమ ఉనికిని కూడా ఇతరులకు తెలియవలసిన అవసరం ఉండదని గ్రహిస్తారు. అదే ఆత్మగంధం. ఆ స్థితిలో ప్రస్తుతముంటున్న ఒక మహానుభావుడు స్వయంగా తన అనుభవాలను నాతో పంచుకుంటూ చెప్పిన పదం ఈ ఆత్మగంధం. మన జీవితంలో మనలని సంతోషపరిచే ఏ జీవి అయినా మనకు ఆత్మ బంధంతో ముడిపడి ఉంటుంది. మనలో విరక్తి పరమైన ఆలోచనలు, వేదాంత ధోరణి ఎక్కువైనప్పుడు, అనుబంధం, ఆత్మీయత అంత ఒక బూటకం, ఆత్మ తృప్తికై మనుషులు ఆడుకునే నాటకం అని ఒక మహా రచయిత వ్రాసిన మాటలను మన ఘంటసాల గారి గళంలో విన్న విషయం గుర్తుకువస్తుంది.
మనం అనుభవంతో, ఆత్మ పరిజ్ఞానంతో తెలుసుకున్న విషయాలు, జీవిత సత్యాలు ఇతరులకు తప్పక చెప్పాలి, ఇతరులతో పంచుకోవాలి. కానీ వారిని ప్రభావితం చేసే విధంగా మన వాగ్ధాటి ఉండకూడదు. ఎందుకంటే ఏ ఇద్దరి జీవితాలు ఒకే విధంగా సాగవు. ఎన్నో వ్యత్యాసాలు ఉంటాయి. మనం అనుభవంతో తెలుసుకున్న విషయాలు మనకు సరైనవే అనిపించవచ్చు. కానీ, ఎదుటివారికి అవి వేరేవిధంగా ఉండవచ్చు. ఉదాహరణకు మనం కుటుంబ బాధ్యతలతో తలమునకలుగా ఉన్నప్పుడు సన్యాసం తీసుకోవడం అంత అవివేకం ఇంకోటి ఉండదు. బాధ్యతలు అన్నీ నిర్వర్తించిన పిదప నీవు ఆలోచించాలి. లేదంటే ముందుగానే అన్నింటినీ త్యజించి, ఆ సామాజిక కనీస బాధ్యతలను కూడా లేకుండా చేసుకోవాలి. అంతేగాని మా గురువు చెప్పాడు, మా స్వామీజీ బోధించాడు కనుక నేను అందరినీ వదిలేసి, బాధ్యతలను విస్మరించి నా దారి నేను చూసుకుంటాను అంటే కుదరదు. నీ మీద ఆధారపడిన వారి జీవితాలలో ఏర్పడే అపశ్రుతులకు నీవే కర్తవు అవుతావు.
‘సర్వే జనః సుఖినోభవంతు’
చాలాబాగా ఉంది.ఆలోచనాత్మకంగా ఉంది.ఎంతో అనుభవంతో వ్రాసినట్లుంది.రచయితకు అభినందనలు