Menu Close
Mutthevi Ravindranath Photo
'మనుస్మృతి'
ముత్తేవి రవీంద్రనాథ్
మూడవ అధ్యాయము (ఒ)

శ్రాద్ధకర్మలో పాటించవలసిన పవిత్రత

పితరులు సాధారణంగా దౌహిత్రుడు (కూతురు కొడుకు) శ్రాద్ధ భోజనం చేసినప్పుడు ఎక్కువగా తృప్తి పొందుతారట. అందుకే అతడు విద్యార్థి అయినాసరే పితరుని మనుమడి (కుమార్తె కుమారుడి)చే శ్రద్ధగా భుజింపజేయాలి. భోక్తలందరి ఆసనాల మీద పవిత్రమైన ఉన్ని కంబళములు వెయ్యాలి. అక్కడి నేల మీద నువ్వులు చల్లాలి. నిమంత్రితులు భోజనం చేసిన పిమ్మట విస్తరకు ముందు నేలమీద కొద్ది శ్రాద్ధాన్నాన్ని వెయ్యాలి. దానిని వికిరము లేక బికిరము (బిచ్చము) అంటారు.

త్రీణి శ్రాద్ధే పవిత్రాణి దౌహిత్రః కుతపస్తిలాః  |
త్రీణి చాత్ర ప్రశంసంతి శౌచమక్రోధమత్వరామ్ || ( 3- 235 )

శ్రాద్ధ కర్మలో అతి పవిత్రమైనట్టి మూడింటిని (దౌహిత్రః, కుతపః, తిలాః) తప్పక పాటించాలి. మొదటిది దౌహిత్రుడు (కూతురు కొడుకు) శ్రద్ధగా భోజనం చేసేట్లు చూడడం. రెండవది శ్రాద్ధ భోజనం అతి పవిత్రమైన కుతప కాలంలో చేసేటట్లు చూడడం. మూడవది ఆ ప్రదేశమంతా పవిత్రమైన తిలలు (నువ్వులు) చల్లడం.

ఇక అక్కడ ప్రశంసార్హమైన (పితరులు మెచ్చుకునే) మూడు అంశాలు కూడా ఉన్నాయి. అవి: మొదటిది - ఆ ప్రదేశాన్నంతటినీ శుచిగా ఉంచడం, అక్కడి అందరూ అంతరంగ, బహిరంగ శౌచాలను పాటించడం. రెండవది అక్రోధము- కోపగించుకోకుండా అక్కడి కార్యక్రమం నిర్వహించడం. మూడు అత్వరామ్ - వేగిరపాటు, త్వరబాటు లేకుండా పితరులు సంతృప్తిచెందే విధంగా కార్యక్రమాన్ని నింపాదిగా, సావధానంగా నిర్వహించడం.

ఈ శ్లోకంలోనూ, దీనికి ముందరి శ్లోకంలోనూ మనువు ప్రస్తావించిన ‘కుతపః’ అనే శబ్దానికి కుల్లూకభట్టు తన ‘మన్వర్థ ముక్తావళీ’ అనే వ్యాఖ్యానంలో ‘పవిత్రమైన నేపాళ కంబళం పరచిన ఆసనం’ (కుతపం చ ఆసనం) అనే అర్థం చెప్పాడు. బ్యులర్ తన ఆంగ్ల వ్యాఖ్యానంలో దానినే అనుసరించి, ‘a Nepal blanket on the seat of each guest’ అన్నాడు. అయితే తన వ్యాఖ్యానానికి కుల్లూక భట్టు ‘మన్వర్థ ముక్తావళీ’ పేరిట రాసిన వ్యాఖ్యానమే ఆధార గ్రంథమని పేర్కొన్న సరస్వతి వేంకట సుబ్బరామ శాస్త్రి మాత్రం దీనికి ముందరి శ్లోకంలో ‘కుతపః’ అంటే కంబళము అనే అర్థం చెప్పి, ఈ శ్లోకంలో మాత్రం కుల్లూకభట్టు వ్యాఖ్యానానికి విరుద్ధంగా ‘కుతపః’ అంటే ‘కుతప కాలం’ అనే అర్థం చెప్పారు. కుతపము అంటే ‘ఒక దినము యొక్క పదిహేను భాగాలలో ఎనిమిదవది’, ‘మేక ఉన్నితో చేసిన కంబళి’, ‘దర్భ’ అనే పలు అర్థాలున్నాయి. కుతపము పేరిట ఒక వాద్యము కూడా ఉంది.

ఇక్కడ కుతప కాలము లేక కుతప వేళ అంటే ఏమిటో మనం వివరంగా తెలుసుకోవాలి. కుతపము అనేది ఒక పగటిలోని 15 భాగాలలో ఎనిమిదవది. సూర్యోదయాన్నుంచి సూర్యాస్తమయం వరకు గల పగటి కాలాన్ని దినము లేక దివసము అంటారు. ఒక దినమును 15 భాగాలుగా విభజించారు. వీటిని ముహూర్తములు అంటారు. దినములో 12 గంటలు - అంటే 720 నిముషాలుంటాయి. కనుక ఒక ముహూర్తము అంటే 48 నిముషాలు. అందులో ఎనిమిదవది కుతపము. అంటే సూర్యోదయ సమయాన్నుంచి 7 ముహూర్తాలు గడచిన తరువాత అంటే సరిగ్గా సూర్యోదయం అయిన 5 గంటల 36 నిముషాల తరువాత ప్రారంభమై 6 గంటల 24 నిముషాలకు ముగిసే ఎండమండే మధ్యాహ్న వేళ కుతప ముహూర్తమన్నమాట. ఒకరోజు సూర్యోదయం 5 గంటల 40 నిముషాలకు అయిందనుకుంటే ఆరోజు 11 గంటల 16 నిముషాలకు ప్రారంభమై 12 గంటల 4 నిముషాలకు ముగిసే ముహూర్తం కుతప ముహూర్తము లేక కుతప వేళ అంటారన్నమాట. ఆ రోజు సూర్యోదయం అయిన సమయాన్నిబట్టి కుతప వేళ ఎప్పుడనేది ఆధారపడి ఉంటుంది. పితృదేవతలకు శ్రాద్ధాన్నం మొదలైనవి సమర్పించడానికి ఈ ముహూర్తము అత్యంత పవిత్రమైన, అనుకూలమైన కాలమని భావిస్తారు. కుతప వేళకు ఇంటికి వచ్చిన వ్యక్తికి గృహస్థు కడుపారా భోజనం పెట్టడం తన విధిగా భావిస్తాడు.

శ్రాద్ధ భోజన విధులు

శ్రాద్ధ భోజనంలో వడ్డించే ప్రతి పదార్థమూ వేడిగా ఉండాలి. భోక్తలు మౌనంగా భోజనం చెయ్యాలి. శ్రాద్ధకర్త పదార్థాలు ఎలా ఉన్నాయని వారిని ప్రశ్నించినప్పటికీ, తాము తింటున్నది హవిస్సులు కనుక వారు వాటి గుణములను ఎంచరాదు.

అన్నము మొదలైన పదార్థాలు ఎంతవరకు వేడిగా ఉంటాయో, భోక్తలు ఎంతవరకు మౌనంగా భుజిస్తారో, ఎంతవరకు హవిస్సుల గుణములు భోక్తలు చెప్పరో, అప్పటివరకు పితరులు భోజనం చేస్తారు.

భోజనం చేసే సమయంలో భోక్తలు తలకు పాగా చుట్టుకొనరాదు. వారు దక్షిణ దిశకు తిరిగి కూర్చుని భోజనం చేయకూడదు. అలాగే వారు పాద రక్షలు వేసుకుని భోజనం చేయరాదు. వీటిలో ఏది చేసినా ఆ భోజనాన్ని రాక్షసులు భుజిస్తారేకానీ, పితృదేవతలు భుజించరు.

శ్రాద్ధ భోజనంలో భోక్తలను చూడకూడనిదెవరు?

శ్రాద్ధ భోజనం తింటున్న భోక్తలను చాండాలుడు (చండాలుడు), వరాహము (సూకరము లేక ఊర పంది), కుక్కుటము (కోడి), శ్వా (శునకము లేక కుక్క), రజస్వలా(ఉదక్యా లేక బహిష్టు అయిన స్త్రీ), షండుడు (నపుంసకుడు) చూడకూడదు. వారు చూడకుండా ఉండేవిధంగా భోక్తలకు భోజనం వడ్డించే ఏర్పాట్లు చేయాలి.

చాలా మంది బ్రాహ్మణులు నేటికీ తాము చేసే రోజువారీ భోజనం కూడా బ్రాహ్మణేతరులు చూడకుండానే తింటారు. బహుశా అది మనువు ప్రభావం కారణంగానేనేమో!

హోమము, దానము, బ్రాహ్మణ భోజనము మొదలైన సమయాలలో, అమావాస్య, పౌర్ణమి మొదలైన దేవకార్యములలో, శ్రాద్ధము మొదలైన పితృకార్యములలోనూ పైన తెలిపిన చండాలుడు మొదలైనవారు కంటబడితే, ఆ యా పవిత్ర కార్యాలు ఏ ఉద్దేశంతో చేస్తారో వాటి ఫలం దక్కదట.

భోక్త తింటున్న ఆహార పదార్థాలను దూరాన్నుంచే సూకరము (ఊరపంది) ఆఘ్రాణించినా (వాసన పసికట్టినా), కోడి రెక్కల గాలి ఆ ఆహారానికి సోకినా, కుక్క కేవలం ఆ ఆహారం వైపు చూసినా, అవరవర్ణజుడు (కడజాతివాడు లేక చండాలుడు) ఆ ఆహారాన్ని తాకినా ఆ పదార్థాలన్నీ అపరిశుద్ధములై వాటితో చేసిన శ్రాద్ధాది క్రియలన్నీ నిష్ఫలమౌతాయట.

ఆనాడు సామాజిక న్యాయమేది?

శ్రాద్ధ కర్త ఇంట్లో ఎవరైనా ఖంజుడు (కుంటివాడు), ఖంజ (కుంటిది), కాణుడు (కంటి రెప్పమీద కాయకాసి కన్ను మూసుకుపోయినవాడు), లేక ఇతర అంగ వైకల్యం కలిగిన ప్రేష్యులు (సేవకులు లేక పనివారు) ఉన్నా వారినందరినీ శ్రాద్ధ దినమున ఆ ఇంటినుంచి బయటికి తరిమెయ్యాలట.

అయితే శ్రాద్ధ దినం నాడు కర్త ఇంటికి వచ్చిన అతిథి, భిక్షుకుడు, భోజనం నిమిత్తం ఆ ఇంటికి వచ్చిన వేరొక బ్రాహ్మణుడు - వీరిని మాత్రం భోక్తల అనుమతి తీసుకుని శక్తి మేరకు భోజనం పెట్టి పంపాలి.

భోక్తలు భోజనంచేయగా మిగిలిన పదార్థాలన్నింటినీ కొద్దిగా నీరుపోసి, ఒక పిండముగా చేసి, శ్రాద్ధ భోక్తల ఎదుట దర్భలు పరచిన స్థలంలో వికిర పిండముగా వేయాలి. వికిరము లేక బికిరము అంటే బిచ్చము. అగ్నిసంస్కారానికి అనర్హులైన బాలలు, కులస్త్రీలు, ఇంకా గురువులను వదలి ఒంటరిగా జీవితం గడుపుతున్న త్యాగులు మొదలైనవారికి ఉద్దేశించిన ఆహారమిది.

శ్రాద్ధ కర్మ సందర్భంగా భూమిమీద  పడిన మెతుకులు, తదితర ఆహార పదార్థాలు అజిహ్ములు (సూటితనం, నిజాయతీ కలిగినవారు), మోసము, సోమరితనం లేకుండా పనిచేసే కర్తవ్యపరాయణులైన సేవకులకు పెట్టాలి.

అలాకాక ఎవరైనా శ్రాద్ధ కర్త తాను చేసిన శ్రాద్ధ కర్మలో భోక్తలు తినగా మిగిలిన అన్నాన్ని వృషలులకు (శూద్రులకు) పెడితే అతడు మూఢుడై  కాలసూత్రం అనే నరకంలో తలకిందులుగా వేలాడతాడట!!

మనువు కాలంనాడు కేవలం కింది కులాలవారు మాత్రమే కాక కులస్త్రీలు, అగ్ని సంస్కారం లేనివారు, గురువులను వదిలినవారు, సేవకులు  భిక్షకుల స్థాయి జీవితం గడిపారనేది సుస్పష్టం. భోక్తలు తినగా మిగిలిన ఆహార పదార్థాలు కూడా శూద్రులకు పెట్టడానికి వీలులేదనీ, అలా చేసిన శ్రాద్ధ కర్త (లేక భోక్త) మూఢుడై కాలసూత్రం అనే నరకంలో తలకిందులుగా వేళ్ళాడతాడని మనువు నియమం విధించడం నాటి సామాజిక వివక్షను స్పష్టంగా సూచిస్తున్నది. పతితులు, అంటు రోగులు మొదలైనవారికి  కుక్కలకు, కాకులకు వేసినట్లే ఆహారాన్ని నేలమీద వేయడం గురించి  కూడా మనం గతంలో తెలుసుకున్నాం. సూక్ష్మ క్రిముల కారణంగా ప్రాణాంతక వ్యాధుల పాల్బడిన వారి పట్ల, పుట్టుకతోనే కుంటి, గుడ్డి, మూగ, చెవిటి వారుగా పుట్టిన వికలాంగుల పట్ల జాలిపడి, వారి సంక్షేమం గురించి ఆలోచించే బదులు, నాటి సమాజం వారిని పాపిష్టివారని దూరం పెట్టడం, గత జన్మలలో వారు చేసిన పాపాల కారణంగానే వారికి ఆ దుర్గతి పట్టిందని భావించడం నిజంగా కేవలం అశాస్త్రీయం మాత్రమే కాదు. అనాగరికం, అమానుషం కూడా!!

భోక్తలలోనూ పెడపోకడలు 

మనువు శ్రాద్ధ భోక్తలను ఎంచుకొనే ప్రక్రియలో కర్తలు ఎంత జాగరూకతతో వ్యవహరించాలో, ఏ యే నియమాలు పాటిస్తూ వేదవిదులు, సచ్ఛీలురు అయిన భోక్తలను ఎంచుకోవాలో విపులంగా వివరించినప్పటికీ, నాటి భోక్తలలోనూ కొందరు వారికి ఉద్దేశించిన పవిత్రతను గాలికి వదిలేసి, అదే రోజు ఒక వృషలీ (శూద్ర స్త్రీ) తో పడక సుఖం పంచుకునేవారూ ఉండేవారనేందుకు సాక్ష్యమే ఈ క్రింది శ్లోకం.

శ్రాధ్ధభుగ్వృషలీతల్పం తదహర్యోధిగచ్ఛతి |
తస్యాః పురీషే తన్మాసం పితరస్తస్య శేరతే  || ( 3- 250 )

శ్రాద్ధ భోక్త శ్రాద్ధ దినము రోజునే ఒక శూద్ర స్త్రీ తో పడక సుఖం పంచుకుంటే, ఆ భోక్త యొక్క పితరులు ఒక మాసం రోజుల పాటు ఆమె పురీషంలో పడి ఉంటారట. పురీషము - మలము(Ordure or Excrement)

శ్రాద్ధ, దైవిక కర్మలకు కావలసిన సంపదలు

శ్రాద్ధ భోజనంతో తృప్తిచెందిన భోక్తలకు శ్రాద్ధ కర్త భుక్తాచమనమునకు (భోజనం తిన్న తరువాత చేసే ఆచమనానికి) నీళ్లిచ్చి, భుక్తాయాసం తీరేటట్లుగా వారు విశ్రమించడం కోసం వారిని ఒక సుఖ ప్రదేశంలో కూర్చోబెట్టాలి. భోక్తలైన  బ్రాహ్మణులు కర్తను ఉద్దేశించి ‘అస్తు స్వధా’ అని చెప్పాలి. పితృకర్మలు అన్నిట్లో స్వధాకారము చెప్పటమే గొప్ప ఆశీర్వాదము.

కర్త భుక్తాన్న శేషాన్ని(భోక్తలు తినగా మిగిలిన అన్నాన్ని) చివరికి భోక్తలకు నివేదించి ‘అన్నశేషః కిం క్రియతామ్?’ (మిగిలిన ఈ అన్నాన్ని ఏమి చెయ్యాలి?) అని వారిని అడగాలి. వారు దానిని ఏమి చేయమంటే అది చేయాలి.

శ్రాద్ధ క్రియకు కావలసిన సంపదలు - అపరాహ్ణము (మధ్యాహ్న వేళ) , దర్భలు, శ్రాద్ధయోగ్య ప్రదేశమును ఎంచుకోవడం, యాచన చేయకుండా శ్రాద్ధ కర్మకు అవసరమైన వస్తువులన్నీ స్వయంగానే సముపార్జించడం, తిలలు (నువ్వులు), అన్నాదులను ఔదార్యంతో, జాగరూకతతో శ్రద్ధగా వండి, వడ్డించడం, పంక్తిపావనులగు బ్రాహ్మణోత్తములు లభించడం.

దైవిక కర్మలకు కావలసిన సంపదలివి - దర్భలు, మంత్రాలు, పూర్వాహ్ణము (ఉదయం వేళ), హవిస్సులు, మునులకు వలసిన అన్నాదులు, పవిత్రమైన ప్రదేశము మొదలైనవి.

హవిస్సులు అంటే యజ్ఞంలో వేల్చే వస్తువులు. అవి - మున్యన్నములు (మునులు తీసుకునే ఆహారాలు) - మునులు అడవులలో నీవారము లేక నివ్వరి ధాన్యము అనే సాగుచేయని పడి మొలిచే తృణధాన్యంతో అన్నం వండుకుంటారు. ఇంకా పయస్సు (పాలు), సోమః (సోమరసము), అనుపస్కృతమైన మాంసము (మసాలా దినుసులు వేయకుండా వండిన మాంసం), స్వభావరీత్యా ఉప్పు, కారాలు లేని పదార్థాలు. ఇవే యజ్ఞంలో దేవతలకు మునులు హవ్యములుగా సమర్పిస్తారు.

 

***సశేషం***

Posted in January 2022, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!